ఆలేరులో ఘనంగా మాజీ ప్రధాని ‘భారతరత్న’ శ్రీమతి ఇందిరా గాంధీ 105వ జయంతి వేడుకలు
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో మాజీ ప్రధాని ‘భారతరత్న’ శ్రీమతి ఇందిరా గాంధీ 105వ జయంతి వేడుకలు స్థానిక ఇందిరా కాంగ్రెస్ భవనంలో ఘనంగా జరిగాయి.
ఈ సందర్బంగా కాంగ్రెస్ ఆలేరు పట్టణ అధ్యక్షులు యం.ఏ. ఎజాజ్ మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ భారతదేశపు తొలి ఏకైక మహిళా ప్రధానమంత్రిగా ఎంతో ప్రఖ్యాతిగాంచారని, ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసి అత్యుత్తమ సేవలు అందించారని అన్నారు. 1964 సంవత్సరములో తండ్రి జవహర్ లాల్ నెహ్రు మరణం తరువాత రాజ్యసభకు ఎన్నికైన ఇందిరాగాంధీ.. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసి అందరిచేత ప్రశంసలు అందుకున్నారన్న విషయాన్ని ఆయన గుర్తు చేసారు. ఇందిరా గాంధీ ఎన్నో సంవత్సరాలపాటు నెహ్రూగారి వెనుకనే ఉన్నా, అనుకోని విధంగా ఆమె ప్రమేయం లేకుండానే తన రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టారని, కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోను, తండ్రి రాలేక పోయిన సభలలో ఆమె మాట్లాడవలసి వచ్చేదన్నారు. ఆమె ఉపన్యాసం, ముఖ్యంగా ఖంగుమని మోగే ఆమె కంఠస్వరం, సామాన్యులలో కలసిపోయే ఆమె స్వభావం అందరినీ ఆకట్టుకునేవని ఎజాజ్ పేర్కొన్నారు. ఇది గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను 1959 ఫిబ్రవరి 2న భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. 1966 జనవరి 24న మొదటిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించి దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారని, నేటివరకు కూడా మరో మహిళ ఆ స్థానాన్ని చేపట్టకపోవడం గమనార్హమని ఆయన అన్నారు. ఆమె ధైర్యం, సమయస్ఫూర్తితో చర్యలు గైకొనే రీతి, ఆమెను ఎన్నో సంవత్సరాలు ప్రధాని పదవిలో ఉండేటట్లు చేసాయని, స్త్రీ శక్తిని తక్కువగా అంచనావేసే ఆ రోజుల్లో ఒక మహిళ ప్రధానమంత్రిగా ఇంత పెద్ద దేశాన్ని, అంతమంది ప్రజలను, తనకున్న తక్కువ అనుభవంతో ఎలా పరిపాలిస్తుందో ప్రపంచం మొత్తం గమనించిందని, వారందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఆమె కొద్ది కాలంలోనే తన సమర్థతను నిరూపించుకున్నారు.
ఎస్.సి.సెల్ రాష్ట్ర కన్వీనర్ నీలం వెంకటస్వామి మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన కొత్తలోనే అధికార యంత్రాంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబోతున్నట్లుగా ప్రకటించేదన్నారు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, కొత్త పద్ధతులను చేపట్టబోతున్నట్లు, ఇది పాత సాంప్రదాయ పద్ధతులకు, నవీన భావాలు గల యువతరానికి జరిగే పోరాటంగా ఆమె చెప్పి అందర్నీ ఆశ్చర్య పరిచారని, సామాన్యుని అండ రాజకీయనేతలకు ఎంత ముఖ్యమో ఆమెకు తెలుసని, అందుకే ఆమె కార్యాలయానికి వెళ్ళే ముందు దేశం నలుమూలల నుండి తనను కలవడానికి వచ్చే ఎంతో మంది ప్రజలను కలసి వారి సమస్యలను విని వారిచ్చే వినతులను స్వీకరించేదని, వాటిని అంతటితో వదిలెయ్యకుండా వాటికి తగ్గ చర్యలను తీసుకోవల్సిందిగా వెంటనే ఆదేశాలిచ్చేదన్నారు అంతటి ప్రతిభాశాలి ఇందిరాగాంధీ అని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్బంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఆలేరు పట్టణ అధ్యక్షులు యం.ఏ. ఎజాజ్, మొదటి వార్డు కౌన్సిలర్ చింతలపని సునీత శ్రీనివాస్ రెడ్డి, ఎస్.సి.సెల్ రాష్ట్ర కన్వీనర్ నీలం వెంకటస్వామి, మాజీ ఎంపీటీసీ జైనొద్దీన్, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యం.ఎస్. విజయ్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సముద్రాల సత్యం, ఓబీసీ ఆలేరు పట్టణ అధ్యక్షులు పోరెళ్ళ సతీష్, జిల్లా కార్యదర్శి వల్లపు ఉప్పలయ్య, ఆలేరు పట్టణ కార్యదర్శి మల్లెల శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ నాయకులు ద్వారపు శంకర్, ఆలేరు యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జూకంటి సంపత్, ఆలేరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కలకుంట్ల లోకేష్, ఎన్.ఎస్.యూ.ఐ మండల అధ్యక్షులు సుంకరి విక్రమ్, ఆలేరు పట్టణ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కాసుల భాస్కర్, ఆలేరు మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బీస కిరణ్, ఆలేరు పట్టణ మహిళా అధ్యక్షులురాలు పాము అనిత, అయిలి లలిత, భీమగాని ప్రభు, ముద్దపక నరసింహ, బొడ్దు మల్లేష్, మహేష్, యండి. మాక్సుద్, జల్లి నాగరాజ్, యండి జావీద్, సుక్క పరశురాం, యం.డి.షమీ తదితరులు పాల్గొన్నారు.