నిజ జీవితాలే ‘హంస’కు ప్రేరణ : దర్శకుడు సయ్యద్ గఫార్

hamsa short film
Spread the love
  • ‘హంస’ షార్ట్ ఫిలిం ఈనెల 18 తేదీన శనివారం సాయంత్రం రవీంద్ర భారతిలో జరిగే ‘సినివారం’ కార్యక్రమంలో ప్రదర్శించారు

ఒక రచయిత, దర్శకుడు ఓ కథను ఇలాగే చెప్పాలి అనుకుంటారు. తీరా ఆ కథ నిర్మాతల దగ్గరికి వెళ్లేసరికి దాన్ని వాళ్లు కమర్షియల్ చూపులో చూస్తారు. కథల్లోకి కమర్షియాలిటీ చొరబడిందంటే ఆ కథను ఉన్నది ఉన్నట్టు చూపించలేం. సినిమాల్లో ఎక్కువగా జరుగుతున్నది ఇదే. అప్పుడు కమర్షియల్ అంశాలు అంటూ కథలో కొత్త కొత్త మార్పులు సూచిస్తారు. తప్పని పరిస్థితుల్లో మనసు చంపుకుని ఆ మార్పులకు నడుం బిగిస్తున్నారు కొందరు రియలిస్టిక్ కథలను, సినిమాలను ఇష్టపడే రచయితలు, దర్శకులు. మీరలా కథను చప్పగా తీస్తే చూసే ప్రేక్షకులు థ్రిల్ ఫీలవ్వరు కాబట్టి మార్పులు చెయ్యవల్సిందే అంటారు. కాదంటే అవకాశం చేజారుతుంది. వాళ్లు అవునన్నట్టు తలూపితే ఓ సినిమా పడుతుంది. వెండితెర మీద తన పేరేను చూసుకుని ఆనందించవచ్చు. అయితే ఇప్పుడు ఇదెందుకు చెప్పవలసి వస్తోందంటే.. సినిమాల్లో మనం చూపని మ్యాజిక్‌ను మనం షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లలో బ్రహ్మాండంగా చూపించొచ్చు. అయితే ఇప్పుడు వెబ్ సిరీస్‌లలో కూడా కమర్షియాలిటీ తిష్ట వేసింది. రామ్ కామ్ సబ్జెక్టులు అయితేనే జనాలు రిసీవ్ చేసుకుంటారనే ఆలోచనతో అబ్బాయి అమ్మాయి కథలకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ఇది ప్రేక్షకుల నిర్ణయం అని వాళ్ల మీద నిందను మోపుతున్నారు. ఇక షార్ట్ ఫిలిమ్స్ విషయానికి వస్తే.. మనం అనుకున్న పాయింటును అనుకున్నట్టుగా తీసి మన అభిరుచిని ప్రదర్శించుకునే ఛాన్స్ ఇంకా పోలేదు. వీటిల్లో కూడా కమర్షియాలిటీ అని కొందరు బూతును, బరితెగింపును యథేచ్ఛగా పెట్టేసి ప్రేక్షకుల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం తాము అనుకున్న పాయింటుకు కమర్షియల్ వాసన తగలకుండా చాలా జాగ్రత్తగా చిన్న చిత్రాలు తీసి శభాష్ అనిపించుకుంటున్నారు. అలాంటి కోవలో వచ్చిన షార్ట్ ఫిలిం ‘హంస’. కవి, రచయిత, జర్నలిస్టు, నటుడు, దర్శకుడు అయినటువంటి సయ్యద్ గఫార్ ఈమధ్య తీసిన హంస షార్ట్ ఫిలిం ఈనెల 18 తేదీన శనివారం సాయంత్రం రవీంద్ర భారతిలో జరిగే ‘సినివారం’ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ సినిమాను చూసి చాలామంది చాలా బాగా తీశారని మెచ్చుకున్నారు. చక్కటి ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తీశారని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. ఇలాంటి రియలిస్టిక్ కథలు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సయ్యద్ గఫార్ సహా ఈ చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు. ఇందులో ముఖ్య పాత్రల్లో నటించిన బేబీ అదితి, మాస్టర్ కేతన్‌ల నటన చాలా సహజ సిద్ధంగా ఉందని మెచ్చుకున్నారు. వాళ్లను కథకు తగ్గ రీతిలో ఎన్నుకొని కథకు న్యాయం చేశారని అన్నారు. అలాగే ఈ చిత్రంలో పోలీస్ పాత్ర పోషించిన నటుడు, చంద్రశేఖర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించినందుకు చాలా గర్వంగా ఉందని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మిర్యాలగూడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని తీశామని దాని తాలూకు అనుభవాలను పంచుకున్నారు.

