(చిత్రం : భగవంత్ కేసరి, విడుదల : 19, అక్టోబర్ 2023, రేటింగ్ : 3.25/5, నటీనటులు : నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రామ్ పాల్ తదితరులు. దర్శకత్వం : అనిల్ రావిపూడి, సంగీత: తమన్, సినిమాటోగ్రఫీ : రామ్ ప్రసాద్)
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటీవల వరుస విజయాలతో సూపర్ డూపర్ ఫామ్‌తో దూసుకెళుతున్నారు స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అదే ఊపులో తాజాగా ఆయన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘భగవంత్ కేసరి’. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలకృష్ణకు తన కెరీర్ లో 108వ చిత్రమిది. ఇందులో బాలయ్య సరసన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, ఆయన కూతురిగా నవతరం క్రేజీ స్టార్ శ్రీలీల కీలక పాత్ర పోషించింది. యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఫలితంగా అన్ని ప్రాంతాల్లోనూ కలిపి భారీ స్థాయిలోనే బిజినెస్ కూడా జరిగింది. విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేసిన ఈ ‘భగవంత్ కేసరి’ నేడు (19, అక్టోబర్ 2023) ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. మరి.. ఈ సినిమా ప్రేక్షకులను ఈ మేరకు మెప్పించింది? అంచనాలను అందుకుందా? లేదా..? తెలుసుకుందాం..
కథ: అనగనగా ఓ గిరిజన ప్రాంతం నేలకొండపల్లి. ఆ ఊరిలో భగవంత్ కేసరి(బాలకృష్ణ) నివసిస్తూ ఉంటాడు. తన సొంత వాళ్ల కోసం ఎంత దూరం అయినా వెళ్లే వ్యక్తిత్వం ఉన్న వాడు. చాలా మొండివాడు కూడా. తన వాళ్లకు ఏదైనా జరిగితే మాత్రం అస్సలు తట్టుకోలేడు. మరోవైపు తన కూతురు శ్రీలీల(విజ్జి పాప)ను ఆర్మీకి పంపించాలనేది అతడి కల. కానీ.. తన కూతురుకు మాత్రం ఆర్మీలోకి వెళ్లడం అస్సలు ఇష్టం ఉండదు. మరోవైపు తన కూతురు వల్ల కొందరు రౌడీలు, రాజకీయ నాయకులతో భగవంత్ కేసరి గొడవ పెట్టుకుంటాడు. అసలు రాజకీయ నాయకులకు, రౌడీలకు, తన కూతురుకు ఏంటి సంబంధం? చివరకు తన కూతురు ఆర్మీకి వెళ్లిందా? ఆ రౌడీల బారి నుంచి తన కూతురును బాలకృష్ణ ఎలా తప్పించాడు? తన భార్యగా నటించిన కాజల్ అగర్వాల్(కాత్యాయిని) ఎవరు? ఆమెకు, కేసరికి ఎలా పరిచయం ఏర్పడింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
విశ్లేషణ : సాధారణంగా దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రాల్లో కామెడీ ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటుంది. అయితే.. ఈ ‘భగవంత్ కేసరి’లో ఎమోషన్స్, మాస్ అంశాలపై ఆయన ఎక్కువ దృష్టిసారించారు. అమ్మాయిలకు చిన్నతనంలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటివి నేర్పించాలని మెసేజ్ ఇస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. సినిమాలో ఎంటర్ టైన్మెంట్ చాలా సెటిల్ గా వుంది. ట్రీట్మెంట్ కూడా సహజంగా నే అనిపించింది. లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా రియలిస్టిక్ గా ఉన్నాయి. భగవంత్ కేసరి క్యారెక్టర్ లో వేరియేషన్ వున్నాయి. ముందు జైలు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆరంభం నుంచి భగవంత్ కేసరి పాత్ర ఒక పాపతో జర్నీ చేసి, ఆ పాపని లక్ష్యం వైపు ఎలా తీసుకెళ్ళారు? అదే సమయంలో తనకి వున్న పగని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అనేది కథ. సినిమాలో సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. కామెడీ టైమింగ్ తో పాటు కన్నీళ్లు పెట్టించే సెంటిమెంట్ సీన్స్ బాగా పండాయి. బాలయ్య ఎంట్రీ సీన్ తోనే అదరగొట్టాడు. ఇది ఒకరకంగా చెప్పాలంటే త్రిపుల్ ధమాకా అని చెప్పుకోవాలి. ఓవైపు బాలయ్య.. మరోవైపు అనిల్ రావిపూడి.. ఇంకోవైపు శ్రీలీల… ఈ ముగ్గురి కాంబోలో సినిమా అంటే ఆమాత్రం ఉంటుంది కదా. అనిల్ రావిపూడి సినిమాలంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక పటాస్.. ఒక ఎఫ్2, ఒక ఎఫ్3, ఒక సరిలేరు నీకెవ్వరు ఇలా తన సినిమాలన్నీ ఒక ఫన్ రైడ్ లా ఉంటాయి. మూడు గంటలు థియేటర్ లో ప్రేక్షకుడు రిలాక్స్ అయి వచ్చేలా తన సినిమాలు ఉంటాయి. ఇక వాటన్నింటికీ తోపు ఈ సినిమా. ఎందుకంటే.. ఇది పవర్ ఫుల్ హీరో బాలయ్య నటించిన సినిమా కావడంతో ఇక బొమ్మ బ్లాక్ బస్టర్ అవడం కాదు.. థియేటర్లు దద్దరిల్లిపోతాయి. బాలయ్య బాబు వీరత్వాన్ని, మార్క్ డైరెక్షన్ ను ఈ సినిమాలో అనిల్ మరోసారి చూపించారు. మొత్తానికి ఒక మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అందులోనూ దసరా బరిలోకి ఈ సినిమా వచ్చిందంటే ఈసారి దసరాకి థియేటర్ల వద్ద జాతరే ఇక. బాలయ్య డైలాగ్స్ అయితే అదుర్స్ అని చెప్పుకోవచ్చు. థియేటర్లలో బాంబుల్లా పేలాయి. నిజానికి బాలయ్య అంటేనే ఎలివేషన్స్ కు మారుపేరు. డైలాగ్స్ కు మారుపేరు. ఈ సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్స్ ను బాలయ్యతో దర్శకుడు అనిల్ చెప్పించాడు. అది కూడా తెలంగాణ యాసలో. ఆ యాసలో బాలయ్య తొలిసారి ఇరగదీశాడు.
ఎవరెలా చేశారంటే… బాలకృష్ణ నటించిన నేలకొండ భగవంత్ కేసరి క్యారెక్టర్ హై ఎనర్జీతో సాగింది. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తన నటనతో అదరగొట్టారు. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు.. అఖండ లాంటి గుర్తుండిపోయే పాత్రలు చేసిన బాలయ్యకు అదే కోవలో ‘భగవంత్ కేసరి’ కూడా గుర్తుండిపోతుంది. ప్రయోగాత్మక చిత్రాలు చేయాలన్నా, సవాల్ తో కూడుకున్న పాత్రలో నటించాలన్నా ముందుంటారు బాలకృష్ణ. భైరవద్వీపంలో కురూపి పాత్ర ఉహించుకోవడానికే కష్టం. అలాంటి పాత్రలని కూడా చేసి మెప్పించగల నటుడు ఆయన. అలాంటి నటుడికి వచ్చిన మరో గొప్ప పాత్ర ఈ భగవంత్ కేసరి. బాలకృష్ణ.. ది లార్జర్ దేన్ లైఫ్ మాస్ ఇమేజ్. ఆయన సినిమా అంటే భారీ ఫైట్స్ ఉండాలని అభిమానులు, మెజారిటీ ప్రేక్షకులు కోరుకోవడం కామన్! ప్రజలు ఆశించే అంశాలతో పాటు కంటెంట్ బేస్డ్ సినిమాను ఈసారి అందించారనిపిస్తుంది. . ముఖ్యంగా కంఫర్ట్ జోన్ నుంచి బాలకృష్ణ బయటకు వచ్చారు. ఆయన వయసుకు తగ్గ క్యారెక్టర్ చేశారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో బాలకృష్ణ బావున్నారు. ఇంటర్వెల్ ఫైట్ నందమూరి అభిమానులకు, ప్రేక్షకులకు మంచి హైప్ ఇచ్చింది. ఇప్పటి వరకు బాలయ్య నటించిన సినిమాలన్నీ ఒక ఎత్తు. ఈ సినిమా మరో ఎత్తు. ఇందులో బాలయ్యను సరికొత్తగా చూపించాడు అనిల్ రావిపూడి. అలాగే.. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి తీసిన సినిమాలు ఒక ఎత్తు.. ఈ సినిమా మరో ఎత్తు. కామెడీ మాత్రమే కాదు.. ఎమోషనల్, డ్రామా, యాక్షన్, లవ్, ఇలా అన్నీ కలిపి మిక్స్ చేసి మరీ ఈ సినిమాను తెరకెక్కించాడు. అసలు బాలయ్యను ఎలా తన అభిమానులు వెండి తెర మీద చూడాలని అనుకున్నారో డిటో దించేశాడు దర్శకుడు. ఇదంతా ఒక ఎత్తు అయితే బాలయ్య నటన మరో ఎత్తు. అసలు తన విశ్వరూపం చూపించాడు. ఈ వయసులో బాలయ్య ఉత్సాహం, ఆ ఎనర్జీ మామూలుగా ఉండదు. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద నడిపించాడు.
