- ఏ హీరోకైనా అభిమానులు ఉంటే పవన్ కళ్యాణ్ కు మాత్రం భక్తులు ఉంటారు.
- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు సమాజంలో జరిగే వివిధ పరిణామాలపై ఆవేశంతో కాక అవగాహనతో ప్రతిస్పందించడం, ఇతరులను మోటివేట్ చేయడం చేస్తే చాలు ఐదారేళ్ళలోనే ఒక మెరుగైన సమాజాన్ని మనం చూడగలుగుతాం. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఆ శక్తి ఉంది.
పవన్ కళ్యాణ్….!
కొంతమంది ఎందుకు పుడతారో ఎవరికీ అర్ధం కాదు. వారు చేసే పోరాటాలు, వారు నమ్మే సిద్ధాంతాలు, వారు సాధించే విజయాలు చూసాక మాత్రమే వాళ్ళు వారి కోసం కాదు మన కోసం పుట్టారని అందరికీ అర్ధమవుతుంది. వారి జీవితం ఒక చరిత్ర అవుతుంది, వారి స్వరం ఒక గర్జనవుతుంది, వారి జననం ఒక పండుగవుతుంది. అలాంటివాడు వ్యవస్ధలో ఒక వ్యక్తిగా కాదు శక్తిగా ఎదుగుతాడు. అలాంటి శక్తే పవన్ కళ్యాణ్…!
గట్టిగా ఊపిరి తీసుకుని మొదలెట్టి ఊపిరి ఉన్నంతవరకూ మాట్లాడేద్దాం అనిపించేంతగా మనల్ని ప్రభావితం చేసే వ్యక్తులు జీవితం మొత్తంలో కొందరే కనిపిస్తారు. అలాంటి వ్యక్తుల్లో ఒకడు పవన్ కళ్యాణ్.
తన నటనతో, తన ప్రతిభతో కొన్ని కోట్లమంది అభిమానుల హృదయాలను గెలుచుకుని తెలుగు సినీ చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించి పవర్ స్టార్ గా ఎదిగి తనని తాను నిరూపించుకున్న అద్భుతమైన నటుడు పవన్ కళ్యాణ్.
అభిమానుల జీవితాలు ఎలా పోతే మనకెందుకు, మనం కూల్ డ్రింక్ కంపెనీలకో , కార్పొరేట్ కంపెనీలకో యాడ్లు చేసేసుకుని కోట్లు సంపాదించేసుకుందాం అనుకుంటూ పసిడి నుండి ఫినాయిల్ దాకా, కూల్ డ్రింక్స్ నుండి కుక్కబిస్కెట్ల దాకా ఏమాత్రం సిగ్గుపడకుండా యాడ్స్ చేసేసి డబ్బు పోగేసుకునే హీరోల మధ్యలో… తన ఇమేజ్ ను క్యాష్ చేసుకోకుండా సమాజం పట్ల బాధ్యతగా నడుచుకుంటున్న ఒకే ఒక్క హీరో పవన్ కళ్యాణ్.
ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ ది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే సమయంలో అతను స్పందించే తీరు, చేసిన సాయాన్ని ఎప్పుడూ ఎక్కడా ఏమాత్రం పబ్లిసిటీ చేసుకోకుండా హుందాగా వ్యవహరించే నైజం అభినందనీయమైనది. సినీపరిశ్రమ మొత్తంలో ఎన్నో గుప్త దానాలు చేసి, ఎందరినో ఆదుకుని, ఎందరికో జీవితాన్నిచ్చిన నిజమైన హీరో పవన్ కళ్యాణ్.
అద్భుతమైన జీవితం, అధునాతన సౌకర్యాలు, ఆకర్షణీయమైన సంపాదన, అంతులేని ఆస్తులు ఉండి కూడా, అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవించగలిగి ఉండి కూడా… దేశం పట్ల ప్రేమతో, సమాజం పట్ల ఆవేదనతో, ప్రజల గురించిన ఆలోచనతో , అనుక్షణం తనవంతుగా దేశానికి ఏదో చేయాలని తపిస్తూ… ప్రజాసేవ చేయాలని భావిస్తూ… తన అమూల్యమైన కాలాన్నీ, అద్భుతమైన జీవితాన్నీ సమాజం కోసం అంకితం చేసిన ఆదర్శప్రాయుడు పవన్ కళ్యాణ్.
