(చిత్రం : దాస్ కా ధమ్కీ , విడుదల తేదీ : మార్చి 22, 2023, TOLLYWOOD TIMES.IN రేటింగ్ : 2/5, నటీనటులు: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, రోహిణి మొల్లేటి, తరుణ్ భాస్కర్, హైపర్ ఆది, అజయ్, అక్షర గౌడ, శౌర్య కరే, జబర్దస్త్ మహేష్, పృథ్వీరాజ్ తదితరులు. కథ : ప్రసన్నకుమార్ బెజవాడ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : విశ్వక్ సేన్, నిర్మాత: కరాటే రాజు, సంగీతం : లియోన్ జేమ్స్, సినిమాటోగ్రఫీ: దినేష్ కె బాబు, ఎడిటర్: అన్వర్ అలీ)
తెలుగు చిత్రసీమలో గతంలో వచ్చిన ‘ఫలక్ నుమా దాస్’ చిత్రానికి దర్శకత్వం వహించిన యువ కథానాయకుడు విశ్వక్ సేన్ చాలా కాలం తర్వాత మళ్లీ ‘దాస్ కా ధమ్కీ’ అంటూ మరో చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నివేదా పెతురాజ్ హీరోయిన్ గా నటించిన ‘దాస్ కా ధమ్కీ’ ఈ శుక్రవారం ( మార్చి 22, 2023) విడుదలయింది. విశ్వక్ సేన్ హీరోగా నటించడంతో పాటు మరోసారి దర్శకత్వం కూడా వహించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. ‘పాగల్’ చిత్రం తర్వాత విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ ఈ సినిమాలో మరోసారి జోడీ కట్టారు. చిత్రం విడుదలకు ముందు జోరుగానే ప్రమోషన్స్ సాగాయి. ఎప్పటికప్పుడు సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మరి.. ఈ సినిమా ఎలా ఉంది? క్లాస్ అండ్ మాస్ ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో తెలుసుకోవాలంటే… రివ్యూలోకి వెళదాం…
కథ: స్టార్ హోటల్‌లో వెయిటర్ గా పనిచేస్తున్న కృష్ణదాస్ (విశ్వక్ సేన్) ఓ అనాథ. ఓ లగ్జరీ హోటల్లో వెయిటర్ గా పని చేస్తూ ఉంటాడు కానీ.. తనకి మాత్రం లైఫ్ లో పెద్ద స్థాయిలో సెట్ అవ్వాలన్నది కల. అలాంటి డ్రీమ్స్ తోనే కాలం గడుపుతుంటాడు. ఓ రోజు అతడు పనిచేస్తున్న హోటల్ కు వచ్చిన కీర్తీ (నివేదా పేతురాజ్)తో పరిచయం పెంచుకుంటాడు. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీస్తుంది. ఆమెతో తను వెయిటర్ అనే విషయాన్ని దాచిపెడతాడు. అలా కీర్తీతో అబద్ధాలు ఆడతాడు. అంతేకాదు..తానొక పెద్ద ఫార్మా కంపెనీకి సీఈవోని అని కూడా బిల్డప్ ఇస్తాడు. ఎన్ని అబద్ధాలు ఆడినా.. ఓ రోజు మాత్రం కృష్ణదాస్ వెయిటర్ అనే నిజం ఆమెకి తెలిసిపోతుంది. ఈ పరిస్థితుల్లో అతడు చేస్తున్న ప్రవర్తన, పనులవల్ల వెయిటర్ అనే ఉద్యోగం కూడా పోతుంది. ఇంకేం ఉంది..రెంట్ కట్టలేదనిఇంటి యజమాని అతడి సామాన్లు విసిరిపారేస్తాడు. అలా అతడు పూర్తిగా రోడ్డున పడుతున్న సమయంలో సిద్ధార్థ్ మల్హోత్రా (రావు రమేష్) ఎదురవుతాడు. తన అన్నయ్య కుమారుడు సంజయ్ రుద్ర (విశ్వక్ సేన్) క్యాన్సర్ చికిత్సకు ఓ డ్రగ్ కనిపెట్టాడని, రీసెర్చ్ మధ్యలో మరణించాడని చెబుతాడు. విధిలేని పరిస్థితుల్లో అతడిలా నటించమని కృష్ణదాస్ ని కోరతాడు. ఈ నేపథ్యంలో అలా సంజయ్ రుద్ర ఇంటికి వెళ్లిన కృష్ణదాస్ షాక్ అవుతాడు. కారణం..