బాలకృష్ణకు జోడీగా తొలిసారి నటించిన తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ పాత్ర సినిమాలో పరిమితమే. అయినప్పటికీ బాలయ్య భార్యగా కాజల్ అదరగొట్టేసింది. ఇక… తన కూతురుగా నటించిన శ్రీలీల కూడా అంతే. ఇరగదీసేసింది. తన పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. మంచి పాత్రలో చాలా సహజంగా నటించింది. తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని, వాళ్ల వాత్సల్యాన్ని దర్శకుడు చక్కగా చూపించాడు. ‘పెళ్లి సందడి’, ‘ధమాకా’ సినిమాలతో యువతలో క్రేజీ కథానాయికగా మారిన శ్రీ లీలను దర్శకుడు అనిల్ రావిపూడి కొత్తగా చూపించారు. బాలకృష్ణ, శ్రీలీల ఎక్స్ ట్రార్డినరీ పెర్ ఫార్మ్ చేశారు. వారి పాత్రలు చాలా రోజులు గుర్తుపెట్టుకునేలా వుంటాయి. శ్రీలీలకు ఈ పాత్ర ఆమె కెరీర్ లో నిలిచిపోతుంది. బాలకృష్ణ, శ్రీలీల ఎమోషన్స్ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయి. శ్రీలీల కూడా బాలయ్యకు పోటీగా నటించిందని చెప్పొచ్చు. ఆదిత్య 369, భైరవద్వీపం లాంటి ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసి ఘన విజయాలు సాధించిన బాలకృష్ణ.. ఒక స్టార్ హీరోగా వుండి శ్రీలీల లాంటి అప్ కమింగ్, ఫుల్ ఫాం లో వున్న హీరోయిన్ కు ఫాదర్ గా చేయడానికి ఒప్పుకోవడం.. ఆయన గట్స్ కు నిజంగా హ్యాట్సాఫ్! తెలంగాణ యాసలో బాలయ్య చెప్పే డైలాగ్స్ సూపర్‌గా ఉన్నాయి. ఇందులో విలన్ అర్జున్ రామ్ పాల్ ది చాలా పెద్ద రోల్. అతడి క్యారెక్టర్ రొటీన్‌గా ఉన్నప్పటికీ అందరికీ నచ్చుతుంది. బాలకృష్ణకి ఎదురుగా నిలబడే పాత్ర. ఆ పాత్రలో ఆయన చక్కటి నటన కనబరిచి మంచి మార్కుల్ని కొట్టేశాడు.
టెక్నీకల్ విషయాలకొస్తే… సినిమాటోగ్రఫీ వండర్ గా ఉంది. ప్రతీ సన్నివేశాన్ని రామ్ ప్రసాద్ తన కెమెరాలో అంతే అందంగా బంధించాడు. తమన్ మాస్ నేపథ్య సంగీతం బావుంది. ఆయన తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదే స్థాయిలో ఉంది. స్క్రీన్ ప్లేతో పాటు.. అనిల్ రావిపూడి డైరెక్షన్ అంద్భుతంగా ఉంది. మొత్తం మీద ‘భగవంత్ కేసరి’ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడుకున్న బ్యూటీఫుల్ ఎమోషనల్ డ్రామా. ఈ సినిమా అందరినీ అలరిస్తుంది. ఇది రెగ్యులర్‌గా, టిపికల్‌గా వచ్చే బాలకృస్ణ సినిమా కాదు. బాలయ్య ఎంట్రీ, కామెడీ ట్రాక్‌తో సినిమా బావుంటుంది. బాలయ్య ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ లాంటి సినిమా ఇది. అసలైన దసరా జాతర ‘భగవంత్ కేసరి’ రూపంలో వారికి ఇప్పుడే మొదలైందని చెప్పొచ్చు. దసరాకు ప్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాలంటే.. భగవంత్ కేసరికి తీసుకెళ్ళండి.. పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ ఎంటర్టైనర్ మూవీ. బాలయ్య తీన్ మార్ కొట్టాడంటూ ఫ్యాన్స్ అప్పుడే పండగ చేసుకుంటున్నారు. మొన్న బోయపాటి.. నిన్న మలినేని గోపీచంద్, ఈరోజు అనిల్ రావిపూడి ముగ్గురూ హ్యాట్రిక్ హిట్ ఇచ్చారంటూ పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అదీ సంగతీ….!