హైదరాబాద్, మార్చి 2026: మహిళలు క్రీడల్లో మరింతగా పాల్గొనేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఉమెన్స్ క్రికెట్ లీగ్ (WCL) అధికారిక లోగో ఆవిష్కరణకు ముఖ్య అతిథి గా ప్రముఖ సినీ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వ్యవస్థాపకులు టి.జి. విశ్వ ప్రసాద్, సినీ నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్, ఉమెన్స్ క్రికెట్ లీగ్ డైరెక్టర్ & అలా మొదలైంది సినిమా ఫేమ్ స్నిగ్ధా తో పాటు ప్రత్యేక అతిథులుగా బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య, కమ్యూనిటీ కనెక్ట్ స్పోర్ట్స్ డైరెక్టర్ సందీప్ వర్మ, బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ పాల్గొని కలసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో లా వీ ఎన్ రోజ్ వేదికగా జరిగింది.
ఉమెన్స్ క్రికెట్ లీగ్ అనేది విభిన్న రంగాలకు చెందిన ప్రతిభావంతమైన మహిళలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రత్యేక కార్యక్రమం. సినీ రంగం, కార్పొరేట్ రంగం, గృహిణులు వంటి వివిధ నేపథ్యాలకు చెందిన మహిళలు ఇందులో పాల్గొంటున్నారు. వృత్తి పరిమితులను దాటి క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తిని జరుపుకునే వేదికగా ఈ లీగ్ నిలవనుంది.
కుటుంబం, ఉద్యోగం, వ్యక్తిగత లక్ష్యాలను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్న మహిళల సంకల్పం, శక్తి, ఐక్యతను గుర్తించి ప్రోత్సహించడం ఈ లీగ్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు స్నిగ్ధ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మరిన్ని మహిళలు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
ఈ లోగో ఆవిష్కరణతో ఉమెన్స్ క్రికెట్ లీగ్ ప్రయాణానికి నాంది పలికినట్టైంది. మహిళలకు క్రికెట్ రంగంలో మరిన్ని అవకాశాలు కల్పించి బలమైన క్రీడా వేదికను నిర్మించాలనే దృక్పథాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.
ఉమెన్స్ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు మార్చి 7 మరియు మార్చి 8, 2026 తేదీలలో సాయంత్రం 6:00 గంటలకు తెల్లాపూర్‌లోని ప్రైమ్ అరినా లో నిర్వహించబడనున్నాయి. ఈ లీగ్‌లో సినీ రంగం, కార్పొరేట్ రంగం, గృహిణులు మరియు ఇతర సమాజాల నుంచి వచ్చిన 6 ఫ్రాంచైజీలకు చెందిన మొత్తం 96 మంది మహిళలు పాల్గొననున్నారు.
సినీ నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ ఉమెన్స్ క్రికెట్ అనేది మునుపటి వరకు పెద్ద ప్రాచుర్యం లేదు కానీ మగవారితో దీటుగా నేడు మెన్స్ క్రికెట్ తో పాటు ఉమెన్స్ క్రికెట్ కూడా అదే విధంగా ఆదరణ పొందుతుంది. ఎంతోమంది ప్రజలు వీక్షిస్తున్నారు. క్రికెట్ అనేది ఒకటే కాకుండా మహిళలు అన్ని రంగాలలో అన్ని విధమైన స్పోర్ట్స్ లో ప్రత్యేక గుర్తింపుతో పాటు మంచి ప్రతిభ కనబరుస్తున్నారని వాళ్ళ బలం మరింత నిరూపించుకుంటూ అన్ని రకాల స్పోర్ట్స్ లో ఇంకా ఎక్కువమంది రావాలని తెలిపారు.
నిర్మాత కె. ఎల్. దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. “మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళల క్రికెట్ కు ప్రస్తుతం లభిస్తున్న ఆదరణ అందరికీ తెలిసిందే. ఉమెన్స్ క్రికెట్ లీగ్ మరింత ముందుకు వెళ్ళాల”ని కోరుకుంటున్నాను
ఈ సందర్భంగా ఉమెన్స్ క్రికెట్ లీగ్ డైరెక్టర్ స్నిగ్ధా మాట్లాడుతూ , ఈ లీగ్ ద్వారా అనేక మంది మహిళలు ముందుకు వచ్చి క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని, తమ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఈ మహిళా క్రికెట్ ఉత్సవాన్ని విజయవంతం చేయడానికి ప్రముఖులు మరియు మహిళా క్రీడలకు మద్దతు ఇచ్చే వారందరినీ నిర్వాహకులు ఆహ్వానించారు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ.. బెస్ట్ విషెస్ అందించిన టి. జి. విశ్వ ప్రసాద్, కె. ఎల్. దామోదర్ ప్రసాద్
