ఘనంగా తిరుమల బ్యాంక్ 24వ వార్షికోత్సవ వేడుకలు
కస్టమర్ల కు నమ్మకం కలిగిస్తూ తక్షణ సేవలు అందిస్తూ 24 ఏళ్ళ పాటు సహకార బ్యాంక్ కొనసాగడం అభినందనీయం అని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొలేటి దామోదర్ గుప్తా కొనియాడారు. ఎన్నో జాతీయ బ్యాంకు ల మధ్య పోటీ పడుతూ తిరుమల కో ఆపరేటివ్ బ్యాంకు మంచి పేరు తో మనుగడ సాగించి గుర్తింపు పొందడం ప్రశంసనీయం అని ఆయన అభినందించారు. శనివారం కాచిగూడ టూరిస్ట్ హోటల్ లో తిరుమల సహకార బ్యాంక్ 24 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిధిగా విచ్చేసిన కొలేటి దామోదర్ ఆ బ్యాంక్ అభివృద్ధి లో గణనీయమైన పాత్ర పోషించిన చైర్మన్ ఎన్.చంద్రశేఖర్ తో పాటు కొందరు కస్టమర్ల ను సన్మానించారు. హీరో సుమన్ మాట్లాడుతూ అంకితభావం తో ఇన్నేళ్ల పాటు బ్యాంక్ కొనసాగించడం అద్భుతం అన్నారు. సమాజ అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకం అన్నారు. తిరుమల పేరు పెట్టుకోవడమే గొప్ప సక్సెస్ అని చెప్పారు.
సభాధ్యక్షత వహించిన బ్యాంక్ చైర్మన్ ఎన్.చంద్రశేఖర్ మాట్లాడుతూ నిజాయితి తో సేవలు అందించి పేద, మధ్య తరగతి వారి తో పాటు ఉన్నత వర్గాల వారిని ఆకట్టుకున్నామని అన్నారు. వచ్చే ఏడాది వరకు రజతోత్సవ వేడుకలు జరుగుతాయని, ఈ సందర్భంగా తమ కస్టమర్ల కు అనేక రకాల సౌకర్యాలు, రాయితీ లు అందించనున్నట్లు ప్రకటించారు. ఈ వేడుక లో డాక్టర్ ఎం.ఎస్..శ్రీనివాస్, జస్టిస్ జి.గోపాలకృష్ణ మూర్తి, అటవీ శాఖ పూర్వ ముఖ్య కంజెర్వేటర్ పి.మల్లికార్జునరావు, స్టాంజా కార్పొరేషన్ ఎండీ నీరజ్ లఖోటియా, సీనియర్ పాత్రికేయులు డాక్టర్ మహ్మద్ రఫీ, సిఇఓ వి.వి.శోభనాద్రి, న్యాయవాది కె.వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలుత నవరస గాయని ఆమని సారధ్యం లో సుభాష్, శ్రీనివాస్, అమృత తదితరుల సినీ సంగీత విభావరి వీనుల విందు చేసింది. వందలాది బ్యాంక్ కస్టమర్లు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.