(చిత్రం : విమానం, విడుదల : 9 జూన్, 2023, రేటింగ్ 3/5, నటీనటులు : సముద్రఖని, అనసూయ భరద్వాజ్, మాస్టర్ ధ్రువన్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్, రాజేంద్రన్ తదితరులు. మాటలు : హను రావూరి (తెలుగు), ప్రభాకర్ (తమిళం), ఛాయాగ్రహణం : వివేక్ కాలేపు, పాటలు, సంగీతం : చరణ్ అర్జున్, నిర్మాణం : జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్), పాటలు : స్నేహన్(తమిళ్), చరణ్ అర్జున్ (తెలుగు), ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: జె.జె.మూర్తి), దర్శకత్వం : శివ ప్రసాద్ యానాల)
నచ్చే, మెచ్చే కంటెంట్‌ను అందిస్తే తెలుగు సినీ ప్రేక్షకులు .సినిమాను ఎంతగానో ఆదరించి.అక్కున చేర్చుకుంటారన్నది మనం చూస్తూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో మన ప్రేక్షకులు సినిమాలో ఏమాత్రం విషయం వున్నా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి ప్రోత్సహిస్తూనే ఉన్నారు. అయితే.. ఇప్పుడు టాలీవుడ్ లో వస్తోన్న అలాంటి మంచి చిత్రాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్) నిర్మించిన చిత్రం ‘విమానం’. ఈ సినిమా విడుదలకు ముందు వచ్చిన ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్, రేలా రేలా అనే లిరికల సాంగ్‌తో పాటు సుమతి పాత్ర ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్, వైవిధ్యమైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. సముద్రఖని వికలాంగునిగా, ఆయన కుమారుడిగా మాస్టర్ ధ్రువన్ నటించిన ఈ సినిమాలో అనసూయ వేశ్య పాత్రని పోషించారు. కొంత విరామం తర్వాత మీరా జాస్మిన్ ఈ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాహుల్ రామకృష్ణ, మొట్ట రాజేంద్రన్ ఇతర పాత్రల్లో నటించిన ఈ ‘విమానం’ 9 జూన్, 2023న ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? లేదా? తెలుసుకుందాం..
కథ: వీరయ్య (సముద్రఖని) వికలాంగుడు. కుమారుడు రాజు (‘మాస్టర్’ ధ్రువన్)కు జన్మనిచ్చిన తర్వాత భార్య మరణిస్తుంది. వారసత్వంగా వచ్చిన సులభ్ కాంప్లెక్స్ అతని జీవనాధారం. అబ్బాయే అతని జీవితం. రాజుకు విమానం ఎక్కాలని కోరిక. ఫ్లైట్ అంటే పిచ్చి. ఎప్పుడూ విమానం గోలే. అబ్బాయికి లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) ఉందని తెలియడంతో ఎలాగైనా విమానం ఎక్కించాలని వీరయ్య నిర్ణయించుకుంటాడు. వీరయ్య అంగ వైక్యలంతో ఇబ్బంది పడుతున్నా.. కొడుకుని మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటుంటాడు. వీరయ్య కొడుక్కి మాత్రం ‘విమానం’ అంటే పిచ్చి. విమానం ఎక్కాలని