నటసామ్రాట్ పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ఐదవ తరగతి వరకే చదువుకున్నారు. కానీ, ఆంగ్లంలో అద్భుతంగా మాట్లాడే వారు. అక్కినేని నాగేశ్వరరావు పేరిట గుడివాడలో ఒక కళాశాల వుంది. దానికొక ఘనమైన చరిత్ర వుంది. 1959లో ఆ కళాశాల నిర్మాణానికి అక్కినేని నాగేశ్వరరావు లక్ష రూపాయలు ఇచ్చారు. అప్పట్లో లక్ష అంటే ఇప్పుడు ఎన్నో కోట్లు. గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో చదివిన వాళ్ళు అనేకమంది ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు! చాలామంది అమెరికాలో పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు! ఆ తరువాత ఆ కళాశాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డారు. అది వేరే విషయం కానీ, 66 ఏళ్ల క్రితం అక్కినేని ఇచ్చిన ఆ లక్ష వల్ల ఇన్నేళ్లు అయినా ఆ కళాశాలకు గొప్ప గుర్తింపు. ఎందరో ఉన్నత విద్య చదువుకోగలిగారు, చదువుకున్నారు, చదువుకుంటున్నారు. సరే.. నాగార్జున అక్కినేని కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులు, సిబ్బందికి ఒక చిరస్మరణీయ క్షణాన్ని అందించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ,.. తన తల్లిదండ్రులైన అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ అక్కినేని జ్ఞాపకార్థం అక్కినేని కుటుంబం ఏఎన్ఆర్ కళాశాలలో 2 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్ నిధిని ఏర్పాటు చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ నిర్ణయం తాను, తన సోదరి సుశీల, సోదరుడు వెంకట్, మొత్తం ఏఎన్ఆర్ కుటుంబం కలిసి తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిధిని సరైన పద్ధతిలో అమలు చేయడానికి మేము ఏఎన్ఆర్ కళాశాల యాజమాన్యంతో కలిసి పని చేస్తాము. సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఈ సంస్థకు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు, ఆయన వారసత్వాన్ని కొనసాగించడం మా బాధ్యత. ఈ ప్రకటనకు విద్యార్థులు, అధ్యాపకుల నుంచి కరతాళ ధ్వనులు లభించాయి. ఇది కేవలం కుటుంబం యొక్క ఉదారతను మాత్రమే కాకుండా, విద్య, సమాజ సేవతో వారికి ఉన్న శాశ్వత అనుబంధాన్ని కూడా చాటింది. త్వరలో కళాశాల అభివృద్ధి కమిటీకి పంపించే ఏర్పాటు చేస్తానని నాగార్జున హర్షద్వానాల మధ్య ప్రకటించారు. 1959లోనే ఆంధ్ర విశ్వ విద్యాలయానికి అక్కినేని నాగేశ్వరరావు 25 వేల రూపాయల విరాళం ఇచ్చారు. అక్కినేని చదువుకోలేక పోయాననే ఆవేదనలోంచి చదువుకునే వారిని ప్రోత్సహించడం అలవాటు చేసుకున్నారు. చదువుకునే వారిని చూస్తే ఆయనకు ఎక్కడలేని ఆనందం. ఉన్నత చదువులు చదివే వారికి అవసరమైన వారికి గుప్త దానాలు చేసే వారు. విరాళాలు ఇవ్వడం అందరికి సాధ్యం కాదు.. ఎంతో గొప్ప మనసు పెద్ద మనసు కావాలి. అది కొందరికే ఉంటుంది. అందులో అక్కినేని నాగేశ్వరరావు, వారి కుటుంబం ముందు వరసలో ఉంటుంది. అభినందనలు నాగార్జున గారు!
గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలకు రెండు కోట్లు విరాళం : అనౌన్స్ చేసిన అక్కినేని నాగార్జున
