తెలుగు సినిమాకు ఏడు అవార్డులు
ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్ కేసరి’
‘బేబీ’, ‘హను-మ్యాన్’ చిత్రాలకు రెండేసి అవార్డులు
‘బలగం’తో గీతరచయిత కాసర్ల శ్యామ్ కు జాతీయ అవార్డు
‘గాంధీ తాత చెట్టు’తో ఉత్తమ బాలనటిగా సుకృతివేణి
2023 సంవత్సరానికి సంబంధించిన 71వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డు జ్యూరీ కమిటీ శుక్రవారం నాడు కేంద్ర సమాచారం, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు నివేదికను అందజేసింది. మొత్తం 15 విభాగాల్లో అవార్డులను జ్యూరీ ఈ సందర్భంగా ప్రకటించింది. జాతీయ ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్‌కు అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు నటులు పంచుకున్నారు. షారుక్ ఖాన్(జవాన్), విక్రాంత్ మస్సే(12th ఫెయిల్) ఎంపికయ్యారు. మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ)లో నటనకు గాను రాణీ ముఖర్జీని ఉత్తమ నటి అవార్డు వరించింది. అలాగే ఉత్తమ తెలుగు చిత్రంగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరీ నిలిచింది. ఉత్తమ యాక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ)లో హన్‌మాన్ చిత్రం అవార్డు అందుకోగా.. ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్ (బలగం) అవార్డును సొంతం చేసుకున్నారు. దీంతో వరుసగా ఈ ఏడాది కూడా తెలుగు సినిమాలు జాతీయ స్థాయిలో సత్తా చాటినట్లు అయింది. భారతీయ సినిమాకు 2023వ సంవత్సరం ఎంతో ఊరట నిచ్చింది. ఆ యేడాది విడుదలైన పలు భాషా చిత్రాలు విజయం సాధించాయి.ముఖ్యంగా మన తెలుగు చిత్రాలకు అవార్డుల పంటపండింది. తెలుగు చిత్రసీమ ఎప్పటికప్పుడు పరిశ్రమలో తన సత్తా చాటుతూనే ఉంది. దూసుకుపోతున్నప్రపంచానికి ధీటుగా మన టాలీవుడ్ కూడా ఎంతో విభిన్నంగా ఆలోచిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. తాజాగా 71వ జాతీయ అవార్డుల వేదికపై టాలీవుడ్ మరోసారి తన ప్రతిభను ప్రపంచానికి తెలియజేసింది. ఏకంగా 7 అవార్డులను కైవసం చేసుకొని తెలుగువారి గర్వాన్ని పెంచేసింది. మరి ఆ 7 అవార్డులు ఏఏ విభాగంలో ఎవరెవరికి వచ్చాయి.. ఎవరెవరు జాతీయ అవార్డును అందుకోబోతున్నారో చూద్దాం.
