-ప్రెస్ మీట్ లో నట్టికుమార్ షాకింగ్ కామెంట్స్
“థియేటర్స్ లో పర్సంటేజ్ విధానం అమలుకు నిర్మాతలు సుముఖంగానే ఉన్నారు. అయితే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు ఇబ్బందులు తలెత్తని రీతిలో అందరికీ ఆమోదయోగ్యమైన పర్సంటేజ్ ను నిర్ణయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ స్పష్టంచేశారు. మంగళవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. రెంటల్ విధానంలో ఒక థియేటర్ కు రూ. 7,30,000/- వస్తుందని అనుకుంటే..ఆ థియేటర్ ఓనర్ సుమారు రూ.10,00,000/- వరకు పర్సంటేజ్ విధానంలో వచ్చేవిధంగా నిర్ణయించమని అడగడంలో తప్పులేదు. అదే పాతిక లక్షలకు సమానంగా పర్సంటేజ్ ఇవ్వమని అడిగితే, అది ఎంతమాత్రం సహేతుకంగా ఉండదు. సినిమాలలో నష్టం వస్తే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ను ఆదుకునే వారు ఎవరూ లేరు. కొన్ని సందర్భాలలో నష్టాల కారణంగా ఉన్న ఆస్తులు పోగొట్టుకుని, అప్పుల పాలవుతున్నారు. అఖండ-2 సినిమాకు నష్టాలు వస్తే నిర్మాత గురించి ఎవరు మాట్లాడారు. అలాగే చిన్న సినిమా నిర్మాతలకు ఇంకెంత ఇబ్బందులు ఉంటాయి. ఎగ్జిబిటర్ కు తన థియేటర్ అయినా ఒక ప్రాపర్టీ గా, సేఫ్టీ గా ఉంటుంది. హీరోలు తక్కువ సినిమాలు చేయటం వల్ల ఎగ్జిబిటర్స్ ఇబ్బందులు పడుతున్నారు. కారణాలు ఏవైనప్పటికీ సబ్ కమిటీ మీటింగ్ లో మాట్లాడెందుకు కొందరు ఇబ్బందులు పడుతున్నారు. అందువల్లే నేను మాట్లాడాల్సి వస్తోంది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని, ఇబ్బందులు ఎదురుకాకుండా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేసిన సబ్ కమిటీ లో నిర్ణయాలు జరగాలి. ఈ సబ్ కమిటీలో అధ్యక్షులుగా లీజు ఓనర్స్ అయిన డి.సురేష్ బాబు, దిల్ రాజులు ఉన్నారు. వ్యక్తిగతంగా వారిద్దరూ నాకు ఎంతో క్లోజ్. అయితే ఈ సబ్ కమిటీ వారి నేతృత్వంలో పనిచేస్తుండటం వల్ల వారు ఎగ్జిబిటర్స్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. దానివల్ల నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు అన్యాయం జరిగే అవకాశం ఉందన్న అనుమానాలు నాకే కాదు పలువురు నిర్మాతలకు వస్తున్నాయి. అందుకే వారిద్దరూ ఈ కమిటీ నుంచి తప్పుకుని, వారి స్థానాలలో కె.ఎల్.నారాయణ, శ్యాంప్రసాద్ రెడ్డి వంటి వారిని నియమించాలి. వారిద్దరూ కావాలంటే సబ్ కమిటీలో ఎగ్జిబిటర్స్ వైపు నిలబడి మాట్లాడవచ్చు. నిజమైన బి.ఫారం కలిగిన లైసెన్స్ ఉన్న ఓనర్స్ కాకుండా లీజ్ ఓనర్స్ ఇప్పుడు చక్రం తిప్పుతున్నారు. అన్నీ వాళ్లకు అనుకూలమైన, వాళ్లకు భారీ లాభాలు ఉండేలా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న కలవరం ఎంతోమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ లో ఏర్పడుతోంది. ప్రతి ఒక్కరి సమస్యలను సబ్ కమిటీ చర్చించి, శాశ్వతంగా పరిష్కరించాలి. గతంలో సబ్ కమిటీ మీటింగ్ జరిగాక కూడా ఎగ్జిబిటర్స్ రెండు సార్లు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
పెద్ది కలెక్షన్స్ పై రూమర్స్ కరెక్ట్ కాదు..
పెద్ది చిత్రం అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టి, విజయవంతంగా ప్రదర్శింపబడుతోందని, కలెక్షన్స్ తగ్గాయని వస్తున్న రూమర్స్ ఎంతమాత్రం కరెక్ట్ కాదని ఇదే ప్రెస్ మీట్ లో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా నట్టి కుమార్ బదులిచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, పెద్ది సినిమా ఎగ్జిబిటర్స్ కు ఊపిరిపోసిందని అన్నారు. చాలాకాలంగా పెద్ద సినిమాలు ఎక్కువగా రాకపోవడం వల్ల, థియేటర్స్ రన్నింగ్ సరిగా లేక ఇబ్బందులు పడుతున్నటైమ్ లో పెద్ది సినిమా ఎగ్జిబిటర్స్ లో నూతనోత్సాహాన్నినింపిందని చెప్పారు. రామ్ చరణ్ తన పాత్ర కోసం ఎంతో కష్టపడటమే కాదు, పాత్రకు జీవం పోశారని ఆయన చెప్పారు. సినిమా ప్రేక్షకాదరణతో, మంచి రన్నింగ్ తో నడుస్తోందని అన్నారు.
