Major Movie Review In Telugu : సెల్యూట్ ‘మేజర్‌’!

Major Movie Review In Telugu :
Spread the love

By ఎం.డి అబ్దుల్, సినీ విశ్లేషకులు

( చిత్రం : మేజర్‌ , విడుదల తేది: జూన్‌ 3, 2022, దర్శకత్వం : శశి కిరణ్‌ తిక్క, రేటింగ్ : 3/5, నటీనటులు : అడివి శేష్‌, సయీ మంజ్రేకర్‌, ప్రకాశ్‌ రాజ్‌, శోభిత ధూళిపాళ, రేవతి, మురళీ శర్మ తదితరులు, నిర్మాణం : జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్ – ఏ ప్లస్‌ ఏస్‌ మూవీస్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌, నిర్మాత: మహేశ్‌బాబు – అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, సినిమాటోగ్ర‌ఫి: వంశీ పచ్చిపులుసు)

26/11 ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘మేజర్’. క్షణం, గూడచారి, ఎవరు వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. తెలుగులో ;సొంతం’ అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి ‘కర్మ’ అనే సినిమాతో హీరోగా మారాడు అడివి శేష్. ఆ తర్వాత పంజా, బలుపు, కిస్, రన్ రాజా రన్, బాహుబలి, దొంగాట, సైజ్ జీరో వంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు పోషించి ‘క్షణం’ సినిమాతో హీరోగా మంచి బ్రేక్ అందుకున్నాడు. ఆ తర్వాత గూడచారి, ఎవరు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఈ సినిమాని మహేష్ బాబుకు చెందిన ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఇండియా ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రుల పాత్రలో నటించగా సందీప్ ప్రేయసిగా సాయి మంజ్రేకర్ నటించింది. శోభిత ధూళిపాళ్ల కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా ఢిపరెంట్‌గా, గ్రాండ్‌గా చేయడంతో ‘మేజర్‌’పై అంచనాలు పెరిగాయి. పైపెచ్చు ఈ సినిమా నిర్మాణంలో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కూడా పాలుపంచుకోవడంతో ఈ చిత్రంపై మరింత హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం (జూన్ 3, 2022)న విడుదలయింది. మరి ‘మేజర్‌’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో​ చూద్దాం…
కథ: ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి సందీప్‌ ఉన్నికృష్ణన్‌ (అడివి శేష్‌). భారత సైన్యంలో పనిచేయాలనే తపనతో ఉంటాడు. చిన్నప్పటి నుంచి అతడికి అదే అతడికి అదే ధ్యాస. ఆ ఆలోచన చుట్టే పరిభ్రమిస్తుంటాడు. కానీ… అతని తండ్రి (ప్రకాశ్‌ రాజ్‌) కొడుకుని డాక్టర్‌ చేయాలని, తల్లి (రేవతి) కొడుకుని ఇంజినీరింగ్‌ చదివించాలనుకుంటారు. అయితే.. చివరికి కొడుకు ఆశయాలకు, ఆలోచనకు వాళ్ల ఇష్టాన్ని చంపుకుంటారు. సోల్జర్‌ అవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్న సందీప్‌.. ఆ దిశగా కష్టపడి ఇండియన్‌ ఆర్మీలో ప్రవేశిస్తాడు. స్కూల్‌ డేస్‌లో ఇష్టపడిన ఇషా (సయీ మంజ్రేకర్‌)ని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆమెతో ఎక్కువ సమయం గడపలేకపోతాడు. దీంతో వీరిమధ్య విభేదాలు వస్తాయి. చివరకు విడాకుల వరకు వెళతారు. మరోవైపు ఇల్లు, కుటుంబం కంటే దేశమే ఎక్కువ అని భావించే సందీప్‌.. అంచెలంచెలుగా ఎదిగి భారత సైన్యంలో ముఖ్యమైన ఎన్‌ఎస్‌జీ కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి చేరుతాడు. ఓసారి తను ఇంటికి వెళ్లేందుకు పై అధికారి (మురళీ శర్మ) దగ్గర అనుమతి తీసుకొని బెంగళూరు బయలుదేరుతాడు సందీప్‌. అదే సమయంలో ముంబై తాజ్‌ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడతారు. ఆ సమయంలో తన ప్రయాణాన్ని రద్దు చేసుకొని ‘51 ఎస్‌ఎస్‌ జీ’ బృందంతో కలిసి ముంబైకి బయలుదేరుతాడు. తాజ్‌ హోటల్‌లో దాగి ఉన్న ఉగ్రవాదులను సందీప్‌ ఎలా మట్టుబెట్టాడు? హోటల్‌లో బందీగా ఉన్న సామాన్య ప్రజలను ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను రక్షించేందుకు తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు? అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ : ‘ఆర్మీలో చేరుతా’ అని సందీప్‌ అన్నప్పుడు.. ‘నీకేమైనా అయితే ఎలా?’ అని తల్లి అడిగితే..‘ప్రతి అమ్మ ఇలానే అనుకుంటే…?’అని సందీప్‌ చెప్పిన డైలాగ్‌ ఆందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అడివి శేష్ ధైర్యసాహసాలు, పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి తీసుకున్న కఠినమైన శిక్షణ తెరపై ప్రతిబింబిస్తుంది. ఆయన మొత్తం అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకుంటాడు. దేశభక్తి కోసం మేజర్‌లో థ్రిల్లింగ్ లోలాగే గ్రిప్పింగ్ కథనం ఉంది, ఇది జింగోయిస్టిక్‌ను పొందకుండా దేశభక్తిని కలిగిస్తుంది. తాజ్‌ హోటల్‌పై ఉగ్రదాడితో ఫస్టాఫ్‌కి బ్రేక్‌ ఇచ్చిన దర్శకుడు సెకండాఫ్‌లో మొత్తం 26\11 ఉగ్రదాడినే చూపించాడు. తాజ్‌ హోటల్‌లో ఉగ్రవాదులు చేసిన అరాచకాలు.. వారిని మట్టుపెట్టేందుకు మేజర్‌ ఉన్నికృష్ణన్‌ పన్నిన వ్యూహాలు.. ప్రాణాలకు తెగించి సామాన్య ప్రజలను కాపాడిన తీరు.. ప్రతీదీ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ప్రాణాలు పోతాయని తెలిసినా.. సందీప్‌ ఒక్కడే ఉగ్రవాదులు ఉన్న చోటుకు వెళ్లడం.. అక్కడ వారితో జరిపిన వార్‌… ఒంటినిండా బుల్లెట్లు, కత్తిపోట్లు ఉన్నా.. చివరి క్షణం వరకు దేశరక్షణ కోసమే పాటుపడడం.. క్లైమాక్స్‌లో ప్రకాశ్‌ రాజ్‌ స్పీచ్‌.. ప్రేక్షకులను కంటతడిపెట్టిస్తాయి. క్షణం, గుడాచారి, ఎవరు వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు అడివి శేష్‌. అతడు హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రతీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ యాక్షన్ డ్రామాలో అడివి శేష్‌తో పాటు సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి మరియు మురళీ శర్మ కూడా కీలక పాత్రల్లో నటించారు. బయోపిక్‌ సినిమా అంటే.. దర్శకుడికి టెన్షన్ తప్పదు. కత్తిమీద సాములాంటిది. కథతో పాటు అందులోని ఆత్మనూ తీసుకుని తెరకెక్కిస్తే.. ఆ చిత్రాలను ప్రేక్షకులను ఆదరిస్తారు. ఈ విషయంలో దర్శకుడు శశి కిరణ్‌ తిక్క సఫలమయ్యాడు. 26/11 ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ గురించి తెలియని విషయాలను భారతీయ ప్రేక్షకులకు తెరపై చూపించాడు. ముంబై దాడుల్లో మేజర్‌ ఉన్ని కృష్ణ ఎలా వీరమరణం పొందారో అందరికి తెలుసు. కానీ ఆయన ఎలా జీవించాడో ఈ సినిమాలో చూపించారు. ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి? బాల్యం ఎలా సాగింది? తల్లిదండ్రులపై ఆయనకు ఉన్న ప్రేమ, యవ్వనంలో​ ఉన్న లవ్‌స్టోరీ.. ప్రాణాలకు తెగించి ఉగ్రమూకలను మట్టుబెట్టడం.. ప్రతీదీ కళ్లకు కట్టినట్లు చూపించారు. ఫస్టాఫ్‌ అంతా ఆయన బాల్యం, లవ్‌స్టోరీతో పాటు దేశం పట్ల ఆయనకు ఉన్న ప్రేమను, ఆర్మీలో చేరిన తర్వాత ఉన్నత స్థాయికి ఎదగడానికి పడిన కష్టాన్ని కళ్లకుకట్టారు. ఇషాతో ప్రేమాయణం చాలా రొమాంటిక్‌గా సాగుతుంది. ఇక ఆర్మీలో చేరిన తర్వా త ‘సోల్జర్‌’అంటే ఏంటి అని పై అధికారి అడిగినప్పుడు.. సందీప్‌ చెప్పే సమాధానం