మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ.. సస్పెన్స్ డివోషనల్ థ్రిల్లర్!

Mahendragiri Varahi Movie Review... A Suspense-Filled Devotional Thriller!
Mahendragiri Varahi Movie Review... A Suspense-Filled Devotional Thriller!
Spread the love

సుమంత్‌.. చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంటాడు. ఒకప్పుడు పక్కా మాస్‌ కమర్షియల్‌ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ అక్కినేని హీరో.. ఈ మధ్యకాలంలో కంటెంట్‌ ఉన్న, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో మెప్పిస్తున్నాడు. కథలో కొత్తదనం, పాత్రలో వైవిధ్యం ఉంటేనే సినిమాకు ఓకే చెబుతున్న సుమంత్‌.. తాజాగా ‘మహేంద్రగిరి వారాహి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఐశ్వర్య రాజేష్, సిద్దు జొన్నలగడ్డ, వెన్నెల కిషోర్, మీనాక్షి గోస్వామి, బ్రహ్మానందం, మంజు భార్గవి, వంశీ చాగంటి, కమల్ కామరాజు.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ నిర్మాణంలో సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అప్పుడప్పుడో ఓ మంచి సినిమాతో పలకరించి.. ఆ తర్వాత నిరాశపరుస్తూ ఉంటాడు సుమంత్. ‘అనగనగా’ తర్వాత తన నుంచి మళ్లీ ఓ మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ‘న్యూటన్స్ థర్డ్ లా’ పర్వాలేదనిపించింది కానీ.. అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేంద్రగిరి వారాహి ట్రైలర్ బాగుండటం, సిద్ధూ జొన్నలగడ్డ ఈ సినిమాలో ఉన్నాడు అని తెలియడం, ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే మురారి సినిమాలో లాగా అమ్మవారి శాపం, కార్తికేయ సినిమాలో లాగా హీరో రీసెర్చ్ ఉంటుందని అర్ధమయిపోయింది. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా నేడు (సెప్టెంబర్ 11, 2026) థియేటర్స్ లో రిలీజయింది. మరి ‘మహేంద్రగిరి వారాహి’తో సుమంత్‌ ఈసారి ఎలాంటి అనుభూతిని అందించాడు? ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..
కథ : మహేంద్రగిరి రాజవంశస్థులకు ఓ శాపం ఉంటుంది. ఆ వంశంలో పుట్టిన ప్రతి మగబిడ్డ 33వ పుట్టినరోజున మరణిస్తాడు. ఈ శాపం 200 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంటుంది. అలా 1993లో ఆ వంశంలో పుట్టిన రాజేంద్ర వర్మ (సిద్దు జొన్నలగడ్డ)మరణిస్తాడు. ఇక ఈ సారి రాజేంద్రవర్మ అల్లుడు, ఆ రాజవంశానికి వారసుడు నరేంద్ర వర్మ (వంశీ చాగంటి) కూడా మరణిస్తాడని పూజారులు చెప్తారు. కథలో ఇదో భాగం.. