నవతరం హీరోల్లో నవీన్ పొలిశెట్టికి మంచి పేరుంది. వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ మంచి కథలను ఎంచుకుంటున్నాడు. ఈ సంక్రాంతికి అలాంటి వినోదాన్ని పంచడానికి ‘అనగనగా ఒకరాజు’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన కామెడీ టైమింగ్, యాక్టింగ్‌తో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతో సెలెక్టివ్ గా సినిమాలు చేసే నవీన్ పొలిశెట్టి యాక్సిడెంట్ కారణంగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత సుదీర్ఘమైన గ్యాప్ తీసుకొని ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమా మీద అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ కూడా వర్కవుట్ కావడంతో, సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని అందరూ భావించారు. దీనికి తోడు నిర్మాత నాగవంశీ సినిమాని నెక్స్ట్ లెవల్లో ప్రమోట్ చేశారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మొదట దర్శకులు వేరైనా, సినిమా పూర్తి చేసింది మాత్రం మారి. హ్యాట్రిక్ హిట్స్ కొట్టాక కొంచం గ్యాప్ తీసుకొని నవీన్ పొలిశెట్టి రచించి, నటించిన సినిమా ఇది. నవీన్ పోలిశెట్టి తనదైన శైలి కామెడీ టైమింగ్ తో ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద తనకుంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఈ చిత్రానికి చిన్మయి రైటర్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరించడం గమనార్హం. ‘జాతి తర్నాలు’ తర్వాత ఆయన నటించిన పక్కా వినోదాత్మక చిత్రం కావడంతో అభిమానులు అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మరి ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా? మారి తన దర్శకత్వంతో ప్రేక్షకులను మెప్పించడంతో సక్సెస్ అయ్యారా? తన క్యూట్ అందాలతో మీనాక్షి ఎంత మేరకు ఆకట్టుకుంది? యుఎస్ లో సినిమాకి కొంత పాజిటివ్ టాక్ రావడంతో సినిమా మీద మరింత అంచనాలు పెరిగాయి. అయితే సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంతో నవీన్ రెండో హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టగలిగాడో లేదో అనేది రివ్యూలో చూద్దాం….
కథ : గౌరవపురం జమీందార్ గోపరాజు మనవడే రాజు (నవీన్ పొలిశెట్టి). అతడికి ఎంతో రిచ్ గా బతకాలన్నది కోరిక. ఆస్తులన్నీ తాత కరగబెట్టడంతో, లేని దర్పాన్ని ప్రదర్శిస్తూ కాలం వెళ్లదీస్తూ ఉంటాడు. తన బంధువుల్లో ఒకతను ఆస్తులున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడంతో, తాను కూడా అలాగే పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. పక్క ఊరికి చెందిన చారులత (మీనాక్షి చౌదరి) అయితే తనకు కరెక్ట్ గా సెట్ అవుతుందని భావించి, ఆమెను ప్రేమలో పడేలా చేస్తాడు. కోట్లాది రూపాయల ఆస్తులున్న చారులతను పెళ్లి చేసుకున్న మొదటి రాత్రే రాజుకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అసలు ఆస్తులున్న ఆమెను చేసుకున్నాక తెలిసిన ఆ షాకింగ్ విషయం ఏమిటి? అసలు చారులత రాజుని ఎందుకు ప్రేమించింది? చారులత మనసుని ఎలా గెలిచాడు? ఆమె జీవితంలోకి వచ్చాక రాజు కష్టాలు తొలగిపోయాయా? వీరిద్దరూ చివరి వరకు కలిసి ఉన్నారా లేదా? మధ్యలో ఎర్రి బాబు (తారక్ పొన్నప్ప) పాత్ర ఏమిటి? రాజు రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది? చివరికి రాజు ఏం చేశాడు? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెరపై సినిమాని చూడాల్సిందే.
