వాల్తేరు వీరయ్య : హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా!

Waltair Veerayya: High-voltage action drama!
Waltair Veerayya: High-voltage action drama!
Spread the love

చిత్రం : వాల్తేరు వీరయ్య
Reating 3.75.5
నటీనటులు: చిరంజీవి, రవితేజ, శ్రుతి హాసన్, ప్రకాష్ రాజ్, బాబీ సింహా, కేథరిన్ థ్రెసా, రాజేంద్ర ప్రసాద్, నాజర్, సత్యరాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, సముద్రఖని, బిజు మీనన్, ప్రదీప్ రావత్, జాన్ విజయ్, షకలక శంకర్ త‌దిత‌రులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్: నిరంజన్ దేవరమణె
సినిమాటోగ్రఫీ: : ఆర్థర్.కె.విల్సన్
నిర్మాణం : మైత్రీ మూవీ మేకర్స్‌
నిర్మాతలు : నవీన్ ఎర్నేని-రవిశంకర్
స్క్రీన్ ప్లే : కోన వెంకట్ – చక్రవర్తి రెడ్డి – బాబీ కొల్లి
కథ-మాటలు-దర్శకత్వం: కేఎస్‌ రవీంద్ర (బాబీ కొల్లి)
విడుదల : జనవరి 13,2023

‘గాడ్‌ ఫాదర్‌’ లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. అలుపులేకుండా వరసపెట్టి సినిమాలు చేస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి, ‘ధమాకా’తో ఈ మధ్యనే హిట్ కొట్టిన రవితేజ కలిసి ‘వాల్తేరువీరయ్య’తో ముందుకొచ్చారు. ‘అన్నయ్య’ తర్వాత మెగాస్టార్‌తో కలిసి రవితేజ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న సినిమా కావడంతో ఈ సినిమాపై స్టార్టింగ్‌ నుంచే మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. దానికి తోడు విడుదలైన పాటలు, టీజర్‌ ముఖ్యంగా బాస్‌ సాంగ్‌, పూనకాలు లోడింగ్‌ పాటలు జనాల్లోకి విపరీతంగా చొచ్చుకెళ్లి విశేషంగా అలరించాయి. సినిమా ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి నుంచి వింటేజ్ చిరంజీవిని చూస్తారు అని చెప్పుకొచ్చారు మేకర్స్.. కనుక కొత్తదనం కంటే పాతదనమే ఎక్కువుంటుందని ఆడియన్స్ ని ప్రిపేర్ చేసారు. గత ఏడాది చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాపై ఆయన అభిమానులు భారీ అంచనాల్ని పెట్టుకున్నారు. ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు తరహాలో కామెడీ, యాక్షన్‌ హంగులతో వింటేజ్‌ చిరంజీవిని ఈ సినిమాలో చూపించానని దర్శకుడు బాబీ కొల్లి ప్రచార కార్యక్రమాల సందర్భంగా చెప్పడంతో ఈ సంక్రాంతి సీజన్‌లో కావాల్సినంత వినోదం ఖాయమని మెగా ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ చిత్రంలో మెగాస్టార్ కి జోడీగా శృతి హాసన్ నటించారు. మరి ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా నేడు (జనవరి 13, 2023) విడుదలైన ఈ చిత్రం తెరపై చేసిన సందడి ఎలా ఉంది? ‘పూనకాలు లోడింగ్‌’ అంటూ అభిమానుల్లో జోష్‌ని పెంచిన ఈ సినిమా నిజంగా పూనకాలు తెప్పించిందా? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం….