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన యూట్యూబర్‌ సిద్ధు అలియాస్‌ సిద్ధార్థ్‌ (సుమంత్‌).. దెయ్యాలు, దేవుళ్ల పేరుతో కొంతమంది జనాలను మోసం చేస్తున్నారనేది ఆధారాలతో బయటపెడుతుంటాడు. అతని పెరెంట్స్‌తో పాటు అన్నయ్య రాజీవ్‌ (కమల్‌ కామరాజు) కూడా దేవుడిని నమ్ముతాడు.  పెళ్లి దోషం పోయేందుకు మహేంద్రగిరి వారాహి అమ్మవారి ఆలయంలో పూజలు చేయమని చెప్పడంతో, రాజీవ్‌ తన బర్త్‌డే రోజు ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్తాడు. అదే సమయంలో  నరేంద్ర వర్మ కూడా ఆలయానికి వస్తాడు. మొక్కులు చెల్లించుకుంటున్న సమయంలో గుడి ముందే ఉండే దున్నపోతు ఇద్దరినీ పొడిచి చంపేస్తుంది. సరిగ్గా 33వ పుట్టిన రోజు నాడే ఇది జరుగుతుంది. తన అన్న మరణం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు సిద్ధు. ఈ క్రమంలో మహేంద్రగిరి రాజవంశం శాపం వెనుక ఉన్న అసలు విషయం తెలుస్తుంది. అదేంటి? రాజవంశస్తులకు శాపం ఉంటే.. రాజీవ్‌ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? అసలు రెండు వందల ఏళ్ల క్రితం ఏళ్ల క్రితం ఆ శాపం ఎలా వచ్చింది? ఇప్పుడు జరుగుతున్న మరణాలకు నిజంగా అమ్మవారి శాపమే కారణమా లేదా దాని వెనుక ఎవరైనా ఉన్నారా? సిద్ధార్థ్‌ రీసెర్చ్‌లో తెలిసిన అసలు నిజాలు ఏంటి? ఆ తర్వాత ఏం జరిగింది? నిజంగా రాజ వంశాన్ని అమ్మవారు శపించిందా? అసలు సిద్ధు అన్న చావుకి.. మహేంద్రగిరి వంశానికి ఉన్న సంబంధం ఏంటి? ఆ తర్వాత అతను ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు, అమ్మవారికి ఆ వంశానికి ఉన్న అసలు సంబంధం ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే.
విశ్లేషణ : వారాహి అమ్మవారి నేపథ్యాన్ని.. మహేంద్రగిరి సంస్థాన చరిత్రను.. ఆ కుటుంబంలో జరిగే వరుస చావుల్ని పరిచయం చేస్తూ దర్శకుడు సినిమాని చాలా గ్రిప్పింగ్‌గానే ప్రారంభించారు. అనగనగా ఓ ఊరు.. ఆ ఊళ్ళో ఓ గుడి.. రాజవంశానికి శాపం.. ప్రతీ 33 ఏళ్ళకు ఒకరి మరణం.. రెండువందల ఏళ్లుగా సాగుతున్న ఆనవాయితీ.. ఇదంతా వింటుంటే ‘మురారి’ సినిమా కథ గుర్తుకొస్తుంది కదా..? అలాంటి కథతోనే ‘మహేంద్రగిరి వారాహి’ కూడా వచ్చింది. కాకపోతే కాన్సెప్ట్ ఒకేలా అనిపించినా.. ట్రీట్‌మెంట్ డిఫెరెంట్‌గా ఉంది. రాజేంద్రవర్మగా సిద్ధు జొన్నలగడ్డని పరిచయం చేసిన తీరు.. ఆ పాత్ర చుట్టూ నడిపిన డ్రామా కథలో సంఘర్షణని రెట్టింపు చేస్తుంది. హీరో ఫ్యామిలీ ఎప్పుడైతే మహేంద్రగిరిలోకి అడుగు పెడుతుందో అక్కడి నుంచే కథ వేగం పుంజుకుంటుంది. కథానాయకుడి సోదరుడి చావు.. ఈక్రమంలో వచ్చే విరామ ఘట్టాలు ద్వితీయార్ధంపై అంచనాల్ని పెంచుతాయి. హీరో చేసే అన్వేషణతో సెకండాఫ్‌ ఆసక్తికరంగానే మొదలవుతుంది. కాకపోతే ఈ ప్రయాణం ముందుకు సాగే కొద్దీ అందులోని థ్రిల్‌ క్రమంగా తగ్గుతున్న అనుభూతి కలుగుతుంది. హీరో