‘యానిమల్’ చూసి ‘హరి హర వీరమల్లు’లో బాబీ డియోల్ పాత్రను మరింత శక్తివంతంగా మలిచిన దర్శకుడు జ్యోతి కృష్ణ

Director Jyothi Krisna re-designed Bobby Deol’s character (Aurangzeb) in Hari Hara Veera Mallu after watching Animal
Spread the love

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు విశేష స్పందన లభించింది. జూలై 3న ట్రైలర్ ఆవిష్కరణ జరగనుంది.
‘హరి హర వీరమల్లు’ చిత్రానికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. అలాగే పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ కనిపించని విధంగా మొదటిసారి చారిత్రక యోధుడి పాత్రలో కనువిందు చేయనున్నారు. ఇక ‘యానిమల్’ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న బాబీ డియోల్.. ‘హరి హర వీరమల్లు’లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తుండటం మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు.
నిజానికి బాబీ డియోల్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ప్రారంభంలోనే చిత్రీకరించారు. కానీ, ‘యానిమల్‌’లో బాబీ నటనను చూసిన తర్వాత దర్శకుడు జ్యోతి కృష్ణ ‘హరి హర వీరమల్లు’లో ఆయన పాత్రను పునః రచించాలని నిర్ణయించుకున్నారు. ఆ పాత్రను సరికొత్తగా తీర్చిదిద్ది, మరింత శక్తివంతంగా మలిచారు.
“యానిమల్ చిత్రంలో బాబీ డియోల్ గారి నటన అద్భుతం. పాత్రకు సంభాషణలు లేకపోయినా, హావభావాల ద్వారానే భావోద్వేగాలను వ్యక్తపరిచిన ఆయన అసమాన ప్రతిభ ఆశ్చర్యపరిచింది. అందుకే మా సినిమాలో కూడా ఆయన పాత్ర కోణాన్ని మార్చి, పూర్తిగా సరికొత్త రూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను” అని జ్యోతి కృష్ణ అన్నారు.
జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్ని విభాగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. బాబీ డియోల్ పోషించిన ఔరంగజేబు పాత్ర విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. బాబీ డియోల్ నటనలోని భావోద్వేగ లోతును తీసుకురావడం కోసం.. ఆ పాత్రను ఎంతగానో మెరుగుపరిచారు. జ్యోతి కృష్ణ దిద్దిన మెరుగులతో ఔరంగజేబు పాత్ర మరింత బలంగా, ఆకర్షణీయంగా మారింది.
యానిమల్ తర్వాత బాబీ డియోల్ సరికొత్త స్టార్‌డమ్‌ చూశారు. ఆ స్టార్‌డమ్‌ కి న్యాయం చేయడానికి మరియు ఆయనపై ఉన్న అంచనాలను అందుకోవడానికి ఔరంగజేబు పాత్రకు మరింత ఆకర్షణీయమైన ఆర్క్ అవసరమని జ్యోతి కృష్ణ భావించారు. అందుకే ఆ పాత్ర వ్యక్తిత్వం, నేపథ్య కథ, ఆహార్యం వంటి అంశాల్లో కీలక మార్పులు చేశారు.
“నేను సవరించిన స్క్రిప్ట్‌ను చెప్పినప్పుడు, బాబీ గారు చాలా ఉత్సాహపడ్డారు. ఆయన తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఇష్టపడే నటుడు. హరి హర వీరమల్లులో బాబీ డియోల్ ఎంతో శక్తివంతంగా కనిపిస్తారు. ఆయనతో కలిసి పని చేయడం గొప్ప అనుభవం” అని దర్శకుడు జ్యోతి కృష్ణ పేర్కొన్నారు.
ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రతిభగల సాంకేతిక బృందం సహకారంతో ఈ చిత్రం ఒక దృశ్య కావ్యంగా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది.
‘హరి హర వీరమల్లు’ చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి.
దర్శకత్వం: జ్యోతి కృష్ణ , క్రిష్ జాగర్లమూడి,
నిర్మాత: ఎ. దయాకర్ రావు
సమర్పణ: ఎ. ఎం. రత్నం
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్
కూర్పు: ప్రవీణ్ కె.ఎల్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, పెంచల్ దాస్
విజువల్ ఎఫెక్ట్స్: హరి హర సుతాన్, సోజో స్టూడియోస్, యూనిఫై మీడియా, మెటావిక్స్
కళా దర్శకుడు: తోట తరణి
నృత్య దర్శకత్వం: బృందా, గణేష్
స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజారో జుజీ, రామ్ – లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Related posts

Leave a Comment