కథ: వాల్తేరు వీరయ్య (చిరంజీవి) పోర్ట్‌లో ఓ ఐస్‌ ఫ్యాక్టరీ రన్‌ చేస్తుంటాడు. వైజాగ్‌లోని జాలరిపేటకు చెందిన అతడికి సముద్రంలో అణువణువు తెలుసు. అవసరం అయినప్పుడు నేవీ అధికారులకు సైతం సహాయం చేస్తుంటాడు. వీరయ్య వీరత్వం గురించి తెలుసుకున్న పోలీసు అధికారి సీతాపతి (రాజేంద్ర ప్రసాద్‌).. తన సహోద్యోగులను కిరాతకంగా చంపి, తన సస్పెండ్‌కు కారణమైన డ్రగ్‌ డీలర్‌ సాల్మన్‌ సీజర్‌ (బాబీ సింహా)ను మలేషియా నుంచి ఇండియాకు తీసుకురావాల్సిందిగా కోరతాడు. దీని కోసం రూ.25 లక్షలతో డీల్‌ కూడా కుదుర్చుకుంటాడు. అలా మలేషియా వెళ్లిన వీరయ్య.. సాల్మన్‌ని అట్టి పెట్టుకొని అతని అన్నయ్య మైఖేల్‌ సీజర్‌ అలియాస్‌ కాలా (ప్రకాశ్‌ రాజ్‌)కు ఎర వేస్తాడు. అసలు మైఖేల్‌ సీజర్‌కు, వీరయ్యకు మధ్య ఉన్న వైరం ఏంటి? మలేషియాలో వీరయ్యకు పరిచమైన అదితి(శ్రుతిహాసన్‌) ట్రాక్ ఏమిటి? అసలు వీరయ్య గతం ఏమిటి?, వాల్తేరు వీరయ్య (చిరంజీవి)కి విక్రమ్ సాగర్ (రవితేజ) సవతి తల్లి కొడుకు. పరిస్థుతుల కారణంగా ఇద్దరు చిన్నతనంలోనే దూరం అవుతారు. వైజాగ్ లో వీరయ్య తన గ్యాంగ్ తో మందు బాటిల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అక్కడకి ఎసీపీగా వచ్చిన విక్రమ్ సాగర్ వీరయ్యను ఎలా అడ్డుకున్నాడు?, ఈ క్రమంలో వీరయ్యకే తెలియకుండా జరిగిన పొరపాటు ఏమిటి ? డ్రగ్స్‌ కేసుకు వీరయ్యకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు మైఖేల్‌ను ఇండియాకు తీసుకొచ్చి ఏం చేశాడు? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ : భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలకు తగ్గట్టుగానే.. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో .. మెగా ఎంటర్ టైన్మెంట్.. గ్రాండ్ విజువల్స్ తో ఆకట్టుకుంది. చిరంజీవి కామెడీ చేసి చాలా రోజులైంది. సైరా, ఆచార్య, గాడ్‌ ఫాదర్‌ వంటి సినిమాలన్నీ సీరియస్‌ కథలతో రావడంతో మునుపటి వింటేజ్‌ చిరంజీవిని చూడాలని అభిమానులు ఉత్సుకతతో ఎదురుచూశారు. వారిని దృష్టిలో పెట్టుకొని కావాల్సినంత వినోదం, యాక్షన్‌ హంగులతో దర్శకుడు బాబీ ఈ కథ సిద్ధం చేశారు. కథగా చెప్పుకుంటే అంతగా కొత్తదనమేదీ కనిపించదు. తన వారికి జరిగిన అన్యాయానికి హీరో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే ఇతివృత్తం. అయితే చిరంజీవి తనదైన కామెడీ టైమింగ్‌, యాక్షన్‌తో ప్రేక్షకుల్ని ఆద్యంతం ఎంగేజ్‌ చేశారు. ఆయన లుక్స్‌ కూడా బాగున్నాయి. చాలా అందంగా కనిపించాడు. మలేషియాలో జరిగే ఎపిసోడ్‌లో చిరంజీవి తనదైన శైలి కామెడీతో ఆద్యంతం రక్తికట్టించారు. ఆయన కామెడీ టైమింగ్‌, ఈజ్‌ అబ్బురపరుస్తాయి. ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌ ద్వితీయార్థంలో ఏం జరుగబోతుందోననే ఆసక్తిని పెంచుతుంది. చిరంజీవి సినిమా అనగానే అభిమానులు కొన్ని లెక్కలేసుకుంటారు. మంచి ఫైట్‌ సీన్స్‌, డ్యాన్స్‌, కామెడీ.. ఇవన్నీ ఉండాలని కోరుకుంటారు. అందుకే కథ ఎలా ఉన్నా.. ఈ హంగులన్నీ పెట్టడానికి దర్శకులు ప్రయత్నిస్తుంటారు. ‘వాల్తేరు వీరయ్య’లో కూడా అవన్నీ ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు బాబీ. అదిరిపోయే ఇంట్రడక్షన్‌ సీన్‌, తన మార్క్‌ కామెడీ, భారీ యాక్షన్‌ సీన్‌లతో కథను తీర్చిదిద్దాడు. అలాగే మాస్‌ మహారాజ రవితేజ ఉండడం సినిమాకు మరింత ప్లస్‌ అయింది.  పోలీస్‌ స్టేషన్‌లోనే పోలీసులను సాల్మన్‌ అతికిరాతంగా చంపడంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఫస్ట్‌ సీన్‌లోనే విలన్‌ పాత్ర ఎంత కిరాతకంగా ఉండబోతుందో చూపించాడు దర్శకుడు. ఆ తర్వాత నేవీ దళాన్ని కాపాడడానికి సముద్రంలో వీరయ్య చేసే ఓ భారీ ఫైట్‌తో హీరో ఇంట్రడక్షన్‌ ఉంటుంది. వీరయ్య మలేషియాకు షిఫ్ట్‌ అయ్యాక వచ్చే కామెడీ సీన్స్‌ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సాల్మన్‌ని కిడ్నాప్‌ చేయడానికి వీరయ్య టీమ్‌ వేసే ప్లాన్‌ నవ్వులు పూయిస్తుంది. అలాగే శ్రుతీహాసన్‌తో చిరు చేసే రొమాన్స్‌ అభిమానులను అలరిస్తుంది. కానీ కథనం నెమ్మదిగా సాగిందన్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ మాత్రం అదిరిపోతుంది.  ఇక అసలు కథ సెకండాఫ్‌లో మొదలవుతుంది. ఏసీపీ విక్రమ్‌గా రవితేజ ఎంట్రీ, అన్నదమ్ముల మధ్య వచ్చే టిట్‌ ఫర్‌ టాట్‌ ఎపిసోడ్లు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పోలీస్‌ స్టేషన్‌లో చిరంజీవి సినిమా డైలాగ్‌ రవితేజ చెప్పడం.. రవితేజ సినిమా డైలాగ్‌ చిరంజీవి చెప్పడం నవ్వులు పూయిస్తుంది. కారులో చిరంజీవి, రవితేజ మాట్లాడుకోవడం.. చిరు కన్నీళ్లు పెట్టుకోవడం ప్రేక్షకులను ఎమోషనల్‌కు గురిచేస్తాయి.ఎలాంటి ప్రయోగాలకు పోకుండా.. అభిమానులు కోరుకునే అంశాలతో ఓ రొటీన్‌ కథను అంతే రొటీన్‌గా చెప్పాడు డైరెక్టర్‌. అయితే చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా స‌న్నివేశాలు డిజైన్ చేసుకోవడంలో మాత్రం బాబీ సఫలం అయ్యాడు. వీరయ్య – రవితేజ పాత్రలు, కథా నేపథ్యం, అలాగే ఇతర పాత్రల చిత్రీకరణ, నటీనటుల పనితీరు బాగున్నా.. కథనం విషయంలో బాబీ చాలా స్లోగా ప్లే నడిపాడు. అయితే, పాత్రల మధ్య ఎమోషన్స్ ను బాగా ఎస్టాబ్లిష్ చేసినా… కొన్ని చోట్ల మెలో డ్రామాలా అనిపిస్తోంది. దీనికి తోడు పాత్రలు ఎక్కువ అవ్వడం, అలాగే అక్కడక్కడా కామెడీ కోసం పెట్టిన అమవసరమైన డిస్కషన్ సినిమా స్థాయికి తగ్గట్టు లేదు. ఇక సెకండాఫ్ లో కూడా కొన్ని చోట్ల ప్లే స్లోగా సాగింది. ప్రధానంగా కొన్ని సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. దీనికితోడు కొన్ని సన్నివేశాలు కూడా రొటీన్ గానే సాగాయి. ప్రకాష్ రాజ్ ట్రాక్ పూర్తి సినిమాటిక్ గా సాగింది. విలన్ – హీరో మధ్య కాన్ ఫ్లిక్ట్ కూడా ఇంకా బలంగా ఉండాల్సింది. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో వినోదానికి మాత్రం ఢోకా లేదు. వింటేజ్ చిరును చూపిద్దామని ఆయన పాత సినిమాల బాడీ లాంగ్వేజ్.. లుక్స్.. డైలాగ్స్.. కామెడీ టైమింగ్ ను రీక్రియేట్ చేయడానికి బాబీ అండ్ టీం చేసిన ప్రయత్నం ఆశించిన ఫలితాన్నిచ్చింది. మెగాస్టార్ అభిమానులైతే ఆయన పాత్రతో బాగానే కనెక్టవుతారు. మరీ ‘హై’ ఇచ్చే ఎపిసోడ్లు లేకపోయినా.. సగటు ప్రేక్షకులు ఆశించే మినిమం గ్యారెంటీ వినోదానికి ‘వాల్తేరు వీరయ్య’లో ఢోకాలేదు. ఒక పెద్ద స్టార్ నుంచి ఆశించే కమర్షియల్ అంశాలకు ఇందులో లోటు లేదు. చిరంజీవి ‘రౌడీ అల్లుడు’గా అంత వినోదం పంచారన్నా.. ‘ముఠామేస్త్రి’గా మాస్ కు ఎంతో చేరువ అయ్యారన్నా.. ‘శంకర్ దాదా’గా వీర లెవెల్లో ఎంటర్టైన్ చేశారన్నా.. అందుకు ఆయా పాత్రల్లో ఉన్న ప్రత్యేకతే కారణం. కేవలం అలాంటి గెటప్పులే వేసి.. అదే బాడీ లాంగ్వేజ్ చూపిస్తూ.. అదే కామెడీ టైమింగ్ ను రిపీట్ చేసినంత మాత్రాన ప్రేక్షకులు ఊగిపోరు. కానీ చిరు వీరాభిమాని అయిన బాబీ.. ఇదే ప్రయత్నం చేసి చిరు అభిమానులు మురిపించగలిగాడు. చిరు తనను తాను ఇమిటేట్ చేయడానికి చేసిన ప్రయత్నం అన్ని చోట్లా సరైన ఫలితాన్నివ్వలేదు కానీ.. కొన్ని సన్నివేశాల వరకు కామెడీ బాగా పండింది. ఉదాహరణకు.. పోలీస్ స్టేషన్లో తన మరదలు తన దగ్గర ఆశీర్వాదం కోసం వస్తోందని భావించి చాలా ఎమోషనల్ అయి ముందుకు వెళ్లి ఆమె వస్తోంది తన కోసం కాదని అర్థం చేసుకుని ఆ విషయాన్ని కవర్ చేస్తూ వెనక్కి వెళ్లిపోయే సీన్లో చిరు పండించిన విధానం అభిమానులనే కాదు.. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుంది. తమ్ముడి మీద పైకి కోపం చూపిస్తూనే లోపల కొండంత దాచుకునే పాత్రను చిరు పండించిన విధానం ఆకట్టుకుంటుంది. రవితేజతో చిరు కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్. వీరయ్య సోదరుడు విక్రమ్‌ సాగర్‌ (రవితేజ) ఎంట్రీతో ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది. రవితేజ పరిచయ ఘట్టాలు, యాక్షన్‌ ఎపిసోడ్‌ ఆకట్టుకుంటాయి. పోలీస్‌ పాత్రలో రవితేజ తనదైన మార్క్‌ నటనతో మెప్పిస్తాడు. వీరయ్యను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించడం..అక్కడ వీరయ్య, విక్రమ్‌సాగర్‌ మధ్య వచ్చే సన్నివేశాలు కామెడీని పంచాయి. ఒకరి సినిమాలోని డైలాగ్స్‌ ఒకరు చెప్పుకోవడం హైలైట్‌గా అనిపిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి వింటేజ్‌ లుక్‌లో అభిమానుల్ని అలరిస్తాడు. నృత్యాల్లో తనదైన ఈజ్‌లో మెప్పించారు.
