ఆర్జీవీ ‘మా ఇష్టం, ఖత్రా’ సినిమా విడుదలపై రెండోసారి స్టే తెచ్చిన నట్టికుమార్!!

ఆర్జీవీ 'మా ఇష్టం, ఖత్రా' సినిమా విడుదలపై రెండోసారి స్టే తెచ్చిన నట్టి కుమార్!!
Spread the love

రాంగోపాల్ వర్మ రూపొందించిన తెలుగులో ‘మా ఇష్టం” (డేంజరస్), హిందీలో “ఖత్రా” సినిమా శుక్రవారం విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ఆ సినిమా విడుదలను అడ్డుకుంటూ ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ గురువారం రెండోసారి కోర్టు నుంచి స్టే తెచ్చారు. తనకు, వర్మకు మధ్య జరిగిన వివిధ సినిమాల లావాదేవీలలో భాగంగా ఇద్దరిమధ్య ఆర్ధిక ఒప్పందాలు జరిగాయని, వాటిని ఉల్లంఘించి, తనకు ఏమీ సంబంధం లేదని వర్మ వ్యవహరించడంతో పాటు, సినిమాలను విడుదల చేసుకుంటుండటంతో, తప్పనిసరి పరిస్థితులలో తాను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు. ఇంకా నట్టి కుమార్ మాట్లాడుతూ, ఇప్పటికే వర్మ తీసిన ‘లఢఖీ” (ఎంటర్ ది గర్ల్ డ్రాగన్” చిత్రాన్ని కూడా ఇలానే కోర్టు నుంచి స్టే తెచ్చి ఆపామని చెప్పారు. మా ఇష్టం, ఖత్రా’ సినిమాను విడుదల చేసేందుకు తొలుత ఏప్రిల్ 8వ విడుదల తేదీని వర్మ ప్రకటించిన నేపథ్యంలో అప్పట్లో ఈ సినిమా విడుదలను ఆపుతూ, కోర్టు నుంచి స్టే తెచ్చామని నట్టి కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే వర్మ మాత్రం స్టే విషయాన్ని చెప్పకుండా తన సినిమాకు థియేటర్స్ ఇవ్వలేదన్న కారణంగానే విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు చెప్పుకొచ్చారని నట్టి కుమార్ వివరించారు. తాము గౌరవ సిటీ సివిల్ కోర్టు నుంచి ఈ సినిమాపై తొలిసారి తెచ్చిన స్టే పైన వర్మ గౌరవ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కు వెళ్లారని, అయితే అక్కడ ఇరుపక్షాల వాదనలు విన్న గౌరవ ఉన్నత న్యాయస్థానం తొలుత స్టే ఇచ్చిన సిటీ సివిల్ కోర్టునే తేల్చమని ఆదేశాలు జారీచేసిందని నట్టి కుమార్ తెలిపారు. ఆ మేరకు సిటీ సివిల్ కోర్టులో ఇరు పక్షాల వాదనలు జరిగాయని, తమ తరపున శ్యామ్ అగర్వాల్ వాదించారని నట్టి కుమార్ చెప్పారు. తమ వైపు న్యాయం ఉండటంవల్ల సినిమాపై స్టే విధిస్తూ తమకు అనుకూలంగా ఆర్డర్ వచ్చిందని ఆయన వెల్లడించారు. థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్, ఓటీటీ, ఏటీటీ, యూట్యూబ్ … వంటి ఏ ప్లాట్ ఫారంలో విడుదల చేయకుండా గౌరవ న్యాయస్థానం స్టే ఇచ్చిందని అన్నారు. తమకు అన్యాయం చేసి రాంగోపాల్ వర్మ తన సినిమాలు ఏవీ విడుదల చేయలేరని ఆయన స్పష్టం చేశారు. తమకు రావలసిన డబ్బులు ఇస్తేనే సినిమా లు రిలీజ్ అవుతాయని ,రామ్ గోపాల్ వర్మ కు ఇదే నా వార్నింగ్ అని నట్టి కుమార్ అన్నారు. ఇటీవల యూనివర్సిటీ లో మీ ఇంటర్వ్యూ చూసి సభ్య సమాజం తలదించుకుంది. ఇదే ప్రెస్ మీట్ లో : తమ్మారెడ్డి భరద్వాజ మీద కూడా నట్టి కుమార్,ఫైర్ అయ్యారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు తనకు భాధను కలిగించాయని అన్నారు. వర్మకు, తనకు మధ్య జరిగిన ఒప్పందాలను ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫెడరేషన్ దృష్టికి తీసుకుపోయానని, అక్కడ పట్టించుకోకపోవడం వల్లనే న్యాయం కోసం కోర్టుకు వెళ్లానని ఆయన చెప్పుకొచ్చారు.

Related posts

Leave a Comment