కళారంగానికి ప్రాంతాలతో ప్రమేయం ఉండదని, రెండు తెలుగు రాష్ట్రాలు చిత్ర కళారంగాన్ని చిన్నచూపు చూస్తున్నాయని ప్రముఖ దర్శక రచయిత, కవి శ్రీ బి.నర్సింగరావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్ళు అయినప్పటికీ చిత్రలేఖనం, శిల్ప కళ వైపు ప్రభుత్వం ద్రుష్టి సారించలేదని ఆయన పెదవి విరిచారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రఖ్యాత చిత్రకారుడు కవి పద్మశ్రీ ఎస్.వి.రామారావు రచించిన “అలోలాంతరాళాలలో” పుస్తక ఆవిష్కరణ మహోత్సవం ఆత్మీయంగా జరిగింది.
ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీ బి.నర్సింగరావు మాట్లాడుతూ… ఆధునిక యాబ్ స్ట్రాక్ట్ చిత్రకళ ను కవిత్వాన్ని అర్ధం చేసుకుని అనుభూతి చెందాలని, రామారావు కవిత్వం అద్భుత అనుభూతిని ఇస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే మేటి తెలుగు చిత్రకారుడు ఎస్.వి.రామారావు రచనలు, చిత్రకళ తో మ్యూజియం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రచయిత శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు మాట్లాడుతూ… చిత్రకారులు కవులుగా ప్రాచుర్యం పొందడం ప్రపంచ వ్యాప్త సంప్రదాయంగా కొనసాగుతున్నదని, అందులో రామారావు తెలుగు వారు కావడం గర్వకారణం అని అభినందించారు. ఖగోళంలో చైతన్యాన్ని అన్వేషిస్తూ సాగిన కవిత్వం ఆసక్తికరంగా ఆలోచనాభరితంగా ఉందని కితాబునిచ్చారు. సభాధ్యక్షత వహించిన సీనియర్ పాత్రికేయులు శ్రీ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ రామారావు కవితల్లో రంగులతో పాటు రాగాలను కూడా పట్టుకునే ప్రయత్నం చేశారని, చదివిన వారు చిక్కనైన అనుభూతి పొందుతారని వివరించారు.
చిత్రకారులు శ్రీ ఆనంద్ గడపా, శ్రీ గిరిధర్ గౌడ్, సీనియర్ పాత్రికేయులు శ్రీ తల్లావఝుల శివాజి, శ్రీ పున్నా కృష్ణమూర్తి, శ్రీమతి పద్మలత (అమెరికా), తెనాలి ప్రచురణ కర్త సురేష్, డాక్టర్ మహ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.