‘శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం కోసమే తాను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తా’నని చెబుతోంది సెన్సేషనల్ హీరోయిన్గా దూసుకుపోతున్న రష్మిక మందన్న. శరీరం, మనసు రెండింటి మధ్య సమన్వయం కుదిరితేనే ఆనందమయ జీవనం సాధ్యమని..యాభైఏళ్ల వయసొచ్చినా వ్యాయామాన్ని వదిలిపెట్టనంటోంది. స్వతహాగా ఫిట్నెస్ ప్రేమికురాలైన రష్మిక సోషల్‌మీడియాలో తరచు ఫిట్నెస్ వీడియోల్ని షేర్ చేస్తుంది. రష్మిక మాట్లాడుతూ.. “ప్రతి పనిలో ఉత్తమమైన ప్రతిభ కనబరచాల‘న్నదే నా లక్ష్యం. అది సాధ్యం కావాలంటే శారీరకంగా కూడా శక్తివంతంగా ఉండాలి. ఎవరి మెప్పుకోలు కోసమో వ్యాయాయం చేయాలనుకోను. ఫిట్‌గా ఉంటేనే రోజువారి వ్యవహారాలు కూడా సౌకర్యవంతంగా అనిపిస్తాయి. కెమెరా ముందు కూడా అందంగా, ఆహ్లాదభరితంగా కనిపిస్తాం. మహిళలు ఎక్కువగా బరువులు ఎత్తకూడదనే అపోహ ఉంది. ఓ మోస్తరు బరువులు ఎత్తడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గడంతో పాటు ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. శరీరఛాయ కూడా మెరుగుపడుతుంది. ఈ మధ్యే వాలీబాల్ ఆడటం నేర్చుకున్నా. ఆ ఆట కూడా ఫిట్‌నెస్‌లో ఓ భాగంగా భావిస్తా” అని చెప్పింది.
సౌత్‌లో వరుసగా సూపర్ స్టార్స్‌తో సినిమాలు సైన్ చేసిన రష్మిక తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో సరసన హీరోయిన్ చాన్స్ కొట్టేసింది. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా ఇండియాస్ గ్రేటెస్ట్ కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కుతున్న ‘మిషన్ మజ్ను’ అనే మూవీలో రష్మిక లీడ్ రోల్ పోషిస్తోంది. 1970వ దశకంలో జరిగిన కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రా
ఏజెంట్‌గా సిద్ధార్థ్ నటిస్తున్నాడు. అతని సరసన కథానాయికగా రష్మిక కనిపించనుంది. యాడ్ ఫిల్మ్ మేకర్ శాంతను బాగ్చి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ మూవీలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందంటూ రష్మిక ట్వీట్ చేశారు. బాలీవుడ్ ఎంట్రీపై రష్మిక మాట్లాడుతూ.. అన్ని భాషల్లో ప్రేక్షకుల అభిమానాన్ని పొందడం అదృష్టంగా భావిస్తున్నాననీ ‘మిస్టర్ మజ్ను’లో నటిస్తుండటం చాలా సంతోషమంటూ చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ‘ఛలో’, ‘గీతగోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న రష్మిక ఇటీవల కాలంలో వరుస హిట్లతో వరుస అవకాశాలు అందుకుంటోంది.