బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు గ్లామర్ పాత్రల వైపు మొగ్గు చూపుతున్న ఈ రోజుల్లో, భూమి పెడ్నేకర్ మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన పంథాను ఎంచుకున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ‘వి ది విమెన్’, ‘విమెన్ ఆఫ్ ఇంపాక్ట్’ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె, తన కెరీర్‌లో చేసిన పొరపాట్ల గురించి ఎంతో నిజాయితీగా మాట్లాడారు. కెరీర్ ప్రారంభంలో కొన్నిసార్లు కమర్షియల్ సక్సెస్ కోసం, అంటే రూ. 200 కోట్ల బాక్సాఫీస్ హిట్స్ అందుకోవాలనే ఆత్రుతతో కొన్ని పాత్రలు అంగీకరించానని ఆమె ఒప్పుకున్నారు.. ‘నేను కొన్ని తప్పులు చేశాను. ఆ పాత్రలను నేను మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోయాను. నా జెండర్‌ను (స్త్రీత్వాన్ని) అగౌరవపరిచేలా ఉండే పాత్రలను ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. నాకు గౌరవం లేని చోట నేను ఉండను’ అని భూమి కుండబద్దలు కొట్టారు. ప్రజంట్ భూమి మాటలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం భూమి పెడ్నేకర్ ‘దల్దాల్’ అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రీటా ఫెరీరాగా అలరిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సిరీస్, ఆమె నటనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఒక పక్కన తన వృత్తిపరమైన సవాళ్లు, మరోపక్క తనలోని భావోద్వేగాల మధ్య నలిగిపోయే ఒక క్లిష్టమైన పాత్రలో భూమి ఒదిగిపోయారు. ఇలాంటి పవర్‌ఫుల్ పాత్రలకే తాను మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
భూమి పెడ్నేకర్ : పవర్‌ఫుల్ పాత్రలవైపే మొగ్గు!