పెద్దగా కష్టపడకుండానే తన చుట్టూ ప్రశ్నలకు తేలికగా సమాధానాలు దొరికేస్తుంటాయి. హీరో అన్నకు.. మహేంద్రగిరి వంశానికి ఉన్న లింక్‌ ఊహలకి అందేలాగే ఉంటుంది. అయితే శాపం మాటున ఉన్న అసలు నిజాలు బయటపడే సన్నివేశాలు భావోద్వేగభరితంగా ఉంటాయి. కానీ, వారాహి అమ్మవారు తన పేరుతో.. ఆమె కళ్ల ముందు అన్ని హత్యలు జరుగుతున్నా హీరో వచ్చే వరకు ఎందుకలా మౌనంగా చూస్తూ ఉండిపోయిందన్న ప్రశ్న ప్రేక్షకులకు మింగుడుపడదు. ప్రీక్లైమాక్స్‌లోని ట్విస్ట్‌లు.. బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రాజీవ్‌ కనకాల పాత్రల్లోన్ని మరో కోణం ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేస్తాయి. సినిమాని ముగించిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది. రాజవంశానికి శాపం ఉండడంతో 33 ఏళ్లకే చనిపోవడం.. దీనికి వెనుక ఒక కారణం ఉండడం.. హీరో రీసెర్చ్‌ చేసి అసలు కారణం తెలుసుకోవడం..చివరకు శాప విమోచనం.. కథ సుఖాంతం.. ఇదే మహేంద్రగిరి వారాహి చిత్రం కథ. ఇలాంటి కథలను మంచి ట్విస్టులతో, తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠతో తెరపై చూపిస్తే ఆసక్తి కలుగుతుంది. మహేంద్రగిరి వారాహిలో అది మిస్‌ అయింది. సినిమా ప్రారంభంలోనే శాపం బ్యాక్‌స్టోరీ చెబుతారు. అది కథపై ఆసక్తిని పెంచుతుంది. అయితే ఆ తర్వాత కథనం రొటీన్‌గానే సాగుతుంది. యూట్యూబర్‌గా హీరో పరిచయం.. దెయ్యాలు, దేవుడు లేడని చెబుతూ చేసే యూట్యూబ్‌ వీడియోలు.. ఇవన్నీ రొటీన్‌గానే సాగుతాయి.  మహేంద్రగిరి రాజవంశస్తులు శాప విమోచనం కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ఆసక్తికరంగా సాగుతాయి. హీరో ప్యామిలీ మహేంద్రగిరి ఆలయం వద్దకు వచ్చిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ బాగుంటుంది. చావుల వెనుక ఉన్న అసలు నిజాన్ని కనుక్కునేందుకు హీరో చేసే ఇన్వెస్టిగేషనే సెకండాఫ్‌ కథ. ఫస్టాఫ్‌తో పోలిస్తే ద్వితియార్థం కొంత ఆసక్తికరంగా సాగుతుంది. కొన్ని సీన్లు థ్రిల్లింగ్‌గా ఉంటాయి.  ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అయితే చాలా వరకు కథనం ఊహకందేలా సాగుతుంది. అమ్మవారి సంబంధించిన సీన్లు బాగుంటాయి. అనవసరమైన రొమాంటిక్ ట్రాక్స్ లాంటివి ఇరికించకుండా తీసుకున్న పాయింట్‌కే కట్టుబడి ఉండటం మెచ్చుకోదగ్గ విషయం. ముఖ్యంగా ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఊహించని మలుపు సెకండాఫ్‌పై అంచనాలు పెంచేలా చేస్తుంది. అలాగే ప్రీ క్లైమాక్స్, ముగింపు సన్నివేశాల్లో రివీల్ అయ్యే ట్విస్టులు, వాటిని రాసుకున్న తీరు ఎంతో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మధ్యలో వచ్చే