కలర్ ఫొటో రిలీజయ్యాక మీకు వచ్చిన బెస్ట్ కాంప్లీమెంట్స్
హీరో నానిగారు కాల్ చేసి, సినిమా బాగా తీశాను అని అభినందించారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన కలర్ ఫొటో సినిమాని రెండు సార్లు చూశాను అని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. రవితేజగారు, డైరెక్టర్ మారుతి గారు, రాజమౌళి గారు ఇలా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా అభినందించడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. కొందరు హీరోలు ఫోన్ చేసి త్వరలోనే కలుద్దాం అని చెప్పడం ఇవన్ని నాలో మరింతగా ఆత్మ విశ్వాసం పెంచుతున్నాయి.
ఈ సినిమా ద్వారా మీరు నేర్చుకున్న కొత్త విషయాలు ఏంటి
షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు నేను చాలా లిమిటెడ్ క్రూతో వర్క్ చేశాను, ఫీచర్ ఫిల్మ్‌కి వచ్చేసరికి మాత్రం సెట్‌లో 80 నుంచి 100 మంది క్రూతో వర్క్ చేయాలి. చాలా మందికి డైరెక్టర్ ఎవరో తెలీదు ఇలాంటి కొన్ని కొత్త అనుభవాలు నాకు ఎదురైయ్యాయి. కానీ ఫీచర్ ఫిల్మ్ తీయడం వల్ల నాకు పీపుల్ మేనేజ్‌మెంట్ తెలిసింది. డైరెక్షన్ స్కిల్స్‌తో పాటు పీపుల్ మేనేజ్‌మెంట్ కూడా తెలిస్తేనే సరైన సినిమా తీయగలము అని తెలుసుకున్నాను.
సినిమా చూసిన అందరూ క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నారు, దాని గురించి చెప్పండి
కలర్ ఫొటో స్టోరీ అనుకొని దాన్ని డెవలప్ చేసే క్రమంలో నేను క్లైమాక్స్ గురించే ఎక్కువ దృష్టి పెట్టాను. క్లైమాక్స్ బాగుంటే సినిమాను ఆడియన్స్ ఆదిరిస్తారనే నమ్మకం నాకు ఉంది. అందుకే క్లైమాక్స్ కొత్తగా ఉండేలా రెండు విధాలుగా తెరకెక్కించాను. ఫిక్షన్ క్లైమాక్స్, నాన్ ఫిక్షన్ క్లైమాక్స్ అంటూ రెండు ఎండింగ్స్ మా సినిమాలో ఉండేలా చూసుకున్నా. అది అడియెన్స్ కనెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది.
ఈ సినిమాలో మ్యూజిక్‌కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, దీనిపై స్పందన
కలర్ ఫొటో కోసం కాల భైరవ కొట్టిన మ్యూజిక్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మ్యూజిక్ మా సినిమాకి పెద్ద ఎస్సెట్, అలానే మా ఇద్దరి జర్నీ కూడా ఎప్పటినుంచో సాగుతోంది. ఇద్దరం చాలా కంఫర్ట్‌గా వర్క్ చేసుకోగలిగాము.
హీరో సుహాస్, విలన్ సునీల్ వారి పాత్రల్ని ఫుల్ ఫిల్ చేశారనుకుంటున్నారా
కలర్ ఫొటో స్టోరీ ప్రకారం హీరో నల్లగా ఉండాలి. ఈ కారణంగా సుహాస్‌ని సినిమాలోకి తీసుకుంటే, ఇదే నేపథ్యంలో ఎత్తులు పల్లాలు చూసిన వారు సునీల్, అందుకే వారిని ఈ సినిమాలో విలన్‌గా ఎంచుకున్నా. ఇద్దరికిద్దరు వారి పాత్రలకు సంపూర్ణమైన న్యాయం చేశారు, వారితో పాటే హీరోయిన్ చాందినీ కూడా అద్భుతంగా నటించింది.
నిర్మాతలు సాయిరాజేశ్, బెన్నీలు గురించి చెప్పండి
నేను స్ట్రగిలింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు, నన్ను డైరెక్టర్‌ని చేయడానికి డబ్బులు పెట్టడమే కాకుండా తానే ఓ స్టోరీ రెడీ చేసి ఇచ్చారు సాయిరాజేశ్. మా ఇద్దరికి మరింత సపోర్ట్‌గా ఈ ప్రాజెక్ట్‌లోకి బెన్నీగారు వచ్చి చేరారు. లాక్ డౌన్ టైమ్‌లో కానీ, సినిమా షూట్ విషయంలో కానీ ఇలా ప్రతి చోట నా నిర్మాతలు నాకు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికి మరువలేను.
మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి
ప్రముఖ నిర్మాత ఎస్ కే ఎన్ గారితో నా నెక్ట్స్ సినిమా ఉంటుంది. ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే విడుదల అవుతాయి.
ఆడియెన్స్ కి కలర్ ఫొటో గురించి ఏం చెబుతారు
కలర్ ఫొటో సినిమా ఆహా యాప్‌లో స్ట్రీమ్ అవుతుంది. హాయిగా ఇంట్లో అందరితో కలిసి చూడదగ్గ సినిమా, తప్పకుండా చూసి నన్ను నా చిత్ర బృందాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా.