-డాక్టర్ మహ్మద్ రఫీ
డిజిటల్ చిత్రం: అనుపోజు ప్రభాకర్
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కళాకారులకు అయన ఆత్మీయ బంధువు! అందుకే ఆయన సాంస్కృతిక బంధువు గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే తత్వం! చేతికి ఎముక లేని మనస్తత్వం! ఎంత సంపద వున్నా ఎంతో నిరాడంబరత్వం! ఆ గొప్ప మానవతావాది, మనుషుల్లో దేవుడ్ని చూసే తత్వవేత్త, వదాన్య వరేణ్య మరెవరో కాదు…ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ సారిపల్లి కొండలరావు!
గత పాతికేళ్లుగా అక్కినేని నాటక కళా పరిషత్ వ్యవస్థాపక చైర్మన్ గా నాటక రంగానికి విశేష సేవలు అందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, కళా రంగానికి కనిపించే దేవుడు డాక్టర్ కె.వి.రమణాచారి గారి స్ఫూర్తి తో వారి సూచన మేరకు గత మూడున్నరేళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారులకు ఒక్కొక్కరికి పది వేల రూపాయల నగదు పురస్కారాలతో సన్మానిస్తూ, వారికి రానూపోనూ బస్సు చార్జీలు కూడా ఇస్తూ ఆశీర్వదిస్తున్నారు. తన పేరిట ఫౌండేషన్ స్థాపించి ఈ కరోనా విపత్కర సమయం లో ఎవ్వరూ చేయని విధంగా ప్రతి నెల వందమంది జానపద కళాకారులకు ఆర్ధిక సాయం చేస్తూ ‘నేనున్నాను’ అని ఎంతో భరోసా ఇస్తున్నారు! ప్రాచీన కళలను పరిరక్షించే జానపద కళాకారులను ఆదుకోవాలనే ప్రధాన లక్ష్యంతో సేవా సుగుణం తో కృషి చేస్తున్నారు. అందుకే, తెలంగాణ, ఆంధ్ర జానపద కళాకారులు సారిపల్లి కొండలరావు గారి వదాన్యతకు కృతజ్ఞతగా తమ ఇంటి ఆరాధ్య దైవంగా భావిస్తున్నారు. సారిపల్లి కొండలరావు గారి పుట్టిన రోజు అంటే..ఇవాళ జానపద కళాకారులకు పండుగ రోజు అని ఆనందంగా చెప్పుకుంటున్నారు!
అంతే కాదు, డాక్టర్ కె.వి.రమణాచారి సూచన మేరకు వందమంది అర్చకులకు ఆర్ధిక సాయం అందించారు. కళ పత్రిక సంపాదకులు డాక్టర్ మహ్మద్ రఫీ సలహా మేరకు హైదరాబాద్, గుంటూరు సాంస్కృతిక పాత్రికేయులు, ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్లకు కరోనా లాక్ డౌన్ సమయం లో రెండు సార్లు ఆర్ధిక సాయం చేసి తన ప్రేమను చాటుకున్నారు.
అక్కినేని నాటక కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు గా ప్రతి ఏటా నాటకోత్సవాలు నిర్వహిస్తూ నాటక కళాకారుల్లో సరికొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నారు! ఈ రెండున్నర దశాబ్దాల్లో ఎక్కడ వివాదానికి తావు లేకుండా, నిష్పక్షపాతంగా నిర్వహించే గొప్ప పరిషత్ గా తెలుగు నాట గుర్తింపు తీసుకొచ్చారు. లయన్ వై.కె.నాగేశ్వరరావు స్థాపించిన యువకళావాహిని సంస్థ కు సారిపల్లి కొండలరావు అండగా నిలిచి నడిపిస్తున్నారు! మహోన్నత కళా సహృదయులుగా, సౌమ్యశీలీ గా గణతికెక్కారు! ఏప్రిల్ నెలలో వై.కె.నాగేశ్వరావు గారు కనుమూసినా, యువ కళావాహిని సంస్థ ను నిలబెట్టాలని, వై.కె.గారిని సజీవంగా శాశ్వతంగా కళా రంగం లో ఉంచాలనే గొప్ప సంకల్పం తో స్వయంగా తానే పర్యవేక్షిస్తూ కళావాచస్పతి శ్రీ లంక లక్ష్మి నారాయణ నేతృత్వం లో యువకళావాహిని కి సరికొత్త ఊపిరి పోస్తున్నారు! వివిధ కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహిస్తూనే ఉన్నారు!
సాంస్కృతిక బంధువుగా కళా సాంస్కృతిక, సాహిత్య రంగాలకు సారిపల్లి కొండలరావు గారు చేస్తున్న సేవ ఒక ఎత్తు అయితే, అంతకు మించి వేరే రంగాలకు వారు అందిస్తున్న సేవలు మరో ఎత్తు! ఆ రెండో కోణం ఇంకా అద్భుతం! వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషు వచ్చే సంరక్షకులకు ఉచిత భోజన సౌకర్యం ప్రతి రోజు గత కొన్నేళ్లుగా కల్పిస్తూ సేవా తత్పరులు గా మానవ సేవా సమితి వ్యవస్థాపకులుగా మన్ననలు అందుకుంటున్నారు! ఇంకో వైపు బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ద్వారా ఆధ్యాత్మిక సేవలు విరివిగా అందిస్తూ మనుషుల్లో దేవుడిగా ప్రశంసలు అందుకుంటున్నారు!
ఇంత చేస్తున్నా, ఇంకా సేవ చేయాలని ప్రతి నిముషం తపిస్తుంటారు! తన సంపద పేదలకు కళాకారులకు సరిగ్గా సద్వినియోగం కావాలని ప్రయత్నిస్తూనే వుంటారు! కళా సంక్షేమం కోసం, ఆధ్యాత్మికత్వం వికసింపచేసేందుకు, మంచిని పెంచేందుకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూనే ఉంటారు!
సారిపల్లి కొండలరావు గారు ఒక నడిచే ఎన్ సైక్లోపీడియా! వారితో కాసేపు మాట్లాడితే ఎన్నో జీవన సత్యాలు తెలుస్తాయి! వారి జీవిత అనుభవాలు యువత ఎదిగేందుకు గొప్ప పాఠాలు! అయినా సరే, తాను నిమిత్తమాత్రుడ్ని అని, సేవ చేసే భాగ్యం భగవంతుడు కల్పించిన కృపా కటాక్షం అని ఎంతో సింపుల్ గా వినమ్రంగా చెప్పడం వారి గొప్ప మనసుకు నిదర్శనం! సారిపల్లి కొండలరావు గారు ఎందరో మహానుభావులకు అశీతి మహోత్సవం దగ్గరుండి నిర్వహించారు! మరెందరో ప్రతిభగల సినీ, రంగస్థల కళాకారులను, గాయకులను జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలతో సన్మానించారు.
ఇవాళ సారిపల్లి కొండలరావు గారి అశీతి మహోత్సవం! వారికి కళ పత్రిక ప్రత్యేక ఆత్మీయ హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు, అశీతి మహోత్సవ అభినందనలు తెలియచేస్తోంది! నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తోంది! కళా రంగానికి కొండంత అండగా ఉండాలని కోరుకుంటోంది!