విశ్లేషణ: నిజానికి కథగా చెప్పుకోవాలంటే ఇందులో పెద్దగా కథేమీ లేదు. ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న, ఆస్తులు పోగొట్టుకున్న జమీందారీ కుటుంబానికి చెందిన కుర్రాడు అక్కడ మోసపోయి, చివరికి ఎలా బుద్ధి తెచ్చుకున్నాడు అనే లైన్ తో సినిమా రాసుకున్నారు. నిజానికి ఇలాంటి లైన్ తో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. కామెడీ పరంగా అవి వర్కవుట్ అయ్యాయి కూడా. నవీన్ పొలిశెట్టి హీరోగా ఒక సినిమా చేస్తున్నాడంటే, ఖచ్చితంగా ప్రేక్షకులకు ఆ సినిమా మీద అంచనాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో అతను ఎంచుకున్న సినిమాలు అలాంటివి. ఖచ్చితంగా విలక్షణంగా ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించాడు నవీన్. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఒక పల్లెటూరి కథ ఇది. కథ, కథనం, పాత్రలు… ఇలా ప్రతిదీ ఇదివరకటి సినిమాల్లో చూసిన అనుభూతినే కలిగిస్తాయి. అయినా సరే, రాజు పాత్ర చేసే హంగామా నవ్విస్తుంది. కథానాయకుడు నవీన్ పొలిశెట్టి తన మార్క్ టైమింగ్‌ని ప్రదర్శిస్తూ, వన్ మేన్ షోలా సినిమాని ముందుకు నడిపించాడు. సంభాషణలు ఈ సినిమాకి ప్రధానబలం. ఓ పల్లెటూరు, ఒక హీరో, పెళ్లి గోల, ఎలక్షన్స్ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. నవీన్ పోలిశెట్టి కూడా అదే ఫార్మాట్ ను ఫాలో అయ్యాడు. కథ- కథనం అంతా పాత చింతకాయ పచ్చడే అయినప్పటికీ.. ‘రాజుగారు’ చేసే హంగామా చూసి ఫుల్ ఎంటర్టైన్ అవుతాం. సినిమా ప్రారంభమయిన కొంత వరకు బోరింగ్‌గానే సాగుతుంది. ఒక్కో సీన్ వచ్చి వెళ్తుంది కానీ.. ఎక్కడా కనెక్ట్ కాలేం. కానీ రాజు గారు పెళ్లి చూపుల వేట మొదలు పెట్టినప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇక ‘ఆపరేషన్ చారులత’ ఎపిసోడ్ నుంచి నవ్వుల యుద్ధం ప్రారంభం అవుతుంది. కథనం ఊహకందేలా సాగినా.. నవీన్ పొలిశెట్టి వేసే పంచ్‌లు, కామెడీ సీన్లతో ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంది. గోవా ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. సెకండాఫ్ ప్రారంభంలో కథనం నెమ్మదిగా సాగుతుంది. హీరో ఎన్నికల బరిలోకి దిగిన తర్వాత మళ్లీ కథనం పుంజుకుంటుంది. తన దగ్గరికి సాయం కోసం వచ్చే జనాల కష్టాల్ని వింటూ రాజు పడే అగచాట్లతో సినిమా ముందుకు సాగుతుంది. ఆ సన్నివేశాలన్నీ సాదాసీదాగా అనిపిస్తాయి. పెళ్లిలో శపథం, డబ్బున్న అమ్మాయిల కోసం రాజు చేసే ప్రయత్నాలు, ఆపరేషన్ చారులత ఎపిసోడ్స్ మొదలయ్యాకే అసలు సినిమా మొదలవుతుంది. భీమవరం బాల్మ, రాజుగారి పెళ్లిరో పాటలు సినిమాకి మరింత ఊపుని తీసుకొస్తాయి. ఆ రెండు పాటల చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది. చారులత మనసుని గెలిచేందుకు రాజు తన గ్యాంగ్‌తో కలిసి చేసే విన్యాసాలు బాగా నవ్విస్తాయి. విరామ సన్నివేశాలకు ముందు కథలో మలుపు ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధంలో కథ పూర్తిగా ఓ కొత్త మలుపుని తీసుకుంటూ, గ్రామ రాజకీయాల నేపథ్యాన్ని ఆవిష్కరిస్తుంది. ప్రథమార్ధంలో రాజు డబ్బు కోసం పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించినట్టే, ద్వితీయార్ధం కథలోనూ రాజు ఓ ఎత్తుగడ వేస్తాడు. అదే ఈ సినిమాకి కీలకం. ఎన్నికల ప్రచారం, ఊరి జనాన్ని నమ్మించేందుకు కథానాయకుడు పడే అగచాట్ల నేపథ్యం బాగా నవ్విస్తుంది. హీరో స్నేహితులు ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, అది చూసి ఊరి జనాల ప్రతిస్పందన ఇలా సందర్భోచితంగా మంచి హాస్యం పండుతుంది. సోషల్ మీడియా క్యాంపెయిన్, ఎన్నికల హంగామా సాధారణంగానే అనిపించినా, పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. భార్యాభర్తల మధ్య సంభాషణలు ఒకింత సెంటిమెంట్‌ని పండిస్తాయి. ఎలెక్షన్ క్యాంపెయిన్ ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుంది. ఇక క్లైమాక్స్‌లో కథనం ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. అప్పటివరకు నవ్వించిన