ఇవేం రివ్యూలు .. ఇవేం ఇంటర్వ్యూలు

What kind of reviews are these... what kind of interviews are these?
What kind of reviews are these... what kind of interviews are these?
Spread the love

– దాయాదుల తగాదాల్లా అంతటి ఘాటు విమర్శలు ఎందుకు?
– ఇంటర్వ్యూల పేరిట ప్రశ్నించే వాళ్లు తోపులేం కాదు!

మొదటి షో కూడా పడక ముందే సినిమా అట్టర్ ప్లాప్ అంటాడు ఒకడు! ఇంకొకడు పరమ నాసిరకపు చెత్త అంటాడు! ఇంకొకామె ఏకంగా “రాడ్ లకే అమ్మమ్మ” అంటోంది! ఉదయం నుంచి సోషల్ మీడియా అంతా నాని ప్యారడైజ్ సినిమా గురించి దద్దరిల్లిస్తున్నారు… కొందరు సో కాల్డ్ తామే తోపులం అనుకునే రివ్యూయర్స్!
నాని ప్యారడైజ్ గురించి మహా డిజాస్టర్, అట్టర్ ఫ్లాప్ అని ప్రచారం చేస్తున్నారు. అదే సూపర్ స్టార్ రజనీకాంత్ కు చాలా ఏళ్లుగా ఒక్క హిట్ కూడా లేదు. ఇటీవల కాలంలో ఆయన చేసిన సినిమాల్లో సరైన స్టోరీ లైన్ లేదు! కానీ ఆయన సినిమా గురించి ఇలాంటి వాగుడు వాగే దమ్ముందా? అంతెందుకు మన తెలుగు హీరోలనే తీసుకోండి… వయసు పైబడినా హీరోలుగా చెలామణి అవుతూ చెత్త సినిమాలు తీస్తుంటే ఎప్పుడైనా “ఇది చెత్త” అని నోరు విప్పారా? కనిపిస్తే వంగి వంగి దండాలు పెట్టి పక్కన ఒదిగి ఒదిగి ఫోటోలు దిగుతారు!
మరి రియల్ స్టార్ నాని అంటే అంత చులకన ఎందుకు? ఎవరేమన్నా పట్టించుకోడనా? సినిమా బావుండొచ్చు, బాగా లేకపోవచ్చు… అంత మాత్రాన… ఇష్టం వచ్చినట్లు విమర్శలు గుప్పించడమేనా? మీ అందరినీ పిలిచి మర్యాదలు చేసి సినిమా చూపించింది… మీ అభిప్రాయాన్ని జనంఫై రుద్దమని కాదు. కనీసం ఒక వారం అయినా జనాన్ని సినిమా చూడనివ్వమని! ఆ తరువాత మీ రివ్యూలు ఇవ్వమని!
శ్రీకాంత్ ఓదెల… తెలంగాణ నుంచి వచ్చిన ఒక సంచలన దర్శకుడు! అతని ఆలోచనలు, అతని టేకింగ్స్ అతనివి. మోహన్ బాబు, నాని లాంటి వారు గౌరవించి నటించారు. ఒక రకంగా చెప్పాలంటే వారిద్దరూ ఆయా పాత్రలకు న్యాయం చేశారు. అమ్మ సెంటిమెంట్ అద్భుతంగా వుంది. అమ్మ పాట ఇంకా హార్ట్ టచింగ్ గా వుంది. ఏసినాగులు తెలంగాణ జానపద పాట ఉర్రూతలూగించింది. ఇక రప్పా రప్పా నరుకుళ్ళు చాలా సినిమాల్లో వున్నవే! తమిళనాడులో ఇలాంటి హింసను సినిమాపరంగా బాగా ఇష్టపడతారు. మనకు ఇంత నాటు నరకుడు నచ్చదు. సరే, ఆ విషయం చెప్పొచ్చు! కానీ, జనం చూడకముందే మీ తొక్కుడు ఎందుకు? వందల కోట్లు బడ్జెట్ సినిమా! ఎందరికో ఉపాధినిచ్చే సినిమా! సినిమా పూర్తిగా నచ్చాలని ఏమి లేదు. అందరి అభిప్రాయాలూ ఒక్కటి కావు! వారి వారి టేస్ట్ ను బట్టి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు… ముందు జనాన్ని చూడనివ్వండి!