ఎవరెలా చేశారంటే..వీరయ్య పాత్రకు చిరంజీవి ప్రాణం పోశారు. రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో మెగాస్టార్ అద్భుతంగా నటించారు. సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ తో పాటు కథలోని మెయిన్ ఎమోషన్ కూడా బాగుంది. అలాగే మెగాస్టార్ పాత్రలోని షేడ్స్ ను, శ్రుతి హాసన్ తో సాగే సీన్స్ ను, అలాగే ప్లాష్ బ్యాక్ ను.. ఆ ప్లాష్ బ్యాక్ లోని రవితేజ క్యారెక్టర్ తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ ను.. ఇలా ప్రతి పాత్రను, ప్రతి ట్రాక్ ను దర్శకుడు బాబీ చాలా బాగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా రవితేజ పాత్రలోని ఎలివేషన్ సన్నివేశాలు విశేషంగా అలరిస్తాయి. చిరు – శ్రుతి హాసన్ ఆన్‌ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. చిరంజీవి నటనకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు. వీరయ్య పాత్రలో ఆయన జీవించేశాడు. చాలా కాలం తర్వాత మెగాస్టార్‌ని మాస్‌ లుక్‌లో చూస్తారు. ఒకప్పుడు చిరు చేసే కామెడీ, ఫైట్‌ సీన్స్‌ అన్నీ ఇందులో ఉంటాయి. తెరపై చాలా యంగ్‌గా కనిపిస్తాడు. ఉత్తరాంధ్ర యాసలో అదరగొట్టేశాడు.  చిరంజీవికి ఈ తరహా పాత్రలు కొత్తేమీ కాదు. వింటేజ్‌ చిరంజీవిని గుర్తుకుతెస్తూ అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ఫైట్స్‌, పాటల్లో తనదైన మార్క్‌తో మెప్పించారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్‌, వ్యంగ్యంగా చెప్పే సంభాషణలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాయి. ఏసీపీ విక్రమ్‌సాగర్‌గా రవితేజ సినిమాకు బలంగా నిలిచారు. డైలాగ్‌ డెలివరీ బాగుంది. ద్వితీయార్థంలో కథను ఆయనే నడిపించారు. ఊర్వశి రౌతేలా చేసిన స్పెషల్ సాంగ్ థియేటర్స్ లో విజిల్స్ వేయించింది. కీలక పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ పెర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్‌ గా చాలా బాగుంది. క్యాథరిన్ నటన కూడా బాగుంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. బాబీ దర్శకత్వం ఆకట్టుకుంది. కథలోని ప్రధాన పాత్రల పై బాబీ పెట్టిన ఎఫెక్ట్స్ బాగున్నాయి. అదితిగా శ్రుతిహాసన్‌ ఉన్నంతలో చక్కగా నటించింది. అయితే ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. కానీ ఫైట్‌ సీన్‌లో మాత్రం అదరగొట్టేసింది. డ్రగ్స్‌ మాఫియా లీడర్‌ సాల్మన్‌ సీజర్‌గా బాబీ సింహా, అతని సోదరుడు మైఖేల్‌గా ప్రకాశ్‌ రాజ్‌ తన పాత్రలకు న్యాయం చేశారు. కానీ వాళ్లది రొటీన్‌ విలనిజమే. వెన్నెల కిశోర్‌ కామెడీ పంచ్‌లు బాగున్నాయి. పోలీసు అధికారి సీతాపతిగా రాజేంద్రప్రసాద్‌తో పాటు షకలక శంకర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, ప్రవీణ్‌ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 
సాంకేతిక విభాగం : దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధాన బలం.  ‘బాస్ పార్టీ’ నుంచి ‘పూనకాలు లోడింగ్’ సాంగ్ వరకు డీఎస్పీ కొట్టిన సాంగ్స్ ఓ ఊపు ఊపేశాయి. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. అతడి నేపథ్య సంగీతం కూడా సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. ఆర్థన్‌ ఎ.విల్సన్‌ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఎంతో రియలిస్టిక్ గా, గ్రాండ్ విజువల్స్ తో ప్రతి సీన్ ను చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ఎడిటర్ సినిమాలోని స్లో సీన్స్ ను తగ్గించి ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్.వై ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నేషనల్ రేంజ్ లో భారీగా నిర్మించారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.  దర్శకుడిగా బాబీ బాగా ఆకట్టుకున్నాడు. పూనకాలు లోడింగ్ అంటూ హై ఓల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన వాల్తేరు వీరయ్య బాగా ఆకట్టుకున్నాడు. మెగా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇచ్చింది ఈ సినిమా. అలాగే ఇంట్రస్ట్ గా సాగే మెగాస్టార్ – రవితేజ క్యారెక్టరైజేషన్స్.. గ్రాండ్ యాక్షన్ విజువల్స్ అండ్ చిరు కామెడీ టైమింగ్, మెయిన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. మొత్తం మీద ఈ సినిమా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. మెగా ఫ్యాన్స్ కి ఫుల్ పూనకాలను ఇస్తోంది.