అక్టోబర్ 1న విడుదల
సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. దేవ కట్టా దర్శకుడిగా జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రిపబ్లిక్’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదలవుతుంది. శనివారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో…
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘నేనెప్పుడూ తేజ్ ఫంక్షన్స్‌కు రాలేదు. తన మొదటి సినిమా సమయంలో వచ్చానని అనుకుంటున్నాను. దానికి కారణం.. ఇంట్లో మా అక్కయ్య కొడుకుగా తనను ట్రైనింగ్ పంపించి ఏదైనా చేయొచ్చు. . గోకులంలో సీత సినిమా విషయానికి వచ్చేసరికి అన్నయ్య సపోర్ట్ తీసుకోలేదు. ఏ సినిమా వచ్చిందో అలాగే చేశాను. అలాగే తేజ్ కానీ, వైష్ణవ్ కానీ.. ఎవరైనా కుటుంబంపై ఆధాపపడకూడదు. కష్టమో, నష్టమో..సొంతంగా జర్నీ చేయాలి. కానీ ఈరోజు ఫంక్షన్‌కు రావడానికి కారణం, నిర్మాతలు ఇంత ఖర్చు పెట్టి సినిమా తీశారు. సినిమా రిలీజ్ టైమ్‌లో అందరూ హ్యాపీగా ఉండాలి. కానీ తేజ్ మోటార్ బైక్ యాక్సిడెంట్‌కు గురికావడమనేది చాలా బాధాకరమైన విషయం. హీరో ఫంక్షన్‌లో లేని లోటు తెలియనీయకుండా మనవంతు ఏదో చేయాలని నేనిక్కడికి వచ్చాను. మీ అందరి ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తి తేజు. సినిమా చాలా బాగా వచ్చింది. ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించాలి. ఇక ఈ మధ్య కాలంలో నేను ఫీలైందేంటంటే.. తేజ్‌కు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు దర్శకులు, నిర్మాతలు, మిత్రులు, పెద్దలు వచ్చి కోలుకోవాలని ప్రార్థించారు. కొన్ని ప్రోగ్రామ్స్ చూశాను. తేజ్ యాక్సిడెంట్ ఎలా అయ్యింది.. చాలా స్పీడుతో నడుపుతున్నాడు.. నిర్లక్ష్యంతో నడుపుతున్నాడు.. కథలు వచ్చాయి. ఆటోను దాటించేటప్పుడు ఎంత స్పీడులో వెళతాడు నలబై ఐదు కిలోమీటర్ల వేగంతో వెళ్లి ఉండొచ్చు. ఇసుక ఉండటం వల్ల పడిపోయాడు. జాలిపడాలి మనం. దాని మీద కథనాలు అల్లి, మాట్లాడితే ఎలా? అలాంటి వ్యక్తులకు నా విన్నపం ఏంటంటే.. కొంచెం కనికరం చూపించండి. మేమూ మనుషులమే కదా! ఇలాంటి పరిస్థితి మీకు రాదని గ్యారంటీ ఏంటి? మీకు కూడా వస్తుంది కదా. దయచేసి కొంత కనికరం చూపించండి. దేవకట్టాగారు చేసిన ప్రస్థానం సినిమా చూశాను. చాలా చక్కటి సినిమా. ఆటోనగర్ సూర్య చేసినప్పుడు ఆ నిర్మాతలు కలిసి చాలా చక్కటి దర్శకుడు అని చెబుతుండేవారు. రిపబ్లిక్ సినిమాను కూడా సామాజిక స్పృహతో చేశారు. భారత రాజ్యాంగం ఏం చెప్పింది. మన ప్రాథమిక హక్కులేంటి? అనే దానిపై మాట్లాడే సినిమా అని అర్థమవుతుంది. జైహింద్ అని నేను ప్రతి సభలో చెబతుంటాను. ఓ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, మహాత్మాగాంధీజీ వంటి వేలకొలది మహానుభావులు ప్రాణ త్యాగం చేస్తే కానీ, భారత దేశం గణతంత్య్ర దేశంగా ఆవిర్భవించలేదు. అంత గొప్ప త్యాగాలకు గుర్తు. స్వాతంత్య్ర ఉద్యమ కారులు ఎంతో త్యాగం చేశారు. కానీ రాను రాను.. పాలిటిక్స్‌లో దిగజారుడుతనం వచ్చేసింది. హుందాతనం పోయింది. ఆ భావనను ఓ కవి దాన్ని కవితగా రాస్తాడు. ఓ దర్శకుడు దాన్ని సినిమాగా తెరకెక్కిస్తాడు. నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో ధైర్యం చల్లకపోతే, అది నీ గుండెల్లో ఆత్మ గౌరవం పండిచకపోతే, నువ్వు ఎప్పటికీ మోచేతి అంబలి తాగే బానిసల్లాగా బతకాలని అనుకుంటే.. ఆ చిందించిన రక్తానికి ఎంత ద్రోహిగా మారావో తెలుసుకో’’శేషేంద్ర శర్మగారు చెప్పారు. సినిమాల్లో విలువలు మాట్లాడటం ఒక ఎత్తైతే, దాన్ని నిజ జీవితంలో ముందుకు తీసుకెళ్లడం ఎంతో కష్టతరం. ఈరోజు దర్శకులు నిర్మాతలు, పెద్దలు.. అందరూ థియేటర్స్ బావుండాలని కోరకుంటున్నారు. కరోనా సమయం వల్ల సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులను ఎదుర్కొంటుంది. సెన్సిటివ్ పరిశ్రమ . ఎవరికైనా ఈజీ టార్గెట్ సినిమా పరిశ్రమ. 45 కిలోమీటర్ల అత్యంత వేగంగా వెళుతూ ఆటోని ఓవర్‌టేక్ చేస్తూ కిందపడిపోయాడు తేజు.. అనే కథనాలు కూడా ఉన్నాయి. అంతే కంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చాలానే ఉన్నాయి. వై.ఎస్.వివేకానందరెడ్డి ఎందుకు హత్య చేయబడ్డారు అని కథనం వేయండి. తేజ్ యాక్సిడెంట్ కాదు. ఓ నాయకుడిపై కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఎయిర్‌పోర్టులో కోడికత్తితో దాడి జరిగింది. అదేమైందని అడగండి…తేజు యాక్సిడెంట్ గురించి కాదు. లక్షలాది పోడు భూముల్లో గిరిజనులు వ్యవసాయం చేసుకుంటూ వుంటే అది వారికి దక్కడం లేదు. దాని గురించి మాట్లాడండి..తేజు యాక్సిడెంట్ గురించి కాదు. ఆరేళ్ల చిన్నారి చరిత అన్యాయంగా, అకారణంగా, అమానుషంగా హత్యకు గురైతే అది వదిలేసి.. తేజు యాక్సిడెంట్ గురించి కథనం కాదు కావాల్సింది మనకు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్స్ గురించి మాట్లాడి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్స్ గురించి ఎందుకు మాట్లాడటం లేదో దాని మీద కథనాలు చేయండి.. రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు.. బోయ కులస్థులకు ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం రావడం లేదు… ఓ ఆడపిల్ల బయటకు వెళితే క్షేమంగా ఎలా బయటకు రావాలో వంటి విషయాలపై కథనాలు నడపండి. మేం గౌరవిస్తాం. సినిమా హీరోల మీద, సినిమా వాళ్ల గురించి ఎందుకు మాట్లాడుతారంటే వాళ్లు సాఫ్ట్ టార్గెట్స్. వాళ్లనేమైనా అంటే ఎవరూ ఏమనరు. రాజకీయ నాయకుల గురించి మాట్లాడరు. ఇడుపుల పాయలో నేలమాళిగల్లో డబ్బులుంటాయని పోలీస్ వ్యవస్థే చెబుతుంటుంది. ఎంత నిజమో తెలియదు కానీ.. దానిపై కథనాలు నడపండి. అవి నడిపితే, ఇళ్లలో కొచ్చి కొడతారు. అందుకే వాళ్ల గురించి మాట్లాడరు. తేజ్ అమాయకుడు కదా!. కళ్లు తెరవకుండా అక్కడ పడున్నాడు కదా, హాస్పిటల్లో. ఈరోజు వరకు తేజు ఇంకా కళ్లు తెరిచాడో లేదో నేను కూడా చూడలేదు. దీనిపై కథనాలు కాదు కావాల్సింది. పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి. సినిమా