‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ రివ్యూ: ఆసక్తి కలిగించే కథనం!

'Operation Valentine' Movie Review: An Interesting Story!
Spread the love

(చిత్రం : ఆపరేషన్ వాలెంటైన్, విడుదల : 1 మార్చి-2024, రేటింగ్ : 3/5, రచన, దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ హడా, నటీనటులు: వరుణ్ తేజ్, మనుషీ చిల్లర్, నవదీప్, రుహానీ శర్మ,మీర్ సర్వర్, శుభశ్రీ, లహరి షారీ తదితరులు. బ్యానర్స్: మిక్కీ జే మేయర్, రినాయిసెన్స్ పిక్చర్స్, నిర్మాతలు: సోని పిక్చర్స్, సందీప్ మడ్డా, సినిమాటోగ్రఫీ: హరి కే వేదాంతం, ఎడిటింగ్: నవీన్ నూలి, మ్యూజిక్: మిక్కీ జే మేయర్)

సరైనవిజయం కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొంతకాలంగా ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. అయితే తన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ పై మాత్రం భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆరాటపడ్డాడు. ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన విషయం తెలిసిందే. సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి.. ఈ సినిమా ఎలా ఉంది? వరుణ్ తేజ్ అనుకున్నట్లు సక్సెస్ ట్రాక్ ఎక్కడా? ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం ప్రేక్షకులను అలరించిందా? తెలుసుకుందాం…

కథ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్ అర్జున్ దేవ్ (వరుణ్ తేజ్) అలియాస్ రుద్ర వింగ్. తోటి ఫైటర్స్‌ (నవదీప్, అలీ రెజా, మీర్ సర్వర్‌తో కలిసి వజ్ర మిషన్‌ ప్రారంభించి విఫలమవుతాడు. దాంతో రుద్రపై ఆంక్షలు విధిస్తారు. ఈ క్రమంలో పుల్వామా దాడి జరిగి చాలా మంది జవాన్లు వీరమరణం పొందుతారు. దాంతో భారత ప్రభుత్వం పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పాలని సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని నిర్ణయిస్తుంది. ఆ మిషన్‌ను లీడ్ చేసే బాధ్యతను రుద్రకు అప్పగిస్తారు. దేశ రక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్స్ ని టెస్ట్ చేయడం అర్జున్ పని. 2021 ఫిబ్రవరి 14న డి.ఆర్.డీ.ఓ నుండి వచ్చిన ఒక కొత్త ఎయిర్ క్రాఫ్ట్ ను టెస్ట్ చేసి.. బేస్ క్యాంప్ కి రిటర్న్ అవుతుండగా.. అర్జున్ ని పాకిస్థాన్ జెట్స్ టార్గెట్ చేస్తాయి. అయితే.. అది ఒక ట్రాప్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ జెట్స్ పై దృష్టి పెట్టి ఉన్న సమయంలో కింద భూమిపై పుల్వామా దాడి జరుగుతుంది. ఇండియా 40 మందికి పైగా సైనికులను కోల్పోతుంది. శత్రు సైన్యాన్ని సునాయసంగా ఎదురుదాడి చేసేలా రూపొందించిన వజ్ర మిషన్‌ను అమలు చేయడంలో రుద్ర అలియాస్ అర్జున్ దేవ్ ఎందుకు విఫలమయ్యాడు. వజ్ర మిషన్ ఫెయిల్యూర్‌తో రుద్రకు ఎలాంటి నష్టం వాటిల్లింది? వైమానిక దళంలో పనిచేసే అహానా గిల్ (మనుషీ చిల్లర్)తో ఎందుకు విభేదాలు వస్తాయి? పుల్వామా దాడి తర్వాత రుద్ర నాయకత్వంలోని వాయు సేనలు పాకిస్థాన్‌పై ఎలాంటి ఎదురుదాడి చేసింది? తాను అనుకొన్న విజ్ర మిషన్‌ను రుద్ర సక్సెస్ చేశాడా? ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి? వింగ్ కమాండర్ అర్జున్ పడ్డ కష్టం ఏమిటి? ఈ మొత్తం యుద్ధంలో అర్జున్ ఆశయం అయిన.. ఆపరేషన్ వజ్ర ఎలా సహాయ పడుతుంది? అతని భార్య అయిన మరో కమాండర్ అహ్న ( మానుషి చిల్లర్) రోల్ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా కథ.