బెస్ట్ తెలుగు ఫిల్మ్ – భగవంత్ కేసరి: నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సినిమా ‘భగవంత్ కేసరి’. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి నిర్మించిన ఈ సినిమా 2023లో విడుదలయి భారీ విజయాన్ని మూటగట్టుకుంది. ఈ సినిమాలో బాలయ్యకు కూతురుగా శ్రీలీల నటించింది. ఈ సినిమా కథ విషయానికొస్తే వరంగల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ భగవంత్ కేసరి (బాలకృష్ణ). ఆ జైలర్ శ్రీకాంత్ (శరత్‌కుమార్) ఓ ప్రమాదంలో చనిపోతాడు. ఆయనకు జైలర్ చేసిన సాయానికి కృతజ్ఞతగా జైలు అధికారి కూతురు అయిన విజ్జి పాప (శ్రీలీల) ను ఆర్మీ ఆఫీసర్ చేయాలనుకుంటాడు. ఇంకోపక్క విజ్జీని చంపేందుకు బిజినెస్‌మెన్ రాహుల్ సంఘ్వీ (అర్జున్ రాంపాల్) ప్రయత్నిస్తుంటాడు? విజ్జీని అతడు ఎందుకు చంపాలని అనుకున్నాడు? భగవంత్ కేసరి రాహుల్ సంఘ్వీ నుండి విజ్జిని ఎలా కాపాడాడు? విజ్జిని సైన్యంలోకి పంపాలన్న భగవంత్ కేసరి లక్ష్యం నెరవేరిందా? అడ్డంకులను దాటి భగవంత్ కేసరి ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయగలిగాడా? అనేదే మిగతా సినిమా కథ. ‘బనావో బేటీకో షేర్’ అనే లైన్ తో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు అనిల్టా రావిపూడి. నేలకొండ భగవంత్ కేసరిగా బాలయ్య నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమాలో చూపించిన గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ అనే పాయింట్ ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఒక గుణపాఠం గా చూపించింది. ఇక ఈ విషయం తెలియడంతో నందమూరి ఫ్యాన్స్ సంబురాలు మొదలుపెట్టారు. ఈ ఏడాదిలోనే బాలయ్యకు పద్మభూషణ్ వరించింది. ఆ ఆనందంలో ఉన్నప్పుడే మరో జాతీయ అవార్డును ఆయన సినిమాకు రావడం హర్షించదగ్గ విషయమని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ అవార్డు మరియు బెస్ట్ ఫిల్మ్.. యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్ అవార్డు – హనుమాన్: కుర్ర హీరో తేజా సజ్జ, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. మొట్ట మొదటి సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా గతేడాది విడుదలయింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడి మరీ సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇక ఈ సినిమాలోని విజువల్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యిపోయారు. తక్కువ బడ్జెట్ లో అంత క్వాలిటీ విజువల్స్ కు ఆశ్చర్యపోయారు. ఇక ఇప్పుడు ఈ సినిమా యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్ విభాగంలో జాతీయ అవార్డును అందుకుంది. అంతేకాకుండా బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీగా కూడా అవార్డును కైవసం చేసుకోవడం గమనార్హం.
బెస్ట్ మేల్ సింగర్.. ప్రేమిస్తున్నా, రోహిత్ విపిఎస్ఎన్ మరియు బెస్ట్ స్క్రీన్ ప్లే.. సాయి రాజేష్ – బేబీ చిత్రం : విరాజ్ అశ్విన్, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలుగా సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బేబీ. ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ సినిమా 2023 లో విడుదలయింది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా విడుదలయిన ‘బేబీ’ టాలీవుడ్ లోనే ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ముఖ్యంగా వైష్ణవి చైతన్య-ఆనంద్ దేవరకొండ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలోని ప్రేమిస్తున్నా సాంగ్ ఇప్పటికీ బ్రేకప్ అయినవారికి ఫేవరేట్ గా మారిపోయింది. ఆ సాంగ్ పాడిన సింగర్ రోహిత్ విపిఎన్ కే ఉత్తమ జాతీయ సింగర్ అవార్డు వచ్చింది. ఇక బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు సాయి రాజేష్ సొంతం చేసుకున్నాడు.
బెస్ట్ లిరిక్స్.. ‘బలగం’ ఊరు పల్లెటూరు.. కాసర్ల శ్యామ్: ఊరు.. పల్లెటూరు అంటూ ఒక్క సాంగ్ తో అన్ని పల్లెటూర్లను ఏకం చేశాడు గేయరచయిత కాసర్ల శ్యామ్. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా కమెడియన్ వేణు డైరెక్టర్ గా పరిచయం అయిన సినిమా ‘బలగం’. దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి ఈ సినిమాను నిర్మించింది. 2023లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా చిత్ర పరిశ్రమను మొత్తాన్ని షేక్ ఆడించేసింది. ముఖ్యంగా ఆ ఊరు .. పల్లెటూరు సాంగ్ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు అదే సాంగ్ లిరిక్స్ కు ఉత్తమ జాతీయ అవార్డు వరించింది.