సన్నివేశాలు కాస్త నెమ్మదించినట్లు అనిపించి బోర్ కొట్టిస్తాయి. దైవశక్తికి సంబంధించిన అంశాలు కేవలం క్లైమాక్స్‌లో మాత్రమే చూపించడం లాజిక్‌కు దూరంగా ఉంటుంది. ఇక ప్రమోషన్స్‌లోనే ఐశ్వర్య రాజేష్ పాత్రను బయట పెట్టేయడం వల్ల థియేటర్లో ఆ థ్రిల్ చాలా వరకు మిస్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ మొదట శాపం గురించి చెప్పి, 1993 లో కథ చూపించి, ప్రస్తుతంలో హీరో, అతను చేసే పనులు, నరేంద్రవర్మ పూజలు, రాజీవ్ మరణంతో సాగుతుంది. రాజీవ్, నరేంద్ర వర్మ మరణంతో సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో సిద్దార్థ్ ఈ చావు, శాపం వెనక రీసెర్చ్ చేయడం, ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన ఫ్లాష్ బ్యాక్, చావుల వెనక ఏముంది అని బయటపెట్టే ట్విస్టులతో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ రొటీన్ సీన్స్ తో కాస్త సాగదీశారు. ఓ ఆలయం, ఊళ్ళో చనిపోవడం, అంతా దేవుడి వల్ల అనుకోవడం, కానీ దాని వెనక ఏదో ఉండటం.. లాంటి కథలతో అనేక సినిమాలు వచ్చాయి. ఈ మహేంద్రగిరి వారాహి కూడా అదే కథ. సుమంత్ కి కమల్ కామరాజు అన్నయ్య అంటేనే నమ్మబుద్ది కాదు. సెట్ అవ్వలేదు కూడా. ఫస్ట్ హాఫ్ లో కామెడీ అక్కడక్కడా ట్రై చేసారు కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ సో సో అనిపించినా సెకండ్ హాఫ్ బాగా డీల్ చేసారు. సినిమాకు క్లైమాక్స్ చాలా ప్లస్ అయింది. ఈ చావుల వెనక ఏముందో దొరకకపోవడం, అమ్మవారి వచ్చే సీన్స్ బాగున్నాయి. చివర్లో ఇదంతా ఎవరు చేస్తున్నారు అని ఇచ్చిన రెండు ట్విస్టులు మాత్రం అదిరిపోయాయి. అసలు ఇదంతా ఎవరు చేసారు అని క్లైమాక్స్ వచ్చేదాకా ఊహించలేం కూడా. ఆ ట్విస్టులు రెండు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. గ్రాఫిక్స్, ఏఐ లో అమ్మవారి విజువల్స్ బాగానే చూపించారు. వారాహి మొదలవ్వడమే చాలా ప్రామిసింగ్‌గా మొదలైంది.. ఫస్ట్ పది నిమిషాలు సిద్ధూ జొన్నలగడ్డపైనే ఉండటం మేజర్ ప్లస్ పాయింట్. ఆ తర్వాత మెయిన్ స్టోరీ మొదలైంది.. అక్కడ్నుంచి కూడా టెంపో బాగానే మెయింటేన్ చేసారు.. మధ్యలో కొన్ని ల్యాగ్ సీన్స్ అనిపించినా.. ఇంటర్వెల్ ముందు సెట్ అయిపోతుంది. సెకండాఫ్‌కు చాలా ప్రశ్నలు వదిలేసి సస్పెన్స్ మెయింటేన్ చేసారు. అమ్మవారి శాపం నుంచి తప్పించుకోలేక వచ్చే మరణాలు చూస్తుంటే.. కచ్చితంగా దానివెనక ఏదో రహస్యం ఉందనే విషయం అర్థమైపోతుంది. క్లైమాక్స్ వరకు ట్విస్ట్ రివీల్ కాకుండా బాగానే లాక్కొచ్చాడు దర్శకుడు సంతోష్.. కానీ మరీ ఊహించలేనంత ట్విస్టులు మాత్రం ఉండవు.. ఆ టైమ్‌కు పాస్ అయిపోతాయి. సిద్ధూతో పాటు ఐశ్వర్య రాజేష్ క్యామియో బాగుంది.. