కళాకారులను ఆదుకోవడం అభినందనీయం: ‘కళ’ ఎడిటర్ డాక్టర్ మహ్మద్ రఫీ

Spread the love

కరోనా లాక్ డౌన్ సమయం లో కళాకారులు ఆర్ధికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీనియర్ పాత్రికేయులు కళ పత్రిక సంపాదకులు డాక్టర్ మహ్మద్ రఫీ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా బారిన పడి చాలా మంది కళాకారులు చనిపోయారని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీల్ వెల్ కార్పొరేషన్ బండారు సుబ్బారావు సౌజన్యం తో కళ పత్రిక ఆధ్వర్యం లో శుక్రవారం తెలుగు విశ్వ విద్యాలయం అంఫి థియేటర్ లో పద్య నాటక కళాకారులకు, గాయకులకు, సినీ సంగీత వాద్య కళాకారులకు, పాత్రికేయులకు, ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్లకు, రవీంద్రభారతి అవుట్ సోర్సింగ్ సిబ్బంది మొత్తం 110 మంది కుటుంబాలకు నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువుల పంపిణీ జరిగింది. మహ్మద్ రఫీ మాట్లాడుతూ కళాకారులను సీల్ వెల్ కార్పొరేషన్ ఆదుకోవడం సంతోషంగా ఉందని సౌజన్యదాత బండారు సుబ్బారావు ను అభినందించారు. కళపత్రిక కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని చెప్పారు.
తెలుగు విశ్వ విద్యాలయం ప్రజా సంబంధాల అధికారి శ్రీ ఎస్.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కళా పోషకులు, ప్రభుత్వానికి కళాకారులకు మధ్య కళ పత్రిక వారధిగా సేవలు అందిస్తున్నదని అభినందించారు. బండారు సుబ్బారావును స్ఫూర్తి గా తీసుకుని మరింత మంది ముందుకు వచ్చి కళాకారులను ఆదుకుని, కళలకు మునుపటి వైభవం తీసుకు రావాలని కోరారు. సౌజన్య మూర్తి బండారు సుబ్బారావు జూమ్ ద్వారా స్పందిస్తూ లాక్ డౌన్ సమయం లో పోలీసు శాఖ ద్వారా వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వున్న కరోనా బాధితులకు, ఐసొలేషన్ లో వున్న పేషేంట్లకు, తలసీమియా బాధితులకు లక్షా పాతిక వేల మందికి భోజన సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. రెండు వేల నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమం లో సీనియర్ పాత్రికేయులు రియాజ్ ఖాలిద్, వాజేంద్ర, రంగస్థల రూపశిల్పి మల్లాది గోపాలకృష్ణ, నటులు కుటుంబ శర్మ, మల్లాది వెంకట రమణ, గాయకుడు మధు బాపు శాస్త్రి తదితరులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు.

Related posts

Leave a Comment