సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఘట్టమనేని ఇందిరాదేవి కన్నుమూత

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఘట్టమనేని ఇందిరాదేవి కన్నుమూత
Spread the love

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి శ్రీమతి ఘట్టమనేని ఇందిరాదేవి ఇకలేరు. కొద్దిసేపటి క్రితం ఆమె కన్నుమూశారు. ఇందిరాదేవి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు (బుధవారం) ఉదయం తొమ్మిది గంటలకు అభిమానుల సందర్శన కోసం ఆమె పార్ధివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచి అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు.
మహేశ్ బాబు కుటుంబంలో ఒకే ఏడాది రెండు విషాదాలు
సూపర్ స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. కొద్దిరోజులుగా ఆరోగ్యం క్షీణించడంతో AIG ఆసుపత్రిలో చేర్చించారు. ఈక్రమంలోనే తెల్లవారుజామున 4 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా ఈఏడాది జనవరిలోనే మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఒకే ఏడాదిలో సూపర్ స్టార్ ఇంట్లో రెండు తీవ్ర విషాదాలు చోటుచేసుకున్నాయి. సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరా దేవి మొదటి భార్య కాగా.. వీరికి మహేష్, రమేష్, మంజుల, ప్రియుదర్శిని, పద్మావతి జన్మించారు. కాగా కృష్ణ రెండో భార్య విజయ నిర్మల 2019 లో చనిపోయిన సంగతి తెలిసిందే. ఇందిరాదేవి మృతితో ఘటమనేని కుటుంబంతో పాటు..టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రిన్స్ మహేష్ బాబు..ఇందిరాదేవి బర్త్ డే రోజున, మదర్స్ డే రోజున, విమెన్స్ డే రోజున ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తనకు తల్లి పట్ల ఉన్న మమకారాన్ని అభిమానులతో పంచుకునేవారు. కాగా, ఇటీవల కాలంలోనే…విజయ నిర్మల, రమేష్ బాబు మృతితో దిగాలు చెందుతున్న ఘట్టమనేని ఫ్యామిలీలో.. ఇప్పుడు ఇందిరాదేవి మరణం మరింత బాధాకరమైన విషయం.
ఇందిరాదేవి గారి మరణం ఎంతో కలచివేసింది: చిరంజీవి
శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ సూపర్ స్టార్ కృష్ణ గారికి, సోదరుడు మహేష్ బాబుకి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.
ఇందిరాదేవి గారి మరణం బాధకరం: నందమూరి బాలకృష్ణ
ఘట్టమనేని కృష్ణ గారి సతీమణి, ఘట్టమనేని మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి గారి మరణం బాధకరం. ఇందిరాదేవి గారు లేకపోవడం కృష్ణగారి కుటుంబానికి తీరని లోటు. ఇందిరాదేవి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
శ్రీ కృష్ణ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి : పవన్ కళ్యాణ్
ప్రముఖ నటులు శ్రీ కృష్ణ గారి సతీమణి, శ్రీ మహేష్ బాబు గారి మాతృమూర్తి శ్రీమతి ఇందిరాదేవి గారు తుది శ్వాస విడిచారనే విషయం విచారం కలిగించింది. శ్రీమతి ఇందిరా దేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ బాధ నుంచి శ్రీ కృష్ణ గారు, శ్రీ మహేష్ బాబు గారు త్వరగా కోలుకొనే మనో ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిసున్నాను.

Related posts

Leave a Comment