హంసకు మూలం ఎక్కడ: సుచంద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన హంస షార్ట్ ఫిలిం కన్నా ఓ ఐదేళ్లు ముందు ఒక కథ ఉంది. తొలుత ఆయిన ఈ కథతో షార్ట్ ఫిలిమే తీద్దామని తీశారు. కానీ, ఎక్కడో పొరపాటు జరిగి దాన్ని అలా మధ్యలోనే వదిలేశారు. అటు తర్వాత అదే కథను చక్కగా పేపర్ మీద పెట్టి, నవ తెలంగాణ పత్రిక ‘బండారు అచ్చమాంబ’ పేరిట కథల పోటీని నిర్వహించింది. ఆ పోటీలకు గఫార్ పంపిన హంస కథకు మొదటి బహుమతి లభించింది.
కరోనా మొదటి వేవ్ అప్పుడు జరగిన సందర్భం ఇది. ఈ క్రమంలో తన టేస్టుకు తగ్గ నిర్మాతగా చంద్రశేఖర్ ఆయన్ను కలవడం జరిగింది. కథ ఆయనకు వినిపించడం, నచ్చడం, అటు తర్వాత షూటింగ్‌కు వెళ్లడం అంతా చకచకా జరిగిపోయాయి. కథలో హంస పాత్ర కోసం అన్వేషించగా అదితి రూపంలో ఆయనకు మంచి బాలనటి దొరికింది. వెంటనే గంగడు పాత్రకు కేతన్ దొరికాడు. ఇంకే వాళ్లిద్దరికి నటనలో ఓనమాలు నేర్పి తెరమీదికి తేవడంలో సయ్యద్ గఫార్ కృతకృత్యులయ్యారు. అలా హంసను పట్టాల మీద ఎక్కించారు. చిన్న చిత్రమే అయినా పడ్డ కష్టం మాత్రం ఎక్కువే. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని చిత్రాన్ని ముగించారు.

