‘ఆదర్శ కుటుంబం’లో దేవియాని శర్మ నటనకు ప్రశంసల వెల్లువ
మాటల మాంత్రికుడు.. గ్రేట్ డైరక్టర్ త్రివిక్రమ్ సినిమాల్లో చిన్న పాత్రలకు కూడా మంచి నటులను ఎంచుకుంటారనే విషయం తెలిసిందే. తాజాగా ‘ఆదర్శ కుటుంబం’ విడుదలయ్యాక వెంకటేష్ కామెడీ, త్రివిక్రమ్ డైలాగుల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సెకండ్ హాఫ్‌పై కూడా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. అయితే వీటి మధ్య సైలెంట్ సర్ప్రైజ్ లాగా ఓ నటి కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమాలో ఆమెకు ఎక్కువ సన్నివేశాలు లేవు. అయినా కనిపించిన కాసేపట్లోనే గుర్తుండిపోయేలా చేశారు. ఆ నటి దేవియాని శర్మ. ‘ఆదర్శ కుటుంబం’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. డైలాగులు ఎక్కువగా లేకపోయినా కళ్లతో పలికించిన హావభావాలు ఆకట్టుకున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పాత్రల్లో ఏమాత్రం ఎక్కువ చేసి నటించినా తేడా కొట్టే ప్రమాదముంది. దేవియాని మాత్రం తన చూపులతోనే పాత్ర స్వభావాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె నటనకు ప్రశంసలు వస్తున్నాయి. దేవియాని తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్‌తో ముందే గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో ఆమె నటన, కామెడీ టైమింగ్ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలో పూర్తి భిన్నమైన పాత్ర దక్కింది. ఓటీటీలో చూసిన నటిని థియేటర్ సినిమాలో మరోలా చూడటం ప్రేక్షకులకు కూడా కొత్తగా అనిపిస్తోంది. ముఖ్యంగా నెగెటివ్ పాత్రలోనూ నటించగలనని చూపించుకునే అవకాశం ఆమెకు వచ్చింది. దేవియాని ఇప్పటికే వెబ్ సిరీస్‌లో ఒక తరహా నటన చూపించారు. ఇప్పుడు మరో రకమైన పాత్ర చేశారు. ఈ రెండు అనుభవాలతో సినిమాల్లో మరింత ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లు దక్కితే తన ప్రతిభను చూపించుకునే అవకాశం పెరుగుతుంది. ‘ఆదర్శ కుటుంబం’లో వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, నివేదా పేతురాజ్ సహా పెద్ద తారాగణమే ఉంది. ఇంతమంది మధ్య దేవియాని పేరు కూడా వినిపించడం ఆమెకు కలిసొచ్చే విషయమే. ముఖ్యంగా ‘సేవ్ ది టైగర్స్’ ద్వారా ఓటీటీ ప్రేక్షకులకు పరిచయమైన ఆమెకు ఇప్పుడు పెద్ద కమర్షియల్ సినిమాలోనూ గుర్తింపు దక్కుతోంది.
