(చిత్రం : రైటర్ పద్మభూషణ్, విడుదల తేదీ: ఫిబ్రవరి 3, 2023, రేటింగ్ : 3/5, రచన, దర్శకత్వం : షణ్ముఖ ప్రశాంత్,
నటీనటులు : సుహాస్, రోహిణి మొల్లేటి, టీనా శిల్పరాజ్, ఆశిష్ విద్యార్థి, గోపరాజు రమణ, శ్రీ గౌరీ ప్రియ తదితరులు. ఛాయాగ్రహణం : వెంకట్ ఆర్. శాకమూరి, నేపథ్య సంగీతం, స్వరాలు : కళ్యాణ్ నాయక్, స్వరాలు : శేఖర్ చంద్ర , నిర్మాతలు : అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్).
నటుడుసుహాస్ నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయికగా నటించింది. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పించారు. తెలుగు చిత్రసీమకు ‘కలర్ ఫోటో’తో సుహాస్ కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ చిత్రంకంటే ముందే అతడు కొన్ని సినిమాల్లో క్యారెక్టర్లు చేశాడు. అంతకు ముందు ఛాయ్ బిస్కెట్ యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. ఇప్పుడు సుహాస్, ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలయికలో ‘రైటర్ పద్మభూషణ్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో హీరో తల్లిదండ్రులుగా రోహిణి, ఆశిష్ విద్యార్థి నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం…
కథ : విజయవాడలోని లైబ్రరీలో పద్మభూషణ్ (సుహాస్) ఉద్యోగి. రైటర్ పద్మభూషణ్ అనిపించుకోవాలనేది అతడి ఆశ..ఆశయం కూడా! ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా ఓ పుస్తకం రాస్తాడు. నాలుగు లక్షలు అప్పు చేసి మరీ పబ్లిష్ చేస్తాడు. పేరు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకుంటాడు. ఆ పుస్తకం సక్సెస్ కాదు. అయితే, అతడి పేరు మీద ఎవరో పుస్తకం పబ్లిష్ చేస్తారు. ఒక బ్లాగ్ కూడా మైంటైన్ చేస్తారు. అది సూపర్ సక్సెస్ అవుతుంది. దాంతో డబ్బులున్న మేనమామ పిల్లను ఇవ్వడానికి ముందుకు వస్తాడు. మరదలు సారిక (టీనా శిల్పరాజ్)పై పద్మభూషణ్ మనసు పారేసుకుంటాడు. మరదలు సారికను వదులుకోకూడదని అనుకోవడంతో పాటు తల్లిదండ్రుల ముఖాల్లో సంతోషం, తనకు లభిస్తున్న పేరు చూసి ఆ పుస్తకం రాశానని అబద్ధం చెబుతాడు. అసలు… పద్మభూషణ్ పేరు మీద పుస్తకం రాసింది ఎవరు? అతడు రాయలేదనే నిజం తెలిసిన తర్వాత సారిక, తల్లిదండ్రులు ఎలా స్పందించారు? పద్మభూషణ్ ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో అతడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ : ఏది ఓ సగటు యువకుడి కథ! ఇదొక అమ్మ కథ! సినిమా ప్రారంభంనుంచి చివరివరకు ఆద్యంతం ఎంతో ఆసక్తిగా కథ నడుస్తుంది. సన్నివేశాలన్నీ వేటికవే సాటిగా నడిచి సినిమా చూస్తున్న ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. తనది కాని పేరు, గౌరవాన్ని అబద్ధంతో పొంది సమాజంలో సెలబ్రిటీగా మారిపోయిన అతడు ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొన్నాడన్నది ఆద్యంతం వినోదాత్మకంగా ఈ సినిమాలో చూపించారు. మగవాళ్ల విషయంలో కలల్ని, అభిరుచులను ప్రోత్సహించే సమాజం మహిళలకు వచ్చే సరికి కనీసం వారి ఇష్టాల్ని, అభిప్రాయాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించరనే సందేశాన్ని చూపించారు. పెళ్లి తో మహిళల కలలకు ముగింపు పడినట్లు కాదని,వారి ఇష్టాల్ని గౌరవించాలని ఈ సినిమాలో భావోద్వేగభరితంగా చూపించారు. సినిమా ఫస్ట్ హాఫ్‌లో తాను రాసిన పుస్తకాన్ని ఎలాగైనా అమ్మాలని ప్రయత్నిస్తూ సుహాస్ పడే కష్టాల నుంచి కామెడీని రాబట్టే ప్రయత్నం చేశారు దర్శకుడు. సుహాన్, టీనా శిల్పరాజ్ లవ్ డ్రామా ఒకే అనిపిస్తుంది. చివరి ఇరవై నిమిషాలు ఈ సినిమాకు పెద్ద ప్లస్‌గా నిలిచింది. ఎమోషనల్‌గా సాగే ఈ సన్నివేశాల నుంచి చక్కటి ఫ్యామిలీ డ్రామా పడింది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఓ కల అంటూ ఉంటుంది. దానిని సాకారం చేసుకోవడం కోసం ఎంత కష్టమైనా పడాలనే తపన సైతం ఉంటుంది. కష్టపడకుండా కల