ఆలోచనలతో ఎప్పుడూ తన చుట్టూ ఉన్నవారిని ప్రశ్నిస్తూనే ఉంటారు. తండ్రిని కూడా విమానం ఎక్కించమని బతిమాలాడుకుంటూ ఉంటాడు. అతనికి విమానం ఎక్కాలని ఎంతో ఆశ.. కానీ ఎలా? ఎప్పుడు విమానాన్ని చూసినా అలా ఆనందం, ఆశ్చర్యంతో చూస్తూనే ఉండిపోతాడు. తన కోరికను తండ్రికి చెబితే బాగా చదువుకుంటే విమానం ఎక్కవచ్చునని చెబుతాడు. అంగ వైకల్యంతో బాధపడే తండ్రి వీరయ్య ఎలాంటి కష్టం తెలియకుండా తల్లి లేని కొడుకుని పెంచుకుంటుంటాడు. మరి ఆ పిల్లాడి కోరిక తీరిందా? తండ్రి చెప్పినట్లే ఆ పిల్లాడు విమానం ఎక్కాడా? తండ్రీ కొడుకుల మధ్య అసలు ఈ విమానం గోల ఏంటి? ఆ తర్వాత ఏమైంది? జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వీరయ్య జీవితంలో బస్తీలో వేశ్య సుమతి (అనసూయ), చెప్పులు కుట్టే కోటి (రాహుల్ రామకృష్ణ), ఆటో డ్రైవర్ డేనియల్ (ధనరాజ్) పాత్రలు ఏమిటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ : మనకు జీవితంలో కనిపించే వివిధ పాత్రలకు సంబంధించిన ఎమోషనల్ జర్నీఈ ’విమానం’. జీవితంలో ఏదో సాధించాలని మనకు చెప్పే పాత్రలను వెండితెరపై చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ఇష్టపడతారు. అలాంటి పాత్రలతో రూపొందిన చిత్రమిది. వైవిధ్యమైన పరిస్థితులు, వాటికి సరిపోయేటువంటి సున్నితమైన పాత్రలను ఈ చిత్రంలో మనం చూడొచ్చు. ప్రతీ ఒక్కరి జీవితాల్లో బలమైన భావోద్వేగాలుంటాయి. అలాంటి ఎమోషన్స్‌ను బేస్ చేసుకునే ‘విమానం’ తెరకెక్కింది. బస్తీలో ఉండే తండ్రీ కొడుకులు.. పూట గడిస్తే చాలనుకునే చాలీ చాలని సంపాదన.. అలాంటి ఓ పేద కుటుంబంలోని ఉండే పిల్లాడుకి విమానం ఎక్కాలనే కోరిక పుడుతుంది. తండ్రి అవిటితనంతో బాధపడుతున్నప్పటికీ కొడుకు కోరికను తీర్చాలనుకుని రాత్రి పగలు కష్టపడుతుంటాడు. విమానం ఎక్కాలనుకునే కొడుకు కోరికను తీర్చటానికి ఏం చేయాలా? అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. ఇది తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్. సుమతీ అనే అమ్మాయిని ప్రేమించే కోటి.. లోకమంతా తనను కామంతోనే చూస్తుందని భావించే ఆమెకు తనను మనస్ఫూర్తిగా ప్రేమించే వాడున్నాడని తెలియగానే ఆమె హృదయంలో నుంచి వచ్చే ఆవేదన.. ఇది రెండు హృదయాల మధ్య ఉండే ఎమోషన్.. హృదయాన్ని తాకే ఈ ఇలాంటి భావోద్వేగాల వ్యక్తుల ప్రయాణాన్ని తెలియజేసే చిత్రమే ‘విమానం’. మాస్టర్ ధ్రువన్ కొడుకుగా నటిస్తే, తండ్రి పాత్రలో విలక్షణ నటుడు సముద్ర ఖని నటించారు. వీరి మధ్య సాగే విమానం సంభాషణ ఆసక్తికరంగా, ఫన్నీగా ఉంది. అలాగే సినిమాలో బలమైన ఎమోషనల్ అంశాలు కూడా మిళితమై ఉన్నాయి. ‘నాన్నా