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్.. సుకృతి వేణి బండ్రెడ్డి ‘గాంధీ తాత చెట్టు’ : స్టార్ డైరెక్టర్ సుకుమార్ ముద్దుల తనయ సుకృతి వేణి తన మొదటి సినిమాతోనే జాతీయ అవార్డును అందుకుంది. ఆమె బాలనటిగా నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. ఈ సినిమా విడుదలవ్వకముందే ఎన్నో అవార్డులను అందుకుంది. విడుదలయ్యాక సుకృతి వేణి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ వయస్సులోనే ఆమె నటనను చూసి మెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఈ చిన్నారిని జాతీయ అవార్డు వరించింది.
71వ జాతీయ అవార్డుల పూర్తి లిస్ట్ ఇదే..
భారతీయ సినిమాకు 2023వ సంవత్సరం ఎంతో ఊరట నిచ్చింది. ఆ యేడాది విడుదలైన పలు భాషా చిత్రాలు విజయం సాధించాయి. 2023లో విడుదలైన పలు చిత్రాలు 71వ జాతీయ చలన చిత్ర అవార్డులకు పోటీపడ్డాయి. తెలుగు సినిమాకు ఏడు అవార్డులు దక్కాయి. అందులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘భగవంత్ కేసరి’ నిలవగా, ‘హను-మ్యాన్’ రెండింటిని, ‘బేబీ’ కూడా రెండు అవార్డులను సొంతం చేసుకున్నాయి. ‘బలగం’ ఓ అవార్డును, ‘గాంధీతాత చెట్టు’ ఓ అవార్డును దక్కించుకున్నాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ‘ట్వల్త్ ఫెయిల్’ ఎన్నికయింది. ఉత్తమ నటుడు విభాగంలో ‘జవాన్’ ద్వారా షారుఖ్ ఖాన్, ‘ట్వల్త్ ఫెయిల్’ తో విక్రాంత్ మస్సే విజేతలుగా నిలిచారు. ఉత్తమ నటిగా ‘మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే’లో నటించిన రాణీ ముఖర్జీ ఎన్నికయ్యారు.
అవార్డుల వివరాలు: ఉత్తమ జాతీయ చిత్రం : ట్వల్త్ ఫెయిల్ (హిందీ), ఉత్తమ దర్శకుడు : సుదీప్తో సేన్ (ద కేరళ స్టోరీ (హిందీ), ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు : ఆశిష్ బెండే (ఆత్మపాంప్లెట్ – మరాఠీ), ఉత్తమ విశేషాదరణ పొందిన వినోదభరిత చిత్రం : రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ (హిందీ), ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం : శ్యామ్ బహదూర్ (హిందీ), ఉత్తమ బాలల చిత్రం : నాల్ 2 (మరాఠీ), ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్ మూవీ : హను-మ్యాన్ (తెలుగు), ఉత్తమ నటుడు : షారుఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (ట్వల్త్ ఫెయిల్), ఉత్తమ నటి : రాణీ ముఖర్జీ (మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే), ఉత్తమ సహాయనటుడు : విజయ రాఘవన్ (పూక్కాలమ్ – మళయాళం), సోమూ భాస్కర్ (పార్కింగ్ – తమిళం), ఉత్తమ సహాయ నటి : ఊర్వశి (ఉల్లోళుక్కు – మళయాళం), జానకీ బోడీవాలా (వశ్ – గుజరాతీ), ఉత్తమ బాలనటుడు/నటి : సుకృతి వేణి (గాంధీతాత చెట్టు – తెలుగు), కబీర్ కందరే (జిప్సీ – మరాఠీ), త్రిష, శ్రీనివాస్, భార్గవ్ (నాల్ 2- మరాఠీ), ఉత్తమ గాయకుడు : పీవీయన్ యస్ రోహిత్ (ప్రేమిస్తా… (బేబీ- తెలుగు), ఉత్తమ గాయని : శిల్పా రావ్ (చెలియా… జవాన్ -హిందీ), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : ప్రశాంతు మోహపాత్ర (ద కేరళ స్టోరీ – హిందీ), ఉత్తమ స్క్రీన్ ప్లే : సాయి రాజేశ్ నీలమ్ (బేబీ – తెలుగు), రామ్ కుమార్ బాలకృష్ణన్ (పార్కింగ్ – తమిళం), ఉత్తమ డైలాగ్ రైటర్ : దీపక్ కింగ్రాణీ (సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై – హిందీ), ఉత్తమ ఎడిటింగ్ : మిథున్ మురళి (పూక్కాలమ్ – మళయాళం), ఉత్తమ సౌండ్ డిజైన్ : సచిన్ సుధాకరన్, హరిహరన్ మురళీధరన్ (అనిమల్ – హిందీ), ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : మోహన్ దాస్ (2018- ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో- మళయాళం), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ : సచిన్ లోవలేకర్, దివ్యా గంభీర్, నిధి గంబీర్ (శ్యామ్ బహదూర్ – హిందీ), ఉత్తమ మేకప్ : శ్రీకాంత్ దేశాయ్ (శ్యామ్ బహదూర్ – హిందీ), ఉత్తమ సంగీత దర్శకత్వం : జీవీ ప్రకాశ్ కుమార్ (వాతి – తమిళం), ఉత్తమ నేపథ్య సంగీతం : హర్ష వర్ధన్ రామేశ్వర్ (అనిమల్ – హిందీ), ఉత్తమ గీత రచయిత : కాసర్ల శ్యామ్ (ఊరూ పల్లెటూరు… బలగం – తెలుగు), ఉత్తమ కొరియోగ్రఫి : వైభవీ మర్చంట్ (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ లోని ‘ధింధోరా బాజే…’ పాటకు), ఉత్తమ యాక్షన్ (స్టంట్ కొరియోగ్రఫి) : నందు పృథ్వీ (హను-మ్యాన్ – తెలుగు).
ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు: ఉత్తమ తెలుగు సినిమా – భగవంత్ కేసరి, ఉత్తమ తమిళ సినిమా – పార్కింగ్, ఉత్తమ పంజాబ్ సినిమా – గాడ్డే గాడ్డే చా, ఉత్తమ ఒరియా సినిమా – పుష్కర, ఉత్తమ మరాఠీ సినిమా – శ్యామ్చీ ఆయీ, ఉత్తమ మళయాళం – ఉల్లోళుక్కు, ఉత్తమ కన్నడ – కందీలు – ద రే ఆఫ్ హోప్, ఉత్తమ హిందీ సినిమా – కఠల్ – ఏ జాక్ ఫ్రూట్ మిస్టరీ, ఉత్తమ గుజరాతీ – వశ్, ఉత్తమ బెంగాలీ – డీప్ ఫ్రిజ్, ఉత్తమ అస్సామీ – రొంగటపు 1982.
ప్రత్యేక విభాగం : ఉత్తమ గరో ఫిలిమ్ – రిమ్ డోగిట్టానా, ఉత్తమ తై ఫకే ఫిలిమ్ – పై తంగ్ (స్టెఫ్ ఆఫ్ హోప్), ప్రత్యేక ప్రశంస – ఎమ్.ఆర్.రాజ్ క్రిష్ణన్ (రీ-రికార్డింగ్ మిక్సర్ – అనిమల్ – హిందీ)
నాకు అపారమైన గర్వకారణం : నందమూరి బాలకృష్ణ
71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం నాకు అపారమైన గర్వకారణం. ఈ గౌరవం మొత్తం మా చిత్ర బృందానికే చెందుతుంది. షైన్ స్క్రీన్ (ఇండియా ఎల్.ఎల్.పి) తరఫున చిత్ర నిర్మాతలు సాహు గారపాటి గారు, హరీష్ పెద్ది గారు, ఈ కథను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు అనిల్ రావిపూడి గారు, అలాగే ప్రతి కళాకారుడు, సాంకేతిక నిపుణుడు, సిబ్బంది అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది. జాతీయ అవార్డుల జ్యూరీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ .. భారతదేశంలోని ఇతర జాతీయ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. వారి ప్రతిభ భారతీయ సినీ రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఈ గుర్తింపు మాకు మరింత స్ఫూర్తినిస్తూ ..ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకే శక్తివంతమైన కథలను అందించాలన్న మా తపనను మరింత బలపరుస్తోంది. జై హింద్’ అని తెలిపారు.
