ఢిల్లీలో తెలుగు మీడియా జర్నలిస్టుల సంక్షేమమే మా లక్ష్యం : ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల అసోసియేషన్ (డిటిజెఎ)

Our goal is the welfare of Telugu media journalists in Delhi: Delhi Telugu Journalists Association (DTJA)
Spread the love

-జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రెస్ అకాడమీ చైర్మన్లు కె. శ్రీనివాస్ రెడ్డి , ఆలపాటి సురేష్
-ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల అసోసియేషన్ (డిటిజెఎ) నూతన కమిటీ ఎన్నిక

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయు)కు అనుబంధంగా పనిచేస్తున్న ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల అసోసియేషన్ (డిటిజెఎ) సమావేశం మంగళవారం సాయంత్రం తెలంగాణ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాలు లో విజయవంతంగా జరిగింది. అసోసియేషన్ గౌరవాధ్యక్షులు టి.శ్రీనివాస్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఢిల్లీ తెలుగు సీనియర్ జర్నలిస్టులు హాజరయ్యారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (IJU) జాతీయ అధ్యక్షులు, తెలంగాణా ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి , ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, గౌరవ అతిథులుగా ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కే. రాంనారాయణ, ప్రత్యేక అతిథిగా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావులు హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మీడియా, జర్నలిస్టులకు సంబంధించి, ప్రత్యేకంగా ఢిల్లీలో తెలుగు మీడియా సంస్థల్లో పనిచేస్తున్న మీడియా సిబ్బంది సంక్షేమ అంశాలపై వివరంగా చర్చించారు. తెలంగాణా ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న విధానాన్ని కే.శ్రీనివాస్ రెడ్డి వివరించారు. ఢిల్లీలో తెలుగు మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల అంశాలను తన దృష్టికి వివరంగా తెలియజేస్తే ప్రభుత్వంతో మాట్లాడి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఢిల్లీలో పని చేస్తున్న తెలుగు జర్నలిస్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ హామీ ఇచ్చారు. ఐజేయు నేత దేవులపల్లి అమర్ మాట్లాడుతూ, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఢిల్లీ జర్నలిస్టుల సంక్షేమం కోసం జరిగిన కృషిని వివరించారు. జర్నలిస్టుల సంక్షేమం, ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారానికి తమ యూనియన్ చేస్తున్న కృషిని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ అలీ, వివరించారు. ఢిల్లీలో తెలుగు మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు తాము పూర్తిగా అండగా వుంటామని, సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక గురించి చర్చ జరిగింది. అసోసియేషన్ కు అధ్యక్షులుగా వున్న మహాత్మా(Tv9), కార్యదర్శి స్వరూప ఢిల్లీ నుండి హైదరాబాద్ కు బదిలీ అవ్వడం, అదే విధంగా మరికొందరు మిత్రులు అసోసియేషన్ తో కలిసి పనిచేస్తామని ముందుకు రావడంతో నూతన కమిటీ కూర్పుపై చర్చ జరిగింది. సమావేశానికి హాజరైన మీడియా జర్నలిస్టుల ప్రతిపాదనలతో ఢిల్లీ తెలుగు జర్నలిస్ట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా టి. శ్రీనివాసరావు( Tv5 బ్యూరో చీఫ్ )ను ఎన్నుకోవడం జరిగింది. అదే విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పీ.గోపిక్రిష్ణ (10Tv బ్యూరో చీఫ్) ప్రధాన కార్యదర్శిగా టి.సూర్య ప్రకాష్ (ఆంధ్రజ్యోతి చీఫ్ రిపోర్టర్)లు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా శ్రీమతి పీ.కళా శ్రీనివాస్ ( ప్రైమ్ 9 బ్యూరో చీఫ్ ) ఎండీ.మదార్ (V6 బ్యూరో చీఫ్), కోశాధికారిగా ఏం.వి. శివరావు ( BIG న్యూస్ బ్యూరో చీఫ్ ), సంయుక్త కార్యదర్శులుగా ఎం.సత్య (ఆంధ్రప్రభ బ్యూరో చీఫ్), విద్యాసాగర్ (ఆంధ్రజ్యోతి కరస్పాండెంట్), ఎస్.నవీన్ కుమార్ (99 బ్యూరో చీఫ్)లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరికొందరు జర్నలిస్టులు కూడా అసోసియేషన్ లోకి రావడానికి సిద్ధంగా వుండటం, వారితో సహా తెలుగు మీడియా లోపనిచేస్తున్న వీడియో జర్నలిస్టులతో కలిపి త్వరలోనే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి, కమిటీని మరింత విస్తరించాలని సమావేశం నిర్ణయించింది. ఢిల్లీలో పనిచేస్తున్న తెలుగు మీడియా జర్నలిస్టులందరి సంక్షేమానికి, సమస్యలు, ఇబ్బందులు పరిష్కారానికి వీలైనన్ని అన్ని మార్గాల ద్వారా ఒక నిర్దిష్ణ కార్యాచరణ తో పనిచేయాలని నూతన కమిటీ నిర్ణయించింది. ఇంకా ఈ సమావేశంలో ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం. ఏ.మాజీద్, కార్యదర్శులు వై. నరేందర్ రెడ్డి, డి. సోమసుందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment