* నాగోల్ పోలీస్ అధికారిణి ఎన్. హిమబిందుకు
కోటక్ మహీంద్రా బ్యాంకు, మహిళా మండలిల సత్కారం
శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనూ, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పోలీసులు ఎప్పుడూ ముందుంటారని.. పోలీసు దుస్తుల వెనుక ఉండే సేవా దృక్పథం గల మానవత్వాన్ని, దయగల మనసును చాటే గుణం లాంటి ఎన్నో సంఘటనలను మనం గమనించవచ్చని నాగోల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మాక్బుల్ జానీ పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం విధుల్లో ఉండే పోలీసు అధికారులు, సిబ్బంది సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులను గమనించిన వెంటనే మహిళా పోలీస్ అధికారులు సమయస్ఫూర్తితో స్పందించి స్వయంగా హాస్పిటల్‌కు తరలించి ప్రాణాలు కాపాడుతున్నారని పేర్కొన్నారు. సమాజానికి వెన్నెముక లాంటి పోలీసులు లేకపోతే అరాచక శక్తులు విజృంభిస్తాయన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించే క్రమంలో పలువురు ప్రాణాలు సైతం అర్పించారని, పాలనా వ్యవస్థలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమైనదని సర్కిల్ ఇన్స్పెక్టర్ మాక్బుల్ జానీ పేర్కొన్నారు. నాగోల్ పోలీస్ అధికారిణి ఎన్. హిమబిందుకు సత్కారం జరపడం ఆనందంగా ఉందని తెలిపారు.
తాజాగా ఇటీవల (శనివారం రాత్రి) ఘట్కేసర్ మండలం నారపల్లి సదాతలిగూడ నల్ల నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద జరిగిన ఓ బైక్ యాక్సిడెంట్ లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయాల పాలైతే వారిని రోడ్డుపై వెళుతున్న నాగోల్ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీస్ అధికారిణి (రిసెప్సనిస్టు) ఎన్. హిమబిందు (డబ్ల్యూపిసి 12924) చూసి క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ చేసిన మానవత్వం చాటుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఎన్. హిమబిందును బుధవారం నాగోల్ పోలీస్ స్టేషన్ లో కోటక్ మహీంద్రా బ్యాంకు నాగోల్ శాఖకు చెందిన అధికారులు ఆమె మానవత్వాన్ని కొనియాడుతూ ఘన సత్కారం జరిపి కోటక్ బ్యాంకు పక్షాన రివార్డును సైతం అందజేశారు. అలాగే బంగారు తెలంగాణ మహిళా కమ్యూనిటీ సభ్యులు కె. గౌరి, ఎస్.ఇ ఉపేంద్ర, డి.సంధ్య, ఇ.దేవి, అమృత, కె. సతీష్ గౌడ్, బి. రవి హిమబిందు చేసిన సహాయాన్ని మెచ్చుకుంటూ సన్మానం నిర్వహించారు.
ఈ సందర్బంగా మహిళా మండలి కమ్మరి గౌరి, సతీష్ గౌడ్ లు మాట్లాడుతూ.. విధినిర్వహణలోనే కాకుండా ఎల్లప్పుడూ మానవత్వాన్ని చాటుకోవడంలో నాగోల్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారని ఈ సంఘటన మరోమారు గుర్తుచేసిందని.. నాగోల్ పోలీస్ అధికారిణి ఎన్. హిమబిందుకు సత్కారం జరపడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. నల్ల నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద జరిగిన యాక్సిడెంట్ లో రోడ్డుపై నడచి వెళుతున్న వ్యవసాయకూలీ ఎల్ల మంకయ్యను ప్రతాప సింగారంకు చెందిన డి.ముత్తయ్య బైక్ ఢీ కొనడంతో ఇద్దరూ తీవ్రంగా గాయాలపాలుకాగా… రోడ్డుపై పడిన క్షతగాత్రులను స్థానికులు ఎవరూ పట్టించుకోకపోవడంతో అవస్థలు పడుతున్న వారిని అదే సమయంలో డ్యూటీ ముగించుకొని ఇంటికి బైకుపై వెళుతున్న పోలీస్ అధికారిణి ఎన్. హిమబిందు గాయాల పాలైన ఇద్దరిని చూసి వెంటనే ఒక ఆటో సహాయంతో కొర్రెముల ఎక్స్ రోడ్ వద్ద గల వర ఆసుపత్రిలో అడ్మిట్ చేసి మానవత్వం చాటుకోవడం మరచిపోలేని విషయమని వారు కొనియాడారు. సమాజంలో అందరూ పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులో తమ భార్య పిల్లలతో సంతోషంగా ఉంటే, మరోవైపు అదే సమయంలో పోలీసులు ఆ సంతోషాలకు దూరంగా వారి కుటుంబాలకు దూరంగా ఉండి పగలనక, రాత్రనక విధుల్లో నిమగ్నమై ఉంటారని తెలిపారు. నాగోల్ పోలీస్ అధికారిణి ఎన్. హిమబిందుకు జరిగిన ఘన సత్కారంలో సి.ఐ జానీతో పాటు నాగోల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