ఈ పురస్కారాలు చిత్ర పరిశ్రమకు నూతనోత్సాహాన్ని అందిస్తాయి : పవన్ కళ్యాణ్
జాతీయ చలన చిత్ర పురస్కార గ్రహీతలకు ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ, ’71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉంది. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకం. ఆ చిత్ర దర్శకుడు శ్రీ అనిల్ రావిపూడి, నిర్మాతలు శ్రీ సాహు గారపాటి, శ్రీ హరీష్ పెద్దిలకు అభినందనలు. ఉత్తమ వి.ఎఫ్.ఎక్స్. చిత్రంగా ‘హను-మాన్’ చిత్రం నిలిచింది. ఈ చిత్ర దర్శకుడు శ్రీ ప్రశాంత్ వర్మ, వి.ఎఫ్.ఎక్స్. నిపుణులకు, నిర్మాతకు అభినందనలు. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా శ్రీ నీలం సాయి రాజేష్ (బేబీ చిత్రం), ఉత్తమ గీత రచయితగా శ్రీ కాసర్ల శ్యామ్ (బలగం), ఉత్తమ గాయకుడుగా శ్రీ పి.వి.ఎన్.ఎస్. రోహిత్ (బేబీ), ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ గా శ్రీ నందు పృథ్వీ (హను-మాన్), ఉత్తమ బాల నటిగా సుకృతివేణి బండ్రెడ్డి (గాంధీ తాత చెట్టు) పురస్కారాలకు ఎంపికైనందుకు వారికి హృదయపూర్వక అభినందనలు. ఈ పురస్కారాలు చిత్ర పరిశ్రమకు నూతనోత్సాహాన్ని అందిస్తాయి. జాతీయ ఉత్తమ నటులుగా శ్రీ షారుక్ ఖాన్, శ్రీ విక్రాంత్ మాస్సే, ఉత్తమనటిగా శ్రీమతి రాణీ ముఖర్జీ, ఉత్తమ దర్శకుడుగా శ్రీ సుదీప్తో సేన్, ఇతర పురస్కార విజేతలకు అభినందనలు’ అని తెలిపారు.
ఈ అవార్డుల వెనుక ఎంతో కష్టం ఉంది : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
సినిమాల్లో అత్యుత్తమ సేవలు అందించిన టెక్నీషియన్స్ ను గుర్తించి వారి సేవలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పురస్కారాలతో సత్కరిస్తూ ఉంటుంది. ప్రభుత్వం 71 వ జాతీయ పురస్కారాలకు అర్హులైనవారి పేర్లను ప్రకటించింది. అందులో టాలీవుడ్ 7 అవార్డులను కైవసం చేసుకుంది. ఈ 7 అవార్డుల్లో రెండు అవార్డులను సొంతం చేసుకుంది హనుమాన్. బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ గా నందు, పృథ్వీ ఈ అవార్డును అందుకోనుండగా.. బెస్ట్ ఫిల్మ్ (యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్) విభాగంలో వెంకట్ కుమార్ చిట్టి మరో అవార్డును అందుకోనున్నారు. ఇక తమ టీమ్ ఈ అవార్డులను అందుకోవడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ.. జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు. ‘ మా సినిమాకు రెండు అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది. వీరికి ఈ అవార్డులు వచ్చాయి అంటే కనుక వారి వెనుక ఎంతోమంది కృషి ఉంది. మా నిర్మాతలు, నటులు, టెక్నీషియన్స్ కు నా తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జ్యూరీ సభ్యులకు మాకు ఈ అవార్డులు ఇచ్చినందుకు మా యూనిట్ తరువాత థాంక్స్’ అంటూ చెప్పుకొచ్చాడు.