భాగ్యశ్రీ బోర్సే: సెన్సిటివ్‌ గర్ల్‌!

Bhagyashree Borse: A sensitive girl!
Spread the love

జీవితం ఎటు తీసుకెళ్తే అటు వెళ్తూ, అపజయాలను కూడా విజయాలుగా మార్చుకోవడమే అసలైన జీవితం అంటోంది నటి భాగ్యశ్రీ బోర్సే. అలుపు లేని ఉత్సాహంతో, అభిమానుల ప్రేమే తన ఇంధనంగా ముందుకు సాగుతూ, తన మనసులోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో ఇలా పంచుకుంది… ”నేను చాలా సెన్సిటివ్‌. చిన్న విషయానికే  వెంటనే ఎమోషనల్‌ అయిపోతాను. అయితే, నటిగా అదే నా సూపర్‌ పవర్‌. అందుకే, ఏ ఎమోషన్స్ ని అయినా లోతుగా అర్థం చేసుకొని, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలుగుతాను. ప్రతి అమ్మాయీ తన సహజమైన అందాన్ని ప్రేమించాలి. నేను బాడీ పాజిటివిటీని బలంగా నమ్ముతాను. ఇతరుల కోసం మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. కెరీర్‌ మొదట్లో నేను ఒక పెద్ద రిజెక్షన్ ని ఎదుర్కొన్నాను. అయినా తగ్గలేదు. ఆడిషన్‌ నుంచి బయటకు వచ్చి, డ్రెస్‌ మార్చుకుని, మళ్లీ డైరెక్టర్‌ దగ్గరకు వెళ్లి నన్ను నేను ప్రూవ్‌ చేసుకున్నాను. జీవితంలో రబ్బర్‌ బాల్‌లా ఎంత గట్టిగా కింద పడితే అంతకంటే వేగంగా పైకి ఎగరాలి. నేను ఉత్తరాది నుంచి తెలుగులోకి వచ్చినప్పుడు ఇక్కడి ప్రేక్షకులు ఒక స్టార్‌ని ఇంత గొప్పగా ఎలా ఆరాధిస్తారో.. ప్రేమిస్తారో ప్రత్యక్షంగా చూశాను. నాకోసం ఎలాంటి కథలు, పాత్రలు రాసి పెట్టి ఉన్నాయో నాకు తెలియదు. వచ్చిన ప్రతి పాత్రకు వందశాతం న్యాయం చేస్తూ విలక్షణ నటిగా పేరు తెచ్చుకోవాలని ఉంది” అంటోంది భాగ్యశ్రీ బోర్సే. ”అనుష్క చేసిన ‘అరుంధతి’ లాంటి పాత్రలు చేయాలని ఉంది. నన్ను అందరూ తమ తెలుగమ్మాయిగా అభిమానిస్తున్నారు. అభిమానం అనేది చాలా గొప్ప ఎమోషన్‌. ఎలాంటి బంధం లేకుండా ఓ పరిచయం లేని వ్యక్తిని ప్రేక్షకులు అంతలా ఎలా అభిమానిస్తారనిపించేది. ఇలాంటి అభిమానం, గౌరవం, ప్రేమ మరింత పొందాలని కోరుకుంటున్నా’’ అని చెబుతోంది. సుదీర్ఘ విరామం తర్వాత ‘లెనిన్‌’ చిత్రంతో ముందుకు రాబోతున్నారు అఖిల్‌. మురళీకిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఈ సినిమా జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తనకు మరింత మంచి పేరు తెచ్చిపెడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది.

Related posts