Agent Movie Review in Telugu : ‘ఏజెంట్‌’ సినిమా రివ్యూ… ప్రేక్షకులపై బుల్లెట్ల వర్షం!

Agent Movie Review Still1
Spread the love

(చిత్రం: ఏజెంట్, విడుదల తేది: 28 ఏప్రిల్-2023, రేటింగ్ : 2/5, నటీనటులు: అఖిల్ అక్కినేని, మ్ముట్టి, సాక్షి వైద్యా, డినో మోరియా, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి తదితరులు. సంగీతం: హిప్ హాప్ తమీజా సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, ఎడిటర్: నవీన్ నూలి, నిర్మాత: రామ బ్రహ్మం సుంకర, దర్శకత్వం: సురేందర్ రెడ్డి, నిర్మాణం : ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా)

టాలీవుడ్ నవతరం హీరో అఖిల్ అక్కినేనికి ఎందుకనో కెరీర్ లో నిలదొక్కుకునేందుకు కాలం కలసిరావడం లేదు. హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంటనే వరుసగా మూడు పరాజయాలను చవిచూశాడు. అతడి గత చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో ఫర్వాలేదనిపించిన అఖిల్ తన కెరియర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూశాడు. తన ఆశలన్నీ తాజా చిత్రం ‘ఏజెంట్’ పైనే పెట్టుకున్నాడు. తన సిక్స్ ప్యాక్ లుక్ తో ప్రేక్షకులను అఖిల్ అలరించే ప్రయత్నం చేశాడు. ‘సై రా నరసింహా రెడ్డి’ ఫేమ్ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళం స్టార్ మమ్ముట్టి కూడా ఈ ‘ఏజెంట్’ లో కీలక పాత్రని పోషించారు. అఖిల్ కు జోడిగా సాక్షి వైద్య కథానాయికగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 28, 2023న ప్రేక్షకుల ముందుకొచ్చింది. యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టయిలిష్ ఫిలిం మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ స్టయిలిష్ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ అనగానే ఈ సినిమాపై అందరికీ ఆసక్తి కలిగింది. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రమిది. సినిమా విడుదలకు ముందే ‘ఏజెంట్’ ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో భారీ అంచనాలని పెంచింది. ఈ చిత్రం ద్వారా అఖిల్ అక్కినేని ఎలాంటి విజయాన్ని అందుకున్నాడు? సినిమా అంచనాలను అందుకుందా? లేదా? తెలుసుకుందాం…

