జనవరి 6న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ నుంచి మొదటి గీతం ” మాట వినాలి” విడుదల

Powerstar Pawan Kalyan's Hari Hara Veera Mallu Part-1: Sword vs Spirit First Song Out on January 6, 2025
Spread the love

ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ భారీ యాక్షన్ ఎపిక్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్ర పాటల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులు, ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపే వార్తను తాజాగా నిర్మాతలు పంచుకున్నారు. ‘హరి హర వీర మల్లు’ నుంచి ‘మాట వినాలి’ అంటూ సాగే మొదటి గీతాన్ని జనవరి 6వ తేదీన ఉదయం 9:06 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ప్రత్యేక పోస్టర్ ను వదిలారు. తుఫానుకి ముందు ప్రశాంతతలా, యుద్ధానికి ముందు చిరునవ్వు చిందిస్తూ ప్రశాంతంగా కనిపిస్తున్న యోధుడిలా ఉన్న పవన్ కళ్యాణ్ లుక్ పోస్టర్ లో ఆకట్టుకుంటోంది. పెంచల్ దాస్ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించడం విశేషం.
పవన్ కళ్యాణ్ సినిమాల్లో సంగీతానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన సినిమాల్లోని పాటలు కేవలం ఉత్సాహాన్ని కలిగించడమే కాదు, సమాజాన్ని చైతన్య పరిచేలా, యువతలో స్ఫూర్తి నింపేలా ఉంటాయి. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాల్లోని ఎక్కువ శాతం పాటలు ఎవర్గ్రీన్ గా నిలుస్తుంటాయి. ఇక తన సినిమాల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించే పాటలకు ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉంది. ‘తమ్ముడు’, ‘ఖుషి’, ‘జానీ’, ‘అత్తారింటికి దారేది’ అజ్ఞాత వాసి‘, వంటి పలు సినిమాల్లో తన గాత్రంతో కట్టిపడేశారు. ఇప్పుడు ‘హరి హర వీర మల్లు’లో ‘మాట వినాలి’ అంటూ మరోసారి తన స్వరంతో మాయ చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రముఖ వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, ‘బాహుబలి’ ఫేమ్ శ్రీనివాస్ మోహన్, హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి పని చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Related posts

Leave a Comment