వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’

'Save the Tigers' in an entertaining way
Spread the love

 

* జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

జియో హాట్ స్టార్‌లో ‘సేవ్ ది టైగర్స్’కి వచ్చిన స్పందన అందరికీ తెలిసిందే. ఇప్పటికే రెండు సీజన్లు బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు మూడో సీజన్ స్ట్రీమింగ్‌కి రెడీ అయింది. జూన్ 19 నుంచి ఈ మూడో సీజన్ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో అందరినీ ఆకట్టుకునేలా, వినోదభరితమైన ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ఎవరన్నా.. చిన్నప్పటి నుంచి పెళ్లి గురించి మనకు ఇన్ని అబద్దాలు చెప్పింది.. పెళ్లి అంటే పండు వెన్నెల, పెళ్లాం అంటే నిండు పున్నమి’ అని రాహుల్ పాత్రలో అభినవ్ గోమటం చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ఓపెన్ అవుతుంది. బార్‌లో రాహుల్ (అభినవ్ గోమటం), విక్రమ్ (కృష్ణ చైతన్య), ఘంటా రవి (ప్రియదర్శి) ముగ్గురూ కలిసి పెళ్లి గురించి, జీవితం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అన్నడో నాకు దొరికితేనా? అని విక్రమ్ (కృష్ణ చైతన్య) అనడంతో స్వర్గంలో ఇంద్రుడి పాత్రలో వెన్నెల కిషోర్ ప్రత్యక్షం అవుతారు. అక్కడి నుంచి కథ వేరే ట్రాక్ ఎక్కుతుంది. ఘంటా రవి ఎమ్మెల్యేగా ఎదుగుతాడు. రాహుల్ గొప్ప స్క్రీన్ ప్లే రైటర్ అవుతారు. విక్రమ్ ఓ పెద్ద కంపెనీకి సీఈవో అవుతారు. అసలు తమ జీవితంలో ఏం జరుగుతుందో తమకే అర్థం కాకుండా ఉంటుంది. రెండో ప్రపంచంలో ఈ మార్పులు అన్నీ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఫుల్ ఫన్, ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా ఈ మూడో సీజన్‌ను నెక్ట్స్ లెవెల్లో రూపొందించారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఇక ట్రైలర్ చివర్లో వెన్నెల కిషోర్ చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత, రోహిణి ఇలా అందరూ తమ తమ పాత్రలతో మరోసారి ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు సిద్దంగా ఉన్నారు. జూన్ 19 నుండి స్ట్రీమింగ్ ప్రారంభం కానున్న ఈ సిరీస్ రెండు విభిన్న ప్రపంచాల మధ్య జరుగుతుందని అర్థం అవుతోంది. ట్రైలర్ కాస్త కన్ఫ్యూజింగ్‌గానే ఉన్నా కామెడీ మాత్రం కన్ఫామ్‌గా ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. ఫాంటసీ అంశాలతో రిలేషన్ షిప్ డ్రామాను మిక్స్ చేసి మూడో సీజన్‌ను వినోదభరితంగా తెరకెక్కించారనిపిస్తోంది.

Related posts