కథ: అనగనగా రిక్కీ అలియాస్ రామకృష్ణ (అఖిల్) అనే యువకుడు. తాను ఓ పవర్ ఫుల్ ‘రా’ ఏజెంట్ కావాలని చిన్నప్పటి నుంచి కల కంటూ.. రా కోసమే బతుకుతూ ఉంటాడు. రా ఏజెంట్ అవ్వాలన్నదే అతడి లక్ష్యం. అందుకోసం అతడు చేసిన ప్రయత్నాలన్నీ నీరుగారిపోతుంటాయి, రా ఏజెంట్ అవ్వాలంటే మాటలుకాదు.. చేతలు కావాలి. అలాంటి చేతలన్నీ తనవద్ద ఉన్నాగానీ ఎందుకనో ఆ అడుగులు విఫలమవుతుంటాయి. రిక్కీ ఉత్సాహం, అతి విశ్వాసం కారణంగా ప్రతీసారి రా ఏజెంట్ గా రిజెక్ట్ అవుతుంటాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఒక ఫేమస్ రా ఏజెంట్.. పేరు డెవిల్ మహాదేవ్ (మమ్ముట్టి) వద్దకు వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో రా ఏజెన్సీ హెడ్ డెవిల్ ను ఆకట్టుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ డెవిల్ కి ఇండియాలో ఒక సిండికేట్ ను రన్ చేసే గాడ్ (డినో మోరియో)తో గొడవలు ఉంటాయి. గాడ్ ని తుదముట్టించడానికి డెవిల్ ఎప్పటికప్పుడు తన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఈ మధ్యలో రిక్కీ, వైద్య (సాక్షి వైద్య)తో ప్రేమలో పడతాడు. కానీ అంతలో డెవిల్ మహాదేవ్, రిక్కీకి ఒక డేంజరస్ మిషన్ అప్పగిస్తాడు. ఇంతకీ ఏమిటి ఆ మిషన్ ?, అసలు రిక్కీ ఎందుకు రా ఏజెంట్ కావాలనుకకుంటాడు?, చివరకు రిక్కీ, డెవిల్ మహాదేవ్ ఇచ్చిన మిషన్ ను పూర్తి చేశాడా? లేదా? ఇంతకీ డెవిల్ మరియు గాడ్ కి మధ్య గొడవలు ఎందుకు ఏర్పడ్డాయి? రా ఏజెంట్ అవ్వడానికి అఖిల్ కు డెవిల్ ఈ విధంగా ఉపయోగపడ్డాడు? తను అనుకున్నట్లు అఖిల్ రా ఏజెంట్ అవ్వగలిగాడా? లేదా? డెవిల్ గాడ్ మధ్యలో ఎవరు గెలిచారు? చివరికి ఏమైంది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ: మామూలుగా మొదలయిన సినిమా ఫస్ట్ హాఫ్ లోని సన్నివేశాలు అన్నీ ఇంతకుముందు ఏదో సినిమాలో చూసినట్లుగానే కనిపిస్తాయి. రెగ్యులర్ తెలుగు కమర్షియల్ సినిమా ఫార్మేట్ లోనే ఈ సినిమా మొత్తం సాగింది. . స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉంటుంది. ట్రైలర్ లో అఖిల్ పాత్ర చెప్పినంత వైల్డ్ గా సినిమా అయితే లేదు. ఇంటర్వెల్ సీన్ ఫర్వాలేదు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా అంతే బోరింగ్ గా రెగ్యులర్ ఫార్మేట్ లోనే నడుస్తుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి బోరింగ్ కమర్షియల్ సినిమా రాలేదని కచ్చితంగా చెప్పొచ్చు. ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ వైవిధ్యమైనది కాకపోయినా.. కనీసం ఇంట్రస్ట్ గా అయిన సాగాలి. ఈ కథలో అది కూడా మిస్ అయింది. దర్శకుడిగా సురేందర్ రెడ్డి మంచి కథా నేపథ్యం రాసుకున్నప్పటికీ.. ఆసక్తికరమైన కథనంతో సినిమాని ఇంట్రెస్టింగ్ గా మలచలేకపోయారు. అక్కడక్కడ బోర్ గా సాగే సన్నివేశాలు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. పైగా ఈ చిత్రం చూస్తున్నంత సేపు రెగ్యులర్ యాక్షన్ డ్రామాలే గుర్తుకువస్తాయి. అన్నిటికీ మించి సినిమాలో గుర్తు ఉండిపోయే ఒక్క ఎమోషన్ కూడా బలంగా ఎలివేట్ కాలేదు. నిజానికి క్లైమాక్స్ లో మమ్ముట్టి క్యారెక్టర్ ను ఎమోషనల్ గా డిజైన్ చేసినప్పటికీ.. అది పెద్దగా స్క్రీన్ మీద వర్కౌట్ కాలేదు. సినిమాలో ఎక్కువ భాగం యాక్షన్ అండ్ ఇన్విస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సాగినా.. ఎక్కడా వాట్ నెక్స్ట్ అనే టెన్షన్ కూడా బలంగా లేకపోవడం ఈ సినిమాకి మరో బలహీనత. సినిమా మెయిన్ గా మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే జోనర్ అయినప్పటికీ.. దర్శకుడు మాత్రం అక్కడక్కడ ఆకట్టుకునే యాక్షన్ ను తప్ప.. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ను సినిమాలో ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. పైగా ఈ చిత్రంలో చాలా తేలికపాటి ఇన్విస్టిగేషన్ తోనే ముగించడం అంతగా రుచించదు. ఎవ్వరికీ నచ్చలేదు. పైగా సినిమా అంతా బుల్లెట్ల వర్షం కురిసి ప్రేక్షకుల్ని బాగా విసిగించింది. దర్శకుడు సురేందర్ రెడ్డి మంచి కథనే ఎంచుకున్నారు గానీ, ఆ ఐడియాకు తగ్గట్టు అంతే కొత్తగా ట్రీట్మెంట్ ను మాత్రం రాసుకోలేకపోయారు. సినిమాలో సస్పెన్స్ తో ఇంట్రెస్ట్ పెంచే స్కోప్ ఉన్నప్పటికీ ప్లే సింపుల్ గా హ్యాండల్ చేశారు.