ప్రేక్షకుడిలో ఉద్వేగాన్ని కలిగిస్తాయి. అలాగే ట్రైనింగ్‌ సమయంలో సందీప్‌తో పాటు మిగిలిన జవాన్లు పడే కష్టాలను కూడా తెరపై కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. హోటల్‌లో దాగి ఉన్న సాధారణ యువతి ప్రమోదరెడ్డి( శోభిత ధూళిపాళ), ఓ చిన్న పిల్లను కాపాడడం కోసం పడిన పాట్లు ఆకట్టుకుంటాయి. అలాగే మీడియా వల్ల జరిగిన నష్టం ఏంటో కూడా ధైర్యంగా తెరకెక్కించాడు దర్శకుడు. సోల్జ‌ర్‌` అంటే అర్థం ఏమిట‌ని అడిగిన‌ప్పుడు.. స‌మాధానంచెప్ప‌డానికి సందీప్ ప‌డిన సంఘ‌ర్ష‌ణ‌, `నిజ‌మైన సోల్జ‌ర్‌లా బ‌తికి చూపిస్తా` అని క‌మాండ‌ర్‌కి మాట ఇవ్వ‌డం.. ఇవ‌న్నీ ఉద్వేగాన్ని క‌లిగిస్తాయి. ముంబై ఉగ్ర‌దాడిని ద్వితీయార్థానికి ప‌రిమితం చేసి, ప్ర‌ధ‌మార్థం మిగిలిన విష‌యాల్ని చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించారు. బాల్యంలోని సంగ‌తులు హృద్యంగా సాగుతాయి. ప్రేమ‌క‌థ‌ని కూడా చాలా రొమాంటిక్ గా తీశారు. ప్ర‌తీ ఎపిసోడ్‌లోనూ ఏదో ఓ విష‌యం చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించారు. చివ‌రి పావుగంటా.. ప‌తాక స్థాయిలోకి తీసుకెళ్లారు. ఉగ్ర‌వాదుల్ని మేజ‌ర్ సందీప్ ఒక్క‌డే ఎలా ఎదుర్కొన్నాడన్న‌ది హీరోయిటిక్‌గా చూపించారు. ప్రాణాలు పోతున్నా.. దేశ ర‌క్ష‌ణే ధ్యేయంగా సాగించిన పోరాటం.. ఉద్వేగ‌భ‌రితం. చివ‌ర్లో ప్ర‌కాష్ రాజ్ స్పీచ్ కంట‌త‌డిపెట్టిస్తుంది.
నటీనటుల విషయానికొస్తే… మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ పాత్రలో అడివి శేష్‌ ఆకట్టుకున్నాడు. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఎమోషన్స్‌ పలికిస్తూనే.. హీరోయిజాన్ని తెరపై ఆవిష్కరించాడు. ఈ పాత్ర కోసం శేష్‌ పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. ఇషా పాత్రలో సయీ మంజ్రేకర్‌ ఒదిగిపోయింది. ఇక సందీప్‌ తండ్రిగా ప్రకాశ్‌ రాజ్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఎలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండే. ఆయన చెప్పే డైలాగ్స్‌ కంటతడి పెట్టిస్తాయి. హీరో తల్లిగా రేవతి నటనకు సెల్యూట్ చెప్పాల్సిందే. హోటల్‌లో చిక్కుకున్న హైదరాబాద్‌ యువతి ప్రమోదారెడ్డిగా శోభిత ధూళిపాళ మంచి నటనను కనబరిచింది. ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో ఆమెది కూడా ఒక్కటి. ముఖ్యంగా చిన్న పిల్లను కాపాడడం కోసం ఆమె చేసిన ప్రయత్నాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఇక మేజర్‌ సందీప్‌ పై అధికారిగా మురళీ శర్మతో ఒకే అనిపించారు.
ఇలాంటి కథలకు టెక్నిక‌ల్ టీమ్ స‌పోర్ట్ ఎంతో కీలకం. ఫొటోగ్ర‌ఫీ, ఎడిటింగ్, నేప‌థ్య సంగీతంలో ఎక్క‌డా లోటు కనిపించలేదు. విజువ‌ల్స్ సైతం అంతే రిచ్ గా ఉన్నాయి. యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ సూపర్. సహజంగా ఉంటూనే.. క‌మ‌ర్షియ‌ల్ గానూ క‌నిపించింది. అబ్బూరి ర‌వి సంభాష‌ణ‌లు మ‌రో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ముఖ్యంగా చివ‌రలో ప్ర‌కాష్ రాజ్ చెప్పే డైలాగులు ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఈ సినిమాకు మరో ప్రధానమైన బలం శ్రీచరణ్‌ పాకాల సంగీతం. తనదైన నేపథ్య సంగీతంతో సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఫైట్‌ సీన్స్‌కి తనదైన బీజీఎంతో గూస్‌ బంప్స్‌ తెప్పించాడు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. మొత్తంగా వండర్ ఫుల్ ‘మేజర్‌’.

Related posts

Leave a Comment