చరణ్ ను ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ అని పిలవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది : చిరంజీవి

It gave me great joy to call Charan the 'New Age Megastar': Chiranjeevi
Spread the love

* పుత్రోత్సాహాన్ని నూటికి నూరు శాతం అనుభవిస్తున్నాను
* పెద్ది చిత్రాన్ని ఆదరించి ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు
– ‘పెద్ది’ మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ లో మెగాస్టార్

* పెద్ది విజయం నా జీవితాన్ని మార్చేసింది.
* పెద్ది రిలీజ్ అయ్యే వరకు మా పాప క్లీంకార నన్ను ‘నాన్న’ అని పిలిచేది.
విడుదలైన తర్వాత ‘పెద్ది’ అని పిలుస్తోంది.
* ఇప్పుడు అందరికీ పెద్ది పేరే గుర్తుంది.
* పెద్ది ఇంత అందమైన జ్ఞాపకాన్ని ఇచ్చింది
-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. 2026 సౌత్ ఇండియా నంబర్ వన్ గ్రాసర్ గా నిలిచింది అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా మేకర్స్ పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ ని నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, టీమ్ సభ్యులకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ చేతుల మీదుగా షీల్డ్స్ బహుకరించారు.
పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా అభిమానుల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రమశిక్షణలో ఎలాంటి మార్పు లేదు. అదే ఉత్సాహం, అదే ప్రేమతో ఆదరిస్తూ వస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక అభివాదాలు. నేను ఇక్కడికి ఒక అతిథిగా, ఒక సీనియర్ నటుడిగా, సినిమాపై అపారమైన ప్రేమ ఉన్న వ్యక్తిగా వచ్చాను. ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రతి ప్రేక్షకుడికి, అభిమానికి, చిత్ర బృందానికి నా ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చాను. ఇలాంటి సినిమాలు రావాలి. పరిశ్రమ సుభిక్షంగా ఉండాలి. థియేటర్లు కళకళలాడాలి. ఆ దిశగా పెద్ది ఒక గొప్ప విజయంగా నిలిచింది. ఈ సినిమా చూస్తున్నంతసేపూ నేను ఒక ట్రాన్స్‌లోకి వెళ్లిపోయిన అనుభూతి కలిగింది. పాత్రలతో మమేకమై వారి పోరాటంలో నేనూ ఒకడినై ప్రయాణించాను. ఇంత పవర్‌ఫుల్, ఎమోషనల్, మోటివేషనల్ కథను ఎంచుకుని, దానికి రామ్ చరణ్ న్యాయం చేస్తాడని నమ్మి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబుకు సభాముఖంగా నా హృదయపూర్వక అభినందనలు. ఇది మట్టి మనుషుల కథ. బుచ్చిబాబు కూడా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో ఆ భావోద్వేగాలను అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. ఈ కథకు ఆయన నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. ఇలాంటి దర్శకుడిని తెలుగు సినీ పరిశ్రమకు అందించిన సుకుమార్ గారికి కూడా నా అభినందనలు. మట్టిలో దాగి ఉన్న మాణిక్యాలను వెలికి తీయగల దార్శనికుడు సుకుమార్ గారు. నిర్మాత సతీష్ కిలారు గారు దర్శకుడి విజన్‌ను ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో తెరపై ఆవిష్కరించారు. ఆయనకు నా ప్రత్యేక అభినందనలు. ఒక తోటి నటుడిగా, పరిశ్రమలో సీనియర్‌ యాక్టర్ గా చెప్పాలంటే… యాక్షన్, డ్యాన్స్, ఎమోషన్స్, ఇంటెన్సిటీ, ఇన్వాల్వ్‌మెంట్… ఒక నటుడికి అవసరమైన అన్ని కోణాల్లో పరిపక్వత సాధించి, దానిని 100 శాతం తెరపై చూపించిన రామ్ చరణ్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక తండ్రిగా గర్వపడుతున్నాను. రంగస్థలంలో చరణ్ ఎంత అద్భుతంగా నటించాడో చూశాం. అలాంటి పాత్ర మళ్లీ రావాలంటే చాలా కాలం పడుతుందని అనుకున్నాం. మగధీర, రంగస్థలం, అర్అర్అర్ లాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. కానీ మూడేళ్ల వ్యవధిలోనే పెద్దిలాంటి మరో గొప్ప పాత్ర రావడం ఆశ్చర్యంగా అనిపించింది. ఈ పాత్ర దక్కడం నిజంగా చరణ్ అదృష్టం.