రాజుగారు.. చివరిలో కాస్త ఎమోషనల్‌కు గురి చేస్తూ.. ఓ మంచి సందేశం ఇస్తాడు. కథ-కథనం గురించి ఆలోచించకుండా.. వెళ్తే.. ‘అనగనగా ఒకరాజు’ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు. ఫస్టాఫ్ అంతా హీరో క్యారెక్టరైజేషన్ పరిచయం, హీరో హీరోయిన్ల ప్రేమ, పెళ్లి అంటూ ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ ముందు ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ తో సెకండాఫ్ మీద అంచనాలు పెంచారు. సెకండాఫ్ ఆసక్తికరంగానే సాగింది. పొలిటికల్ యాంగిల్ ఒకటి యాడ్ కావడంతో ఒక పొలిటికల్ సెటైర్ లాగా సినిమా సాగిపోయింది. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ ఎంటర్టైనింగ్ గా ఉంది. చివర్లో ఎప్పటిలాగే ఒక మెసేజ్ ఇచ్చి సినిమాని క్లోజ్ చేశారు. అనగనగా ఒక రాజు సినిమా కథ విషయానికి వస్తే.. ఆడియెన్స్‌ను గొప్పగా భావోద్వేగాలకు గురిచేసే కథ కాదు. కేవలం వినోదం, డైలాగ్ కామెడీపై ఆధారపడి నవీన్ పొలిశెట్టి ఇమేజ్‌కు తగినట్టుగా చేసిన రెగ్యులర్ రూరల్, లవ్ స్టోరీ. అయితే ఇలాంటి సింపుల్ పాయింట్‌తో కథ మొదలుపెట్టిన దర్శకుడు మారి, క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయి.. రాజు క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి సుమారుగా అరగంట తీసుకొన్నారు. అయితే అంత సమయం తీసుకొన్నప్పటికీ.. సరైన సీన్లు, డైలాగ్స్ రాసుకోకపోవడంతో ఈ సినిమాను ఎటువైపు తీసుకెళ్తున్నారనే సందిగ్దత కూడా కలుగుతుంది. కానీ చారులత క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా కథ సరైన ట్రాక్‌పైకి ఎక్కిందనే ఫీలింగ్ కలుగుతుంది. అక్కడి నుంచి ఫన్ జనరేట్ చేస్తూ సినిమా సరదాగా సాగిపోతుంది. నవీన్ పొలిశెట్టి పాత్రను, ఆ పాత్ర తాలూకు సీన్స్ ను బాగా డిజైన్ చేసుకున్నా, అంతే స్థాయిలో మిగిలిన పాత్రలను జనరంజకంగా క్రియేట్ చేయలేకపోయారు. అలాగే, సెకండ్ హాఫ్ లో కీలక సన్నివేశాల్లో ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోవడంలో దర్శకరచయితలు కొన్ని చోట్ల విఫలం అయ్యారు. మొత్తానికి సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు ప్రధాన పాత్రలను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాకి మరింత మేలు జరిగేది. దర్శకుడు మారి తనకు మొదటి సినిమా అయినప్పటికీ, కామెడీని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి నటన, ఆ క్యారెక్టర్‌ను ఫన్నీగా తీర్చిదిద్దిన విధానం కూడా బాగుంది. మొత్తానికి సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ తో పాటు కామెడీ సన్నివేశాలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు : నవీన్ పొలిశెట్టి వన్ మేన్ షోలా ఉంటుంది ఈ సినిమా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా మొత్తాన్ని తన భుజానా వేసుకొని ముందుకు నడిపిస్తూ… రాజు పాత్రలో జీవించేశాడు. ప్రతీ సన్నివేశంలోనూ తెరపై కనిపిస్తూ, నాన్ స్టాప్‌గా సంభాషణలు చెబుతూ అల్లరి చేస్తుంటాడు. అతడికి ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు, కొట్టిన పిండి. రాజు అనే పాత్రలో ఇమిడిపోయాడు, ఒకరకంగా అదరగొట్టాడు. సినిమా మొత్తాన్ని తన భుజం మీదే మోసేస్తుంటాడు. మాస్ సినిమాలకి ఆ వన్ మ్యాన్ షోలు ఒకే కానీ.. కామెడీ సినిమాల్లో మిగతా పాత్రలు కూడా కామెడీ పండించాల్సిన, పండాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఆ విషయంలో నవీన్ కాస్త తగ్గి మిగతా పాత్రలకి కూడా పంచులు వేయడానికి కొంచం స్పేస్ ఇస్తే బాగుండేది. అయితే.. టైమింగ్ విషయంలో నవీన్ మంచి ఫార్మ్ లో ఉన్నాడు. కొన్ని పంచులు పేలకపోయినా.. నవీన్ టైమింగ్ ని ఎంజాయ్ చేస్తాం. రైటర్ గాను ఈ సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. తన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన నవీన్ పొలిశెట్టి, ఈ సినిమాతో కూడా ఆకట్టుకున్నాడు. తన శైలి కామెడీ టైమింగ్ తో పాటు స్టైలిష్ ఎలిమెంట్స్ తో మరియు కొన్ని చోట్ల ఎమోషన్స్ తోనూ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. నటించిన విధానం ఆకట్టుకుంది. గ్యాప్ ఇవ్వరా.. గ్యాప్ ఇవ్వు.. అంతా నువ్వే చేస్తే అంటే ఎలా..? ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టిని చూసాక ఇదే అనిపిస్తుంది. అస్సలు ఎవరికీ ఛాన్స్ ఇవ్వలేదు రాజుగారు.. కథ లేదు.. కథనం లేదు.. ఓన్లీ బుల్లెట్ బండిలా నవీన్ డైలాగులే పేలాయి థియేటర్లో..! కాకపోతే మనోడు ఎంత పర్పార్మ్ చేసిన పక్కన ఇంకో క్యారెక్టర్ అంతే స్థాయిలో ఉండుంటే బాగుండేది. అక్కడ స్కోప్ లేకపోయినా.. దూసుకెళ్లిపోయాడు. అమాయకమైన చారులత పాత్రలో మీనాక్షి చౌదరి ఆకట్టుకుంటుంది. ఆమెకి ఇందులో ప్రాధాన్యమున్న పాత్రే దక్కింది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో ఎక్కువ సన్నివేశాల్లో కనిపించింది. నటనతో ఆకట్టుకుంటూ ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేసిందని చెప్పాలి. మీనాక్షి చౌదరి నటిగానూ మెప్పించింది. సాధారణంగా ఆమెను గ్లామరస్ గా మాత్రమే చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ.. ఈ సినిమాలో ఆమె గ్లామర్ కంటే యాక్టింగ్ కి పెద్ద పీట వేసింది. కామెడీ కూడా బాగా పండించింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో అలాగే సెకండ్ హాఫ్ లో ఆమె తన నటనలో చూపించిన వేరియేషన్స్ బాగున్నాయి. రావు రమేష్ పాత్ర చిన్నదే అయినా.. మంచి ఇంపాక్ట్ ఉంది. తన పాత్రలో ఒదిగిపోయారు. సిల్లీ సిచ్యుయేషన్స్ లో కూడా తన టైమింగ్ తో ఆయన తన పాత్రను చాలా బాగా పండించారు. తారక్ పొన్నప్ప స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది కానీ.. అతని క్యారెక్టర్ ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది. హీరో గ్యాంగ్‌లో కనిపించే చమ్మక్ చంద్ర, మహేశ్, బుల్లిరాజుగా సుపరిచితమైన మాస్టర్ రేవంత్ అక్కడక్కడా నవ్వించారు. ప్రథమార్ధంలో ఓ కొత్త చిట్టి కనిపించి ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేసింది. మిక్కీ జె.మేయర్ పాటలు, నేపథ్య సంగీతంతో సినిమాపై గట్టి ప్రభావమే చూపించారు. కథ, కథనాల కంటే సంభాషణల రచనే ఈ సినిమాకి ప్రధానబలం. బలమైన కథ లేదనే విషయం బయట పడకుండా, హాస్యం పండించేందుకు రచయితలు ప్రయత్నించారు.
టెక్నికల్ టీం విషయానికి వస్తే..సాంకేతికంగా సినిమా బాగుంది. దర్శకుడు మారి తన టేకింగ్ తో మెప్పించినా.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా దర్శకరచయితలు స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్ అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆ ఫ్రేమ్ వర్క్స్ అన్ని బాగా వర్కవుట్ అయ్యాయి. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా జె. యువరాజ్ చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ తగ్గించాల్సింది. నిర్మాతలు నాగవంశీ, సాయిసౌజన్య ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే.. ‘అనగనగా ఒక రాజు’ అంటూ ఫుల్ ఫన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్, మెయిన్ థీమ్ మరియు కామెడీ సన్నివేశాలు అలాగే కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ బాగున్నాయి. ఓవరాల్ గా సినిమాతో రాజుగారు పండక్కి నవ్వులు పంచారు.
(చిత్రం: అనగనగా ఒక రాజు, విడుదల: జనవరి 14, 2026, నటీనటులు: నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, రావు రమేశ్, చమ్మక్ చంద్ర, రంగస్థలం మహేష్, గోపరాజు రమణ, భద్రం మాస్టర్ రేవంత్ (బుల్లిరాజు), తారక్ పొన్నప్ప తదితరులు. సంగీతం: మిక్కీ జే మేయర్. సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్, ఎడిటింగ్: వంశీ అట్లూరి, దర్శకత్వం: మారి, క్రియేటివ్ డైరెక్టర్ : చిన్మయి, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ – సాయి సౌజన్య, నిర్మాణం : సితార ఎంటర్టైన్మెంట్స్- ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్).
Anaganaga Oka Raju Review in Telugu: పండక్కి నవ్వులు పంచిన రాజుగారు!
