రాహుల్ పర్యటన ‘ఫైర్ బ్రాండ్’కు అగ్నిపరీక్ష !!

Rahulghandhi-Revanthreddy
Spread the love

By Sk.Zakeer,
Editor, Bunker News :

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్ర, శనివారాల్లో తొలి పరీక్షను ఎదుర్కోబోతున్నారు. పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటనను విజయవంతం చేయడం రేవంత్ కు కత్తిమీద సాము లాంటిది.రేవంత్ రాజకీయ చతురతకు,పరిణతికి, శక్తి సామర్ధ్యాలకు, పార్టీ నాయకుల మధ్య సమన్వయ సాధనకు సంబంధించిన అగ్ని పరీక్ష ఇది.ఆయన పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు.రైతులతో పాటు దళితులు, బహుజనులు, అట్టడుగువర్గాలు, విద్యార్థులు, యువత,నిరుద్యోగులను ఆకట్టుకునే విధంగా రాహుల్ పర్యటన సాగుతుందని కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం ఉన్నది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య, జగ్గారెడ్డి వంటి వారు పోటీ పడినా రాహుల్ గాంధీ ప్లస్ పార్టీ హైకమాండ్ రేవంత్ వైపే మొగ్గు జూపడం వల్ల ఆయనకే పీసీసీ పగ్గాలు లభించినవి.సీనియర్లను కాదని రేవంత్ కు పార్టీ పగ్గాలను అప్పగిస్తే కాంగ్రెస్ కు నష్టమా,లాభమా అనే అంశంపై పార్టీ హైకమాండ్ తర్జనభర్జన చేసింది.చివరకు రేవంత్ మొండితనం,పట్టువిడుపులు లేని వైఖరి,టిఆర్ఎస్ ను,ముఖ్యమంత్రి కేసీఆర్ ను వెరపు లేకుండా చెండాడుతుండడం,ప్రజలలో ఉన్న ఆకర్షణ,వాక్పటిమ…. అన్నీ కలిసి రేవంత్ కు రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు లభించడానికి మార్గం సుగమమైంది.అయితే రేవంత్ డబ్బులిచ్చి పార్టీ పదవిని కొనుక్కున్నారంటూ లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి.పార్టీలో కలకలం సృష్టించగా అధికారపార్టీ టిఆర్ఎస్ కు అస్త్రాలు అందించినట్లయింది.కేసీఆర్ కు అస్త్రాలందించడం కోసమే ఈ సీనియర్ నాయకుడు ఇలాంటి ఆరోపణలు చేశారని పార్టీలో అంతర్గతంగా ఊహాగానాలు సాగాయి.తన వ్యాఖ్యలు పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని సవాలు చేసినట్లవుతుందని,సోనియా,రాహుల్ నాయకత్వాన్ని ధిక్కరించినట్లవువుతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు అంచనా వేయలేదో తెలియదు.రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి మధ్య రగులుకున్న నిప్పు చల్లారినట్టు కనిపిస్తున్నా మళ్ళీ రాజుకోకతప్పదని పార్టీ వర్గాలు భావిస్తున్నవి.రాహుల్ గాంధీ పర్యటన కోసం జనసమీకరణకు గాను జిల్లాల వారీగా జరిపిన సన్నాహాక సమావేశాల్లో… ఉమ్మడి నల్లగొండ సమావేశానికి కోమటిరెడ్డి డుమ్మా కొట్టారు.పైగా ఆ రోజు కేంద్రమంత్రి గడ్కరీ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉన్నట్టు ఒక సాకు చూపారు.రాహుల్ పర్యటనను విజయవంతం చేసే వ్యూహరచన కన్నా బీజేపీ కేంద్రమంత్రి పర్యటన ఆయనకు ఎట్లా ప్రాధాన్యమైనదో తెలియదు.
కనీసం నాలుగైదేళ్ల నుంచి తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి అనే పేరు హాట్ టాపిక్ గా ఉన్నది.’ఓటుకు నోటు కేసు’ ద్వారా ఆయన ఎంత అపకీర్తిని మూటగట్టుకున్నా జైలు నుంచి వెలుపలికి వచ్చిన తరవాత దూకుడు తత్వమే పిసీసీ అధ్యక్షుడు కావడానికి కారణమైంది. రేవంత్ రెడ్డికి తప్ప ఎవరికి పార్టీ పగ్గాలు ఇచ్చినా పర్వాలేదంటూ సీనియర్లు లాబీయింగ్ చేసినా ఫలితం లేకపోవడాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. రేవంత్ కు పగ్గాలిస్తే కాంగ్రెస్ భూ స్థాపితం ఖాయమని వీ.హెచ్ లాంటి కురువృద్ధులు కూడా అప్పట్లో అన్నారు.ఎన్నో ఏళ్లుగా తాము కాంగ్రెస్ నే నమ్ముకుని ఉన్నామని విహెచ్ వాదన. కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్కలలో ఒకరికి టీపీసీసీ ఇవ్వాలని ప్రతిపాదించారు కూడా.రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అనుచరుడన్నది మరొక వాదన.రేవంత్ రెడ్డి గతంలో టిడిపిలో ఉన్న మాట నిజమే.చంద్రబాబుకు సన్నిహితుడుగానూ కొనసాగారు.అయితే ఆయన కాంగ్రెస్ లో చేరిన అనంతరం తన పెర్ఫార్మెన్స్,సోనియా,రాహుల్ పట్ల విధేయతను బేరీజు వేయవలసి ఉన్నది.కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి రేవంత్ కు కవచంగా నిలబడినందున విహెచ్ తదితరుల వాదనను,ఆవేదనను ఎవరూ పట్టించుకోలేదు.కేసీఆర్ పై పోరాటమంటే మాటలు కాదని హైకమాండ్ కు తెలియనిది కాదు. అందుకు తగిన పోరాట పటిమ, నైపుణ్యం, జనాకర్షణ,నిధుల సమీకరణ… వంటి అంశాలు కీలకమైనవి.కనుక ఎట్లా చూసినా పీసీసీ చీఫ్ పదవికి రేవంత్ మాత్రమే అర్హుడని ఢిల్లీ నాయకులు భావించారు.అయితే సీనియర్లలో అసమ్మతిని చల్లార్చే వ్యూహంలో భాగంగానే కోమటిరెడ్డికి ‘స్టార్ క్యాంపెయినర్’ పదవినిచ్చి సంతృప్తిపరచారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్,కాంగ్రెస్,బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ జరగనున్నట్టు సాధారణంగా ఉన్న అంచనా. కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు టీఆర్ఎస్ కు స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు.బీజేపీకి బండి సంజయ్,ఈటల రాజేందర్, రఘునందనరావు,కిషన్ రెడ్డి తదితరులు స్టార్ క్యాంపెయినర్ లుగా ఉన్నారు. ప్రసంగాలలో పదును,దూకుడు, ప్రత్యర్థులను ఇరుకున పెట్టడం,టిఆర్ఎస్,బీజేపీ నాయకులకున్న బలం.కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి మినహా ‘క్రౌడ్ పుల్లర్లు’ లేకపోవడం ఎవరు ఒప్పుకున్నా,ఒప్పుకోకపోయినా వాస్తవం.కేసీఆర్ పై కయ్యానికి కాలు దువ్వడంలో రేవంత్ కు మించిన వారు లేరు.జన్వాడ ప్రాంతంలో కేటీఆర్ ఫార్మ్ హౌజ్,దాని పరిసరాలను డ్రోన్ కెమరాతో చిత్రీకరించిన కేసులో రేవంత్ అరెస్ట్ కావడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఘటన.
2018 ఎన్నికల్లో కొడంగల్ లో రేవంత్ ను ఓడించేదాకా టిఆర్ఎస్ నాయకత్వం నిద్రపోలేదంటే అతిశయోక్తి కాదు.అయితే లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి గెలుపొందడం విశేషం. రేవంత్ తన ప్రధాన ప్రత్యర్థి అని బహిరంగంగా ప్రకటించడానికి టీఆర్ఎస్ అంగీకరించదు.బీజేపీని టార్గెట్ చేస్తూ ఆ పార్టీయే తమ ప్రత్యర్థిగా భావిస్తున్న చందంగా టిఆర్ఎస్ కార్యాచరణ ఉంటోంది.పూర్తి ఆధారాలతో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడం రేవంత్ ప్రత్యేకత.ఆయన తరచూ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ కొన్ని డాక్యుమెంట్లు ప్రదర్శిస్తూ ఉంటారు.ప్రత్యర్థులను అయోమయపరచడానికి గాను ఈ విధానం ఉపయోగపడుతుంది. ఆ డాక్యుమెంట్లు,కాగితాల్లో సరుకు ఏమీ లేకపోయినా ‘ఏదో ఉన్నది’అనే భ్రమ కలిగించటానికి ఇదొక ట్రిక్కు.
కాగా దుబ్బాక, హుజురాబాద్ , జీహెచ్ఎంసీ ఎన్నికల పోరాటం టీఆర్ఎస్, బీజేపీల మధ్యనే సాగింది.ఆ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉందంటూ మీడియా చేసిన ప్రచారమూ ఆశ్చర్యాన్ని కలిగించిన అంశం.’కాంగ్రెస్ లెఖ్ఖలోనే లేదు’ అనే కృత్రిమ వాతావరణాన్ని సృష్టించడంలో చాలా మంది భాగస్వాములుగా ఉన్నారు.
దూకుడు వైఖరి,ఒంటెత్తు పోకడలకు సంబంధించి పార్టీ హైకమాండ్ కు రేవంత్ పై కొన్ని ఫిర్యాదులు అందాయి.అలాంటి ఫిర్యాదులను పట్టించుకునే దశలో ‘టెన్ జన్ పథ్’ లేదు.తెలంగాణలో గ్రామస్థాయిలో కాంగ్రెస్ కు బలం, బలగం ఉందని హైకమాండ్ కు బాగా తెలుసు.సమస్య అంతా పార్టీకి సమర్ధ నాయకత్వం అందించడమే. కార్యకర్తల్లో ఉత్తేజం నింపగల నాయకునిగా రేవంత్ కు గుర్తింపు లభిస్తోంది.రేవంత్ పూర్తి ఫామ్ లోకివస్తే టీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చే స్థాయిలోకి పార్టీ తయారవుతుందన్న అంచనాలున్నవి. తెలంగాణలో టీడీపీ కనుమరుగయిపోయినా ఆపార్టీ అభిమానులు,కార్యకర్తలు రేవంత్ కు అదనపు బలం. తెలంగాణ అంతటా పాదయాత్ర జరిపి మీడియా ఫోకస్ ను తన వైపునకు తిప్పుకోవాలన్నది రేవంత్ ప్రణాళిక.ఈ ప్రణాళికకు హైకమాండ్ ఆమోదం లభిచే అవకాశాలున్నవి.కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో 80 స్థానాలు వస్తాయని ఆయన ఒక ఇంటర్వ్యూ లో స్పష్టం చేశారు.రెండు,మూడు స్థానాల్లో టిఆర్ఎస్,బీజేపీ ఉంటాయని ఆయన నమ్మకం.

Related posts

Leave a Comment