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి సినిమాను మొదలుపెట్టిన విధానం ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తుంది. ‘మహేంద్రగిరి వారాహి’లో వారాహి అమ్మవారి చుట్టూ కథను నడిపించి.. చివర్లో అమ్మవారి విశ్వరూప దర్శనం చేయించడం చూస్తే.. ఇప్పుడున్న ట్రెండులో కథ ఇలా ఉంటే.. అలాంటి సన్నివేశాలు పెడితే జనం చూసేస్తారన్న భ్రమతో ఈ సినిమా తీశారేమో అనిపిస్తుంది. లేదంటే తన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. కథల ఎంపికలో మంచి అభిరుచి ఉందని చాటే సుమంత్ ఇలాంటి పేలవమైన స్క్రిప్టును ఓకే చేసి సినిమా చేయడం.. ఇలాంటి ఔట్ పుట్ తో సినిమాను బయటికి తీసుకురావడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. థ్రిల్లర్ లక్షణాలున్న కథల్లో చివర్లో ఎవ్వరూ ఊహించని వ్యక్తి విలన్ అని తేలితే.. ప్రేక్షకులు ఆశ్చర్యపోయి నోరెళ్లబెట్టడం సహజం. కానీ ఇక్కడ విలన్ ఎవరో తెలిసినపుడు.. ప్రేక్షకులు వెటకారంగా నవ్వడం మొదలుపెడితే.. తాను చేసిన హత్యలకు కారణమేంటో చెప్పినపుడు ఇదేం లాజిక్కురా బాబూ.. అని జుట్టు పీక్కుంటారు అంటే.. ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా పరిస్థితేంటో ఊహించుకోవచ్చు. ప్రేక్షకుల ఏమాత్రం కన్విన్స్ కాలేని విలన్ క్యారెక్టర్లను పెట్టడం.. కారణాలను చూపించడం వల్ల మొత్తం సినిమానే నవ్వుల పాలైపోయే పరిస్థితి వచ్చిందన్నది వాస్తవం. అంత అన్ కన్విన్సింగ్ గా.. చాలా సిల్లీగా పతాక సన్నివేశాలను డీల్ చేశాడు దర్శకుడు. విలన్లు ఎవరన్నది తెలియడం ఒకెత్తయితే.. ఆ తెలిసే సన్నివేశాలను తీర్చిదిద్దిన వైనం ఇంకో ఎత్తు. తెర మీద నటుడు భయానక రసాన్ని పండిస్తుంటే.. అది చాలా కామెడీగా అనిపిస్తుందంటే ఆ సన్నివేశాన్ని ఎంత పేలవంగా తీశారో అర్థమైపోతుంది. ఒక ఊరిలో వరుస మరణాలు సంభవిస్తుంటాయి. ఊరి జనాలేమో అది దాని వెనుక దేవుడో దయ్యమో ఉందంటారు. అలాంటి చోటికి సైంటిఫిక్ టెంపర్ బాగా ఉన్న హీరో వచ్చి ఆ మరణాల వెనుక గుట్టును కనిపెడతాడు. అదే సమయంలో బ్యాలెన్సింగ్ యాక్ట్ కింద దేవుడి పాత్రనూ ఎలివేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. కథ మొదలైన తీరుతోనే.. ఇది ఎలా నడుస్తుందన్నది అర్థమైపోతుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న ట్విస్టులతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ముఖ్యంగా ఇంటర్వెల్ దగ్గర జంట మరణాలతో కథ కాస్త రసకందాయంలో పడ్డట్లు కనిపిస్తుంది. కానీ ఆ క్యూరియాసిటీని ద్వితీయార్ధం ఏమాత్రం కొనసాగించలేకపోయింది. ఒక కంటిన్యుటీ లేకుండా.. చాలా పరిమిత వనరుల మధ్య తీసిన సన్నివేశాలు సినిమాలో ఆసక్తిని అంతకంతకూ తగ్గించేస్తాయి.
