సినీ జర్నలిస్టుగా కెరీర్ ను ప్రారంభించి అటు తర్వాత సినీ గేయ రచయితగా మారిన పెద్దాడ మూర్తి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య సంధ్య, కూతురు సుగాయత్రి, కుమారుడు అభిజిత్ ఉన్నారు. కూతురు సుగాయత్రి నెల్లూరులో ఇంటర్ చదువుతుండగా, కుమారుడు అభిజిత్ హైదరాబాద్ లో పదవ తరగతి చదువుతున్నాడు. సినీ జర్నలిస్టుగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న పెద్దాడ మూర్తి దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రోత్సహంతో ‘కూతురు’ అనే చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుపెట్టాడు. ఆ తరువాత ఇడియట్, మధుమాసం, చందమామ, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, పౌరుడు, కౌసల్య సుప్రజ రామ, స్టాలిన్ తదితర చిత్రాల్లో పాటలు రాసిన ఆయన ఇలా అర్ధాంతరంగా లోకం విడిచివెళ్లడంతో తోటి సినీ జర్నలిస్టులు, సినీ గేయ రచయితలు, మిత్రులు, చిత్రసీమకు చెందిన ఆత్మీయులు ఆయన కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సంతాపం
సీనియర్ జర్నలిస్ట్, సినీ గేయ రచయిత పెద్దాడ మూర్తి ఇకలేరన్న విషయం తెలిసి ఎంతో మనస్థాపానికి గురయ్యామని, జర్నలిస్టుగా, సినీ గేయ రచయితగా పెద్దాడ మూర్తి మంచి పేరును తెచ్చుకున్నారని, ఆయన మరణం పట్ల పెద్దాడ మూర్తి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సురేష్ కొండేటి, ఎం.లక్ష్మీనారాయణ, సహాయ కార్యదర్శులు ఎం.డి. అబ్దుల్, నారాయణ, కోశాధికారి హేమసుందర్ తదితరులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.