ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ‘EPIC – FIRST SEMESTER’ నుంచి మధురమైన మూడో పాట విడుదల
యువతను ఆకట్టుకునే యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘EPIC – FIRST SEMESTER’ నుంచి మూడో పాట ‘మనసా వాచా’ విడుదలైంది. ప్రేమ, విరహం, అనురాగం వంటి సున్నితమైన భావోద్వేగాలను హృదయాన్ని హత్తుకునేలా ఆవిష్కరించే ఈ గీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ప్రముఖ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ఈ పాటకు దిగ్గజ గాయనీమణి కె. ఎస్. చిత్ర, ప్రముఖ గాయకుడు ఎస్. పి. చరణ్ తన గాత్రంతో ప్రాణం పోశారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ మధురమైన స్వరకల్పనకు చిత్ర, చరణ్‌ల భావోద్వేగభరితమైన గానం తోడవడంతో ‘మనసా వాచా’ ఓ అద్భుతమైన సంగీత అనుభూతిగా నిలిచింది.
శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించిన ఈ పాటలో కథానాయకులు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య పోషించిన పాత్రల మధ్య ప్రేమ, అనుబంధం, వారి మనసుల్లో చోటుచేసుకునే భావోద్వేగాలను ఎంతో అందంగా ఆవిష్కరించారు. పాటకు అనుగుణంగా తెరకెక్కించిన విజువల్స్ కూడా ఆ భావోద్వేగాలకు మరింత బలాన్ని చేకూరుస్తూ, వారి ప్రేమ ప్రయాణంలోని సున్నితమైన కోణాలను ఆవిష్కరిస్తున్నాయి.
ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.
ప్రేమ, యవ్వనం, స్నేహం, భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందుతున్న ‘EPIC – FIRST SEMESTER’ చిత్రం సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
‘EPIC – FIRST SEMESTER’ నుంచి హృదయాలను హత్తుకునే మూడో గీతం ‘మనసా వాచా’