సినిమా చూస్తున్నప్పుడు మాకు చరణ్ కనిపించలేదు… పెద్ది మాత్రమే కనిపించాడు. ఆ పాత్రను పూర్తిగా ఒంటబట్టించుకున్నాడు. దర్శకుడికి ఏం కావాలో దానిని అంకితభావంతో ఇచ్చాడు. పెద్ది పాత్రతో మనందరినీ నవ్వించాడు, ఏడిపించాడు, ఉత్సాహపరిచాడు, భావోద్వేగానికి గురిచేశాడు. చివరిగా విజయం సాధించాడు. ఆ పాత్రలో అతను చూపించిన నటనకు నా హృదయపూర్వక అభినందనలు.కళ్లతోనే భావాలను పలికిస్తూ ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించగలిగాడు. అదే పరిపూర్ణ నటన. ఈరోజు రామ్ చరణ్ ఆ పరిపక్వతను, ఆ సంపూర్ణతను చూపించి నన్ను పూర్తిగా సంతృప్తిపరిచాడు. చరణ్ ఒక స్టార్ హీరో కొడుకు. గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడు. ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. దర్శకుడు చెప్పింది చేసి వెళ్లిపోవచ్చు. కానీ అతను కష్టాన్ని నమ్ముకున్నాడు. అందుకే ఈరోజు మీరంతా అతని నటనను నేషనల్ అవార్డు స్థాయిలో ఉందని ప్రశంసిస్తున్నారు. అవార్డు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ప్రజల మనసుల్లో ‘అద్భుతంగా నటించాడు’ అనే గుర్తింపు రావడం కంటే గొప్ప అవార్డు మరొకటి లేదు. ప్రజల ప్రేమ, అభిమానం, ఆదరణే గొప్ప అవార్డు. ఈ సినిమా కోసం అతను చేసిన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను నేను ప్రతిరోజూ ఇంట్లో చూశాను. ఉదయం వ్యాయామాలు, షూటింగ్, మళ్లీ సాయంత్రం వ్యాయామాలు… అతని కష్టాన్ని చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా అనిపించేది. షూటింగ్ సమయంలో చరణ్ కంటికి గాయం అయింది. ఆ ఫొటో చూసి నేను చాలా భయపడ్డాను. డాక్టర్లతో మాట్లాడిన తర్వాత ప్రమాదం లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను. ఎనిమిది కుట్లు పడ్డాయి. అయినా వెనక్కి తగ్గలేదు. ఆ సమయంలో నాకు గూండా సినిమా షూటింగ్ గుర్తొచ్చింది. ట్రైన్ కింద యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు మా నాన్నగారు చాలా భయపడ్డారు. అప్పుడు నేను ‘ప్రేక్షకులను అలరించాలంటే ఇలాంటి రిస్కులు చేయాల్సిందే’ అన్నాను. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు – ‘నీకు కొడుకు పుట్టి, వాడు హీరో అయి ఇలాంటి కష్టాలు పడితే అప్పుడు ఒక తండ్రి బాధ తెలుస్తుంది’ అని. చరణ్ కి గాయమైనప్పుడు నాన్నగారి మాట గుర్తుకు వచ్చింది. అయితే తను కష్టాన్ని నమ్ముకోవడం తండ్రిగా నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. నిన్ననే ప్రధాని నరేంద్ర మోదీ గారితో కలిసి చరణ్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు.అక్కడ తనకి న్యూ ఏజ్ మెగాస్టార్ అనే టైటిల్ ఇచ్చారు. నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. పిల్లలు ఎదుగుతున్నప్పుడు తండ్రికి కలిగే ఆనందం వర్ణించలేనిది. నేను ఈరోజు ఆ పుత్రోత్సాహాన్ని నూటికి నూరు శాతం అనుభవిస్తున్నాను. మేము ఎప్పుడూ కష్టాన్ని నమ్ముకున్నాం. ఆ కష్టానికి ప్రతిఫలంగా మీరు మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు. అంత గొప్ప స్థానం ఇచ్చిన ప్రేక్షకలోకానికి, అభిమానులకు, పెద్ది చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికీ మా కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. జగపతిబాబు గారు, శివరాజ్ కుమార్ గారు తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. జాన్వీ కపూర్ కూడా ఎంతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి నటీనటుడికి, ప్రతి టెక్నీషియన్‌కు నా అభినందనలు. రెహమాన్ గారి సంగీతానికి ప్రత్యేకంగా అగ్రతాంబూలం ఇవ్వాలి. రత్నవేలు గారు పెద్ది