మీకు ప్రమోషన్ యాడ్స్ ఇవ్వొచ్చు ఇవ్వకపోవచ్చు! జనానికి అవసరం లేదు! మీకు ప్రచార ఇంటర్వ్యూలూ ఇవ్వకపోవచ్చు. అంత మాత్రాన రాత్రికి రాత్రి సినిమా చూసి రచ్చ చేయక్కరలేదు. ఎంతో మంది టాప్ హీరోల సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయినా ఆహా ఓహో అని మీరు అరచి గీ పెట్టారు. అయినా, మీ రివ్యూలు చూసి సినిమాకు వెళ్లే వారు ఎవ్వరు ఉండరు. మీరు బావుంది అన్నా బాలేదన్నా చూసే వాళ్లు చూస్తూనే ఉంటారు. కానీ, మౌత్ టాక్ పబ్లిసిటీ ఏ సినిమాకు మంచిది కాదు.
ఈ సినిమాలో నటించిన సంపూర్ణేష్ బాబును ఒకాయన ఇంటర్వ్యూ చేస్తూ, మీ ఫేస్ కు సినిమా హీరో అవ్వాలనుకోవడం ఏమిటీ? నీకు మీ తాతలకు సినిమా వారసత్వం లేదు…. మీకెందుకు ఈ దురద? అని అడిగాడు. ప్రశ్న వేసే జర్నలిస్టులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీరేం న్యాయ నిర్ణేతలు కాదు. తీర్పు ఇచ్చే న్యాయమూర్తులు కూడా బోనులో నిలుచున్న వారితో ఏంతో గౌరవ భాష మాట్లాడతారు!
మీ స్టూడియోలకు వచ్చారని, మీరు ప్రశ్నలు వేసే సుపీరియర్ గా భావించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మీ విలువ మీరే తగ్గించుకున్న వారవుతారు. సంపూర్ణేష్ లోపల ఫీల్ అయి ఉండొచ్చు. కానీ మీ గౌరవాన్ని తగ్గించకుండా నవ్వుతూ “మీరు చెప్పిందే కరెక్ట్” అని జవాబు ఇచ్చి మీ గౌరవాన్ని కాపాడాడు. ఆది అతని సంస్కారం! ఏం వారసులు అయితేనే సినిమాల్లో నటించాలా? డబ్బులుంటేనే సినిమా రంగంలోకి రావాలా? ఎందుకు అలా ఫిక్స్ అయ్యారు… ముందు
తుప్పు పట్టిన మీ మైండ్ సెట్ మార్చుకోండి.
రివ్యూయర్స్ కావచ్చు, ఇంటర్వూయర్స్ కావచ్చు. మనం తోపులం, తురుమ్ ఖాన్ లం, అంతా మనకే తెలుసు అనే భ్రమల్లోంచి బయటకు రండి! అందుకే మన జీవితాలు అక్కడే ఆగిపోయాయి. మన ఎదుట కూర్చుని ఇంటర్వ్యూ లు ఇచ్చిన వారంతా స్టార్స్ అయిపోయారు. అందరూ సక్సెస్ అయ్యారు వారి వారి దారుల్లో! ఇలాంటి పిచ్చి ప్రశ్నలు, పిచ్చి వాగుళ్ళతో మన గౌరవాన్ని మనమే కూల్చుకుంటున్నాం! అమ్మనా బూతులు తిడుతున్నారు… కాస్త కమెంట్స్ బాక్స్ చూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం మంచిది. నిజంగా దమ్ము ఉంటే నానిని కాదు… ప్రతి స్టార్ ను నిలదీసి నిగ్గు తేల్చండి. యాడ్ ఇస్తే ఒకలా జోకడం, పట్టించుకోకపోతే ఇంకోలా మాట్లాడటం మంచిది కాదు. రివ్యూలు చేయండి… కానీ పచ్చిగా కాదు! ప్రతి దానికి ఒక లైన్ ఉంటుంది. ఆది దాటకూడదు. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో అడుగు వేస్తూ ఉనికి చాటుకుంటున్న తెలంగాణ ప్రతిభను గుర్తించండి. ప్రోత్సహించక పోయినా పరవాలేదు, తొక్కేయకండి!
– డా. మహ్మద్ రఫీ