నటీనటుల పనితీరు : సిద్ధార్థ్‌ పాత్రలో నటుడు సుమంత్‌ తనకు అలవాటైన పాత్రలో ఆకట్టుకున్నారు. మోసాలను బయటపెట్టే యూట్యూబర్‌గా అతడి నటన చాలా సహజంగా ఉంది. మిస్టరీని ఛేదించే క్రమంలో తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఫస్టాప్‌లో నార్మల్‌ యూట్యూబర్ గా కనిపించడంతో అతని పాత్ర అంత ఇంపాక్ట్‌ చూపదు. కానీ సెండాఫ్‌లో మాత్రం బాగా నటించాడు . అయితే ఇప్పటికే ఆయన ఈ తరహా పాత్రలు చేయడంతో కొత్తగా అనిపించదు. అతిథి పాత్రలో మెరిసిన సిద్ధు జొన్నలగడ్డ ఉన్నది కొద్దిసేపే అయినా సినిమాకు అద్భుతమైన బేస్ క్రియేట్ చేశాడు. ఐశ్వర్య రాజేష్‌ పాత్ర కాసేపు సర్‌ప్రైజ్‌ చేస్తుంది. మాళవిక నాయర్‌ పోషించిన ప్రత్యేక పాత్రలు కథపై బలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. వారాహి గుడి పూజారిగా బ్రహ్మానందం పాత్ర నటుడిగా తనలోని మరో కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. క్లైమాక్స్‌లో ఆయనతో పాటు రాజీవ్‌ కనకాల, వెన్నెల కిశోర్‌ పాత్రలకిచ్చిన ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. మంజు భార్గవి, మీనాక్షి గోస్వామి, వంశీ చాగంటి, శ్రీనివాస్‌ వడ్లమాని, నిత్యాశెట్టి తదితరుల పాత్రలు ఫర్వాలేదనిపిస్తాయి.
సాంకేతిక నిపుణుల పనితీరు : పిండి కొద్దీ రొట్టె అన్నట్లు ‘మహేంద్రగిరి వారాహి’లో సాంకేతిక హంగులు కూడా కంటెంటుకి తగ్గట్లే తయారయ్యాయి. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన అనూప్ రూబెన్స్ పాటలు-నేపథ్య సంగీతం విషయంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇలాంటి సస్పెన్స్ సినిమాలకు టెక్నికల్ వాల్యూస్ చాలా కీలకం. గ్రాఫిక్స్ వర్క్ ఆకట్టుకోదు, పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం కూడా కొంత మైనస్ అయింది. ప్రతాప్. ఆర్ కృష్ణ కెమెరా పనితనం ఓకే. దర్శకుడు రాసుకున్న కథ, కథనాల్లో కొత్తదనం లేకున్నా.. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్‌ థ్రిల్‌ చేస్తాయి. విజువల్స్, ఆర్ట్‌ వర్క్‌ ఆకట్టుకుంటాయి. పాత కథే అయినా కొత్త దేవతని తీసుకొని రొటీన్ కథనంతోనే ఊహించని ట్విస్టులతో తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
చిత్రం: మహేంద్రగిరి వారాహి
విడుదల : 11- 09 – 2026
2.75/5
నటీనటులు: సుమంత్, ఐశ్వర్య రాజేశ్, సిద్ధు జొన్నలగడ్డ, మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, ప్రభ, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రాజీవ్‌ కనకాల, అలీ, మంజు భార్గవి, వంశీ చాగంటి, సురేష్ , కమల్ కామరాజు, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: ప్రతాప్ ఆర్. కృష్ణ, ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ. రచన-దర్శకత్వం: సంతోష్ జాగర్లమూడి, బ్యానర్లు : ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్, నిర్మాతలు: మధు కలిపు, లక్ష్మణ్