నెరవేరితే? ఈజీగా మన పాకెట్ పేరు, ప్రతిష్ఠలతో నిండితే? మనసులో నిజాయితీ నిండిన వ్యక్తి అయితే… తనది కాని జీవితంలో అడుగులు వేయడానికి సందేహిస్తూ సంకోచిస్తాడు. అయితే, తాను ప్రేమించిన అమ్మాయి, అమ్మానాన్నల కోసం తప్పటడుగు వేసే ప్రమాదం ఉంది. అటువంటి యువకుడి కథే ఈ ‘రైటర్ పద్మభూషణ్’. ‘రైటర్ పద్మభూషణ్’ పతాక సన్నివేశాల వరకు ప్రేక్షకుడు ఇదొక సగటు యువకుడి కథని ఫీలవుతాడు. అయితే, అసలు విషయం ఆ తర్వాత తెలుస్తుంది. ఇదొక అమ్మ కథ అని! ఇంతకు మించి చెబితే ట్విస్ట్ రివీల్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి స్పాయిలర్స్ ఇవ్వడం లేదు. నిజం చెప్పాలంటే… థియేటర్లో ప్రేక్షకుడు కాస్త ఆలోచిస్తే ఇంటర్వెల్ ట్విస్ట్ కంటే ముందు క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించవచ్చు. మొదటి పది పదిహేను నిమిషాలు చూశాక చివరికి హీరో ఏం చేస్తాడనేది చెప్పవచ్చు. అంత రెగ్యులర్ రొటీన్ స్క్రీన్ ప్లే, సన్నివేశాలతో సాగే చిత్రమిది. మరి, ఇంకేముంది? అని ఆలోచిస్తే… క్లైమాక్స్! సుహాస్, రోహిణి నుంచి దర్శక నిర్మాతల వరకూ… అందరూ ఆ క్లైమాక్స్ మీద నమ్మకం పెట్టుకుని సినిమా చేశారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి… చివరి పదిహేను నిమిషాలు మనల్ని మర్చిపోయి, అప్పటి వరకు జరిగిన కథను మర్చిపోయి మనసుతో సినిమా చూస్తాం. అంతలా క్లైమాక్స్ సీన్ కదిలిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ప్రేమకథ, ఆ తర్వాత వచ్చే ఫ్యామిలీ సన్నివేశాల్లో పెద్దగా పస లేదు. కాకపోతే… థియేటర్‌లో హీరో హీరోయిన్ సన్నివేశాలు కొన్ని గట్టిగా పేలతాయి. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. కొన్ని చోట్ల కామెడీ బాగుంది. పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం కూడాఒకే! సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఒక మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ కలిగి హాయిగా థియేటర్లోంచి బయటికి వస్తాం. రైటర్ పద్మభూషణ్ టీజర్స్, ట్రైలర్స్ చూసి ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా అనే నమ్మకంతో థియేటర్‌లో అడుగుపెట్టిన ప్రేక్షకులకు ఫన్‌తో పాటు చక్కటి సందేశాన్ని అందించి సర్ ప్రైజ్ చేశాడు డైరెక్టర్ షణ్ముఖ్ ప్రశాంత్. నిజాయితీతో కష్టపడి సంపాదించుకున్న పేరు, డబ్బు ఏదైనా దానిని మనస్ఫూర్తిగా ఆస్వాదించగలుగుతాం. అలా కాకుండా అప్పనంగా వచ్చే పేరుప్రతిష్టల్ని ఎంజాయ్ చేయడంలో భయం అభద్రతా భావం కలుగుతాయి. అలాంటి ఓ రచయిత కథతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు.
ఎవరెలా చేశారంటే? : ముందుగా చెప్పుకోవలసింది హీరో సుహాస్ నటన గురించి. హీరోగా నటించిన సుహాస్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సగటు తెలుగు సినిమా హీరోలా ఎక్కడా కనిపించలేదు. స్నేహితుడితో చెంపదెబ్బ తినే సన్నివేశం చేశారు. రంగు మీద సెటైర్ వేసుకున్నారు. డ్యాన్సులు చేశారు. ఇవన్నీ పక్కన పెడితే… సగటు యువకుడు తెరపై ఉన్నది తానేనని ఫీలయ్యేలా నటించాడు. ఇక, నటిగా రోహిణి మరోసారి మెరిశారు. అమ్మగా ఆవిడ చాలా మంచి పాత్రలు చేశారు. అయితే, ఇందులోని పతాక సన్నివేశాల్లో కంటతడి పెట్టిస్తారు. ప్రేక్షకుల మదిలో ఆలోచన రేకెత్తిస్తారు. తండ్రిగా ఆశిష్ విద్యార్థి కనిపించడం కొత్తగా ఉంటుంది. టీనా శిల్పరాజ్ కు ఇది మొదటి సినిమా. చక్కగా నటించి మంచి మార్కుల్ని కొట్టేసింది. ఆమెతో పాటు శ్రీ గౌరీ ప్రియ… అమ్మాయిలు ఇద్దరూ క్యారెక్టర్లకు సూట్ అయ్యారు. గోపరాజు రమణ, ఇతరులు పాత్రల పరిధి మేరకు నటించి ఒకే అనిపించారు.
చివరగా ‘రైటర్ పద్మభూషణ్’కు ఎందుకు వెళ్ళాలి? అంటే… అమ్మ కోసం! కథ, కథనాలు పక్కన పెడితే… అక్కడక్కడ నవ్వించడంతో చివర్లో మనసు పొరలో తడిని బయటకు తీసుకొచ్చే చిత్రమిది. అమ్మను ఓ మాట అడగాలని మనలో ఆలోచన తీసుకొచ్చే చిత్రమిది.