జనసేనను ప్రారంభించి రాజకీయాల్లోకి వచ్చాకా ఆశయాలపై పెట్టిన దృష్టి ఆశయసాధనపై పెట్టకపోవడం వల్లో, అవగాహనారాహిత్యం వల్లో , ఓవర్ ఎక్స్పక్టేషన్ల వల్లో, ప్రత్యర్ధి పార్టీల శక్తిని సరిగా అంచనా వేయలేకపోవడం వల్లో, ప్రజల నమ్మకాన్ని పొందలేకపోవడం వల్లో , రాజకీయాల్లో దారుణమైన ఎదురుదెబ్బ తినడం వాస్తవమే అయినా అతిత్వరలో తమ లోపాలను సరిచేసుకుని ప్రణాళికాబద్ధమైన వ్యూహాలతో రాష్ట్ర రాజకీయాల్లో బలమైన పార్టీగా జనసేనను నిలుపగలిగే సత్తా జనసేనానికి ఖచ్చితంగా ఉంది.
ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి. సినిమాల్లోనైనా రాజకీయాల్లోనైనా గెలుపోటములకు అతీతంగా పవన్ కళ్యాణ్ ను ప్రేమించి, అభిమానించి, ఆదరించే మనసు వారికి ఉంది. వీరికి ఉన్న యూనిటీ , డెడికేషన్ , హెల్పింగ్ నేచర్ లను ఈ సందర్భంగా ఖచ్చితంగా మెచ్చుకోవాలి. పవర్ స్టార్ మీద అభిమానంతో సమాజానికి ఉపయోగపడే ఎన్నో సేవా కార్యక్రమాలను గ్రామగ్రామాల్లోనూ వీరు చేయడం చాలా అభినందనీయం.
ఏ హీరోకైనా అభిమానులు ఉంటే పవన్ కళ్యాణ్ కు మాత్రం భక్తులు ఉంటారు. పవన్ కళ్యాణ్ కోసం ప్రాణాలైనా ఇచ్చే అభిమానులు వీధివీధికీ ఇంటింటికీ మనకి కనిపిస్తూనే ఉంటారు. రాజకీయాల్లో జనసేన విజయం కోసం సహనం, సంయమనం వంటి లక్షణాలను తమ హీరోనుంచి వీరు అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు సమాజంలో జరిగే వివిధ పరిణామాలపై ఆవేశంతో కాక అవగాహనతో ప్రతిస్పందించడం, ఇతరులను మోటివేట్ చేయడం చేస్తే చాలు ఐదారేళ్ళలోనే ఒక మెరుగైన సమాజాన్ని మనం చూడగలుగుతాం. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఆ శక్తి ఉంది.
వయసుతో జెండర్ తో సంబంధం లేకుండా కులాలకు మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని , మనస్తత్వాన్ని అభిమానించేవాళ్ళు ఆరాధించేవాళ్ళు చాలాచోట్ల మనకి కనిపిస్తారు. వారికి తమ పార్టీ సిద్ధాంతాలను , నిబద్ధతను రీచ్ అయ్యేలా చేయగలిగితే జనసేన తన ఉనికిని చాటుకుని బలిష్టం అవుతుంది.
పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కునే ప్రోసెస్ లో తమ ఉనికిని కాపాడుకోవడం కోసం అతని వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసినపుడు కూడా చాలా సంస్కారంగా స్పందించి , హుందాగా వ్యవహరిస్తున్న తీరు అభినందనీయం. అరగంటలో పంపేస్తానని బతిమాలేవాళ్ళు, అన్నీ చేస్తుందా అని ఆరాతీసేవాళ్ళు కూడా ఫ్యూచర్లో నీ వైవాహికజీవితాన్ని విమర్శిస్తారు. అప్పుడు కూడా ఇలాగే హుందాగా ప్రవర్తించాలి.
కథానాయకుడి స్ధానం నుండి ప్రజానాయకుడి స్ధానం వరకూ ఎదగడం అంటే సాధారణ విషయం కాదు. ప్రజల అభిమానాన్నీ, అభిమానుల నమ్మకాన్నీ మరింతగా పెంపొందించుకునే ప్రయత్నం చేస్తూ , సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ తన సత్తా చాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… జనసేనాని , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
- రాధాకృష్ణ