వాళ్ల గురించి కాదు మాట్లాడాల్సింది. అది కదా, సమాజానికి కావాల్సింది. సినిమాల థియేటర్స్‌కు వెళ్లాలని అందరూ అనుకుంటున్నారు. కానీ థియేటర్స్ తెలంగాణలోనే ఉన్నాయి. ఆంధ్రాలో థియేటర్స్ ఎక్కడున్నాయి. వైసీపీ నాయకులు ఏమనుకుంటున్నారంటే.. పవన్ కళ్యాణ్ సినిమా ఆపేసినా, అతనొచ్చిన చిత్ర పరిశ్రమను ఆపేసినా, వాళ్లందరూ భయపడి మన కాళ్ల దగ్గరకొచ్చేస్తారని. కానీ వాళ్లు నన్ను తప్పు అర్థం చేసుకున్నారు. సినిమాలో దర్శకులు, హీరోలు, హీరోయిన్లు ఇన్ని కోట్లు తీసుకుంటున్నారని అందరూ అంటుంటారు. వాళ్లకు చెప్పేదొక్కటే.. అరే! సన్నాసుల్లారా, దద్దమ్మల్లారా! హీరోలు కానీ, దర్శకులు కానీ, హీరోయిన్స్ కానీ, వీళ్లు లెక్క చెబుతారు. ఉదాహరణకు హీరోకు పదికోట్లు పంపితే అందులో ఒక కోటి ట్యాక్స్ కట్ చేసుకునే పంపుతారు. పన్నులు పోగా.. ఆరున్నరకోట్లు మిగులుతాయి. దీంట్లో వాళ్లు వ్యవస్థను నడుపుకోవాలి. ఆ డబ్బులు ఊరికే రాలేదు. దోచింది కాదు. వాళ్ల కష్టం మీద వచ్చిందే. వేలకోట్లు దోచేయలేదు. దొంగ క్రాంటాక్టులు చేసి సంపాదించలేదు. ఎంటర్‌టైన్ చేసి సంపాదిస్తున్నాం. డాన్సులేసో, కిందపడో, మీద పడో, ఒళ్లు విరగొట్టుకునో చేస్తున్నాం. బాహుబలిలో ప్రభాస్‌గారిలాగా కండలు పెంచి కృషి చేస్తే, రానాగారిలాగా కండలు పెంచి కష్టపడితేనే అది బాహుబలి అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్‌లా అద్భుతమైన డాన్సులు చేస్తే అప్పుడు డబ్బులు ఇస్తారు. ఒకరోజులో ఎవరికీ ఇవ్వలేదు. రామ్‌చరణ్ లాంటి హీరో అద్భుతమైన స్వారీలు చేస్తే అప్పుడు డబ్బులు ఇస్తారు. దేన్నైనా తెగేదాకా లాక్కండి అని అందరికీ చెబుతున్నాను. సినీ ఇండస్ట్రీ బాగుకోరే వారికిచెబుతున్నదొక్కటే. సినీ ఇండస్ట్రీ నష్టపొతే, నేను డబ్బులు వదిలేస్తున్నాను. అలాగే ఎక్కడో మారుమూల నన్నెవరూ గుర్తించలేదని బాధపడుతున్న కిన్నెర మొగలయ్యను గుర్తించి డబ్బులిచ్చాను. అది నా సంస్కారం. మేమూ చేస్తాం. అవి కూడా చూడండి. మీరు దృష్టి పెట్టాల్సింది. అక్రమ ఆర్జిత రాజకీయ నాయకులపైన.. సినిమా వాళ్ల మీద కాదు. మీరు ఒకసారి రాజకీయాల్లోకి వచ్చి ముప్పై ఏళ్లు అధికారంలోకి ఉండాలనుకునే కోరికలుంటాయి కానీ, వ్యాపారం చేసుకునేవాళ్లకు ఉండదా. హోటల్ ఓ బ్రాంచీ పెడితేనె, మరో బ్రాంచీ పెట్టాలనుకుంటాం. అందులో తప్పేంటి. మీకు దిల్‌రాజుగారు నచ్చలేదా.. పోటీగా మరో పది మందికి అవకాశం ఇవ్వండి. వెనుకబడిన తరగతుల వాళ్లకు థియేటర్స్ కోసం స్థలాలు ఇవ్వండి. ఆర్థికంగా బలంగా లేనివారికి థియేటర్స్ ఇవ్వండి వాళ్లు వీళ్లతో పోటీ పడతారు. అది మానేసి, మీకు డబ్బులొద్దు..మాకు డబ్బులొద్దంటారు. వెల్త్ క్రియేషన్ లేకపోతే ఎక్కడ్నుంచి డబ్బులు వస్తాయి. అది తప్పా అని అడగాలనుంది. కానీ ఎవర్నీ అడగాలో తెలియదు. నేను వెల్త్ క్రియేషన్ చేయలేకపోతే మొగలయ్యకు రెండున్నర లక్షలు ఇవ్వగలనా? సైనికులకు కోటి రూపాయలు, కరోనా నిధికి రెండు కోట్లు ఇవ్వగలనా? వెల్త్ క్రియేషన్ జరగాలిరా సన్నాసుల్లారా!. డబ్బులు సంపాదించేస్తున్నారు అనే సన్నాసులకు ఒకటే చెబుతున్నా. నా పేరు చెప్పి ఫిల్మ్ ఇండస్ట్రీని చావ దొబ్బేస్తున్నారు. చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూడకండి.. కాలిపోతారు జాగ్రత్త. మీరు లక్ష కోట్లు సంపాదించొచ్చు. మేం అడుక్కుతినాలా? వైసీపీ నాయకులకు ఇండస్ట్రీ వైపు చూడకండి అని మీరు చెప్పాలేరా? మాట్లాడండి. ఏం చేస్తారు? ఇది వైసీపీ రిపబ్లిక్ అని కాదు.. ఇండియన్ రిపబ్లిక్ అని చెప్పండి. అధికారం ఉంది కదా.. అని పిచ్చి వేషాలు వేస్తే.. భవిష్యత్ ఉండదు. దీనికి ఒక ఉదాహరణ..లిబియా అధ్యక్షుడు గడాఫీ.. అధికారం కోసం చాలా మందిని చంపాడు. ఇరవై ఏళ్ల తర్వాత నడిరోడ్డులో మారుమూల, చిన్న కుర్రాళ్లు గడాఫీని కొట్టి చంపేశారు. నాకు సినిమాల్లోకి, రాజీకీయాల్లోకి రావాలని లేదు. కానీ ఖర్మ సరిగా లేదు. అందుకనే రాజకీయాల్లోకి ..సినిమాల్లోకి వచ్చాను. సినిమా పరిశ్రమకు కులాలు మతాలు ఉండవు. న్యూక్లియర్ ఫిజిక్స్‌లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన త్రివిక్రమ్ సినిమాల్లోకి వచ్చాడు. హరీశ్ శంకర్ కరీంనగర్ వాస్తవ్యుడు. నాతో వకీల్ సాబ్ సినిమా చేసిన శ్రీరామ్ వేణు ఎంబీసీ కులానికి చెందినవాడు. ఆయన తండ్రి ఓ టైలర్. తన వరంగల్‌కు చెందినవాడు. సురేందర్ రెడ్డి వరంగల్‌వాడు. ఇప్పుడు రిపబ్లిక్ చేసిన దేవకట్టా కూడా బాగా చదువుకున్నవాడే. ఎంత జ్ఞానం లేకపోతే, రిపబ్లిక్ సినిమా తీయలేడు. ఓ సినిమా తీయడం ఎంత కష్టమో దిల్‌రాజుగారిని అడగండి. చిత్ర పరిశ్రమలో ప్రాంతీయ తత్వం, కులతత్వం ఉండవు. నేను కులం చూసి బంధాలు పెంచుకోలేదు. వ్యక్తిత్వం చూసి బంధాలు పెంచుకున్నాను. మొగిలయ్య దళిత కులానికి చెందిన వ్యక్తి. నేను అభిమానించే ప్రొఫెసర్ సుధాకర్ దళిత కులానికి చెందిన వ్యక్తి. నాతో వకీల్ సాబ్ సినిమా చేసిన శ్రీరామ్ దర్జీ కులానికి చెందినవాడు. ఈరోజు భీమ్లానాయక్ సినిమా చేస్తున్న సాగర్ రెడ్డి.. కులానికి చెందినవాడు. అందరూ బావుండాలని కోరుకునేవాడిని. రాజ్యాంగం చాలా గొప్పది. ఇప్పుడు వైసీపీవాళ్లను అడిగితే ఓ రూల్ చూపిస్తారు. ఇలా చేస్తున్నామని అంటారు. నిజమే అది రూల్‌గానే ఉండొచ్చు. కానీ అన్వయించేది మీ నిబద్దతను బట్టి ఉంటుంది. చిత్ర పరిశ్రమలోని వ్యక్తిగా చెబుతున్నాను. మీ మీద దాడి చేస్తున్నప్పుడు మీరు బలంగా మాట్లాడండి. మీకు హక్కు ఉంది. మీరు దోపీడీలు, దొమ్మీలు చేయడం లేదు. చిత్ర పరిశ్రమ అంటే దిల్‌రాజుగారో, అల్లు అరవింద్‌గారో, సురేష్‌బాబుగారో కాదు.. చాలా ఉంది. ఈ మధ్య హీరో నానిని అందరూ తిడుతుంటే చాలా బాధేసింది. తనో సినిమా చేసుకుని, థియేటర్స్ దొరక్క ఓటీటీకెళితే, థియేటర్స్ యజమానులందరూ తనని తిట్టారు. మీరు వైసీపీ నాయకులతో మాట్లాడుకోండి. ఆ అబ్బాయి మీద పడితే తనేం చేస్తాడు. తన తప్పేం ఉంది. పాతిక వేల మంది సినిమా పరిశ్రమపై ఆధాపడుతున్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి లక్ష మంది ఉంటారు. మీరు పవన్ కళ్యాణ్‌పై కోపంతో సినిమా ఆపేస్తే .. ఇక్కడ లక్ష మంది పొట్ట కొడుతున్నారు. మీకు నాతో గొడవుంటే, నా సినిమాలను ఆపేయండి. మా వాళ్లను వదిలేయండి. చిరంజీవిగారెందుకు అలా బతిమాలడుకుంటున్నారు? అని ఎవరో అంటే.. అది ఆయన మంచి మనసు.. అలానే ఉంటారు. ఏం చేస్తాం. చిత్ర పరిశ్రమకు అక్కరకు రాని సోదర భావన ఎందుకు? వెళ్లి దిబ్బలో కొట్టుకోవడానికా!. సినిమా టిక్కెట్లను ఆంధ్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలనుకుంటుందంటే వాళ్ల దగ్గర డబ్బులు లేవు. చిత్ర పరిశ్రమ మీద వచ్చే ఆదాయాన్ని బ్యాంకులకు చూపించవచ్చు. లోన్స్ తెచ్చుకోవచ్చు. దాని కోసమే టికెట్స్ అమ్మకాన్ని తీసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం థియేటర్స్ విషయంలో ఇబ్బంది పెడతారు. చిరంజీవిగారిలాంటి వ్యక్తులకు చెప్పండి ప్రాధేపడొద్దని. హక్కుతో మాట్లాడమని చెప్పండి. సినీ పెద్దలు, సంపూర్ణ విద్వాంసులు బయటకు రండి. ఖండించండి. తప్పని చెప్పండి. చిత్ర పరిశ్రమ వైపు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీరు మారకపోతే, మీరు మార్చేలా ఎలా చేయాలో మాకు తెలుసు’’ అన్నారు.
హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ ‘‘అన్నయ్య తేజు బాగా కోలుకుటున్నాడు. అందరినీ అలరించడానికి త్వరగా వచ్చేస్తాడు. ఆరోజు ప్రమాదం జరిగినప్పుడు స్పాట్‌లో ఉండి త్వరగా ఫోన్ చేసి అన్నయ్యను హాస్పిటల్‌లో చేర్చిన వారికి చాలా థాంక్స్. డాక్టర్స్‌తో పాటు అభిమానులు, ప్రేక్షకుల ఆశీర్వాదంతో తేజన్నయ్య త్వరగా కోలుకుంటున్నాడు. మీకు థాంక్స్ అని చెబితే సరిపోదు. రిపబ్లిక్ సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సినిమాను థియేటర్స్‌లో చూడాలని అనుకుంటున్నాను. అందరూ హెల్మెట్ ధరించి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని ఓ అన్నయ్యలా, తమ్ముడిలా, కొడుకులా చెబుతున్నాను. ప్లీజ్.. రిపబ్లిక్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
చిత్ర దర్శకుడు దేవ కట్టా మాట్లాడుతూ ‘‘నేను పవన్ కళ్యాణ్‌గారికి నిరంతర అభిమానిని. ఆరాధకుడిని. ఆయన రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడంతో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అభిమానులకు థాంక్స్. నా టీమ్‌కు, తేజ్ ప్రయాణంలో భాగమైన దర్శకులు, నిర్మాతలు కూడా ఇక్కడికి వచ్చారు. అందరికీ థాంక్స్. రిపబ్లిక్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ఇక్కడ వరకు వచ్చిందంటే కారణం తేజ్. జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు వచ్చిన ఐడియా. దాన్ని బ్యూరోక్రాట్ రూపంలో సినిమా చూడాలని ఉందని తేజ్‌కు చెప్పాను. తను డీప్‌గా కనెక్ట్ అయ్యాడు. ఈ కథ నాతోనే చేస్తానని ప్రామిస్ తీసుకున్నాడు. నేను ప్రస్థానం తర్వాత చేసిన తప్పుల వల్ల ఇండస్ట్రీకి నాపై నమ్మకం పోయింది. తేజ్ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి, పవర్ ఇచ్చి సినిమాను సైనికుడిలా కాపాడాడు. నా విజన్‌లో తను, తన విజన్‌లో నేను.. కలిసి పనిచేశాం. కమర్షియల్ అంశాలతో పాటు అన్ని ఉంటూనే సినిమాలోని సోల్‌ను ఏది దెబ్బ తీయకూడదని ఓ సైనికుడిలా తేజ్ పోరాడాడు. తేజ్‌చాలా తర్వగా కోలుకుంటున్నాడు. తను ఈ సినిమాకు సైనాధ్యక్షుడిలా తిరిగి వస్తాడు. ఈ సినిమా కథ చెప్పిన రోజు నుంచి నిర్మాతలు జీస్టూడియోస్ ప్రసాద్‌గారు, భగవాన్‌గారు, పుల్లారావుగారు నాపై నమ్మకంతో వదిలేశారు. పవర్, రెస్పెక్ట్‌తో పాటు ఫ్రీడమ్ ఇచ్చారు. మణిశర్మగారు అద్భుతమైన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. కె.ఎల్.ప్రవీణ్ సినిమాను బ్యూటీఫుల్‌గా ఎడిట్ చేశారు. సినిమాటోగ్రాఫర్ సుకుమార్‌గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. అందరూ సైనికుల్లా ఈ సినిమా కోసం పనిచేశారు. ట్రైలర్ చూసి చాలా మంది ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. నా దృష్టిలో ప్రతి మాట ఓ ఆలోచన. దాన్ని ఈ సినిమాలో రాశాను. అంతే తప్ప మాటల గారడీ చేయలేదు. బలమైన ఆలోచన రిపబ్లిక్ మూవీ మీపై ప్రభావం చూపిస్తుందని, థియేటర్స్‌లో వదిలిపోయే సినిమాలా కాకుండా, గుండెల్లో మీతో మోసుకెళ్లే సినిమా అవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు.
చిత్ర నిర్మాత పుల్లారావు మాట్లాడుతూ ‘‘మెగాభిమానులు, ప్రేక్షకులు ఆశీర్వాదంతో తేజు త్వరగా కోలుకుంటున్నాడు. చిత్రలహరి, ప్రతిరోజూ పండగే చిత్రాల తర్వాత సాయితేజ్ మాకు రిపబ్లిక్ సినిమా చేసే అవకాశం ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మా సినిమాకు వచ్చి క్లాప్ కొట్టి ఆశీర్వదించిన పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌గారు ఇప్పుడు మళ్లీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వస్తున్నారు. ఆయనకు థాంక్స్. కరోనా సమయంలో రెండు లాక్‌డౌన్స్‌ను ఫేస్ చేశాం. అందరి నిర్మాతల్లాగానే మేం కష్టాల్లో ఉన్నప్పుడు జీ స్టూడియోస్ వారు అండగా నిలబడ్డారు. ఈ సందర్భంగా జీ స్టూడియోస్‌వారికి థాంక్స్. డైరెక్టర్ దేవ కట్టాగారికి, సినిమాటోగ్రాఫర్ సుకుమార్‌గారికి అండ్ టీమ్‌కు థాంక్స్. కథ ఓకే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అండగా నిలబడ్డ సతీశ్‌గారికి థాంక్స్. అక్టోబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతుంది. ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి ఆదరిస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.
చిత్న నిర్మాత భగవాన్ మాట్లాడుతూ ‘‘ఈ ఈవెంట్‌ను ఆశీర్వదించడానికి వచ్చిన మెగాభిమానులు, పవర్‌స్టార్‌గారి అభిమానులకు థాంక్స్. సాయితేజ్‌తో మాకు పన్నెండేళ్ల అనుబంధం ఉంది. తేజ్.. బంగారం. మా దేవ కట్టాగారి గురించి చెప్పాలంటే ఆయన సినిమాలే చెబుతాయి. సాయితేజ్‌గారు, దేవకట్టాగారికి ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది’’ అన్నారు.
