‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ : నాన్ స్టాప్ నవ్వుల పండుగ!

'Anaganaga Oka Raju' Movie Review: A non-stop laughter festival
Spread the love

(చిత్రం: అనగనగా ఒక రాజు విడుదల తేదీ : జనవరి 14, 2025, రేటింగ్ : 2.5/5, నటీనటులు : నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, రావు రమేశ్, తారక్ పొన్నప్ప, చమ్మక్ చంద్ర, అనంత్, రంగస్థలం మహేష్, భద్రం తదితరులు.
దర్శకత్వం : మారి, నిర్మాతలు : నాగవంశీ, సాయిసౌజన్య, సంగీతం : మిక్కీ జె. మేయర్, ఛాయాగ్రహణం : జె. యువరాజ్, కూర్పు : కళ్యాణ్ శంకర్, నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్).

ఈ సంక్రాంతిని నవ్వుల పండుగలా మార్చడానికి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో థియేటర్లలో అడుగుపెట్టారు స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి. మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఎంతో సెలెక్టివ్ గా సినిమాలు చేసే నవీన్ పొలిశెట్టి, యాక్సిడెంట్ కారణంగా సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమా మీద అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ కూడా వర్కవుట్ కావడంతో, సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని అందరూ భావించారు. దీనికి తోడు నిర్మాత నాగవంశీ సినిమాని నెక్స్ట్ లెవల్‌లో ప్రమోట్ చేశారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మొదట దర్శకులు వేరైనా, సినిమా పూర్తి చేసింది మాత్రం మారి. యుఎస్ లో సినిమాకి కొంత పాజిటివ్ టాక్ రావడంతో సినిమా మీద మరింత అంచనాలు పెరిగాయి. భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా నేడు (జనవరి14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది తెలుసుకుందాం…
కథ: జమీందారీ కుటుంబంలో పుట్టిన రాజు (నవీన్ పొలిశెట్టి) బయటకు తెలియని పేదరికంలో బతుకుతూ ఉంటాడు. తన తాత చేసిన దుబారా ఖర్చులు కారణంగా రాజుకి ఆస్తులు ఏమి మిగలవు. ఇలాంటి రాజుకి అనుకోకుండా చారులత (మీనాక్షి చౌదరి) కనిపిస్తుంది. ఆమెను పెళ్లి చేసుకుంటే.. లైఫ్ సెట్ అవుతుందని.. ఆమెకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని.. చాలా ప్లాన్డ్ గా ఆమెను టార్గెట్ చేసి.. ప్రేమలో పడేసి పెళ్లి చేసుకుంటాడు రాజు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చారులత గురించి, ఆమె తండ్రి పెట్టిన బాధ్యత గురించి రాజుకి అసలు నిజం తెలుస్తోంది. ఇంతకీ ఏమిటి ఆ నిజం? అసలు చారులత రాజుని ఎందుకు ప్రేమించింది? చివరికి రాజు ఏం చేశాడు? వీరిద్దరూ చివరి వరకు కలిసి ఉన్నారా లేదా? మధ్యలో ఎర్రి బాబు (తారక్ పొన్నప్ప) పాత్ర ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే.
విశ్లేషణ: నిజానికి కథగా చెప్పుకోవాలంటే ఇందులో పెద్దగా కథేమీ లేదు. ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న, ఆస్తులు పోగొట్టుకున్న జమీందారీ కుటుంబానికి చెందిన కుర్రాడు అక్కడ మోసపోయి, చివరికి ఎలా బుద్ధి తెచ్చుకున్నాడు అనే లైన్ తో కథ రాసుకున్నారు. నిజానికి ఇలాంటి లైన్ తో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన ఒక ప‌ల్లెటూరి క‌థ ఇది. క‌థ‌, క‌థ‌నం, పాత్ర‌లు… ఇలా ప్ర‌తిదీ ఇదివ‌ర‌క‌టి సినిమాల్లో చూసిన అనుభూతినే క‌లిగిస్తాయి. అయినా స‌రే, రాజు పాత్ర చేసే హంగామా న‌వ్విస్తుంది. క‌థానాయ‌కుడు న‌వీన్ పొలిశెట్టి త‌న మార్క్ టైమింగ్‌ని ప్ర‌ద‌ర్శిస్తూ, వ‌న్ మేన్ షోలా సినిమాని ముందుకు న‌డిపించాడు. తన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన నవీన్ పొలిశెట్టి, ఈ సినిమాతో కూడా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ అతడు నటించిన విధానం ఆకట్టుకుంది. దర్శకుడు మారి తనకు మొదటి సినిమా అయినప్పటికీ, కామెడీని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి నటన, ఆ క్యారెక్టర్‌ను ఫన్నీగా తీర్చిదిద్దిన విధానం కూడా బాగుంది. ‌మొత్తానికి సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ తో పాటు కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. నవీన్ పొలిశెట్టి హీరోగా ఒక సినిమా చేస్తున్నాడంటే, ఖచ్చితంగా ప్రేక్షకులకు ఆ సినిమా మీద అంచనాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో అతను ఎంచుకున్న సినిమాలు అలాంటివి. ఖచ్చితంగా విలక్షణంగా ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించాడు నవీన్. ఈ సినిమా కూడా అలాంటి పేరు తెచ్చిపెట్టేదే.
ఎవరెలా చేశారంటే… నవీన్ పొలిశెట్టికి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. రాజు అనే పాత్రలో ఇమిడిపోయాడు, నవీన్ కామెడీ టైమింగ్, మెయిన్ థీమ్.. అలాగే కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ బాగున్నాయి. హీరోయిన్ గా మీనాక్షి చౌదరి తన నటనతో అలరించడమే కాకుండా ఫస్ట్ హాఫ్ లో.. అలాగే సెకండ్ హాఫ్ లో తన నటనలో చూపించిన వేరియేషన్స్ బాగున్నాయి. మరో ప్రధాన పాత్రలో నటించిన రావు రమేశ్ తన పాత్రలో ఒదిగిపోయారు. మరో కీలక పాత్రలో కనిపించిన తారక్ పొన్నప్ప నటనఓకే. ఇతర కీలక పాత్రల్లో నటించిన చమ్మక్ చంద్ర, అనంత్, రంగస్థలం మహేష్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. ఆ ఫ్రేమ్ వర్క్స్ అన్ని బాగా వర్కవుట్ అయ్యాయి. సంగీతం బాగుంది, నేపథ్య సంగీతం సైతం సినిమాకి తగ్గట్టుగా ఉంది. మిక్కీ జె.మేయ‌ర్ పాట‌లు, నేప‌థ్య సంగీతంతో సినిమాపై గ‌ట్టి ప్ర‌భావమే చూపించారు. క‌థ‌, క‌థ‌నాల కంటే  సంభాష‌ణ‌ల ర‌చ‌నే ఈ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. మొత్తం మీద ఈ సంక్రాంతిని ‘అనగనగా ఒక రాజు’ వినోదాల విందుని అందించి నవ్వుల పండుగలానే మార్చేశాడు.

Related posts