ప్రపంచాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. విజువల్ వండర్‌ను సృష్టించారు. ప్రతి టెక్నీషియన్‌కు నా అభినందనలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థాంక్యూ సో మచ్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా నాన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారికి, అనిల్ రావిపూడి గారికి, సాహు గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కొన్ని విజయాలు మనల్ని ఆనందపరుస్తాయి. కొన్ని విజయాల గురించి ఆలోచిస్తే మనసుకు చాలా తృప్తిని ఇస్తాయి. పెద్ది విజయం మాత్రం నా జీవితాన్నే మార్చేసింది. పెద్ది లాంటి అనుభూతి నాకు ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. అలాంటి గొప్ప అనుభూతిని ప్రేక్షకులు నాకు అందించారు. ఈ సినిమా ద్వారా నా గుండెల్లో జీవితాంతం దాచుకునే జ్ఞాపకాన్ని ఇచ్చారు. అందుకే ముందుగా మీ అందరికీ థాంక్యూ. నేను సోషల్ మీడియాలో రీల్స్ చూస్తుంటే చాలా కొత్త ఆడియన్స్ థియేటర్లకు వచ్చినట్లు అనిపించింది. చిన్న పిల్లలు ‘మస్సా మస్సా’ పాటకు డ్యాన్స్ చేస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. పేరెంట్స్ ఎంత నమ్మకం పెడితే తమ పిల్లలను కూడా థియేటర్లకు తీసుకొస్తారో అది ఈ సినిమా ద్వారా తెలిసింది. అది బుచ్చిబాబు చేసిన ప్రయత్నానికి దక్కిన గొప్ప గౌరవం. చిన్నవాళ్లతో పాటు పెద్దవాళ్లు కూడా లుంగీలు కట్టుకుని, తెల్ల జుట్టుతో డ్యాన్స్ చేస్తూ కనిపించడం నాకు చాలా కొత్త అనుభూతిని ఇచ్చింది. మళ్లీ ఇలాంటి అనుభూతి వస్తుందో లేదో తెలియదు. ఈ సినిమాను మీరు ఎంతగా ఆదరించారంటే, రామ్ చరణ్‌ను మర్చిపోయి పెద్దినే గుర్తుపెట్టుకుంటారేమో అనిపిస్తోంది. ఆ విషయాన్ని మా ఇంట్లోనే నేను అనుభవించాను. పెద్ది రిలీజ్ అయ్యే వరకు మా పాప క్లీంకార నన్ను ‘నాన్న’ అని పిలిచేది. సినిమా విడుదలైన తర్వాత ‘పెద్ది’ అని పిలుస్తోంది. ఇప్పుడు అందరికీ పెద్దినే గుర్తుంది. ఇంత అందమైన జ్ఞాపకాన్ని ఇచ్చిన బుచ్చిబాబుకు చాలా థాంక్స్. సుకుమార్ గారు నా ఫేవరెట్ పర్సన్. నా జీవితంలో ఎప్పుడైనా చిన్న డౌన్ మూమెంట్ వచ్చినా, నాన్నగారి తర్వాత నేను ఫస్ట్ ఫోన్ చేసే వ్యక్తి సుకుమార్ గారే. ఆయన లెక్చరర్‌గా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. నన్ను కూడా ఒక స్టూడెంట్‌లా చూసి గైడ్ చేయాలని నేను ఎప్పుడూ అడుగుతుంటాను. సతీష్ గారు పెద్ది సినిమాకు ఒక బలమైన పిల్లర్‌లా నిలబడ్డారు. తొలి సినిమాకే నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి, ఎక్కడా రాజీ పడకుండా నిలిచిన ఆయనకు థాంక్యూ సో మచ్. భవిష్యత్తులో కూడా ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. రత్నవేలు గారు ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించారు. ఆయన సినిమాటోగ్రఫీ నిజంగా మాస్టర్‌పీస్. రెహమాన్ గారు తన సంగీతంతో ఈ సినిమాకు ప్రాణం పోశారు. అలాగే మా టీమ్‌లోని డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌తో పాటు అన్ని విభాగాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఠాగూర్ సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తోంది. ‘తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా ఎవరినీ ఇష్టపడరు. ఒకసారి ఇష్టపడితే చనిపోయే వరకు ప్రేమిస్తూనే ఉంటారు.’ అదే ప్రేమను మీరు పెద్దిపై చూపించారు. ప్రేక్షకులు ఈ సినిమాను తమ సినిమాగా భావించి తమ భుజాలపై మోసుకుని ఘన విజయాన్ని ఇచ్చారు. ఈ సినిమాలోని మంచిని గుర్తించి ఆదరించిన ప్రతి ప్రేక్షక దేవుడికి నా సెల్యూట్. ఈ సినిమాకు రివ్యూలు ఇచ్చిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పెద్దికి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఇంత మర్చిపోలేని సినిమాను, ఇంత గొప్ప జ్ఞాపకాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. జాన్వీ కపూర్‌కు, అలాగే ఈ సినిమాలో అద్భుతమైన పాట చేసిన శృతి హాసన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ముందుగా చిరంజీవి గారికి థాంక్యూ. ఆయన పక్కన కూర్చోవాలన్నా ఇప్పటికీ నాకు టెన్షన్‌గానే ఉంటుంది. చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే మాకు నిద్ర పట్టేది కాదు. ఆయన మరో సినిమా చేసి హిట్ కొట్టే వరకు ఎదురుచూసేవాళ్లం. అలాంటి చిరంజీవి గారు మాకు రామ్ చరణ్ లాంటి హీరోను ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్. బుచ్చిబాబు ఈ కథ చెబుతున్నప్పుడు నేను, చరణ్ ఇద్దరం అమేజ్ అయిపోయాం. కథ విన్న వెంటనే చాలా ముచ్చట పడ్డాం. చరణ్‌కు కమర్షియల్ సినిమా చేయడం చాలా ఈజీ. కానీ ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న కథను, పరిస్థితులే విలన్స్‌గా మారే కథను నమ్మి ఒప్పుకుని చేయడం చాలా గొప్ప విషయం. అలాంటి సినిమాతో బ్లాక్‌బస్టర్ సాధించడం ఇంకా గొప్ప విషయం. కమర్షియల్ సినిమా కాన్సెప్ట్‌ను పెద్ది మార్చేసింది. ఈ విషయంలో బుచ్చిబాబుకి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి. ఉప్పెన తీసిన అబ్బాయి, పెద్ది లాంటి భారీ చిత్రాన్ని ఇంత అద్భుతంగా హ్యాండిల్ చేయడం నిజంగా గొప్ప విషయం. కంగ్రాట్యులేషన్స్ బుచ్చిబాబు. చరణ్ ఈ సినిమా కోసం కసితో పనిచేశాడు. ప్రతి సీన్‌లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు. ఈ విజయం చరణ్ కష్టానికి దక్కిన ఫలితం. మా చరణ్ బంగారం. ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆ విషయం తెలుసు. ఈ సినిమాను ఇంత అద్భుతంగా నిర్మించిన నిర్మాత సతీష్ గారికి కూడా ధన్యవాదాలు. చరణ్‌ ఇచ్చిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. RC 17 ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా.
నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అనిల్ రావిపూడి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పెద్ది సినిమాను తెలుగు ప్రేక్షకులు తమ భుజాలపై మోసుకుంటూ విజయపథంలో ముందుకు తీసుకెళ్లారు. విడుదలై 19 రోజులు అవుతున్నా ఇప్పటికీ థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్, బీ-సీ సెంటర్లలో సినిమా అద్భుతమైన స్పందనతో దూసుకుపోతోంది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మా టీమ్ అంతా ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల పాటు ఎంతో కష్టపడి పనిచేశాం. రామ్ చరణ్ గారు నాకు ఈ అవకాశం ఇవ్వకపోయి ఉంటే పెద్ది సినిమా ఉండేది కాదు. నన్ను నమ్మి ఈ చిత్రాన్ని నాకు అప్పగించిన ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే సుకుమార్ గారికి, సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన బుచ్చిబాబు గారికి, మా టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. చరణ్ గారు రెండేళ్ల పాటు అహర్నిశలు కష్టపడి పనిచేయడం వల్లే ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని, అభిమానులను అలరిస్తోంది. ఈ సినిమాను విడుదల చేసే సమయంలో నేను కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నాను. ఆ సమయంలో నాకు అండగా నిలిచి, ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి కందుల దుర్గేష్ గారు, అలాగే తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మాకు ఎంతో సహకారం అందించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సినిమాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించాయి. అన్ని విధాలుగా పెద్ది బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ విజయంతో మేమంతా ఎంతో ఆనందంగా ఉన్నాం.
