భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం ధీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

'Manyam Dheerudu' hero R.V.V. Satyanarayana accorded a grand welcome to the first passenger at Bhogapuram International Airport.
'Manyam Dheerudu' hero R.V.V. Satyanarayana accorded a grand welcome to the first passenger at Bhogapuram International Airport.
Spread the love

విశాఖపట్నం, ఆగస్టు 18: ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం (విశాఖపట్నం) అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 17న అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో విమానాశ్రయానికి విచ్చేసిన తొలి అంతర్జాతీయ ప్రయాణికుడికి వినూత్న రీతిలో, ఘనంగా స్వాగతం పలకడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
‘మన్యం దీరుడు’ చిత్రంలో విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన కథానాయకుడు శ్రీ ఆర్.వి.వి. సత్యనారాయణ, ఈ ప్రారంభోత్సవ వేడుకలలో అల్లూరి సీతారామరాజు వేషధారణలో పాల్గొని తొలి ప్రయాణికుడికి ఆత్మీయ స్వాగతం పలికారు. వీరత్వం ఉట్టిపడేలా అల్లూరి రూపంలో ఆయన రాక ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ అపూర్వ ఘట్టం అనంతరం హీరో ఆర్.వి.వి. సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ…
“ఉత్తరాంధ్ర తలమానికంగా నిర్మితమైన ఈ భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించడం నాకెంతో గర్వకారణంగా ఉంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి గడ్డపై, నా చిత్రంలో నేను పోషించిన అదే అల్లూరి వేషధారణలో వచ్చి తొలి ప్రయాణికుడికి స్వాగతం పలకడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. నన్ను ఒక నటుడిగా గుర్తించి, గౌరవించి, ఈ అద్భుతమైన చారిత్రక ఘట్టంలో భాగస్వామిని చేసిన విమానాశ్రయ యాజమాన్యానికి, అధికారులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు,” అని సంతోషం వ్యక్తం చేశారు.
అలాగే, తాను నటించిన ‘మన్యం దీరుడు’ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha) లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకుల విశేష ఆదరణ పొందుతోందని ఆయన తెలిపారు. అల్లూరి సీతారామరాజు జీవిత స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూసి ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ వేడుకలో అల్లూరి సీతారామరాజు వేషధారణలో ఉన్న సత్యనారాయణతో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు ప్రయాణికులు, ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఎంతో ఉత్సాహం చూపించారు.