ఆ సంజయ్ రుద్ర ఎవరో కాదు.. ఫార్మా కంపెనీ సీఈవో. మరి అతడి స్థానంలోకి కృష్ణదాస్ వెళ్లిన తర్వాత అసలు ఏమైంది? కృష్ణదాస్ కు..సంజయ్ రుద్ర అనే ఈ ఇద్దరికీ ఏమైనా ఒకరికి ఒకరు లింక్ ఉంటుందా? కథ ఎన్ని మలుపులు తిరిగింది? కృష్ణదాస్ తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా? ఇంతకీ కీర్తీ (నివేదా పెతురాజ్)కి ఏమైంది? ఇలా అనేక ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే ఈ ‘దాస్ కా ధమ్కీ’ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ : ఈ చిత్రంలో అక్కడక్కడా ఆకట్టుకునే వినోదం ఉన్నప్పటికీ.. కథ పరంగా అయితే ఈ ‘దాస్ కా ధమ్కీ’ మెప్పించదు. మనం గతంలో చూసిన డ్యూయల్ రోల్ రొటీన్ లా అనిపిస్తుంది. కొత్తదనం ఏమీ కనిపించక పోగా, ప్రేక్షకుడికి బోర్ కొట్టేలా చేస్తుంది. ప్రథమార్ధంలో ఎదో వెలితి అనిపించి.. సినిమా ద్వితీయార్ధంపై ఆసక్తి పెంచుతుంది. కానీ దర్శకుడు విశ్వక్ సేన్ తన హీరో పాత్రపైనే దృష్టి పెట్టాడు కానీ..కథనం నడిపించడంలో దర్శకత్వం పరంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేయలేకపోయాడు. ద్వితీయార్ధం బాగా ఉండొచ్చేమో.. సన్నివేశాల్లో ఏమైనా హుషారు కనిపిస్తుందేమో..? అన్న ఆశ కలిగిన మాస్ ప్రేక్షకులు సైతం ఈ మూస పద్దతికి బెంబేలెత్తిపోతారు. ట్విస్ట్ లంటారా.. ఉన్నాయి కానీ అవి అంతంతమాత్రమే. ఆ ట్విస్ట్ లే ప్రేక్షకులకి విసుగు తెప్పిస్తాయి కూడా! ఎంతో కీలకమైన సెకండాఫ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి.. అలా.. అలా.. కానిచ్చేశారు. దర్శకుడు విశ్వక్ సేన్ దర్శకత్వలోపం మాత్రం స్పష్టంగా కనిపించింది. గతంలో చేసిన సినిమాకు ఈ ‘దాస్ కా ధమ్కీ’కి ఆ తేడా ప్రత్యేకంగా అగుపిస్తుంది. ఈ సినిమాకి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే రేంజ్ లో తన పనితనం లేదనే చెప్పాలి. సెకండాఫ్ లో ఇంకా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఉంటే బాగుండుననిపించింది. కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు పైగా చాలా ఇంప్రెస్ చెయ్యని ట్విస్ట్ లు సినిమా చూసే ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తాయి. ఈ చిత్రంలోని కొన్ని సీన్లు, ఫైట్లు ఇంతకు ముందు వచ్చిన మన తెలుగు సినిమాలను అక్కడక్కడా గుర్తు చేస్తాయి. అందువల్ల, సినిమా కొత్త ఫీల్ ఏమీ ఇవ్వదు. సినిమా కథ కొత్తగా లేకున్నా.. కొన్ని సినిమాలు తర్వాత ఏం జరుగుతుంది? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలిగిస్తాయి. ఈ ‘దాస్ కా ధమ్కీ’లో అటువంటి క్యూరియాసిటీ కలిగించే మూమెంట్స్ ఏమీ కనిపించవు.
