పీపుల్ మీడియా ఫ్యాక్టరీ: ఒక ఏడాదిలో రెండూ వందకోట్ల సినిమాలే!

With Karthikeya 2 and Dhamaka, People Media Factory delivered two hundred crore films back to back in the same year
With Karthikeya 2 and Dhamaka, People Media Factory delivered two hundred crore films back to back in the same year
Spread the love

కాలం బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి. అలానే సినీ పరిశ్రమలో కూడా చాలా మార్పులు సంభవించాయి. ఓటిటి లో సినిమాలు చూడటానికి అలవాటు పడిన ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కి రావడం తగ్గించేశారు అనుకున్న తరుణంలో బింబిసార, సీతారామం వంటి సినిమాలు, ఒక మంచి సినిమా చేస్తే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు అని నిరూపించాయి. 2022 లో ట్రిపుల్ ఆర్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్, భీమ్లా నాయక్, ఆచార్య వంటి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలలో కొన్ని బాక్సాఫీస్ వద్ద మంచి కలక్షన్స్ రాబట్టాయి. ట్రిపుల్ ఆర్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్, భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ వంటి సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరాయి. ఈ సినిమాలు వందకోట్ల క్లబ్ లో చేరడం అంత ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణసంస్థ నుంచి రిలీజైన రెండు సినిమాలు వందకోట్ల క్లబ్ లో చేరడం విశేషం.
టీజీ విశ్వప్రసాద్ 2017 లో స్థాపించిన ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మొదటి అమెరికాలో ఇండిపెండెంట్ సినిమాలను నిర్మించింది. నందమూరి కళ్యాణ్ రామ్ Mla సినిమాతో వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా తెలుగులో సినిమాలను నిర్మించడం మొదలుపెట్టింది ఈ సంస్థ. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా ఎన్నో హిట్ సినిమాలను నిర్మిస్తూ వచ్చారు. “గూడాచారి” “ఓ బేబీ” “రాజ రాజ చోరా” వంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో పాటు “వెంకీ మామా” “A1 ఎక్స్‌ప్రెస్” వంటి జనాదరణ పొందిన సినిమాలను నిర్మించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. 2022 సంవత్సరంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన కార్తికేయ-2, ధమాకా సినిమాలు వందకోట్ల వసూళ్లను రాబట్టాయి.
నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, చందు మొండేటి దర్శకత్వంలో నటించిన కార్తికేయ-2 బాక్సాఫీస్ వద్ద భారీ కలక్షన్స్ ను రాబట్టింది. చిన్న సినిమాగా సాదాసీదాగా విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా దాదాపుగా 120 కోట్లకు పైగా వసూలు చేసి, పాన్ ఇండియన్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఎంతో భారీగా నిర్మించిన ఈ మూవీ భారతీయ సనాతన ధర్మం, కృష్ణతత్వానికి సంబంధించిన ఒక కీలక అంశాలను ఆధారంగా అడ్వెంచరస్, థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.
ఇదే బ్యానర్ నుండి రీసెంట్ గా వచ్చిన సినిమా ధమాకా. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల హీరోహీన్లుగా నటించిన ధమాకా సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటూ కలక్షన్స్ సునామి సృష్టిస్తుంది. మాస్ మహారాజా అభిమానులకు ఈ సినిమా మంచి ట్రీట్. ఈ సినిమా కూడా వంద కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమాలు వందకోట్లు వసూలు చేయడం సాధారణ విషయమే. కానీ కంటెంట్ ఉన్న సినిమాలు, అభిమానులకు వినోదాన్ని అందించే సినిమాలు వందకోట్ల క్లబ్ లో చేరడం అనేది రేర్ థింగ్. కార్తికేయ-2, ధమాకా ఈ రెండు సినిమాలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నుంచి రావడం విశేషం. ప్రస్తుతం ఈ బ్యానర్ లో మరికొన్ని సినిమాలు నిర్మాణదశలో ఉన్నాయి. గోపీచంద్-శ్రీవాస్ రామబాణం, అవసరాల శ్రీనివాస్-నాగశౌర్య ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి, అలాగే లావణ్య త్రిపాఠితో ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా అగ్రహీరోలైన పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలు కూడా బ్యానర్ లో రూపుదిద్దుకుంటున్నాయి.