తెలిమంచు కురిసింది తలుపు తీయనా ప్రభూ… ఎన్ని వేల సార్లు విన్నామో కదా! ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది… ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది! ఆలోకయే బాలకృష్ణం కావచ్చు! విరిసేను చిరుజల్లులే కావచ్చు! నిన్ననే కదమ్మా… విశ్వనాధుడ్ని గుర్తు చేసుకుంటూ నీ పాటలన్నీ విన్నాం! సంగీత ప్రధానమైన పాట పాడాలంటే భావం అర్ధవంతంగా ఉండేలా పాడాలంటే నువ్వు తప్ప ఎవరున్నారు? నీలో మన సుశీలమ్మ స్వరం జానకమ్మ స్వరం ఉంది! అటు లత, ఆశ స్వరాలు నీలో ఉన్నాయి! ఆ నలుగురి స్వరాలను కలిపిన స్వరమే వాణి జయరాం!
కలై వాణి తమిళనాడు లో పుట్టినా వారి తల్లి గారిది కర్నూలు ! అందుకే తెలుగు బాగా వచ్చు! తను పాడుతుంటే తెలుగమ్మాయి పాడినట్లే ఉంటుంది! వాణి పాన్ ఇండియా సింగర్! 18 భాషల్లో 20 వేల పాటలు!, క్లిష్టమైన సాహిత్యం తో కూడిన పాట కోసం మరో పేరు గుర్తు రాదు వాణి పేరు తప్ప!
వేటూరి అయినా సినారే అయినా సిరివెన్నెల అయినా పాట పల్లవి బాగా వస్తే అద్భుతం అనిపిస్తే అది వాణి తో మాత్రమే పాడించాలని పైన నోట్ చేస్తారు! అది వాణి మార్క్! విశ్వనాధ్ గారు చాలా పాటలు పాడించుకున్నారు! ఆయన సినిమాల్లో పాటలు అన్నీ సూపర్ హిట్స్! అందులో వాణి పాడినవి సూపర్ డూపర్ హిట్స్! శంకరాభరణం, స్వాతి కిరణం లాంటి సంగీత సుస్వరాలే కాదు “ఒక బృందావనం సోయగం” లాంటి పాటలతో కూడా ఉర్రూతలూగించారు వాణి ! పాట ఆమె స్వరం లోంచి జాలు వారితే చాలు అదొక మత్తు పాటల ప్రియులకు!
కేంద్ర ప్రభుత్వం వారం క్రితమే పద్మభూషణ్ ప్రకటించింది వాణి గారికి! బహుశా మార్చి లో రాష్ట్రపతి చేతుల మీదుగా గౌరవం! ఆ ప్రతిష్టాత్మక పురస్కారం స్వయంగా అందుకోకుండానే ఇవాళ ఉదయం ఇంట్లోనే కనుమూశారు 78వ ఏట! ఇంట్లో జారి పడి నుదుట బలమైన గాయం తో ఆకస్మికంగా చనిపోయినట్లు సమాచారం! విశ్వనాధ్ చనిపోవడం ఆ జ్ఞాపకాలతో రాత్రంతా నిద్ర పోలేదని, ఆమెను బాగా కలచి వేసిందని సన్నిహితులు తెలిపారు! వాణి మృతి విచారకరం! పాటల జలపాతం వాణి గారికి వినమ్ర నివాళి! నువ్వు లేకున్నా నీ స్వరం శాశ్వతం 🙏
– డా. మహ్మద్ రఫీ