విశ్లేషణ: పుల్వామా ఉగ్రదాడి దేశ చరిత్రలో ఎవ్వరూ మరచిపోలేరు. ఆ ఘటన తరువాత భారత్ తీర్చుకున్న రివేంజ్ కూడా ఒక చరిత్ర. ఇలాంటి అంశాన్ని కథా వస్తువుగా తీసుకుని చాలానే సినిమాలు వచ్చాయి. ఈ జనరేషన్ కళ్ళ ముందు జరిగిన ఒక విధ్వంసం కాబట్టి.. ప్రేక్షకులు ఈ పాయింట్ కి త్వరగా కనెక్ట్ అవుతారు కూడా. సినిమా మొదలైన అరగంట వరకు ఆపరేషన్ వజ్రని రీ కాల్ చేసుకుంటూ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ పడుతూ ఉంటాయి. దీంతో.. కథలో ఆ సీక్వెన్స్ ఎక్కువ ప్లే ఉంటుందని అంతా ఆశిస్తారు. కానీ.. అసలు ఆ సీక్వెన్స్ అంతా అండర్ ప్లేలో చూపిస్తూ.. హీరో బిల్డప్ షాట్స్ గా ఉపయోగించుకున్నారు. ఇక చాలా సేపటికి పుల్వామా ఉగ్రదాడి జరగడం, దానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతీకారానికి సిద్దం అవ్వడంతో ఫస్ట్ ఆఫ్ కాస్త ఎంగేజింగ్ గా అనిపిస్తూ ముగుస్తుంది. గ్వాలియర్ ఎయిర్ బేస్‌లో జరిగిన ఓ సంఘటనతో కథ సీరియస్‌గా మొదలవుతుంది. ఆ తర్వాత కథ బ్యాక్ డ్రాప్ శ్రీనగర్‌కు చేరుకొంటుంది. వరుణ్ తేజ్ ఎంట్రీ, మనుషీ చిల్లర్ క్యారెక్టరైజేషన్ తదితర అంశాలు అభిమానులను ఆకట్టుకొనేలా సాగుతాయి. కానీ కథలో బలమైన సన్నివేశాలు, ప్రేక్షకుడిని ఉద్వేగానికి గురిచేసే సన్నివేశాలు ఫస్టాఫ్‌లో లేకపోవడంతో రెగ్యులర్ ఆడియెన్స్‌కు ఏదో సాదాసీదాగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ ముందు దర్శకుడు ఎత్తుకొన్న పాయింట్ మూవీకి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. సెకండాఫ్‌లో ఏం జరుగబోతుంది? దర్శకుడు ఎలా డీల్ చేస్తాడనే ఉత్సాహం కలిగేలా చేస్తుంది. విక్కీ కౌశల్ ఉరి ఇందులో మాస్టర్ పీస్ మూవీ. అయితే.. ఆపరేషన్ వాలెంటైన్ మూవీలో కూడా ఈ మ్యాజిక్ రిపీట్ అయ్యిందా అంటే లేదనే చెప్పుకోవాలి. ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీని పూర్తిగా దేశభక్తి ప్రధానంగానే ప్రమోట్ చేశారు. పుల్వామా ఉగ్రదాడి, దాని ప్రతీకారం చుట్టూ జరిగే కథ అనే చెప్పారు. కానీ.., సినిమాలో ఆ మొత్తం ఎపిసోడ్ కి దక్కిన స్పేస్ చాలా తక్కువ. హీరో ఎలివేషన్ కోసం సగం సినిమా పైగా నడిపించేశారు. దీంతో.. కొన్ని అద్భుతమైన సీక్వెన్స్ లు ఉన్నా.. ‘ఆపరేషన్ వాలెంటైన్’ సక్సెస్ కాలేక పోయింది. సెకండాఫ్ మొదలైన కొద్దిసేపటికే నిమిషాల్లో కథలోని మెయిన్ పాయింట్ అయిపోతుంది. ఇక ఆపరేషన్ వాలెంటైన్ కథ ఏముంది? అనగా ఓ ఫిక్షనల్ పాయింట్ ఈ కథకి అటాచ్ చేసి.. హీరో క్యారెక్టర్ కి ఎలివేషన్ ఇస్తూ పోయారు. అప్పటి వరకు కొంత ఆకట్టుకుంటూ నడిచిన ఆపరేషన్ వాలెంటైన్ ఇక్కడ నుండి టోటల్ గా ఎమోషన్ మిస్ అయిపోయి.. ఒకానొక స్టేజ్ కి వీడియో గేమ్ అయిపొయింది. అయితే.. లాస్ట్ లో వింగ్ కమాండర్ అభినందన్ రిఫరెన్స్ ఇండైరెక్ట్ గా చూపించడం కాస్త కొస మెరుపు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే.. సినిమా ప్రథమార్థంలో వరుణ్ తేజ్ నటన, పల్వామా ఎపిసోడ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే.. ద్వితీయార్ధంకొచ్చే సరికి సినిమాలో ఎమోషన్ మిస్ అయింది. సెకండాఫ్‌లో పాక్, ఇండియా మధ్య పరస్పర దాడుల చిత్రీకరణ గ్రిప్పింగ్గా ఉంటుందనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్రియేట్ చేసిన డ్రామా, క్లైమాక్స్‌లో ప్రధాని, జాతీయ భద్రత సలహాదారులు పన్నే వ్యూహాలు, అలాగే వందేమాతరం బ్యాక్ డ్రాప్ సాంగ్, బీజీఎం సినిమాను మరింత ఎమోషనల్‌గా మార్చాయి. దాంతో మంచి దేశభక్తి ప్రధానమైన సినిమాను చూశామనే ఫీలింగ్ కలిగిస్తుంది. స్క్రిప్టు పరంగా చాలానే లోపాలు కొట్టొచ్చాయి. కానీ దర్శకుడు అనుసరించిన స్క్రీన్ ప్లే వల్ల అవి పైకి కనిపించకుండా పోయాయి. కొన్ని సన్నివేశాలు ఉద్వేగంగా, భావోద్వేగంగా సాగడం వల్ల ఫీల్‌గుడ్‌ మార్క్‌ను సినిమా సొంత చేసుకొనేలా చేశాయి.