ఎవరెలా చేశారంటే… ఈ ‘దాస్ కా ధమ్కీ’లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రెండు షేడ్స్ లో ఇరగదీశాడని చూపొచ్చు. చక్కటి పెర్ఫామెన్స్ తో ప్రేక్షకుల్ని బాగా ఇంప్రెస్ చేస్తాడు. ఇది వరకు కూడా ఇలాంటి యూత్ ఫుల్ అగ్రెసివ్ రోల్స్ లో కనిపించిన అతడు ఓ చైర్మన్ పాత్రలో అయితే వాహ్.. అనిపించేలా ఆద్యంతం సెటిల్డ్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు. రెండు షేడ్స్ లో కూడా మంచి వేరియేషన్స్ ని, ఎమోషన్స్ ని పండించాడు. విశ్వక్ సేన్ రెండు పాత్రల మధ్య వేరియేషన్ చూపించాడు. నెగిటివ్ షెడ్స్ పాత్రలో ఇంకా బాగా చేశాడనిపించింది.
కథానాయిక నివేదా పేతురాజ్ కీర్తి క్యారెక్టర్ లో ఒదిగిపోయింది. తన గత సినిమాలకు భిన్నంగా ఈ చిత్రంలో గ్లామ్ షో చేసి మాస్ ఆడియెన్స్ కి ఓ కిక్ ఇచ్చిందని చెప్పొచ్చు. నటన పరంగా కూడా మంచి పెర్ఫామెన్స్ ని ప్రదర్శించి విశ్వక్ సేన్ తో బ్యూటీఫుల్ కెమిస్ట్రీని అందించింది. ముఖ్యంగా వినోదాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే.. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్ లతో విశ్వక్ సేన్ పండించే పలు కామెడీ సన్నివేశాలు హిలేరియస్ గా ఉండి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయి. ఇక రోహిణి లాంటి నటి పాత్రకి ఇంపార్టెన్స్ పెద్దగా చూపలేకపోయారు. తరుణ్ భాస్కర్, మహేష్ మధ్య వచ్చే సన్నివేశం బావుంది. ఇక వారితో పాటుగా రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకున్న పరిధిమేరకు నరించి పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక విషయాలకొస్తే..మొదటగా చెప్పుకోవలసింది లియోన్ జేమ్స్ గురించి. అతడి సంగీతం సినిమాకి మంచి ట్రీట్ ఇస్తుంది. అతడు అందించిన పాటలు బావున్నాయి. బాణీలు, పూర్ణాచారి రాసిన పాటలు బాగున్నాయి. దినేష్.కె. బాబు సినిమాటోగ్రఫీ అందాల్ని తన కెమెరాలో సూపర్ గా బంధించింది. ఎడిటర్ అన్వర్ అలీ తనవంతు పాత్రని బాగానే నిర్వర్తించాడు. కాకపోతే.. అక్కడక్కడా ఇంకా బెటర్ గా చేయాల్సింది అనిపిస్తుంది. కాస్ట్యూమ్స్, డైలాగ్స్ టీం వర్క్స్ ఒకే! ఇక నిర్మాణ విలువలు అంటారా.. అవి అయితే బాగా రిచ్ గానే ఉన్నాయి.కథలో పాత్రల డిమాండ్ మేరకు కావాల్సిన అన్ని హంగుల్లో మంచి నిర్మాణ విలువలు మనకు కనిపిస్తాయి. ప్రొడక్షన్ వేల్యూస్ పరంగా విశ్వక్ సేన్, ఆయన తండ్రి ‘కరాటే’ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మొత్తం మీద ఈ దాస్ ‘ధమ్కీ’లివ్వకుండానే సినిమా ముగించేశాడు!!!