హైదరాబాద్ : కరోనా బారినపడి మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు బుధవారం (డిసెంబర్ 15) రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున చెక్కులను బాధిత కుటుంబాలకు చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న,ఎమ్మెల్యే క్రాంతి కుమార్ లు పంపిణీ చేశారు.
రాష్ట్రంలో దాదాపు వంద మందికి పైగా జర్నలిస్టు కుటుంబాలకు జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి ఈ చెక్కులను పంపిణీ చేసారు. వీరికి ఐదేళ్ల పాటు పెన్షన్ ను కూడా ప్రతి నెలా వారి వారి అకౌంట్ లలో ఐదు వేల రూపాయల చొప్పున జమ చేస్తారు. ఇందులో భాగంగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీయూడబ్ల్యూజే (ఐ జే యు) ప్రాథమిక సభ్యులు ఆరుగురు కరోనా బారినపడి మృతి చెందగా మరో ఇద్దరు అనారోగ్యం కారణంగా మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు.వీరిలో నిజామాబాద్ నగరానికి చెందిన జలపాతం ఎడిటర్ సిహెచ్ మధు, నందిపేట్ మండల ఆంధ్రభూమి విలేకరి దర్శనం అశోక్ ,ధర్పల్లి మండల సాక్షి రిపోర్టర్ అల్లాడి శేఖర్,డిచ్పల్లి టీవీ ఫైవ్ రిపోర్టర్ వేణుగోపాల్, ఆర్మూర్ ప్రజావాణి విలేఖరి రాచర్ల రాజేశ్వర్,ఆర్మూర్ TG 24 రిపోర్టర్ జ్ఞానేశ్వర్ లతోపాటు బోధన్ కు చెందిన ఉర్దూ రిపొర్టర్ ఇర్ఫాన్ ఖాన్, పిట్లంకు చెందిన మల్లాగౌడ్ కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల కమిటీ,రాష్ట్ర కన్వీనర్, జిల్లా కార్యదర్శి అంగిరేకుల సాయిలు, యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆరోగ్య కమిటీ రాష్ట్ర కన్వీనర్ రాజేష్ జిల్లా నాయకులు ప్రసాద్,మోహన్,శేఖర్,ప్రమోద్,దస్తా గౌడ్,ఖుర్శీద్ తదితరులు పాల్గొన్నారు.
టీయూడబ్ల్యూజే కృషితో 50 కుటుంబాలకు ఆర్థిక సహాయం : టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) ఆయా జిల్లాల బాధ్యుల కృషితో దాదాపు 50 బాధిత జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందడం శుభ పరిణామంగా భావిస్తున్నామని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ అన్నారు. ఈ సందర్బంగా విరాహత్ అలీ మాట్లాడుతూ.. ‘జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి 100 కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని మీడియా అకాడమీ ద్వారా అందించారు. అయితే ఈ ఆర్థిక సహాయం కోసం వివిధ జిల్లాల్లో బాధిత కుటుంబాలకు దరఖాస్తులను అందించడమే కాకుండా, దీనికి కావాల్సిన డాక్యుమెంట్లను మన యూనియన్ బాధ్యులే సమకూర్చారు. సదరు దరఖాస్తులను హైదరాబాద్ లోని మీడియా అకాడమీలో అందించే బాధ్యతను చేపట్టి ఆ కుటుంబాలకు బాసటగా నిలబడడం అభినందనీయం. అంతేకాకుండా ఇవ్వాళ పలు జిల్లాల నుండి మన యూనియన్ బాధ్యులు బాధిత కుటుంబాలకు తోడుగా వచ్చి చెక్కులు ఇప్పించారు. ఈ సందర్భంలో ప్రత్యేకంగా మెదక్, నిజామాబాద్ జిల్లాలు మరియు హెచ్.యు.జే బాధ్యులను అభినందిస్తున్నాను” అని పేర్కొన్నారు.