– బర్డ్ వాచర్ జర్నల్ ఆవిష్కరణ
భాగ్యనగరం ప్రకృతిలో పక్షుల సంపద ఎనలేనిదని, పక్షుల ప్రేమికులు లక్షల సంఖ్యలో ఉన్నారని ప్రముఖ ఆర్నిథాలజిస్ట్, ఇండియన్ బర్డ్స్ జర్నల్ సీనియర్ ఎడిటర్ ఆశిష్ పిట్టి తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కళ పత్రిక, జయహో పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి.ఎ.మంగ రచన రేఖా చిత్రాలతో రూపొందించిన బర్డ్ వాచర్ జర్నల్ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన హైదరాబాద్ ఆర్నిథాలజిస్ట్ ఆశిష్ పిట్టి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి రచయిత్రి, చిత్రకారిణి, ఫోటోగ్రాఫర్ అయిన వి. ఎ. మంగను అభినందించి సత్కరించారు. హైదరాబాద్ లో వారాంతంలో బర్డ్ వాచింగ్ కోసం ఎంతో మంది ఆసక్తిగా చెరువులు, పార్కులు, అడవులు సందర్శిస్తున్నారని, వారిలో ఎక్కువ శాతం యువతరం ఉండటం సంతోషదాయకం స్ఫూర్తిదాయకం అని చెప్పారు. ఇటీవల కాలంలో భాగ్యనగరంలో బర్డ్ వాచింగ్ అభిరుచి ఉధ్రుతంగా పెరిగిందన్నారు. సభాధ్యక్షత వహించిన కళ పత్రిక సంపాదకులు డాక్టర్ మహ్మద్ రఫీ మాట్లాడుతూ సరళమైన తెలుగు భాషలో అందరికి అర్ధమయ్యే రీతిలో చక్కటి బొమ్మలతో హైదరాబాద్ లోని అందమైన అరుదైన పక్షుల విశేషాలతో పుస్తకం ఆసక్తికరంగా రచయిత్రి మంగ తీసుకొచ్చారని అభినందించారు. ప్రకృతికి పక్షులు మరింత అందాన్ని జోడిస్తాయని, ప్రపంచవ్యాప్తంగా బర్డ్ వాచర్స్ సొసైటీలు విస్తృత సేవలు అందిస్తున్నారని వివరించారు. ప్రకృతి పర్యావరణాన్ని కాపాడే పక్షుల్లో పిచ్చుకలు అంతరించిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రచయిత్రి డాక్టర్ వి. ఎ. మంగ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ తరువాత సరదాగా తీసిన ఫోటోగ్రఫీకి చిక్కిన తేనె పిట్ట తనలో పక్షులపై విపరీతమైన ఆసక్తిని పెంచి అభిరుచిగా మార్చినట్లు తెలిపారు. ఐదేళ్లు హైదరాబాద్ లోని కొండలు గుట్టలు చెరువులు అన్నీ తిరిగి వేలాది పక్షుల ఫోటోలను కెమెరాలో బంధించి నాలుగు పుస్తకాలు ప్రచురించినట్లు తెలిపారు. ప్రకృతిలో అందమైన పక్షులను తిలకించడం మనసుకు ఎంతో అలౌకిక ఆనందం ఇస్తుందని ఆమె వివరించారు. సినీ దర్శకుడు శివ నాగేశ్వరరావు, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య పుస్తకాన్ని సమీక్షిస్తూ పక్షులతో తమకున్న అనుబంధాన్ని అనుభవాలను వివరించారు. జయహో పబ్లికేషన్స్ పి.వై.బాబు సమన్వయం చేశారు.