ఎవరెలా చేశారంటే…. వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ కోసం తన బెస్ట్ ఇచ్చేశాడు. వరుణ్ తేజ్ రుద్ర అలియాస్ అర్జున్ దేవ్‌గా పలు వేరియేషన్స్ ఉన్న పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. సక్సెస్, ఫెయిల్యూర్ అనే విషయాన్ని పట్టించుకోకుండా కథలను ఎంపిక చేసుకొనే విధానాన్ని అభినందించాల్సిందే. రొమాన్స్‌కు పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికీ.. కొన్ని చోట్ల మనుషి, వరుణ్ మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. రుద్ర, అహానా మధ్య ఎమోషనల్ సీన్, డైలాగ్స్ ఫీల్’గుడ్‌గా మార్చాయని చెప్పవచ్చు. హీరోయిన్ మానుషి చిల్లర నటనలో అదరగొట్టింది. మిగతా నటులు ఎవ్వరికీ అంతగా స్క్రీన్ స్పేస్ దొరకలేదు. నవదీప్ క్యారెక్టర్ అసంపూర్తిగా ముగిసిపోవడం కొంత జీర్ణించుకోలేని విషయంగా కనిపిస్తుంది. మిగతా పాత్రల్లో నటించిన వారందరూ తమ రోల్స్ వరకు ఫర్వాలేదనిపించారు.

టెక్నికల్ విషయాలకొస్తే… ఆపరేషన్ వాలెంటైన్ సినిమా చాలా స్ట్రాంగ్ మూవీ. కెమెరా వర్క్ తో పాటు.. సీజి వర్క్ అదిరిపోయింది. కాకుంటే సెకండ్ ఆఫ్ పై ఇంకాస్త దృష్టి పెట్టుంటే బాగుండేది. మ్యూజిక్ కు ప్రాధాన్యత లేదు. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. టెక్నీషియన్ గా మాత్రం దర్శకుడు శక్తి ప్రతాప్ కి మంచి మార్కులు వేయొచ్చు. బీజీఏం, వీఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ ఈ మూవీకి స్పెషల్ ఎట్రాక్షన్. సాధారణ ప్రేక్షకులకు ఈ సినిమా మంచి అనుభూతిని పంచేలా సాంకేతిక విభాగాల పనితీరు ఉంది. సీన్లు చాలా రిచ్‌గా ఉన్నాయి. సోని పిక్చర్స్ అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. మొత్తం మీద వరుణ్ తేజ్ వన్ మ్యాన్ షోగా సాగింది ఈ సినిమా. దేశభక్తి సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

Related posts

Leave a Comment