అక్కినేని శత జయంతి ..శతకోటి నివాళి!

Akkineni Satha Jayanti ..One Hundred Million Tributes!
Spread the love

దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఘనంగా జరుపుకుంటోంది. సినీ లోకం ఆ మహానటుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. అక్కినేని కేవలం తెలుగు సినిమాకే కాదు భారతీయ సినియా దిగ్గజాల్లో ఒకరు. దశాబ్దాల పాటు తెలుగు తెరను ఏలిన ఇద్దరు అగ్రనటులలో ఒకరు నందమూరి తారకరామారావు ..ఇంకొకరు అక్కినేని. సెప్టెంబర్‌ 20 అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి. నటుడిగా ఆయన గురించి చెప్పాలంటే …పౌరాణికాల్లో ఎన్టీ రామారావు… సాంఘికాల్లో నాగేశ్వరరావు. మన తొలి తరం తెలుగు నటులందరూ మొదట నాటకాల్లో నటించినవారే. అంటే, గొంతెత్తి డైలాగులు చెప్పినవారే. చేతులను విపరీతంగా కదిలిస్తూ అభినయించినవారే. అంటే, ఆంగికం, వాచికం రెండూ గట్టిగా చేసేవారు. అక్కినేని కూడా ఆ సంప్రదాయం నుంచి వచ్చిన నటుడే. అందులోనూ ఆడవేషాలు వేసిన అనుభవంతో చలనచిత్రాల్లో నాయకుడైన అపురూపమైన జీవితం ఆయనది. కానీ, సినిమా నటనకు, నాటకరంగ నటనకు ఉన్న తేడాను ఆయన పట్టుకున్నంత వేగంగా మరో నటుడు పట్టుకోలేదు.సినిమాల్లో అరవనక్కరలేదు. చేతులు ఎడాపెడా ఊపనక్కరలేదు. నాటకాల్లో అది తప్పదు. అయిదో వరసలో ఉన్న ప్రేక్షకుడికి కూడా కనిపించాలి, వినిపించాలి కనక. సినిమాకు సాత్వికాభినయం అన్నిటికంటే ముఖ్యం. అది అక్కినేని చాలా త్వరగానే గ్రహించారు. ఇక, కళ అంటే వాస్తవికతాభ్రాంతిని కలిగించేది. అది వాస్తవికత కాదు. దానిని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న నటుడు అక్కినేని. అందుకే ఆయన పాత్రలో లీనమైనట్టు కనిపిస్తారే కానీ నిజంగా లీనమవరు. అప్పటిదాకా అభినయించిన పాత్ర భావోద్వేగాల నుంచి తేలికగ బయటపడటం అక్కినేని ప్రత్యేకత. తను ఒక నటుడిని మాత్రమే కానీ, తను విప్రనారాయణో, సురేంద్రబాబో, డాక్టర్‌ చక్రవర్తో, దేవదాసో, నారదుడో, కాళిదాసో, జయదేవుడో కాడన్న స్పృహ ఆయనను నటిస్తున్నప్పుడు కూడా వీడలేదు. ఈ ఎరుక ఉండడం మామూలు విషయం కాదు. కొందరు నటులు పాత్రల్లో లీనమైపోయి, షూటింగ్‌ తర్వాత కూడా మామూలు మనఃస్థితి చేరుకోలేకపోవడం అక్కినేని కాలంలో జరిగేది. కానీ, ఆయనలో ఆ లక్షణాలే లేవు. నటనను నటనగా సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు కనకే, తను నాస్తికుడై ఉండీ, భక్తిపాత్రలను అంత గొప్పగా పోషించగలిగారు. తను నిజంగా అసాధారణ భక్తుడినని ప్రేక్షకులను నమ్మించగలిగారు. అలాగే, ఒక్క పెగ్గూ తాగకుండా దేవదాసును మన కళ్లముందు సాక్షాత్కరింపజేయగలిగారు. నటుడిగా ఆయనలో ఉన్న మరో గొప్పగుణం, తన పరిమితులు తెలిసి ఉండడం. ఏ పాత్ర తను వేస్తే బాగుంటుందో, ఏది తనకు నప్పదో ఆయనకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే, ఆయనకు ప్రేక్షకులే పరమప్రమాణం. ఏది చేసినా, ప్రేక్షకుల మెప్పును పొందుతానా, ప్రేక్షకులు తనని ఈ పాత్రలో ఆమోదిస్తారా అని ఆలోచించారే తప్ప, తన అహాన్ని సంతృప్తిపరచుకోవడానికి ఏ పాత్రనైనా తను చెయ్యగలనని అనుకోలేదు. ఆ కారణంగానే పౌరాణిక పాత్రలు కొన్నింటిని తిరస్కరించారు. అంతమాత్రాన ఆయన సవాళ్లను స్వీకరించలేదని కాదు. దానికి మంచి ఉదాహరణెళి ’మిస్సమ్మ’ లో రెండో ప్రాధాన్యం ఉన్న పాత్రను వెంటనే ఒప్పేసుకోవడం. అప్పటికే దేవదాసుతో శిఖరాగ్రం చేరుకున్న తను, మిస్సమ్మలో రెండో స్థాయి పాత్రను ఎందుకు ఒప్పుకున్నట్టు? తన నటనపై తనకున్న విశ్వాసంతోనే. తను విషాదపాత్రలతో సరిసమానంగా హాస్యపాత్రను కూడా రక్తికట్టించగలననే నమ్మకంతోనే. అతిగా నటించడం అక్కినేని లక్షణం కాదు. ఆయన నటనలో పాత్ర ఔచిత్యం ఎక్కడా దెబ్బతినదు. పాత్రను అర్థం చేసుకోవడంలో దిట్ట కనకే ఆయన నవలానాయకుడిగా సులువుగా ఒదిగిపోయారు. ఆయనే పదేపదే చెప్పుకున్నట్టు, నిజంగా తనది హీరో పర్సనాలిటీ కాదు. కానీ ఎప్పుడూ మన కళ్లలో హీరోగానే ఉంటారు.

Related posts

Leave a Comment