ఎప్పుడు దేవుడు కనపడినా దండం పెట్టుకోమంటావు ఎందుకు’ అని అడిగిన కొడుకుతో ‘మనం అడిగినవన్నీ ఇస్తాడు’ కాబట్టి అని తండ్రి చెబుతాడు. దానికి ఆ పిల్లాడు ‘అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు.. నాన్నా అంటారు’ అనే ఓ డైలాగ్ చాలు.. తండ్రీ కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగ బంధాన్ని సినిమాలో ఎలా చూపించారో చెప్పటానికి. ఈ సినిమాలో మంచి కథ, అంతకు మించి కంటతడి పెట్టించే భావోద్వేగభరిత సన్నివేశాలు ఉన్నాయి.. సినిమాలో క్యారెక్టర్లు తక్కువ ఉన్నాయి. పరిమిత పాత్రలతో కథ ముందుకు నడిచేటప్పుడు సీన్లు ఎంత క్రిస్పీగా ఉంటే… స్క్రీన్ ప్లే ఎంత ఫాస్ట్‌గా ఉంటే… ప్రేక్షకుడు అంతలా కనెక్ట్ అవుతాడు. కథలో లీనం అవుతాడు. లీనమయ్యేలా చక్కని కథనంతో సినిమాను నడిపించడంలో దర్శకుడు శివ ప్రసాద్ యానాల ప్రతిభను కనబరిచారు. ‘విమానం’ ప్రారంభంలో తండ్రీ కొడుకుల మధ్య, వాళ్ళతో ఆ బస్తీ ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరించడంలో దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నారు. అనసూయ, రాహుల్ రామకృష్ణ మధ్య సన్నివేశాలు బావున్నాయి. అయితే, కథలో భాగంగా ముందుకు తీసుకువెళితే మరింత బావుండేది. స్కూల్ లో సన్నివేశాలు చిన్నారుల అమాయకత్వాన్ని చూపెడుతూ నవ్విస్తాయి. ఇంటర్వెల్ దగ్గర క్లైమాక్స్ ఎలా ఉంటుందనే ఐడియా ప్రేక్షకులకు వస్తుంది. ప్రేక్షకులు ఎవరూ ఊహించని మరో ట్విస్ట్ క్లైమాక్స్‌లో ఇచ్చారు. మధ్యలో ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. తండ్రీ కుమారుల జర్నీ హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. విమానం’ టేకాఫ్ కావడానికి కొంత టైమ్ తీసుకుంది. ఇంటర్వెల్ వరకు రన్ వే మీద ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. మధ్యలో కొన్ని సీన్లు అలరించినా ఎంత సేపటికీ కథ ముందుకు కదలదు. ఇంటర్వెల్ తర్వాత జర్నీ గాడిలో పడింది. విమానం పర్ఫెక్ట్‌గా ల్యాండింగ్ అవుతుంది. ఈ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం కనిపిస్తుంది. రాజు అనే అనే అబ్బాయి తన తండ్రితో మాట్లాడుతూ.. ఓసారైనా తనని విమానం ఎక్కించమని అడుగుతుంటాడు. విమానం ఎక్కటానికి ఎందుకంత ఇష్టం నీకు అని అడిగితే పై నుంచి చూస్తే అన్నీ చిన్నగా కనిపిస్తాయని అంటాడు. అయితే బాగా చదువుకుంటే పెద్దయ్యాక నువ్వే విమానం ఎక్కొచ్చని తండ్రి అంటాడు. ఇందులో సున్నితంగా, చక్కగా తండ్రీ కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగాలను చక్కగా ఎలివేట్ చేశారు రైటర్, డైరెక్టర్ శివ ప్రసాద్ యానాల.
ఎవరెలా చేశారంటే : విమానం సినిమాలో వెర్సటైల్ యాక్టర్ సముద్ర ఖని అంగ వైకల్యంతో బాధపడే మధ్య వయస్కుడిగా, భార్య లేకపోయినా పిల్లాడిని జాగ్రత్తగా చూసుకునే వీరయ్య అనే తండ్రి పాత్రలో ఎంతో చక్కగా నటించారు. తండ్రి పాత్రకు సముద్రఖని న్యాయం చేశారు. కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ ఆకట్టుకుంటాడు. అతడి నటనలో అమాయకత్వం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య భావోద్వేగభరిత సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. థియేటర్లలో ప్రేక్షకులు సైతం ఎమోషనల్ అవుతారు. సినీ రంగంలోకి ఎందరో నటీనటులు తమదైన గుర్తింపు సంపాదించుకున్నారు. అందుకు కారణం వాళ్లు ఎంపిక చేసుకునే విలక్షణమైన పాత్రలే. అలాంటి వెర్సటాలిటీ లేకపోతే ఆడియెన్స్‌కు కనెక్ట్ కారు. అలాంటి డిఫరెంట్ రోల్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి అనసూయ భరద్వాజ్. ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా అయినా, ‘పుష్ప 2’లో దాక్షాయణిగా అయినా మెప్పించటం ఆమెకే చెల్లింది. ఇప్పుడలాంటి మరో విభిన్నమైన పాత్ర ఈ సినిమాలోని సుమతి క్యారెక్టర్. ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రలన్నింటితో పోల్చితే ఈ చిత్రంలో ఆమె చేసిన సుమతి పాత్ర చాలా వెరైటీ అని చెప్పొచ్చు. ఓ వైపు బోల్డ్‌గా ఉంటూనే ఎమోషనల్ టచ్‌తో ఉండే పాత్ర ఆమెది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు (ముఖ్యంగా మాస్ సెంటర్స్) గుర్తు చేసుకునే పాత్ర ఆమెది. జీవితంలో ఒక్కొక్కరికీ ఒక్కో కథ ఉంటుంది. ప్రతీ కథలోనూ హృదయాలను కదిలించే భావోద్వేగం ఉంటుంది. అలాంటి సుమతి అనే ఓ ఎమోషనల్ అండ్ బోల్డ్ క్యారెక్టర్‌లో మెప్పించింది అనసూయ. వేశ్య పాత్రలో ఆమె అవసరమైన శృంగార రసాన్ని పలికించారు. క్లైమాక్స్ ముందు ఎమోషనల్ సీన్ అంత కంటే బాగా చేశారు. రాజేంద్రన్ పాత్రలో రాజేంద్రన్, డేనియల్ పాత్రలో ధన్‌రాజ్, కోటి పాత్రలో రాహుల్ రామకృష్ణ కనిపించి ఆయా పాత్రల్లో ఈజీగా నటించారు. అతిథి పాత్రలో మీరా జాస్మిన్ నటించడం వల్ల ఎయిర్ హోస్టెస్ క్యారెక్టర్ కు హుందాతనం వచ్చింది.
సాంకేతిక వర్గం: స్టార్ యాంకర్‌గా బుల్లి తెర ప్రేక్షకులను మెప్పించిన అనసూయ భరద్వాజ్ సిల్వర్ స్క్రీన్‌పై కూడా విలక్షణమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ చిత్రంలోని సుమతి అనే బోల్డ్ పాత్ర. ఇప్పటి వరకు అనసూయ చేసిన సినిమాల్లో చేయనటువంటి పాత్ర. అలాంటి ఆమెను ఓ యువకుడు ప్రేమించి తన ప్రేమను చెప్పలేక అవస్థలు పడుతుంటే ఎలా ఉంటుందనే విషయాన్ని ‘సుమతి’ అనే పాట ద్వారా తెలియజేశారు మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్. ఆయన సంగీతం అందిచటమే కాకుండా ఈ పాటకు లిరిక్స్ రాసి ఆయనే పాడటం విశేషం. ‘‘సుమతీ.. సుమతి/ నీ నడుములోని మడత/ చూస్తే ప్రాణమొణిక వనితా/ నువ్వు పూసే రంగులన్నీ/చూస్తే నేను పొంగిపొర్లుతా..’’ అని అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణలపై సాగే పాట యూత్‌కి బాగా కనెక్ట్ అయింది. పాట వింటే తప్పకుండా అందరూ హమ్ చేసుకుంటారనటంలో సందేహం లేదు. చిత్ర సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ పాటను రాయటం విశేషం. చరణ్ అర్జున్ స్వరాలు, సాహిత్యం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ప్రముఖ సింగర్ మంగ్లీ తనదైన పంథాంలో అద్భుతంగా పాటను ఆలపించారు. అలాగే ఇందులో తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్ని తెలియజేసేలా ‘రేలా రేలా..’ అనే లిరికల్, ‘సిన్నోడా ఓ సిన్నోడా’ అనే పాటలు సైతం అలరిస్తాయి…అందర్నీ ఆకట్టుకుంటాయి. మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బావుంది. హను రావూరి డైలాగ్స్ హృదయాన్ని తాకాయి. వివేక్ కాలేపు సినిమాటోగ్రఫీ పనితనం మెచ్చుకోవలసిందే. ప్రతీ సన్నివేశాన్ని ఎంతో భావోద్వేగభరితంగా తన కెమెరాలో బంధించింది. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ ఒకే. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్) నిర్మించిన ‘విమానం’ చిత్రం నిర్మాణ విలువలు బేషుగ్గా ఉన్నాయి.
