హీరోయిన్ గా… క్యారక్టర్ ఆర్టిస్టుగా రావిపల్లి సంధ్యారాణి విజయబావుటా!!

sandyaraani
Spread the love

కష్టాలు ఎదురుపడినప్పుడు కొందరు కుంగిపోతారు… వాటికి లొంగి పోతారు. కానీ కొందరు వాటికి ఎదురు తిరుగుతారు. కష్టాల కొలిమిలో తమను తాము సానబెట్టుకుంటారు. ఈ రెండో కోవకు చెందిన చిన్నది “రావిపల్లి సంధ్యారాణి”. “సినిమాల్లో నటించాలి… అందులో రాణించాలనే” వజ్రసంకల్పంతో మొక్కవోని దీక్షతో అడుగులు ముందుకు వేసిన సంధ్యారాణి… చదువుకుంటూనే ఉద్యోగం చేస్తూ… ఉద్యోగం చేస్తూనే సినిమా ప్రయత్నాలు చేస్తూ- సినిమాల్లో నటిస్తూ… తెలుగు సినిమా రంగంలో తనకంటూ మెల్లగా ఓ చిన్న స్థానం సంపాదించుకునే దిశగా ముందుకు సాగుతోంది.
“వీధి బాలలు” అనే చిత్రంలో రిపోర్టర్ రోల్ ప్లే చేయడంతో నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ విజయనగరం ముద్దుబిడ్డ… రామ్ చరణ్-బోయపాటి శ్రీనుల “వినయవిధేయ రామ, శేఖర్ కమ్ముల-నాగ చైతన్యల “లవ్ స్టొరీ”, రవితేజ-గోపిచంద్ మలినేనిల “క్రాక్” వంటి పెద్ద చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు పోషించి… “పద్మశ్రీ, పల్లెటూరి అమ్మాయి” చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. “సినిమాల్లో నటించడం, నాకు ఇచ్చిన పాత్రల్లో మెప్పించడం నాకిష్టం. “హీరోయినా.. లేడి విలనా.. క్యారక్టర్ ఆర్టిస్టా… వంటి విషయాలకు నేను అస్సలు ప్రాధాన్యత ఇవ్వను” అంటున్న సంధ్యారాణి… యోగాలో నిష్ణాతురాలు. అలాగే మంచి దైటీషియన్ కూడా. సినిమాల్లో బిజీగా ఉన్నా… తన యోగా ప్రావీణ్యాన్ని, డైటీషియన్ నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ… హెల్త్ కన్సల్టెంట్ గానూ సేవలందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
“1997, అమ్మవారి మహత్యం, లోకరక్షకుడు, కడప వెబ్ సిరీస్, నేను నా లల్లి, శ్రీలత-ఓటిటి మూవీ, హిందీ వెబ్ సిరీస్”లలో మెయిన్ రోల్, విలన్ రోల్, స్పెషల్ రోల్ వంటివి చేసి… తన ప్రతిభను ఘనంగా ప్రకటించుకున్న ఈ రావిపల్లివారి అమ్మాయి… తేజ, శ్రీధర్ సీపాన తదితర దర్శకుల సినిమాల్లో మంచి పాత్రలు చేస్తూ బిజీగా ఉంది.
ప్రఖ్యాత దర్శకులు తేజ, శేఖర్ కమ్ముల, బోయపాటి శ్రీను, గోపిచంద్ మలినేని వంటి దర్శకుల నుంచి కితాబులందుకోవడం నటిగా తన ఆత్మస్థైర్యాన్ని ఇనుమడింపజేసిందని చెబుతున్న సంధ్యారాణి… రోజుకి కనీసం ఓ గంట సేపైనా వ్యాయామానికి కేటాయించుకోవాలని సూచన చేస్తుంది. “అలా చేయకుంటే మనమే మనకు అన్యాయం చేసుకున్నట్లు” అని నొక్కివక్కాణిస్తుంది.
తన నటనను మెరుగు పరుచుకోవడానికి… భాషాభేదం లేకుండా రోజుకు ఒకటి రెండు సినిమాలైనా చూడకుండా తన దినచర్యను ముగించడానికి ఇష్టపడని సంధ్య… టైమ్ చాలా విలువైనదని, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాళ్ళు మాత్రమే జీవితంలో రాణిస్తారని నమ్ముతానని చెబుతుంది. అభినయం, ఆత్మస్థైర్యంతోపాటు… సమయపాలన, క్రమశిక్షణలకు తోడు.. చక్కని నడవడిక, మాట పొందిక పుష్కలంగా కలిగిన “రావిపల్లి సంధ్యారాణి” నటిగా మరిన్ని మెట్లు వడివడిగా ఎక్కాలని కోరుకుందాం!!

Related posts

Leave a Comment