(ఎం.డి.అబ్దుల్ -టాలీవుడ్ టైమ్స్)
హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 19వ వర్ధంతి ఘనంగా జరిగింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్టాత్మక కాళోజీ పురస్కారం- 2022కు ఎంపికైన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన ప్రముఖ కవి శ్రీరామోజు హరగోపాల్‌ను సన్మానించి, అవార్డును అందజేసి అభినందనలు తెలిపారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణ రావు జ్ఞాపకార్ధం సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మాక అవార్డు 2022ను యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులుశ్రీరామోజు హరగోపాల్‌కు దక్కడం ఆనందదాయకమని , రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణకు చెందిన వైతాళికులు, కవులు, సాహితీ వేత్తలు, మేథావుల సేవలను భవిష్యత్ తరాలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు హరగోపాల్‌ను ఎంపిక చేసిందని ఆయన తెలిపారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల మేరకు హరగోపాల్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ అవార్డుకింద హరగోపాల్ రూ. లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయల (1,01,116/-) నగదు, కాళోజీ అవార్డును షీల్డ్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజాకవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణ రావు నిజాం దమననీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా కలం ఎత్తిన గొప్ప యోధుడు అని అభివర్ణించారు. కాళోజీ అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ నిర్మాత సీఎం కేసీఆర్‌కు కాళోజీ రచనలు, కవిత్వం అంటే ఎంతో అభిమానమని తెలిపారు. పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు, వైతాళికుడు మన కాళోజీ నారాయణ రావు అని కొనియాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజాకవి కాళోజీని గౌరవిస్తూ వారి జన్మదినం (సెప్టెంబర్ – 9)ను ‘తెలంగాణ భాషా దినోత్సవం’ గా జరుపుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, రమణాచారి, మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీ వైస్ ఛైర్మన్ కొరమోని వెంకటయ్య, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు, ప్రొఫెసర్ మనోజ తదితరులు పాల్గొన్నారు.
శ్రీరామోజు హరగోపాల్‌కు ఎమ్మెల్సీ కవిత అభినందనలు
కాళోజీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో కాళోజీ నారాయణ రావుకు ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. అనం తరం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్టాత్మక కాళోజీ పురస్కారం- 2022కు ఎంపికైన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన ప్రముఖ కవి శ్రీరామోజు హరగోపాల్‌ను సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రజాకవి కాళోజీ చేసిన సాహిత్య సేవలను స్మరించుకునేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అక్టోబర్ 15, 16వ తేదీల్లో సాహిత్య సభలు నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్ మంత్రి శ్రీదేవి, టీఎస్ ఫుడ్స్ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి పాల్గొన్నారు.