హంస కథేంటి: రవీంద్ర భారతిలో హంస చిత్రాన్ని చూసినవారందరికీ ఇంత బాగా నచ్చడానికి ముఖ్య కారణం. చిత్తు కాగితాలు ఏరుకునే వారి జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు చూపడమే. హంస, గంగడు అనే రెండు చదువుకు నోచుకోని రెండు పాత్రలే మనకీ చిత్రం మొత్తంలో కనిపిస్తాయి. వాళ్లు అమాయకంగా చిత్రం చూసిన మనమీద ఎన్నో ప్రశ్నలను సంధిస్తారు. ఇద్దరు అక్కా తమ్ముడు చెత్త ఏరుకుంటూ బయలు దేరుతారు. ఆ ఏరే క్రమంలో వారికి ఎదురయ్యే సమస్యలు కనిపిస్తాయి. వారి జీవన విధానం ఎంత నిస్సారంగా ఉందో కళ్లకు కడుతుంది. ఏరుకున్న చిత్తు కాగితాలను, సీసాలను షాపులో అమ్ముకుంటే రూ.30 వస్తాయి. ఆ రూ.30లో పది రూపాయలు పప్పు ఉండలకు, పది రూపాయలు అమ్మ జ్వరానికి మాత్రలు, ఇంకో పది రూపాయలు ఇంటికి తీసుకుపోదాం అని అనుకుంటారు. కేవలం రూ.30 కోసం ఇద్దరి బాల్యం చదువుకు ఎంత దూరంగా తరిమేయబడుతుందో మనకు అర్థమవుతుంది. అక్కడినుంచి వెళ్తూ హంస ఓ షాపులో పలక దొంగతనం చేస్తుంది. షాపువాళ్లు వాళ్లను వెంబడించి దోచుకుంది పలక అని తెలిసి షాక్ అవుతారు.
70 ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో ఇంకా చదువుకు నోచుకోని బాల్యం ఉందని తెలిసి ఆ పోలీసాయన కూడా కంటతడి పెట్టుకుంటాడు. హంసకు చదువు మీద, డాన్స్ మీద ఉన్న మక్కువను చూసి వాళ్లంతా ఆమె పలక దొంగతనానికి ఏం శిక్ష వేయాలో తెలియక సందిగ్ధంలో పడతారు. ప్రతిరోజూ చెత్త ఏరుతూ వెళ్లి అక్కడ స్కూలు మెట్ల మీద కూర్చుని చాటుగా విద్యార్థులకు టీచర్ పాఠాలు చెప్పడాన్ని చాలా ఇంట్రెస్టుగా చూస్తుంటుంది హంస. ఈ విషయం టీచర్ గూడ గ్రహించలేకపోతుంది. హంసకు చదువు ఎంతో ముఖ్యం. మరి ఆమెను ఎవరు చదివించాలి? ఈ వ్యవస్థలో అలాంటి వారికి విద్యను కానుకగా ఇవ్వాలనే సోయి బాధ్యతగల పౌరులకు ఎవరికైనా ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలు వేస్తూ కథ ముగుస్తుంది. చివరి సన్నివేశానికి ప్రతీ వ్యక్తి ఆలోచనలో పడటం ఖాయం.

పెద్ద సినిమానే: హంస తనకు సంతృప్తినిచ్చిన షార్ట్ ఫిలిం అంటారు దర్శకుడు గఫార్. ఈ చిత్రం చూసిన ప్రతీ ఒక్కరూ చాలా బాగుంది అని అంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ‘ఇంకా ఈ చిత్రాన్ని యూట్యూబులో అప్‌లోడ్ చెయ్యలేదు. ఎందుకంటే దీనిని షార్ట్ ఫిలిం పోటీలకు పంపాలని భావిస్తున్నాను. ఇంకా కొన్ని వెబ్ సిరీస్, సినిమా కథలు తయారు చేసుకున్నాను. నిర్మాతలు కూడా తన కథలు నచ్చి చేయడానికి ముందుకు వస్తున్నారు. హంస ఇచ్చిన స్ఫూర్తితో సినిమా తియ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నా. మంచి కథతో వెండితెర మీద నా సత్తా నిరూపించుకుంటా. నా దగ్గర ఇలాంటి ఆర్ట్ ఫిలిమ్స్ లాంటి కథలే కాకుండా కమర్షియల్ అంశాలు ఉన్న కథలు కూడా ఉన్నాయి. త్వరలోనే ఓ మంచి పెద్ద ప్రాజెక్ట్ వివరాలు ప్రకటిస్తాను. సామాజిక ఇతివృత్తాల మీదే సినిమాలు తీయాలని అనుకుంటున్నా. నాకున్న కథ రచన మీద పట్టు, నాటక అనుభవం నన్ను సినిమా వైపు నడిపిస్తున్నాయి. నేను దగ్గరగా చూసిన జీవితాలనే హంసకు కథగా ఎంచుకున్నాను’ అని తన తదుపరి కార్యాచరణ గురించి పంచుకున్నారు.

సినివారం: ప్రతి శనివారం రవీంద్ర భారతి వేదికగా చేస్తున్న సినివారం కార్యక్రమం తనలాంటి ఎందరికో మంచి ప్రోత్సాహం అందిస్తోందని అన్నారు. తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు ఇంత మంచి ప్లాట్ ఫామ్ తీసుకుని రావడం హర్షించదగ్గ విషయం. హంస చిత్రాన్ని ప్రదర్శించి తమకు మంచి ప్రోత్సాహం అందించిన సినివారం టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని గఫార్ అన్నారు.

Related posts

Leave a Comment