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సాయితేజ్ వారి ఆశీర్వాద బలంతోనే త్వరగా కోలుకుంటున్నాడు. త్వరలోనే మన మధ్యకు వస్తాడు. ఇక రిపబ్లిక్ సినిమా గురించి చెప్పాలంటే దేవ కట్టా మంచి ప్యాషనేట్ డైరెక్టర్. తన ఔట్‌పుట్ వచ్చే వరకు కాంప్రమైజ్ కాడు. రిపబ్లిక్ వంటి పొలిటికల్ డ్రామా గురించి సాయితేజ్ ఓ సందర్భంలో మాట్లాడాడు. లైన్ నాకెంతో నచ్చింది. తేజ్ హీరోగా ఎన్నో సక్సెస్, ఫెయిల్యూర్స్ చూశాడు. అక్టోబర్ 1న రిపబ్లిక్ మూవీ రిలీజ్ అవుతుందంటే ప్రేక్షకాభిమానులే కాదు.. మెగాస్టార్‌గారు, పవర్‌స్టార్‌గారు వెనుకుండి నడిపిస్తున్నారు. రిపబ్లిక్ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.
దర్శకుడు ఎస్.హరీశ్ శంకర్ మాట్లాడుతూ ‘‘సాయితేజ్‌తో నాకు మంచి ఎటాచ్‌మెంట్ ఉంటుంది. ఎప్పుడూ నన్ను అన్నయ్య అనిపిలుస్తుంటాడు. తేజ్..కళ్యాణ్‌గారికి వరుస మేనల్లుడే అయినా, తండ్రీకొడుకుల్లా ఉంటారు. ఆ విషయంలో తేజ్ అదృష్టవంతుడు. తేజ్‌కు ప్రమాదం జరిగినప్పుడు….నందమూరి అభిమానులు, మహేశ్‌గారి అభిమానులు, ప్రభాస్‌గారి అభిమానులు..ఇలా తేజ్ గురించి తెలిసిన ప్రతి హీరో అభిమాని తను త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. గుళ్లలోనే కాదు, చర్చిల్లో, మసీదుల్లో అందరూ ప్రార్థించారు. సినిమాకు కుల మతాలు లేవని నిరూపించిన ప్రేక్షక దేవుళ్లకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్‌లోనూ ఫస్ట్ బంచ్ మూవీస్‌లో రిపబ్లిక్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. తేజ్ ఆరోగ్యంగా బయటకు వచ్చే సరికి అందరూ ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి ఘన విజయాన్ని అందించి వెల్‌కమ్ చెబుతాం. టీజర్, ట్రైలర్ చూశాను. సిస్టమ్‌లో ఉంటూనే ప్రశ్నించవచ్చునని అర్థమైంది. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు సామాజిక స్పృహ ఉంటుంది. గౌరవంగా చూపించే దర్శకుడు దేవకట్టాగారికి థాంక్స్’’ అన్నారు.
హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ మాట్లాడుతూ ‘‘తేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. రిపబ్లిక్ సినిమా కోసం తేజ్ ఎంతో కష్టపడ్డాడు. ఇద్దరం స్కూల్ పిల్లల్లాగా సినిమా కోసం ప్రిపేర్ అయ్యాం. తెలుగు ప్రేక్షకుల్లాగా ఎవరూ ఉండరు. థియేటర్స్‌కు వచ్చి సినిమాను ఆదరిస్తున్నారు. నేను కూడా ఇప్పటి వరకు థియేటర్‌కు వెళ్లలేదు. ఈ సినిమాను థియేటర్‌లో చూడటానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మంచి సినిమాను ఇచ్చిన దర్శకుడు దేవ కట్టాగారికి, నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.
డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ ‘‘నాకు సాయితేజ్ హీరో కంటే తమ్ముడిగానే దగ్గరయ్యాడు. మేమిద్దం ఎంతో ఇష్టపడి చేసిన సినిమా చిత్రలహరి. నాకు చిరంజీవిగారి సినిమాల్లో అభిలాష అంటే ఎంతో ఇష్టం. రిపబ్లిక్ ట్రైలర్ చూసినప్పుడు నాకు అభిలాష సినిమానే గుర్తుకొచ్చింది. చిరంజీవిగారి కెరీర్‌లో అభిలాష ఎలాగో, సాయితేజ్‌గారి కెరీర్‌కు రిపబ్లిక్ అలా నిలవాలని కోరుకుంటున్నాను. తేజ్, దర్శకుడు దేవకట్టా, నిర్మాతలకు, మణిశర్మ తదితరులకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటన్నాను’’ అన్నారు.
నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘రిపబ్లిక్ సినిమా సాంగ్స్, ట్రైలర్ చూస్తే సినిమాలో సామాజిక స్పృహ కనిపిస్తుంది. ఇంత మంచి సినిమా చేసిన సాయితేజ్, దేవ కట్టా, నిర్మాతలకు అభినందనలు’’ అన్నారు.
డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ ‘‘ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తున్నారు. నిన్న విడుదలైన లవ్‌స్టోరికి బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు అక్టోబర్ 1న రిపబ్లిక్ విడుదలవుతుంది. ఈ సినిమా సాయితేజ్‌కే కాదు, ఇండస్ట్రీకి కూడా ఎంతో ముఖ్యం. దేవకట్టా యూనిక్ మార్క్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమాలో సాయితేజ్ మంచి బ్యూరోక్రాట్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా పెద్ద హిట్టై సాయితేజ్, డైరెక్టర్ దేవకట్టాగారికి, నిర్మాతలకు అభినందనలు’’ అన్నారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ ‘‘మా తేజును ఇక్క డ మిస్ అవుతున్నాం. తనకు ఎంతో సంకల్పబలం ఉంది. అందుకే తను అనుకున్న తేదికి రిపబ్లిక్ సినిమా విడుదలవుతుంది. దేవుడు, ప్రేక్షకుల ఆశీర్వాదాలతోనే తను త్వరగా కోలుకుంటున్నాడు. సీటీమార్ సినిమా నుంచి ప్రేక్షకులు థియేటర్స్‌కు వెల్లువలా వచ్చి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నారు. లవ్‌స్టోరికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇలా మేమున్నామంటూ భరోసా ఇస్తున్న తెలుగు ప్రేక్షకులు రిపబ్లిక్ సినిమాకు కూడా బ్రహ్మరథం పట్టాలని కోరుకుంటున్నాను. దేవకట్టాగారి సినిమాలంటే నాకెంతో ఇష్టం. ప్రస్థానం సినిమాలో కనిపించిన ఓ ఎనర్జీ మళ్లీ ఈ సినిమాలో కనిపిస్తుంది. నిర్మాతలు భగవాన్‌గారు, పుల్లారావుగారికి, ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ‘‘సాయితేజ్ నా కుటుంబ సభ్యుడితో సమానం. మా మధ్య మంచి ఎమోషనల్ బాండింగ్ ఉంది. తేజ్ చాలా మంచి మనిషి. నాకెంతో ఆప్తుడు. అక్టోబర్ 1న సాయితేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా విడుదలవుతుంది. అక్టోబర్ 15న సాయితేజ్ పుట్టినరోజు. ఈ సినిమాను హిట్ చేసి అందరూ తనకు బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. చిరంజీవిగారు, పవన్‌కళ్యాణ్‌గారి నుంచి మంచి లక్షణాలను పుణికి పుచ్చుకున్న తేజ్, దేవ కట్టాగారు చేసిన రిపబ్లిక్ ట్రైలర్ చాలా ఇన్‌టెన్స్‌గా ఉంది. సినిమా కూడా అలాగే ఉంటుందని భావిస్తున్నాను. నటిగా తనెంటో ప్రూవ్ చేసుకున్న ఐశ్వర్యా రాజేశ్‌కు అభినందనలు. నిర్మాతలకు అభినందనలు. మెగాభిమానులు, పవర్‌స్టార్ అభిమానులే కాదు, అందరి హీరోల అభిమానులకు నేను చెప్పేదొక్కటే… మంచి సినిమా చేశారు. ఆ సినిమాను చాలా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ ఎం.సుకుమార్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ దేవకట్టాగారికి, నిర్మాతలు భగవాన్‌గారు, పుల్లారావుగారికి థాంక్స్’’ అన్నారు.
రైటర్ బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ ‘‘మనం అందరం మెగాభిమానులం. సమాజం ఇలా ఉంటే బావుంటుందని చెప్పే వ్యక్తి తాలుకా ఆలోచనలను తెలియజేసేది కళ. సినిమా అనేది ఓ ఆర్ట్. సినిమాల్లో సామాజిక బాధ్యత ఉండాలని నమ్మే అతి కొద్ది మంది దర్శకుల్లో దేవ కట్టాగారు ఒకరు. సాయితేజ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా సాయితేజ్, దేవకట్టాగారికి అభినందనలు. ముప్పై ఏళ్లుగా అన్నదమ్ముల్లా కలిసి ఉండి, సినిమాలు చేస్తున్న భగవాన్‌గారు, పుల్లారావుగారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను’’ అన్నారు.