ఇండస్ట్రీ బాధ్యత మరచిపోతోందా!?

tollywood special story
Spread the love

ఫ్రెష్ ఫీల్‌ని కోరుకోవడం ఆడియన్స్ నైజం. ఎప్పటికీ ఫ్రెష్ ఫీల్‌నిచ్చే సినిమాలివ్వడం ఇండస్ట్రీ బాధ్యత. ఈ రెంటి విషయాల్లో తెలుగు ఇండస్ట్రీ ఒక్కడుగూ ముందుకు వేయలేదు. ఇండస్ట్రీ బాధ్యత మరచిపోతోందా!? అనిపిస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు, పాన్ ఇండియా పటాటోపాలు.. ఇవన్నీ పరిశ్రమను పదికాలాలు పరిగెత్తించే బలాన్నిచ్చేవైతే కాదు. అంటే, మంచి సినిమాలే రాలేదా? అన్న ప్రశ్న చటుక్కున బుర్రకు తట్టొచ్చు. ఆ ప్రశ్నకు సమాధానంగా కొన్ని చిత్రాలను ఉదహరించొచ్చు. అవన్నీ కథాబలం, కథనగమనం చూపించిన చిత్రాలుగానే చూడగలం తప్ప, స్టార్లు పెంచుకున్న చిత్రాలుగా అభివర్ణించలేం. స్ట్రెయిట్‌గా చెప్పాలంటే ‘బావున్న’ సినిమాలొచ్చాయే తప్ప, ‘చాలా బావుంది’, ‘చాలా చాలా బావుంది’ అనదగ్గ సినిమాలైతే లేవనే చెప్పాలి. బావున్న సినిమాలొచ్చాయి. అలాంటి సినిమాలను పక్షపాతం లేకుండా ఆడియన్స్ ఆదరించారు. దేశాలు దాటొచ్చిన కథలను ఆదరించారు. భాషాభిమానం పక్కనపెట్టి అనువాద చిత్రాలనూ అక్కున చేర్చుకున్నారు. రొటీన్‌కు భిన్నంగా సినిమా చూపించే టెక్నిక్‌నూ ఆహ్వానించారు. అలా వచ్చిన వాటిలో కథాపరంగా బలాన్ని చూపించి గెలిచినవి కొన్ని. కథనంతో ఆడియన్స్‌ని మెప్పించిన సినిమాలు ఇంకొన్ని. చాలాకాలంగా అలవాటుపడిన రొటీన్ సినిమా ఫార్మాట్‌ను దాటి సరికొత్త అనుభూతిని పంచిన సినిమాలు మరికొన్ని. వైవిధ్యం అన్నది ఏరూపంలోవున్నా ఆడియన్స్ ఓకే అన్నారు. బాక్సాఫీస్ వద్ద సినిమాను మోశారు. కలెక్షన్లిచ్చి కొత్త కళనిచ్చారు. ఒక్కముక్కలో చెప్పాలంటే మంచి సినిమాలు తీస్తే మేమున్నామన్న భరోసానిచ్చారు. అలాంటి ఆశలునింపిన సినిమాల ప్రత్యేకతను చూద్దాం…
ఆ మధ్య ‘ఓ బేబీ’ అని పిలుచుకునేంత ముద్దుగా మనముందుకు వచ్చింది సమంత. కొరియా నుంచి తెచ్చుకున్న కామెడీ, ఫాంటసీ డ్రామాను తెరకెక్కించిన దర్శకురాలు బీవీ నందినరెడ్డి. వృద్ధురాలు ఉన్నఫళంగా యవ్వనంలోకి వస్తే..? అన్న సింగిల్ పాయింట్ మీద నడిచిన మంచి కథ. దీంతోపాటు కథనం కూడా కొత్త అనుభూతి కలిగించటంతో ఆడియన్స్ మురిసిపోయారు. మంచి క్లాసిక్ చూశామన్న భావనకు గురయ్యారు. కథాబీజం అద్భుతమని చెప్పలేం. అయినప్పటికీ తమ అభిరుచిని మరోసారి రుజువు చేశాడు ఆడియన్స్. జాలిలేని బోయవాడు పరివర్తనతో వాల్మీకి ఎలా అయ్యాడన్న కథాసారాన్ని ఇప్పటి విలువలకు అప్లై చేస్తూ వచ్చిన చిత్రం గద్దలగొండ గణేశ్. హీరోయిజం సినిమాలు చేస్తూ వచ్చిన వరుణ్ ఒక్కసారిగా నెగెటివ్ క్యారెక్టర్‌తో సినిమా చేశాడు. ఆడియన్స్‌కి అదో భావన అనిపించింది. రౌడీని హీరోగా పెట్టి అతని ఆత్మకథతో సినిమా తీయడమనే కానె్సప్ట్ కాస్త వెరైటీ అనిపించింది. అలా బాక్సాఫీస్‌ను గద్దలకొండ.. దడదడలాడించాడు.
సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో హీరోయిజానికి ‘జెర్సీ’ ద్వారా కొత్త డెఫినిషన్ ఇచ్చినవాడు నాని. కొడుకు ముందు హీరోగా పడిపోకూడదనుకునే తండ్రి కథ. ఈ సింగిల్ పాయింట్‌ను ఎంతో ఎత్తులో చూపించాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో కథ చూపించిన విధానానికి ఆడియన్స్ ఫ్లాటైపోయారు. తండ్రీ కొడుకుల ఎమోషన్స్ ఫ్రెష్ ఫీల్‌నివ్వడంతో -ఆడియన్స్ హిట్టిచ్చేశారు. కొన్ని సినిమాలు వసూళ్లపరంగా ఓహో అనిపించలేకపోయినా అద్భుతమైన పాయింట్‌తో వచ్చినవీ ఉన్నాయి. అలాంటి వాటిలో కల్యాణ్‌రామ్ చేసిన 118 సినిమా పెట్టొచ్చు. క్లైమాక్స్ ఆడియన్స్‌కి బలంగా కనెక్టైపోవడంతో -ఓకే అనేశారు. ఫైనల్‌గా వసూళ్లను బ్రేక్‌ఈవెన్ దాటించి -కల్యాణ్‌లో మరో వైవిధ్యమైన సినిమా చేసే ఉత్సాహాన్ని నింపారు. చాలా సినిమాలకు కథే హీరో అయినా.. కొన్ని సినిమాలకు మాత్రం హీరోయే కథవుతాడు. అలాంటి క్రేజ్ తెచ్చుకున్న కుర్ర హీరోల్లో అడవి శేష్ పేరు గట్టిగా ప్రస్తావించొచ్చు. అడవి శేష్ సినిమా అంటే -అందులో ఏదోక కొత్తదనం ఉంటుందని అనుకునేంతగా ఇమేజ్ తెచ్చుకున్నాడు శేష్. ‘ఎవరు?’ అని ప్రశ్నిస్తూ వచ్చాడు శేష్. కొత్త కథ. ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే. దానికితోడు శేష్ పెర్ఫార్మెన్స్. ఫిదా అయిపోయారు ప్రేక్షకులు. ఫ్లాపులకు ఎదురెళ్లేవాడు ఎప్పటికైనా హిట్టు కొడతాడని బెల్లంకొండ సాయికి ధైర్యాన్నిచ్చిన రీమేక్ సినిమా ”రాక్షసుడు’. ఇదొక క్రైం థ్రిల్లర్ జోనర్. రొటీన్ జోనర్‌కు ఫ్రెష్ టచ్ నిచ్చాడు దర్శకుడు రమేష్ వర్మ. ఆరు వరుస ప్లాపులకు వెరవకుండా ఏడో అడుగుతో ఆడియన్స్‌కి మంచి అనుభూతినిచ్చాడు సాయిశ్రీనివాస్. చిన్న పిల్లలను హత్య చేసే సైకో -వాణ్ని పట్టుకునేందుకు కంకణం కట్టుకున్న హీరో. కుర్చీల అంచుల్లో కూర్చోబెట్టిన ఉత్కంఠ కథనం -ఆడియన్స్‌ని కట్టిపడేసింది. వీడియో గేమ్స్‌కి ఎడిక్టైన అమ్మాయి. ఆ కథలో హారర్ ఎలిమెంట్స్. అదే -‘గేమ్ ఓవర్’. చిత్రమైన కథ, కథనాలు ప్రేక్షుకలకు నచ్చేశాయి. ముఖ్యంగా తాప్సి నటనకు బలంగా కనెక్టైపోయారు. చూడదగ్గ మంచి సినిమాగా టాగ్ తగిలించేశారు. హీరో సందీప్ కిషన్ మరికొంత కాలం ఉత్సాహంగా సినిమాలు చేసే అవకాశమిచ్చిన కథ ‘నిను వీడని నీడను నేనే’. మంచి కథ దొరికిందన్న ఆనందంతో స్వీయ నిర్మాణానికీ దిగాడు. అనుకున్నంత వసూళ్లు రాబట్టిన సినిమాకాకున్నా కథాపరంగా ఆడియన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వగలిగింది. అద్దంలో మరొకరి ప్రతిబింబం కనిపిస్తే-అన్న ఐడియాతో కథల్లుకున్నాడు దర్శకుడు కార్తీక్‌రాజు. సరైన సినిమా పడక సతమతమవుతున్న నిఖిల్‌కు కొత్త ఊపిరినిచ్చిన సినిమా ‘అర్జున్ సురవరం’. విద్యారుణాలు, సర్ట్ఫికెట్ల స్కామ్ నేపథ్యంగా వచ్చిన ఈ రీమేక్‌ను తెలుగు ఆడియన్స్ అదరించారు. నిఖిల్ కెరీర్‌కు ఈ సినిమాతో కొత్త ఊపునిచ్చారు. సినిమా హిట్టు ఫ్లాపు అన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే -మజిలీ, చిత్రలహరి, ఏబీసీడీ, ఫస్ట్‌ర్యాంక్ రాజు, ఇస్మార్ట్ శంకర్, కథనం, కౌసల్యా కృష్ణమూర్తి, గ్యాంగ్‌లీడర్, ఆవిరి, మీకు మాత్రమే చెప్తా, మిస్‌మ్యాచ్, 90ఎంఎల్ సినిమాల్లోని కథాబీజమూ వైవిధ్యమే. అయితే ఆయా చిత్రాలు కొన్ని ఆడియన్స్ కనెక్టైతే, మరికొన్ని రెండోరోజు కూడా నిలబడలేకపోయాయి. ఏదేమైనా కథా ప్రాధాన్యమున్న చిత్రాల లెక్కను పెద్దగానే చెప్పుకోవచ్చు.

Related posts

Leave a Comment