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. “నేను పిఠాపురంలో ఉన్న రోజుల్లో చిరంజీవి గారికి లెటర్లు రాసేవాడిని. అయితే ఆయన నుంచి ఎప్పుడూ జవాబు రాలేదు. కానీ నా మొదటి కథ చెప్పే అవకాశం మాత్రం ఆయనకే వచ్చింది. నా రెండో సినిమా పెద్ది కూడా ఆయన ఇంటికే వెళ్ళింది. ఒక మనిషికి సంకల్పం ఉంటే ఎంత సాధించగలడో చెప్పే కథే పెద్ది. అలాంటి కథతో ఈరోజు మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. చరణ్ గారికి ఈ కథ చెప్పినప్పుడు, పెద్ది పాత్రను ప్రేక్షకులు తమ మనసుల్లో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్లాలని కోరుకున్నాను. కానీ రామ్ చరణ్ గారు తన అద్భుతమైన నటనతో ఆ పాత్రను ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా చేశారు. ఒక స్టార్ హీరో ఇంతటి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. పెద్ది సెకండ్ హాఫ్ మొత్తం చూస్తే చరణ్ గారి నటన తప్ప ఇంకేమీ కనిపించదు. నేను ఆ పాత్రను ఎంత గొప్పగా ఊహించుకున్నానో, దానికంటే పది రెట్లు ఎక్కువగా చరణ్ గారు చేసి చూపించారు. రామ్ చరణ్ గారిని నేను జీవితాంతం మర్చిపోలేను. మా టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నిర్మాత సతీష్ గారు ఈ సినిమా కోసం ఎక్కడా రాజీ పడలేదు. సతీష్ గారు లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం. అలాగే మా గురువుగారు సుకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన లేకపోతే నేను లేను. నన్ను దర్శకుడిగా పిలవడం కంటే ‘సుకుమార్ గారి అసిస్టెంట్’ అని పిలిస్తే నాకు ఇంకా ఎక్కువ గర్వంగా ఉంటుంది. ఈ సినిమాకు మీరు చూపించిన ఆదరణ, అభిమానానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. పెద్దికి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రతి ప్రేక్షకుడికి హృదయపూర్వక ధన్యవాదాలు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ముందుగా పెద్ది చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి గారు మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంతో సందడి చేస్తే, సరిగ్గా నాలుగు నెలల తర్వాత రామ్ చరణ్ గారు ‘మస్సా మస్సా’ అంటూ బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఇది ఇండస్ట్రీకి ఆక్సిజన్‌లాంటి సక్సెస్. థియేటర్లు మళ్లీ ప్రేక్షకులతో కళకళలాడేలా చేసింది. అందుకు చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ అభినందనలు.రెహమాన్ గారు అద్భుతమైన పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కూడా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. మిగతా సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరూ అద్భుతంగా పనిచేశారు. బుచ్చిబాబు లాంటి దర్శకుడు ఇలాంటి సబ్జెక్ట్‌ను ఇంత స్టార్‌డమ్ ఉన్న హీరోతో చేయడం మామూలు విషయం కాదు. ఆయన నమ్మిన కథకు ప్రేక్షకులు ఇంత పెద్ద విజయాన్ని అందించడం చాలా గొప్ప విషయం. మెగాస్టార్ చిరంజీవి గారి రాకతో ఈ విజయోత్సవం మరింత పరిపూర్ణమైంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ గారు ఎంతో కష్టపడ్డారు. కొండలు ఎక్కారు, కండలు పిండారు, దుమ్ములో దొర్లారు… చివరికి బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్ము లేపారు. సినిమాలో ఒక పోస్టర్ ఉంది. అది చూస్తే నాకు హనుమంతుడు గుర్తొచ్చారు. ఆ స్థాయిలో ఆ పాత్రను ఆయన తెరపై ఆవిష్కరించారు. నిజంగా రామ్ చరణ్ గారికి హ్యాట్సాఫ్. పెద్ది పాత్రలో ‘తండ్రికి మించిన తనయుడు’ అన్నట్టుగా అద్భుతంగా నటించారు. ఆయనకు మరిన్ని గొప్ప విజయాలు రావాలని కోరుకుంటున్నాను. అలాగే నిర్మాత సతీష్ గారు చేసిన తొలి చిత్రమే ఇంత భారీ విజయాన్ని సాధించడం చాలా ఆనందంగా ఉంది.