ఎవరెలా చేశారంటే.. : ఈ చిత్రం కోసం అఖిల్ అక్కినేని బాగా కష్టపడ్డాడని చెప్పొచ్చు.అందుకు అతడు ఒక వైల్డ్ మేక్ ఓవర్ చేశాడు. పొడుగు జుట్టు, సిక్స్ ప్యాక్ లుక్ అఖిల్ కి బాగా సూట్ అయ్యాయి. వెండి తెర మీద అఖిల్ సరికొత్త అవతారంలో కనిపించాడు. యాక్షన్ సన్నివేశాలలో తో పాటే రొమాంటిక్ సన్నివేశాలలో కూడా నటన పరంగా కూడా మంచి మార్కులే వేయొచ్చు. వైల్డ్ సాలె రిక్కీగా ఈ సినిమాలో అక్కినేని అఖిల్ పవర్ ఫుల్ పాత్ర‌లో తన టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అఖిల్ అగ్రెసీవ్ బాడీ లాంగ్వేజ్, డామినేట్ చేసే తన క్యారెక్టరైజేషన్ అండ్ మాడ్యులేషన్ తో తన పాత్రకు ఫర్ఫెక్ట్ గా న్యాయం చేశాడు. పైగా తన గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో అఖిల్ కొత్త లుక్స్ తో చాలా వైల్డ్ గా కనిపించాడు. ఇటు హీరోయిన్ తో ప్రేమ సన్నివేశాల్లో, అటు యాక్షన్ సన్నివేశాల్లో అఖిల్ చాలా సెటిల్డ్ గా చక్కగా నటించాడు. హీరోయిన్ గా నటించిన సాక్షి వైద్య కూడా తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని చోట్ల సందర్భానుసారంగా ఆమె పలికించిన హావభావాలు మరియు ఆమె నటన బాగుంది. గ్లామర్ గా కనిపించి మెప్పించింది. కాకపోతే.. ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత ఉన్నట్టు కనిపించలేదు. ఉన్నంతలో ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ గానే మిగిలిపోయింది. నటనాపరంగా ఒకే అనిపించింది. ఈ చిత్రానికి మరో ప్రధానాకర్షణ సీనియర్ నటుడు మమ్ముట్టి. ఆయన ఎప్పటిలాగే తన టైమింగ్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో మమ్ముట్టి నటన చాలా బాగుంది. మమ్ముట్టి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి పాత్రలు అతడికి కొట్టిన పెండే. మమ్ముట్టి కి ఈ సినిమాలో కీలకమైన పాత్ర లభించింది. ఎప్పటిలాగానే తన చక్కటి పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక గాడ్ గా నటించిన డినో మోరియా తొలిసారిగా ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆయన పాత్ర అనుకున్నంత లేకపోయినప్పటికీ నటనపరంగా ఇరగదీశాడు. అఖిల్ కి తండ్రి పాత్రలో కనిపించిన మురళీ శర్మ తన నటనతో మెప్పించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

టెక్నీకల్ విషయాలకొస్తే… దర్శకుడు సురేందర్ రెడ్డికి యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు చేయడంలో గొప్ప పేరే ఉంది. అలాంటి చిత్రాలు తెరకెక్కించడంలో ఆయనది విభిన్నమైన శైలి అంటుంటారు. ‘ఏజెంట్’ విషయంలో కూడా సురేందర్ రెడ్డి తనదైన శైలిలో యాక్షన్ సన్నివేశాలను విభిన్నంగానే ప్రెజెంట్ చేశారు. అయితే… యాక్షన్ సన్నివేశాలపైన పెట్టిన శ్రద్ద కాస్త కథమీద పెట్టివుంటే బావుండేది. స్క్రీన్ ప్లే సైతం నీరసంగా ఉంది. ఫారిన్ లొకేషన్ ల మీద పెట్టిన ఫోకస్.. కథ మరియు స్క్రీన్ ప్లే మీద మాత్రం పెట్టలేకపోయారు. కథలో కొత్తదనమే కనిపించదు. రొటీన్ అవుట్ డేటెడ్ కథ. స్క్రీన్ ప్లే కూడా చాలా వరకు స్లోగా ఉండటంతో సినిమా చూసే ప్రేక్షకులు బోర్ ఫీలయ్యారు. మ్యూజిక్ విష‌యానికి వ‌స్తే…హిప్ హాప్ తమిజా అందించిన సంగీతం అక్కడక్కడ ఫర్వాలేదనిపిస్తోంది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. సంగీతం ఈ సినిమాకి నెగిటివ్ పాయింట్ గానే చెప్పుకోవాలి. పాటలు అంతంతమాత్రమే. రసూల్ ఎల్లోర్ సినిమాటో గ్రాఫర్ పనితనం మాత్రం బాగుంది. సినిమా మూడ్ కి అనుగుణంగా రసూల్ దృశ్యాలని బాగా తెరకెక్కించారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాగున్నప్పటికీ కథకు అవసరం లేని సీన్స్ ను ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ‘ఏజెంట్’ అంటూ వచ్చిన ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు అఖిల్ వైల్డ్ పెర్ఫార్మెన్స్ మాత్రమే బాగున్నాయి. అలాగే మమ్ముట్టి నటన మెప్పిస్తుంది. అయితే, బోరింగ్ ప్లేతో పాటు లాజిక్ లెస్ సీన్స్, ఇంట్రెస్ట్ కలిగించలేని యాక్షన్ డ్రామా సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో అఖిల్ విభిన్నమైన లుక్ విజువల్స్ బ్యాక్ గ్రౌండ్ లొకేషన్స్ బాగున్నప్పటికీ.. కథ స్క్రీన్ ప్లే బోరింగ్ నెరేషన్ తో సినిమా ఎవ్వరినీ ఆకట్టుకోలేకపోయింది.

Related posts

Leave a Comment