పైగంబర కవితోద్యమ నాయకుడు, జర్నలిస్ట్ ఎమ్.కె.సుగమ్ బాబు వెళ్ళిపోయారు!

m k sugambabu no more
Spread the love

సత్యానికి, ప్రేమకు అంకితమైన ‘రెక్కల’ కవి, పైగంబరుడు ఎం.కె సుగమ్ బాబు (మహాబూబ్ ఖాన్) మంగళవారం 18-10-2022న తెల్లవారు జామున తుది శ్వాస నిలిచిపోయింది. అయన గత రెండుళ్లుగా అస్వస్థులుగా మంచంలో ఉన్నారు. తెలుగు సాహిత్యంలో ‘సూరీడు’ పాటలతో కవిగా అయన ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ‘రెక్కలు’ ప్రక్రియను సాహితీలోకానికి పరిచయం చేసి ‘రెక్కలు’ కవిగా సుప్రసిద్దులయ్యారు. ప్రముఖ కవి, పైగంబర కవితోద్యమ నాయకుడు ఎమ్.కె. సుగమ్ బాబు వెళ్ళిపోయారన్న విషయాన్ని ఆయనతో పనిచేసిన ఆంధ్రభూమి సహచర పాత్రికేయులు గుర్తు చేసుకొని ఆయన పవిత్ర ఆత్మకు శ్రద్థాంజలి ఘటించారు. హైదరాబాదునుండి ఆయన పార్థివ దేహాన్నిమంగళవారం గుంటూరు కొరిటెపాడు లైబ్రరీ వీధి వినాయకుడి గుడి, కార్ ట్రావెల్ దగ్గర వున్న వారి అబ్బాయి స్వగృహానికి తరలించారు. తెలుగు సాహిత్య రంగంలో విన్నూతమైన కవిగా ‘రెక్కలు’ ఆవిష్కర్తగా ప్రభావవంతమైన పాత్రను పోషించారు. సాహితీప్రియులందరికీ ఆత్మీయులు.మంచి వ్యక్తిత్వం కలిగిన వారు.సుగమ్ బాబు గారి మృతి సాహిత్య రంగానికి తీరని లోటు. సుగమ్ బాబు తెలుగు రచయిత, జర్నలిస్టుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. పలు చలన చిత్రాలకు దర్శకుడిగా, రచయితగా వ్యవహరించారు. తొమ్మిది సంపుటాల కవిత్వాన్ని, మూడు సంపుటాల ఇతర రచనలను చేసారు. రెండు డాక్యుమెంటరీలకు దర్శకత్వం వహించారు. సుగమ్ బాబు రాసిన గురజాడ జీవిత విశేషాలతో కూడిన “అస్తమించిన సూర్యుడు’కు బంగారు నంది పురస్కారం లభించింది. ఎం.కె.సుగంబాబు రచయిత, జర్నలిస్టు, దర్శకుడుగానే కాకుండా మాటల రచయిత కూడా.
గుంటూరు జిల్లా గుంటూరు పట్టణంలో 1944 ఏప్రిల్‌ 1 న సకినాబీబి, ఫరీద్‌ఖాన్ దంపతులకు సుగమ్ బాబు జన్మించారు. ఆయనకు తల్లితండ్రులు పెట్టిన పేరు మహబూబ్‌ ఖాన్‌ కాగా అదికాస్తా సుగమ్ బాబు గా స్థిరపడింది. తాడికొండలోని ఎస్. వి. వి. ఉన్నత పాఠశాలలో పదవతరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో 1964 లో డిగ్రీ పూర్తి చేసుకున్నారు. బి.ఏ (తెలుగు) చదివారు. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డక్కన్ క్రానికల్ (ఆంధ్రభూమి)లో 1978లో ఉద్యోగంలో చేరారు. 1999 వరకు అదే పత్రికలో పనిచేశారు. రచయితగా, జర్నలిస్టుగా, దర్శకునిగా, మాటల రచయితగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. తెలుగు సాహిత్యంలో పైగంబర కవుల్లో ఒకరిగా ప్రత్యేక స్థానం పొందారు. 1963 డిసెంబర్‌లో ‘భారతి’ మాసపత్రికలో ‘మట్టీ బొమ్మ’ కవిత ప్రచురణతో ఆయన రచనా వ్యాసంగం ఆరంభం అయింది. అప్పటినుండి వివిధ పత్రికల్లో, సంకలనాల్లో కవితలు, కథానికలు, సాహిత్య వ్యాసాలు రాశారు. తెలుగు సాహిత్యంలో ‘రెక్కలు’ అనే నూతన కవితా ప్రక్రియను 2003లో ప్రారంభించి ఐదు ఎడిషన్లు వెలువరించారు. తొలిసారిగా హిబ్రూ విశ్వవిద్యాలయం (ఇజ్రాయిల్‌) కు చెందిన ఆచార్య సుర్మన్‌ డేవిస్‌ ఆంగ్ల భాషలో ‘వింగ్స్’ పేరిట వాటిని అనువదించి వెలువరించినప్పటి నుండి తెలుగులోనే కాకుండా జాతీయ స్థాయిలో ‘రెక్కలు’ ప్రక్రియ పాఠకాదరణ పొందింది. అది కన్నడం, హిందీ భాషా సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ‘మయూరి’ వీక్లీలో ‘ప్రముఖుల పేజీ’ పేరుతో శీర్షిక నిర్వహించారు. పాతతరం కవులపై ఈ శీర్షికలో రాశారు. చరలో సెలయేరు (1968), విప్లవం (1969), పైగంబర కవులు (1971), సూరీడు (పాటల పుస్తకం, 1971), లెనిన్‌…లెనిన్‌ (1984), రెక్కలు (2003), కొత్తనీరు ‘రెక్కలు, రెక్కలు ఆయన కలం నుంచి జాలువారిన సంపుటాలు. తొలిరోజుల్లో మనసు కవి ఆత్రేయ దగ్గర, ప్రముఖ నిర్మాత ఎం. ఎస్. రెడ్డి దగ్గర పనిచేశారు. కొన్ని సినిమాలకు మాటలు రచయితగానూ, దర్శకత్వ శాఖలోనూ పనిచేశారు. ఆయన రాసిన గ్రంథాలలో ‘సూరీడు’ ఆయనకు ఖ్యాతి తెచ్చిపెట్టింది. గురజాడ జీవిత విశేషాలతో కూడిన ‘అస్తమించిన సూర్యుడు’ డాక్యుమెంటరీకి సుగమ్ బాబును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1985లో బంగారు నందితో సత్కరించింది.

Related posts

Leave a Comment