ఇషాన్ సక్సేనా మాట్లాడుతూ.. ఇంత అద్భుతమైన విజయాన్ని అందుకున్న పెద్ది చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. సతీష్ గారితో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. రామ్ చరణ్ గారు అందరినీ సమానంగా గౌరవించే వ్యక్తి. ఆయనతో కలిసి ఈ సినిమా చేయడం నాకు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. ఆఫ్ స్క్రీన్‌లోనూ, ఆన్ స్క్రీన్‌లోనూ ఆయన అద్భుతమైన స్టార్. ఈ సినిమాలో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ ఎక్స్‌ట్రార్డినరీ. పెద్దికి ఇంత ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
డీవోపీ రత్నవేలు మాట్లాడుతూ.. పెద్ది విజయం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాను మేమంతా ఎంతో అంకితభావంతో, ప్రేమతో చేశాం. ఈ కథ విన్న వెంటనే నన్ను డీవోపీగా ఎంపిక చేసిన రామ్ చరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా నిర్మాత సతీష్ గారికి, దర్శకుడు బుచ్చిబాబు గారికి, ఈ చిత్రానికి పనిచేసిన మా టీమ్ సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం చేసిన ప్రయాణం అపారమైన ఆనందాన్ని అందించింది. పెద్దికి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకుల ప్రేమాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా మాట్లాడుతూ.. పెద్ది సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు అప్పగించిన మా నిర్మాత సతీష్ గారికి, దర్శకుడు బుచ్చిబాబు గారికి, హీరో రామ్ చరణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాకు పనిచేసిన మా టీమ్ సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సినిమాను మేమంతా ఎంతో ఆనందంగా, ఆస్వాదిస్తూ చేశాం. పెద్దికి ఇంత ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.
లిరిక్ రైటర్ బాలాజీ మాట్లాడుతూ.. ఇందులో నేను రాసిన చికిర్చిన పాటకు ప్రేక్షకులు అద్భుతమైన ఆదరణ ఇచ్చారు. అలాగే సినిమాకు కూడా గొప్ప విజయాన్ని అందించారు. రెహమాన్ గారు అన్ని పాటలను అద్భుతంగా స్వరపరిచారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు గారికి, రామ్ చరణ్ గారికి, నిర్మాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు. రామ్ చరణ్ గారి లాంటి స్టార్ హీరో చిత్రానికి పాట రాయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఇంకా అద్భుతంగా ఆడుతుందని, ప్రేక్షకులు మరింతగా ఆదరిస్తారని నమ్మకం ఉంది.
లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. పెద్ది మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. అయినా మీరు ఇంకా థియేటర్లలో చప్పట్లు కొడుతూనే ఉన్నారు. అందుకే ప్రేక్షకులకు చప్పట్లు కొట్టడానికి మీ ముందుకు వచ్చాం. పెద్ది రూ.420 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇది సాధారణ వసూళ్లు కాదు… వసూళ్ల వరద. ఇది ప్రేక్షకులు, అభిమానుల ప్రేమ వల్లే సాధ్యమైంది. మీ చేత చప్పట్లు కొట్టించుకున్న పెద్ది పాత్రను అద్భుతంగా పోషించిన రామ్ చరణ్ గారికి, ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన బుచ్చిబాబు గారికి అభినందనలు. ఇంత విజయవంతమైన చిత్రంలో మూడు పాటలు రాసే అవకాశం రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా మాకు జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాన్ని ఇచ్చింది. అందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.

Related posts