చివరగా చెప్పేదేమిటంటే.. ఇప్పటిదాకా ఫాదర్స్ డే శుభాకాంక్షలు విని ఉంటారు.. విమానం సినిమా చూస్తుంటే అసలు ఫాథర్స్ డే ని ఫీల్ అవుతారు…ప్రతి తండ్రి , పిల్లలని ప్రేమించడం కాదు , వాళ్ళ కోరికలని కూడా గొప్పగా ప్రేమిస్తారు అని చెప్పే సినిమా విమానం. ఈ చిత్రంలో సముద్రఖనిని చూస్తున్నంత సేపు , మీ నాన్న గుర్తుకు వస్తారు.. సినిమా నుండి బైటకి రాగానే కచ్చితం గా మీ నాన్న కి ఫోన్ చేసి thank you చెబుతారు.. విమానం చూసి థియేటర్ లో నుండి బైటకి వస్తారు కానీ, మీ నాన్న జ్ఞాపకాల నుండి మాత్రం బైటకి రాలేరు…సృష్టి లో అమ్మ గొప్పది..కానీ ఆ అమ్మ కూడా వాళ్ళ నాన్నని హీరోలానే చూస్తుంది… అది నాన్న గొప్పతనం.. అమ్మ కన్నీళ్లు అందరకి తెలుస్తాయి.. కానీ నాన్న కన్నీళ్లు కర్చీఫ్ కే తెలుస్తాయి.. ఆ విషయం విమానం చూసాక మీకే తెలుస్తుంది…మీకు ఏదైనా విషయం లో నాన్న మీద కోపం ఉంటే అది తగ్గిపోతుంది ,ప్రేమ ఒక్కటే ఉండి పోతుంది , కష్టం వస్తే అమ్మ ఓదారుస్తుంది, నాన్న ఐతే అసలు ఆ కష్టమే రాకుండా చూస్తాడు…త్యాగం అనే పదం నాన్న నుండి పుట్టిందేమో అనిపిస్తుంది విమానం చూసాకా. చిన్నప్పుడు పిల్లల్లో ఓ మంచి ఎమోషన్‌ను నింపితే వాళ్లు పెద్దయి ఏదైనా సాధించగలరు అని చెప్పటానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. తల్లిదండ్రులు ‘విమానం’ సినిమాను చూడటమే కాకుండా.. వాళ్ల పిల్లలకు కూడా ఈ సినిమాను చూపించాలి. అప్పుడే ఇందులో పిల్లల కోసం తల్లిదండ్రులు పడే తపన ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. అలాగే సినిమాలో మిగిలిన క్యారెక్టర్స్ ఎంతో అద్భుతంగా పండాయి. మొత్తం మీద భావోద్వేగాల వ్యక్తుల ప్రయాణాన్ని తెలియజేసే చిత్రంగా ‘విమానం’ ప్రేక్షకుల హృదయాల్ని తాకుతుంది. ప్రతీ ఒక్కరూ చూడాల్సిన సినిమా ‘విమానం’.
-ఎం.డి. అబ్దుల్
.